ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఓ ఆవు కథ

Like-o-Meter
[Total: 0 Average: 0]

పచ్చని పల్లెలో పుట్టాను నేను. పుట్టగానే మా అమ్మ పాలు తాగా. ఆ రుచి మరిగానో లేదు నన్నువెనక్కి లాగేశారు. అమ్మకు దూరంగా కట్టేశారు. అమ్మ పాలన్నీ పితికేసారు. నాకు రుచించని తిండి పెట్టారు. ఆకలికి ఓర్వలేక తినేసాను. నా ముందే అమ్మ పాలు రోజూ రెండు సార్లు పితుకుతారు. అమ్మ నా వంక చూస్తూ రంకెలు పెడుతుంది. నేను అమ్మ వంక చూస్తూ కేకలు వేస్తాను. 
 
నాకు ఎప్పుడు వచ్చిందో తెలియదు వయసు. కాని చాల అసహజంగా నాకు గర్భం వచ్చింది.  నాకు సహజమైన ప్రేమ కలిగే సమయానికి నాకు ఒక ఆడపిల్ల పుట్టింది. అప్పుడు తెలిసింది – ఇదే కదా చరిత్ర పునరావృతం కావడం అంటే అని.  ఈ మధ్యలో నేను ఎక్కువ పాలు ఇవ్వడం కోసం నాకు కొన్ని సూది మందులు ఇచ్చారు. మొత్తం పాలన్నీ పిండుకున్నారు. నా దిగుబడి తగ్గుతుంది అనగా నాకు మేత తగ్గించారు.  కొంత కాలానికి నాకు మళ్ళీ గర్భం వచ్చింది అదే సమయంలో నా కళ్ళ ముందే నేను కన్న ఆ చిన్నపిల్లకు కూడా కృత్రిమ గర్భం వచ్చేలా చేసారు. నేను, నా పిల్ల మూగగా చూస్తూ ఉన్నాం.  నా పిల్లకు మొగ బిడ్డ కలిగింది కానీ ఆ బిడ్డకు సరిగా పళ్ళు ఇవ్వనివ్వరు. నేను ఎంతగానో రోదించాను. నన్ను చూస్తూ న బిడ్డ కూడా. నాకు మరలా ఆడ పిల్లే. 
 
చరిత్ర మరలా పునరావృతం అయింది. కాని ఇక్కడో మార్పు. నా మనవణ్ణీ ఒక విధమైన యాతనకు గురిచేసారు. వాడు పెరిగి పెద్దయ్యాక ఒక కబేళాకు అమ్మేసారు. మంచి ధర పలికింది అని తెలిసింది. అక్కడకు వెళ్ళిన ఒక పెద్దాయన చెబుతుంటే విన్నాను. బలంగా ఉన్న నా మనుమణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేసి వాడి పేగులు, చర్మం, మాంసం, కొమ్ములు, తోక, అన్నీ విడివిడి గా అమ్ముకొని బాగా సొమ్ము చేసుకున్నారని ఇది తెలిసి నేను భోరుమని ఏడ్చేసాను. 
 
నాకు నాలుగు ఈతలు అయ్యయో లేవో నా బతుకు చాల భారంగా మారిపోయింది. కాని నా ముందే నా రైతు ఇంట్లో సంతానం కూడా వృద్ది అయ్యింది. ఎందుకో ఆ రైతు భార్య వాళ్ళ పిల్లలకి నా పాలేనే పట్టిస్తుంది వాళ్ళను చూస్తే నాకు ఒకరకమైన అభిమానం. వాళ్ళకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మొగపిల్లలూ.
 
నా కళ్ళ ముందే నా రైతు కూతురు తన పిల్లకు పాలు ఇస్తుంటే చూసి నేను మురిసిపోయాను. కనీసం వీళ్ళైనా పిల్లలకు తాగినన్ని పాలు ఇస్తున్నారు అని. వీళ్ళ పాలు అమ్ముకోవడం లేదు అని. 
 
