ఎవరీ ముగ్ధమనోజ్ఞ దర్శనుడెవండీ శారదామూర్తి? ఈ
నవశృంగార రసావతారు డెవరన్నా? శ్రీమదజ్జాడయే
అవునా! ఆ దరహాస మా నడక తీరా ఠీవి ఆ దర్ప మా
కవితా దీప్తి అనన్య సాధ్యములురా కైమోడ్పులందింపరా!
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చెప్పిన పద్యం ఇది.
అన్నదాతలని దిగంతవిఖ్యాతులై
పరగి రజ్జాడాదిభట్లవారు
బ్రాహ్మణ ప్రభువులై బహుయజ్ఞశాలలం
బన్ని రజ్జాడాదిభట్లవారు
కరవు వచ్చిన ఘన కుటుంబముల గా
పాడి రజ్జాడాదిభట్లవారు
విజయరామగజేంద్రు విందొనర్చిరి తమ
పట్ట నజ్జాడాదిభట్లవారు
శ్రీగలిపి యింటిపేర్ ఖకారించి చేతి
వ్రాలు పచరించి లక్ష్మీ సరస్వతులకు
పొందుగావించి మేలిన ప్రోడ లెదిరి
పల్క నోపరజ్జాడాదిభట్లవారు
పైన చెప్పిన రెండు పద్యాలూ ఒకటి శ్రీ నారాయణ దాసుగారి గురించి మరొకటి అజ్జాడ ఆదిభట్లవారి గురించీ వివరం చెపుతాయి.
పుంభావ సరస్వతి, పంచముఖీ పరమేశ్వర, హరికధా పితామహ ఇలా ఎన్నో బిరుదులుగొన్న ఆ మహనీయుని గురించి వ్రాస్తే ఒక పెద్ద కావ్యం అవుతుంది. నాకు అంతటి అర్హత లేదుగా. వారు సంగీత రహస్యాలను వివరిస్తూ వ్రాసిన గ్రంధమునకు ముందుమాట వ్రాయగలిగిన వారు ఆరోజుల్లో లేరు అంటే అతిశయోక్తి కాదు సుమా. వారు పుట్టిన ఇంటనే పుట్టినందుకూ, అజ్జాడ అగ్రహారమునకు తొలివారసుడను అయినందుకు గర్విస్తూ, వారిగురించి వ్రాయమని అడిగిన మిత్రులారా, వృత్తి రీత్యా చాలా హడావిడిగా ఉన్నాను. వీలు మేరకు తప్పక మీ సూచన పాటించగలవాడను అని మనవి.
— శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