ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

కవుల శాపాలు

Like-o-Meter
[Total: 1 Average: 4]

ఇదివరలో శ్రీ ఆచార్య తిరుమల గారు వ్రాయగా ప్రచురింపబడిన ఈ వ్యాసాన్ని సేకరించటం జరిగింది. ‘ఆవకాయ’ పాఠకుల కోసం….

పూర్వకవులు ఇంచుమించుగా సదాచార సంపన్నులు, ప్రగాఢమైన దైవభక్తి గలవారు. వారి వాక్కు అమోఘంగా ఉండేది. వారి మాటకు శక్తి కూడా ఎక్కువగా ఉండేది. వారు నొచ్చుకుంటే శాపం, మెచ్చుకుంటే వరం అయ్యేది. శాపానుగ్రహదక్షులైన కొందరు కవులను, వారి ఆయా పద్యాలను ఆచార్య తిరుమల గారు ఇలా వ్రాసారు.

పద్య లక్షణాన్ని వివరించేది శాస్త్రం ఛందస్సు. ఇది గణాలతో, యతిప్రాసాదులతో ఏ పద్యమెలా ఉండాలో తెలియజేస్తుంది. అయితే, అక్షరాల్లో విషమాక్షరాలు, అమృతాక్షరాలు ఉంటాయి. పద్యపాదాల్లో విషమస్థానాలు, అమృతస్థానాలు అని ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని, కవి జాగ్రత్తగా అక్షర నిబద్ధ శబ్ద ప్రయోగం చేయాలి. లేకపోతే, అది ప్రాణాంతకమైన శాపమౌతుంది.

‘పురాస్త్ర రసగిరి రుద్రే ష్వకచటహ మాతృకా నింద్యా:’ అని పద్య ప్రథమ పాదంలో 3,5,6,7,11 స్థానాల్లో అ, క, చ, ట, హ వర్ణాలుంచి పద్యం వ్రాస్తే, అవి విషమాక్షరాలై పద్యం శాపమై తగులుతుంది.

అలాగే –

హజగడలివి మూడవచో
నిజముగ నిందించి చెప్ప నీల్గుట యరుదే
భుజగమున కన్న గీడగు
సుజనా మర భూజరేచ సుగుణ సమాజా

మూడో చోట ‘హజగడ’లు, ఆరవ కడ ‘తా’ నిల్పిన మారమ్మున, గ్రుమ్మునట్లు మడియు మనుజుడున్’ అని ఆరవచోట ‘త’ కారం, ‘మ’గణమ్ము గదియు రగణము, వగవక కృతి మొదట నిలుపువానికి మరణంబగు’ నని కావ్య ప్రారంభంలో ‘మ’గణం పై, ‘ర’ గణం ఉంచి పద్యం వ్రాస్తే, చావటం ఖాయం.

కాబట్టే, సత్కావ్యాల్లో విషమాక్షర ప్రయోగాలు చేయరాదని లాక్షణికులు శాసనం చేసారు.

ఆదికవి నన్నయ భారత కావ్యాది ప్రార్ధనా శ్లోకంలో ‘శ్రీవాణి గిరిజాశ్చిరాయ’ అని 7వ స్థానంలో’చ’కారం నిల్పటం చేత భారత రచనకు విఘ్నం కలిగిందని, అలానే, నన్నెచోడుడనే రాజ కవి తన కుమారసంభవ కావ్యాన్ని ‘శ్రీ వాణీం ద్రామరేం ద్రార్చిత’ అని ‘మ’ గణం తర్వాత ‘ర’గణం ఉండే స్రగ్ధరా వృత్తంతో ప్రారంభించటం వలనే యుద్ధంలో దారుణంగా మరణించాడని చెబుతారు.

