ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మరపురాని వ్యక్తులు

Like-o-Meter
[Total: 2 Average: 4.5]

బహుశా

వెలితి

జ్ఞాపకాల గుప్తనిధికి

తాళంచెవి

                    — (ముకుంద రామారావు – మరో మజిలీకి ముందు)

 **************

కొద్దిరోజుల క్రితం పై వాక్యాలను చదవగానే నా జీవితంలో ఒకసారి ఎదురుపడి మరలా ఎప్పుడూ తారసపడని కొద్దిమంది మరపురాని వ్యక్తులు వరసగా గుర్తుకొచ్చారు. నా మనసు అనుభవించిన ఆ మూగ సంతోషాన్ని అక్షరబద్ధం చేసే ప్రయత్నమే ఇది.

 **************

 

తిరుపతి, 1977

 తిరుపతిలో తి.తి.దే వారి బాలమందిర్ పాఠశాలలో ఒకటవ తరగతి చేరినప్పుడు ఎదురు పడ్డ ఓ వ్యక్తి (అప్పటికే అతను హై స్కూల్ లో చదివేవాడు). నేను స్కూల్లోకి అడుగుపెట్టగానే నన్ను ఎత్తుకుని తరగతి గది దాకా తీసుకెళ్ళేవాడు. అతనెవరో, పేరేమిటో ఏవీ గుర్తులేవు. కానీ అతని భుజాల నెక్కిన దృశ్యం మాత్రం ఇంకా తాజాగా ఉంది.

 **************

తాడిపత్రి, 1978-81

తాడిపత్రిలో సుంకువారి ఇంటికెదురు సందులో (రాయలసీమలో గొంది అంటారు) ఉండేవాళ్ళం. అప్పట్లో ఆ సందు ఏడిళ్ళ గొంది అని పిలిచేవారు. అక్కడ పరిచయమైన వ్యక్తి “వాణి”. నేను రెండో తరగతి నుండి ఐదో తరగతి వరకు అక్కడి మున్సిపల్ స్కూల్లో చదివాను. వాణి అప్పుడు పదో తరగతిలో చదివేది. ఆ సందులో ఉన్న ఏడిళ్ళలో దాదాపు 10 మంది పిల్లలం ఉండేవాళ్ళం. మేమందరం వాణి కంటే చిన్నవాళ్ళం. అందుకని ఆ అమ్మాయి మా జట్టు నాయకురాలైంది.

 

వాణి మంచి సృజనాత్మకత ఉన్న వ్యక్తి. వేసవి సెలవుల్లో మమ్మల్ని పోగేసి ఇంటికి దగ్గరలోని పెన్నా నదికి పిలుచుకెళ్ళేది.

వెళ్ళే ముందు అందరం వారి వారి ఇళ్ళల్లో పప్పులు, బెల్లం, గసాలు, కొబ్బరి తురుము, ఆవాలు, ఇంగు లాంటి వంట సామాగ్రీని భిక్షమెత్తి పొట్లాలు కట్టి తీసుకెళ్ళేవాళ్ళం.

క్రికెట్ జట్టులా మొత్తం 11 మంది.

ఏటి కెళ్ళగానే అబ్బాయిలం వంటచెరకు కోసం ఓ మైలు దూరం నడిచి ఎండిన పుల్లలు, పేళ్ళు ఏరుకొచ్చేవాళ్ళం. ఈలోపు వాణి ఆధ్వర్యంలో అమ్మాయిలు రాళ్ళు పెట్టి కుంపట్లు సిద్ధం చేసేవారు. పొట్లాల్లో ఉన్న సామాగ్రీని వాణికి అందుబాటులో ఉంచేవారు. పుల్లలు, పేళ్ళు రాగానే పొయ్యి వెలిగేది. సహాయకులు చకచకా అందిస్తుంటే ముప్పావు గంటలో వంటకాలు తయారు చేసేది వాణి.

ఈలోపు అబ్బాయిలం మరో దిక్కుకెళ్ళి బాదాం చెట్టు ఆకుల్ని కోసుకొచ్చేవాళ్ళం. అమ్మాయిలు ఆకుల్లో వడ్డించేలోపు నీటి చెలమల్ని తోడేవాళ్ళం. వేసవి కాబట్టి పెన్నా నది దాదాపు ఎండిపోయి అక్కడక్కడా నీళ్ళు ఉండేవి.బాసింపట్టేసి కూర్చోని వాణి చేసిన వంటకాలని బాదాం ఆకుల్లో ఎంచక్కా లాగించేసి చెలమల్లోని నీళ్ళు తాగి, త్రేంచి తిన్నది అరిగే నిమిత్తం ఆటల్లో పడేవాళ్ళం. 

