ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మిలియన్ అవివేకాలు!

Like-o-Meter
[Total: 0 Average: 0]

ట్యాంక్ బండ్ పై ఉన్న తెలుగు వెలుగు మూర్తుల్ని తెలంగాణా ఆందోళనకారులు తమ మిలియన్ మార్చ్ సందర్భంగా ధ్వంసం చేసి సాగర్ లో తోస్తున్నారన్న వార్తల్ని టివి ఛానెల్స్ లో చూసిన తర్వాత తెలంగాణా ఉద్యమకారులు తమ చరిత్రను ఏవిధంగా తీర్చిదిద్ద దల్చుకున్నారో బోధపడ్డం లేదు.

 

ఒక చక్రవర్తి, ఒక కవి, ఒక వేదాంతి, ఒక సంస్కర్త తెలంగాణా ద్రోహులెలా అయ్యారో అర్థం కావడం లేదు. వారి చరిత్ర వీరి రాజకీయాలకు ఎలా అడ్డంకి అయింది? ప్రాంతీయ భావనల కతీతంగా వారికున్న ఆదరణ తెలంగాణా సాధనకు ఏవిధంగా వ్యతిరేకం?

అంబేద్కర్ విగ్రహం వేలు విరిగితే గోల చేసే వారు, గుర్రం జాషువా విగ్రహాన్ని ముక్కలు చేస్తున్నప్పుడు గుర్రెట్టి నిద్రపోతున్నారా!!

వితంతు వివాహాల్ని ప్రోత్సహించిన కందుకూరి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే తెలంగాణా వస్తుందా?

నన్నయ, శ్రీశ్రీ విగ్రహాల్ని నేల మట్టం చేస్తేనే తెలంగాణా తల్లి సుఖనిద్ర పోతుందా?

భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకన్న మూర్తిని ధ్వంసం చేస్తే మన దేశాన్ని మనమే అవమానించుకున్నట్టు కాదా?

గుంపు గూడితే “మూక మనస్తత్వం” (mass hysteria) ప్రబలుతుంది. ఇది సహజం. కానీ ఆవేశం అవివేకాని దారి తీయకూడదు. అలా జరక్కుండ చూడడం ఆయా నేతలు కనీస కర్తవ్యం. కానీ వీధి రౌడీలే నేతలౌతున్న ఈ కాలంలో కనీస విలువల్ని కూడ ఆశించలేమని ఈరోజు ఋజువయింది.

తెలంగాణా నాయకులు రేపు “ఇది మావాళ్ళ పని కాదు. సమైక్యవాదుల పని” అని చేతులు దులిపేసుకోవచ్చు.

ఎన్టీయార్ అంటే గిట్టని కాంగ్రెస్ వాళ్ళు చేసారని తెలుగుదేశం వాళ్ళు ఆరోపించవచ్చు.

ఇంకా ఇలాంటివేవో డ్రామాలు జరగవచ్చు. కానీ జారిన మాట, పోయిన మానం, గతించిన ప్రాణం తిరిగిరావు.

తెలుగు వెలుగుల్ని చిదిమేసిన వారు ఎవరైనా – అవివేకులుగా, జాతి ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోవడం తథ్యం!

*****