శాపానుగ్రహదక్షులైన కవుల్లో వేములవాడ భీమకవి అగ్రగణ్యుడు. ఈయన 12వ శతాబ్దికి చెందినవాడు. త్రికాల వేది. భీమేశ్వరస్వామి అనుగ్రహపాత్రుడైన అమోఘ వచస్కుడు. ఈయన బాల్యంలో వేములవాడలోని ఒక బ్రాహ్మణ చయనుల ఇంట శుభకార్యమేదో జరిగి భోజనాలకు పంక్తి నేర్పాటు చేసుకుంటే, తను కూడా స్నేహితులతో వెళ్ళి భోజనం పెట్టమనగా ఆ యింటి పెద్ద ఈయనని తిట్టి బైటకు వెళ్ళగొట్టాడట. అపుడు భీమన వాకిటి తలుపు సందులోంచి వడ్డించిన విస్తళ్ళను చూసి –

గొప్పలు చెప్పుకొంచు నను గూటికి బంక్తికి రాకుమంచు నీ
త్రిప్పడు బాపలందరుని దిట్టిరి కావున నొక్కమారు నీ
యప్పములన్ని కప్పలయి, యన్నము సున్నముగాగ మారుచున
బప్పును శాకముల్ పులుసు పచ్చడులుం జిరురాలు గావుతన

అని శపించగానే, అన్నం సున్నమై, కూరలు రాళ్ళయి, అప్పాలు కప్పలై ఎగురుతుండటంతో ఇంటిపెద్ద తెల్లబోయి, తోటి బ్రాహ్మణులతో వచ్చి ఆయనను ప్రార్ధించగా, ఆయన దయతలచి ‘నన్ గౌరవంబున నీ విప్రులు సూచిరందువలనన్ పూర్వస్థితిం జెంది భోజన వస్తు
ప్రకరంబులన్నియు యథా స్వస్థంబు లౌ గావుతన్’ అని శాపోపశమనం చేసి విందారగించి వెళ్ళాడట.

ఒకమారు భీమకవి గుడిమెట్ట గ్రామానికి వెళ్ళగా, ఆ ఊరి ప్రభువు సాగి పోతురాజు ఈయన గుర్రాన్ని పట్టి తన శాలలో కట్టించివేశాడు. ఎంత వేడినా విడువకపోయే సరికి, ఈయన కోపించి చెప్పిన పద్యమిది –

హయమిది సీత, పోత వసుధాధిపుడారయ రావణుండు, ని
శ్చయముగ నేను రాఘవుడ, సహ్యజవారిధి, మారు డంజనా
ప్రియ తనయుండు, లచ్చన విభీషణుడా, గుడిమెట్ట లంక, నా
జయమును పోత రక్కసుని చావును నేడవనాడు చూడుదీ

అని పద్యం ప్రథమ పాదం ఆరో చోట, ‘త’ కార ముంచి విషమాక్షర ప్రయోగం చేసి శపించాడు. ఏడవనాడా పోతురాజు గుండాగి మరణించాడు.

అలాగే, మరో పోతురాజనేవాడు, ఓసారి భీమకవి వస్తూ ఉంటే, తననేమి అడుగుతాడో అని ఇంట్లో తాను లేనని చెప్పించాడట. అది గమనించి భీమకవి –

కాటికి కట్టెలు చేరెను,
నేటావల నక్కలన్ని ఏడువసాగెన
కూటికి కాకులు వచ్చెను
లేటవరపు పోతరాజు లేడా లేడా

అని ప్రశ్నిస్తూ శపించి వెళ్ళగానే, కూర్చున్న మంచం మీదే ప్రాణం పోయి వొరిగిపోయాడట పోతురాజు. అతని భార్య పరుగుపరుగున వెళ్ళి భీమకవి కాళ్ళ మీద పడి వేడుకోగా –

నాటి రఘురాము తమ్ముడు
పాటిగ సంజీవి చేత బ్రతికిన భంగిన్
కాటిక బో నీకేటికి?
లేటవరపు పోతరాజ లెమ్మా రమ్మా

అనగానే, పోతరాజు నిద్రలేచినట్లు లేచి, ఈయన కాళ్ళ మీద పడ్డాడట.