సిగరెట్టు పెట్టలని అడ్డంగా చింపి, గుండ్రంగా తిప్పి, ఇసుక మీద వదిలి పెట్టేవాళ్ళం. గాలికి అవి దొర్లుకుంటూ పోయేవి. ఎవరిదైతే పడకుండా ఎక్కువ దూరం పోతుందో వాళ్ళు గెలిచినట్టు. ఈ ఆట విసుగెత్తగానే అంటుముట్టాట. జట్లు వేసుకుని ఒకరి నొకరు తరుముకుంటూ కాలిన ఇసుకలో పరుగెట్టేవాళ్ళం. ఆడి ఆడి దప్పికేసి చెలమల్లోని నీళ్ళు తాగి, నీడలో సేద తీరి, తెచ్చుకున్న సామాగ్రీని మూటకట్టి ఇంటి దారి పట్టేవాళ్ళం.

వాణి క్రియేటివిటీ ఇక్కడితో ఆగిపోలేదు. మరో రోజు మా జట్టు సభ్యులందరూ నేస్తుడు కిషోర్ ఇంట్లో మేడ మీద పెద్ద గదిలో గుమిగూడేవాళ్ళం. వాణి మాచేత డ్రామాలు వేయించేది. నాకు బాగా గుర్తున్న డ్రామా “బాలనాగమ్మ”. అందులో వాణి మాయల మరాఠీ. నా చెల్లెలు కమల, సువ్వి అనే మరో అమ్మాయి వాణి సహాయకులు. నేను బాలవర్ధన రాజును. వందన, కిషోర్ బాలనాగమ్మ తల్లిదండ్రులు. హిమబిందు బాలనాగమ్మ. ఇలా తారాగణం మిలమిలలాడుతుండగా మిట్టామధ్యాహ్నం వేళకు నాటకం మొదలై సాయంత్రం వరకూ సాగేది. 

ఇక శివరాత్రి వస్తే మా ఇంటి కట్ట (అరుగు) మీద మా నాన్నగారు 100 క్యాండిల్ బల్బులు పెట్టి రంగం సిద్ధం చేసేవారు. వాణి దర్శకత్వంలో ఏ బాలజ్యోతిలోనిదో, చందమామలోనిదో, బాలమిత్రలోనిదో మంచి కథలు ఎన్నుకుని రాత్రి మొత్తం నాటకాలు వేసేవాళ్ళం. 

వీటితో బాటు మర్చిపోలేని ఘటన మరొకటున్నది. వాణి వాళ్ళ అమ్మగారు (లక్ష్మీదేవి గారు) సంగీతం, వీణ నేర్పించేవారు. త్యాగరాజు ఆరాధానోత్సవాలు కూడా చేసేవారు. అలా ఓ ఆరాధనోత్సవంలో వాణి అప్పుడే వచ్చిన శంకరాభరణం సినిమాలోని “సామజవర గమన” పాట పాడింది. సరిగ్గా ఏ సందర్భంలో శంకర శాస్త్రి గట్టిగా అరుస్తాడో అదే చోట నేను గట్టిగా “శారదా” అని అరిచేసాను. వెంటనే వాణీ పాటనాపేసింది. అందరూ నా వైపే చూడ్డంతో వీధిలోకి పరుగెట్టాను. వెనుక నవ్వుల హోరు. 

తాడిపత్రి వదిలి మేము నరసరావుపేటకు వెళ్ళిన కొద్ది సంవత్సరాల తరువాత ఆఫీసు పనిమీద తాడిపత్రి వెళ్ళిన మా నాన్నగారు వాణికి పెళ్ళైనట్టు వార్త పట్టుకొచ్చారు. ఇప్పుడు వాణి ఎక్కడుందో తెలీదు. కానీ ఆమె నేర్పించిన సృజనాత్మక పాఠాలను మరువలేదు.

 **************

 నరసరావుపేట, 1981-84

ఇక్కడ నేను ఆరవ తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకూ చదివాను.

