అప్పు చేసి పప్పు కూడు
1987-2005 మధ్య Alan Greenspan అనే వ్యక్తి అమెరికా Federal Reserve Chairman గా పనిచేసేడు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో ఈయనకొక ప్రత్యేకత ఉంది. 2000 వరకూ interest rates విపరీతంగా పెంచిన ఈయన dotcom bubble burst అయిన తరువాత మోహన్ బాబు లాగ ‘నా రూటే వేరు” అంటూ రూటు మార్చి interest rates భారీగా తగ్గించటం మొదలెట్టేడు. దీనివల్ల 2000-2007 మధ్య అమెరికా ఎకనామి విపరీతంగా విస్తరించింది.అయితే ఈ విస్తరణ ప్రాథమిక కారణాల (fundamental reasons) వల్ల కాకుండా loose monetary conditions వల్ల జరిగింది. ఈ కాలంలో అమెరికన్ కంపెనీలు, అమెరికన్ ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా “అప్పు చేసి పప్పు కూడు” బాగా అలవడింది.
ఇదే సమయంలో భారత, చైనాల ఎకానామి ఊపందుకోవటం, ప్రపంచవ్యాప్తంగా stock markets లో లాభాలు రావడం, ప్రపంచీకరణ బలపడడం, IT బూమ్ రావటం కూడా జరిగేయి. దీనితో యావత్ ప్రపంచంలో అన్ని దేశాలలోను ఆర్ధిక వ్యవస్థ ఎంతో మెరుగుపడింది. 2000-2010 కాలంలో ప్రపంచంలోని దాదాపు 188 దేశాల్లో కేవలం మూడు దేశాలు మాత్రమే ఆర్ధిక ప్రగతిని సాధించలేదు. దీన్ని బట్టి ఈ దశాబ్దం ఎంత స్పెషలోఊహించుకోవచ్చు. ప్రతి దశాబ్దం ఇలానే ఉంటుందనకోవటం మాత్రం మూర్ఖత్వమే.
ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
2000 వరకూ “నా దారి ఎడారి, నా పేరు బికారి’ లాంటి పాటలు పాడుకున్న మనకు 2000 నుంచి కొంత తేడా కనబడడం మొదలయ్యింది. దశాబ్దం మొదట్లోనే Y2K ప్రాజెక్ట్ల ద్వారా Indian software industry ఒక గుర్తింపు తెచ్చుకుంది. అది క్రమేణా బలపడి 2005-06 నాటికి India ఒక బలమైన IT శక్తిగా అవతరించింది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా MNC కంపెనీలు విస్తరించడం,వ్యాపార పరిమాణం ఘనంగా పెరగటంతో మనదేశంలోనూ ఉద్యోగావకాశాలు, జీతాలుబాగా పెరిగేయి. 2000 నాటికి పట్టుమని పదివేలమందినైనా పోషించలేని software industry, 2008లో పదిలక్షల మందిని పోషించేస్థాయికి ఎదిగింది.
పెరిగిన ఉద్యోగాలూ, పెరిగిన జీతాలతో పాటూ కొత్త కొత్త Industries, ముందు లేనివి, వచ్చేయి.Telecom, Private Banks,Insurance, Retail, Construction, Real Estate, Media, Bio-technology లాంటి ఎన్నో రంగాల్లో 2000కి ముందు ఉద్యోగాలు లేవు. ఇవన్నీ ఆ తర్వాత వచ్చినవే.
అనుభవించు రాజా – – – పుట్టింది, పెరిగింది అందుకే
నడి వీధిన దీపం ఒకటి, సుడి గాలికి ఊగుతున్నది
2008లో Lehmann Brothers కుప్పకూలిన తర్వాత వచ్చిన ఆర్ధిక మాంద్యం, ప్రపంచాన్ని పట్టాలు తప్పిన బోగీలా మార్చింది. అనుకోకుండా వచ్చిన ఈ సుడిగాలినించి తప్పించుకోవడానికి అన్ని ప్రభుత్వాలూ Alan Greenspan ని గుర్తుకుతెచ్చుకున్నాయి. అప్పటి వరకూ అమెరికాకి మాత్రమే పరిమితమైన loose monetary conditions ఇప్పుడు అన్ని దేశాలకీ పాకేయి.
మనదేశమొకటే కొంత బెటర్. అయితే, ప్రభుత్వాలు డబ్బులు ప్రింట్ చేయడం, పేషెంట్ ని వెంటిలేటర్ మీద పెట్టడం లాంటిది. అది పీకేస్తే పేషెంట్ చచ్చిపోతాడు. పోనీ అలాగే ఉంచుదామా అంటే ఆ ఖర్చులకి అప్పుల్లో కూరుకుపోతారు. గత నాలుగు సంవత్సరాలుగా ఇదే డ్రామా నడుస్తోంది. అమెరికాలో QE1, QE2 అంటూ దీన్ని ఎక్కడ ఆపాలో తెలీక తలలు బద్దలుకొట్టుకుంటున్నారు.
