ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మన స్వాతంత్ర్యం మేడిపండు

Like-o-Meter
[Total: 0 Average: 0]

మన స్వాతంత్ర్యానికి 64 ఏళ్ళు నిండాయి. ప్రపంచంలోనే ఘనతరమైన ప్రజాస్వామ్యం మనదని దరువులు వేసుకుంటూ అవినీతి గురించి, ప్రజా సంక్షేమం గురించి, రైతు సంక్షేమం గురించి, ధరల నియంత్రణ గురించి అరవై నాలుగేళ్ళుగా మనం వింటున్న ప్రసంగాలనే మరోసారి వినిపించారు మన ప్రధాని. ఈ దేశంలో నిజంగానే స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామా మనం?

దేశ ప్రధాని, బుల్లెట్ ప్రూఫ్ గది నుండి బిక్కుబిక్కుమంటూ జెండా ఎగురవేసి, ప్రసంగాలు చేయటం మనకు లభించిన స్వాతంత్ర్యమా లేక దౌర్భాగ్యమా? ప్రధాని పరిస్థితే ఇలా ఉంటే, సామాన్యుడు ఏ స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ఈ దేశంలో బతుకు వెళ్ళదీస్తున్నాడో తేలికగానే అర్ధమౌతుంది.

మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా నిలవాల్సిన వ్యవస్థలు (చట్ట సభలు, అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఆఖరికి మీడియా కూడా) పీకల్లోతు అవినీతిలో మునిగిపోయి ఉన్నాయి. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించటానికి అనుమతులు కూడా దొరకని స్వాతంత్ర్యం మనది!

ఉద్యోగావకాశాల గురించి తర్వాత, కనీస విద్యావకాశాలు కూడా అందరికీ లభించని స్వాతంత్ర్యం మనది. ప్రజలకు కూడు గూడు గుడ్డ వంటి కనీస అవసరాలను కూడా తీర్చలేని స్వాతంత్ర్యం మనది. రైతే దేశానికి వెన్నెముక అన్న ప్రసంగాల మోతలో, కనీస ధరల కోసం రైతులు చేసే ఆక్రోశాలు వినిపించని స్వాతంత్ర్యం మనది. కనీస ధరలు కల్పించకపోయినా ఫర్వాలేదు, పారిశ్రామికీకరణ పేరుతో రైతుల భూములు దోచే స్వాతంత్ర్యం మనది.

పొద్దున్నే నిద్ర లేచింది మొదలు, రాత్రి నిద్రపోయే వరకూ ఈ దేశంలో సగటు మనిషి పద్మవ్యూహంలో జీవితాన్ని వెళ్ళబోస్తున్నాడు. ఎక్కడి స్వాతంత్ర్యం? అసలు ఈ దేశంలో ఎక్కడ, ఎవరికి స్వాతంత్ర్యం ఉందంటారు?

ఈ దేశంలో డబ్బు, అధికారం మాత్రమే మనకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వగల ముడిపదార్ధాలు. మన రాజకీయ నాయకుల్లాగా నీతి, నిజాయితీ, నిబద్ధతలు వదిలేసి నిస్సిగ్గుగా స్వేచ్ఛా వాయువులు పీల్చేద్దాం. మరో మహాత్ముడు పుట్టి మరో స్వాతంత్ర్య పోరాటం చేసేదాకా, చైతన్యరహితంగా జీవితాలు వెళ్ళబుచ్చుదాం. సంవత్సరానికోసారి, మువ్వన్నెల జెండాల రెపరెపల మాటున మన మూర్ఖత్వానికి ముసుగులు వేస్తూనే ఉందాం.


జై బోలో స్వతంత్ర భారత్ కి…