నా జీవితంలో ఈ నాలుగేళ్ళు మర్చిపోలేనివి. అక్కడి మిత్రులని కూడా మరచిపోలేను.

హరిబాబు, మల్లికార్జునరావు, మాధవరావు, రషీద్ , మెహబూబ్ , పూర్ణచంద్రరావు, ప్రభాకర్ , రవి, చాంద్ బాషా……..ఇలా చాలామందే ఉన్నారు.

ఐతే నేను మర్చిపోలేని మనిషి మా ఇంగ్లీష్ టీచర్ ఉషారాణి మేడం. 

ఆరవ తరగతిలో మొదటి యూనిట్ పరీక్షలో లెక్కల్లో సున్నా మార్కులు, ఇంగ్లీషులో మూడు మార్కులు వచ్చిన నా గురించి కలవర పడిన వ్యక్తి. మొద్దబ్బాయిలు ఎంతో మంది ఉన్నా నా చదువు గురించి మా నాన్నగారిని పిలిపించుకుని మాట్లాడిన ఒకే ఒక టీచర్. ఆవిడ దగ్గరకే ట్యూషన్ కు పంపాలని నాన్నగారు నిశ్చయించారు. ఎంతో ఓపికతో నా బుర్రకు పాఠాలు ఎక్కించిన మేడంను నేను ఎప్పటికీ మరువలేను. 

ఆవిడ ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ చిరునవ్వు నన్ను ముగ్ధుణ్ణి చేసేది. లెక్కల్లో ఏమాత్రం తప్పులు చేసినా నాన్నగారి చేతుల్లో వీపు చిట్లిపోయేది. “రఘోత్తమరావ్ నీకు లెక్కల్రావ్” అని మా నాన్నగారు ప్రాసబద్ధంగా తిట్టేవారు. ఐతే ఇంట్లో అమ్మ, స్కూల్లో ఉషారాణి మేడం కోప్పడకుండా పాఠాలు చెప్పేవారు. 

ఓరోజు ఉదయాన్నే మల్లికార్జునరావు పరుగెట్టుకొచ్చి “ఉషారాణి మేడం గారు నిప్పుల్లో కాలిపోయారంట్రా. గుంటూరుకు పిల్చుకెళ్ళారంట” అని చెబితే ఉన్నపాటున మేడం ఇంటికి పరుగెట్టాను. ఆవిడ అక్కడ లేదని తెలిసినా కొద్దిసేపు తచ్చాడి వచ్చాను. దాదాపు ఆరు నెలల తర్వాత మేడం వచ్చారు. 

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

తరగతి గదిలో నేల మీది ముందు వరసలో కూర్చుని మేడం ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్నాను. తరగతిలోకి ఆవిడ రాగానే అందరం నిలబడి గుడ్ మార్నింగ్ చెప్పాం. ఆత్రంగా మేడం వైపు చూసాను. చేతుల పై కాలినపోయిన మచ్చలున్నాయి. ఐతే ముఖం మాత్రం కాలలేదు. 

ఆవిడ నవ్వుతూ తరగతినంతా ఓసారి చూసి కుర్చీలో కూర్చుంటూనే “ఏం రఘు ! ఎలా చదువుకొంటున్నావు?” అని అడిగారు. నాకు ఓ పక్క సంతోషం, మరో పక్క దుఃఖం తన్నుకొచ్చాయి. గట్టిగా వెక్కిళ్ళుపెట్టి ఏడుస్తూ తల ఊపాను. 

ఈరోజుకూ చిరునవ్వుతో నిండి ఉండే ఉషారాణి మేడం ముఖం మాత్రం మర్చిపోలేను.

 

 **************

మిత్రుడు మూలా సుబ్రహ్మణ్యం ను తొలిసారిగా కలిసినప్పుడు ఓ కవితా సంకలనాన్ని కానుకగా ఇచ్చారు. ఇస్తూ అందులో ఇలా వ్రాసారు:

“కొందరు మన జీవితంలో ఎందుకు ప్రవేశిస్తారో తెలీదు

వారి వల్ల మనం పొందే ఆనందానికి మాత్రం కట్టలేము ఖరీదు”

 

నా జీవితంలోకి వచ్చి ఇంత వెలుగు నింపి వెళ్ళిన వారి విషయంలో పై మాటలు అక్షర సత్యాలే. 

 **************