రగులుతోంది మొగలుపొద
మన భారతీయుల ముక్కుకి వెంటిలేటర్ ఇంకా తగిలించక పోయినా, మనతో ఇంకో చిక్కుంది. మన ఉద్యోగాలన్నీ మిగతా దేశాల మీద ఆధారపడ్డవే. పోనీ కొత్తవేమైనా పుట్టిద్దామా అంటే చాలా రంగాలు ఇప్పటికే వచ్చేసి, ఇక కొత్తగా రావడానికేమీ మిగల్లేదు. అందుకే మన ప్రభుత్వం FDI అంటూ గగ్గోలు పెట్టింది. అదొస్తే ఏదో అద్భుతం జరుగుతుందని కాదు. కనీసం ఏదో చేస్తున్నట్టు కనబడటానికి. ఈ మధ్యలో exportలు తగ్గి, software చల్లబడితే ఉద్యోగావకాశాలు బాగా తగ్గుతాయి. ఇప్పుడు మన పరిస్థితి అదే. మన last quarter 5.5% GDP growth, ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం నెలకొన్న 2008-9 కంటా కూడా తక్కువ.
గత సంవత్సరంగా ఇండియాలో దాదాపు ప్రతి రంగంలోనూ కొంత మాంద్యం కనపడుతోంది. అభివృద్ది చెందిన దేశాలలోనూ పరిస్థితులు మెరుగు పడకపోవడం మూలాన మన ఉద్యోగావకాశాలు ఇప్పట్లో బాగయ్యే అవకాశం లేదు.
ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి!!
ఎరక్క పోయి వచ్చాను, ఇరుక్కు పోయాను
పది సంవత్సరాల corporate opportunities మన ఆలోచనా విధానంలోనే ఓ పెద్ద మార్పుని తెచ్చేయి. ఇప్పటి వరకూ పట్టణాలలో, గ్రామాలలో చిన్నా చితకా ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయం చేసుకొనే కుటుంబాల నుంచి వచ్చిన ఎంతో మంది ఈ Software, IT తదితర corporate ఉద్యోగాల మోజులో పడి మహానగరాల దారి పట్టేరు. ఇదే సమయంలో వ్యవసాయ రంగం క్షీణించడం కూడా జరిగి ఈ మార్పుకి దోహదపడింది. Corporate opportunities ఉంటే పర్వాలేదు. కానీ అవి తగ్గుతున్న ఈ సమయంలో చాలా మంది “రెంటికీ చెడ్డ రేవడి”లా తయారయ్యే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో కాలేజీలనుంచి పాసవుతున్న ప్రతి విద్యార్ధి తరతరాలుగా వస్తున్నకుటుంబ వృత్తిని (వ్యవసాయమైనా, వ్యాపారమైనా)పట్టించుకోకుండా కేవలం నగరాలకి ఉద్యోగం అన్వేషణలో పోతున్నాడన్నది అందరికీ తెలిసిన విషయమే.
వచ్చే 2-3 సంవత్సరాలలో చాలామంది ఈ మహానగరాల మాయలో భంగపడి “పుట్టి౦టోళ్ళు తరిమేసారు, కట్టుకున్నాడు వదిలేసాడు” అని పాడుకోవాల్సి వస్తుంది.
టౌను పక్కకెళ్ళద్దురో డింగరీ……… డాంబికాలు పోవద్దురో
’అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలయ్యా?’ అని మీరు నన్ను నిలదీయవచ్చు. సూక్ష్మంగా చెబుతాను.
- ఇకపై ప్రపంచం ఆర్ధికంగా పెద్దగా పెరిగే సూచనలు ఇప్పట్లో కనబడటంలేదు కాబట్టి, మీ ఎదుగుదల కేవలం మీ capability మీదనే ఆధారపడి ఉంటుంది. ఏ కాలేజీలో చదివినా ఎవడో వచ్చి ఏదో ఒక ఉద్యోగం ఇచ్చే రోజులు పోయేయి. మీకు BE, MBAలకి మంచి కాలేజీలో సీటు రాకపోతే ఓ సంవత్సరం పోయినా మళ్లీ గట్టిగా ప్రిపేర్ అవడం బెటర్. ఈలోగా ఆ డబ్బులు fixed depositలో వేసుకుంటే కనీసం interest అయినా వస్తుంది. దువ్వూరి సుబ్బారావుగారి పుణ్యమా అని మన దేశంలో interest rates చాలా దేశాలకంటే ఎక్కువ.
- మీరు ఇప్పటికే ఉద్యోగం చేస్తుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి.ఇది పొతే ఇంకోటి రావడం అంత ఈజీ కాదు.
- మీరు చదివిన చదువుకు ఇప్పటి వరకూ ఏ మంచి ఉద్యోగం రాకపోయుంటే ఈ ఉద్యోగం గోల వదిలేసి వేరే ఏమైనా చెయ్యవచ్చేమో ఆలోచించండి. మీకు తాతల తండ్రుల ద్వారా సంక్రమించిన వ్యాపకం ఏదైనా ఉంటే దాని మీద కూడా కాస్త దృష్టి పెట్టండి.
- నగరాల్లో బతికితేనే బతుకు అని అనుకోకండి. గ్రామాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ రకరకాలు చేసి డబ్బు సంపాదించ వచ్చు.
- గత పది సంవత్సరాల అలవాట్లనీ కొంత వదిలించుకోండి.డబ్బు దాచడం, ఖర్చులు తగ్గించడం ఎలాగో మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెబుతారు. మా నాన్నో వేస్ట్ ఫెలో అని అనుకోకండి. మిమ్మల్ని చదివించింది ఆయనే.