Like-o-Meter
[Total: 0 Average: 0]
అనుకోని చిక్కులు ఎప్పుడు వస్తాయీ అంటే అనవసరమైన పనులకు “కుదరదు” అని సమాధానమివ్వలేనప్పుడే. ఈ “కుదరని” విషయమేమిటని మీరు ఆశ్చర్యపోవచ్చును. అవునండి! నేను “కుదరదు” అని చెప్పడంలోగల మేలు గురించి మాట్లాడుతున్నాను.
చాలామంది “కుదరదు”(NO) అని చెప్పాలంటే చాలా మొహమాటపడతారు. అలా చెప్పేస్తే అవతలివారు తమను అహంభావిగాను, మర్యాదతెలీని వారిగానూ జమకట్టేస్తారేమోనన్న ఉలికిపాటు ఉంటుంది. అందువల్ల కాని పనులను కూడా తలకు చుట్టుకొని పనికిరాని వారని ముద్రవేయించుకొంటారు. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలని సామెత. పనికిమాలినతనం అనే ముద్ర కంటే అహంభావితనం స్టాంపు మేలుకదా!
అప్పుడప్పుడూ, మరీ ముఖ్యంగా మన ముఖ్యావసరాల ఒత్తిడి మన మీద ఉన్నప్పుడు ఇతరులు అడిగినదానికి “కాదు”అని తిరస్కరిస్తే తప్పు కాదు. ఎందుకంటే అటు అడిగినవారికి, ఇటు మనకూ ఉపయోగంలేని వ్యవహారం చేయడానికి ప్రయత్నించడం ఎందుకు? అందుకే అప్పుడప్పుడు కొద్దిపాటి స్వార్థం ఉండడం కూడా అవసరమే. ఈ స్వార్థం వల్ల సహాయం అడిగిన వారికి నిరాశ మిగలదు సరికదా వారి విలువైన సమయం కూడా ఆదా అవుతుంది.
యోగ్యతకు మీరి ఒప్పుకొనే బాధ్యతలవల్ల ఎవరికీ లాభం ఉండదు. అందువల్ల మన స్వంతపనులు, వాటి ఒత్తిడులు దృష్టిలో పెట్టుకొనే మరొకరికి మాటనివ్వడం మేలు. ఒక్కోసారి గమనిస్తుంటాం…చాలా మంచి నడవడి కలిగినవారు కూడా హఠాత్తుగా చీదరించుకోవడం, కఠినంగా మాట్లాడ్డం చేస్తుంటారు. కారణం, శక్తికి మీరి ఇతరుల పనులను నెత్తికెత్తుకోవడం. తమ ముందున్న సమస్యల్నే అధిగమించడానికి సమయం చాలనివాళ్ళు వేరే సవాళ్ళను స్వీకరిస్తే కుదిరేనా?
ఐతే ప్రతిదానికి “కాదు”, “కుదరదు” అని చెప్పడమే పద్ధతా అని ప్రశ్నిస్తే, మన దగ్గర సమయమున్నప్పుడు, ఆ పనుల్ని పూర్తి చేసేందుకు కావల్సిన శక్తి సామర్ధ్యాలున్నప్పుడు కాదనడం ఉచితం కాదు.
మన సహాయం కోరి వచ్చినవారికి మన సమయానుకూలాన్ని చెప్పి, ఈరోజు కుదరకపోయిన మరుసటిరోజున సహాయం చేస్తానని చెప్పడం అటు అడిగినవారికి, ఇటు సహాయం చేయదల్చిన వారికి ఎంతో మేలు.
అంతేకాదు, మనకు కుదరనప్పుడు సహాయం చేయగల మరో వ్యక్తిని చూపించడం కూడా మంచిపనే!
ప్రాణానికి ప్రాణమైన అర్జునుడు వచ్చి అడిగినా కూడ “ఆయుధమున్ ధరియింప” అని మొదలుపెట్టి “ఊరకే సాయము చేయువాడ, తెలుసన్నను పిమ్మట ఎగ్గులాడినన్ దోయిలి యొగ్గుదున్” అని సన్నాయి నొక్కులు నొక్కి “నిజము కొంత వచించితి కోరుకొమ్ము నీకేయేదిష్టమో” అని చివరకు మొహమాటం లేకుండ చెప్పాడు కృష్ణుడు.
ఆయన దారిలోనే నడిస్తే ఉభయకుశలోపరిగానే ఉంటుంది. ఏమంటారు?
@@@@@