ఈమధ్య కాలం లో నా గొప్పదనం పై చాల మంది ఉపన్యాసాలు ఇస్తున్నారట. వాళ్ళ పుణ్యాన ఒక మంచి జరిగింది. నా దగ్గరకు రోజూ చాల కుటుంబాలు వచ్చి నాకు మంచి పళ్ళు, గడ్డీ పెట్టడం, నా చుట్టూ ప్రదక్షిణ చేయడం నా పృష్ట భాగానికి నమస్కరించడం, నా పాలే కొనుక్కొని వెళ్ళడం నా మూత్రం, నా మలం పవిత్రం గా సేకరించడం చేస్తున్నారు. నా పిల్లకు కూడా మంచి గ్రాసం ఇస్తున్నారు. ఈ మార్పు నాకు చాల వింతగా తోచింది. 
 
మా రైతు మాత్రం తన ఖర్చు తగ్గించుకొని మంచి రాబడితో సహకార సంఘానికి నా పాలుపోసి ఇంకా లాభం పొందుతున్నాడు. ఆవు పాలకు గిరికీ పెరగడం తో నా పై ఇంకా ప్రయోగాలు మొదలయ్యాయి. మళ్ళీ గర్భం దాల్చాను. ఆవుపాల జున్నుకి మంచి గిరాకీ రావడంతో మా రైతు ఒక్క గుక్క మాత్రం నా బిడ్డతో తాగించి మిగతావి పితుక్కొని అమ్మేసుకున్నాడు. 
 
ఒక సంవత్సరంలో నా ఆరోగ్యం క్షీణించింది. నన్ను కూడా కబేళాకు బేరం కుదిర్చి పంపేశాడు రైతు. ఆ ఇరుకు లారీలో నాతో పాటే ఉన్న తోటి ఆవుల్ని, ఎద్దులని చూసా. ఒక ఎద్దు నా పక్కనే నన్ను రాసుకొంటూ నిలబడివుంది. దాని స్పర్శ నాకు కొత్తగా తోచింది. దానికి కూడా అలానే అనిపించిందేమో నన్ను ప్రేమగా చూస్తూ నాతో ప్రయాణం చేసింది.
ఎముకలు విరిగిపోయే వేగం, ఎత్తు పల్లాలు, దుర్భరమైన ప్రయాణం. నరక యాతన. మొత్తానికి గమ్యం చేరాము. ఇక ఎవరు ముందు చంపబడతారో తెలియదు. 

ఆ రాత్రి ఒక కల:
 
నన్ను హింసించిన రైతు,  నన్ను ఇక్కడకు తీసుకొని వచ్చిన లారీ వాడు, నన్ను లారీలోకి బలవంతంగా ఎక్కించిన వాడు, నన్ను దారుణంగా నించోబెట్టి కట్టేసిన వాడు. ఒక 12 గంటలు నీరు గడ్డీ లేకుండా ప్రయాణం చేయించిన వాడు, నాకు సూది మందు ఇచ్చిన వాడు, నాకు కృత్రిమంగా గర్భాదానం చేసిన వాడు అందరూ యమలోకం  లో భయంకరమైన యాతనలను అనుభవిస్తుంటే నేను చూస్తూ ఉండడం. నాకు ఆ యమభటులు వారిని చూపి “ఇక నీకు ఈ యమసదనం లో  పని లేదు ఎందుకంటే నీ పాపాలు భూలోకం లోనే వీళ్ళు చేసిన పనితో పోయాయి. ఇహ నువ్వు స్వర్గ వాసివే!” అని చెప్పి నన్ను పంపిచేసారు. 
 
కల చెదిరింది కబేళా  ద్వారం తెరుచుకుంది.  నన్ను చంపడానికి ఒకాయన తోలుకొని పోయాడు. నా తలకు ఒక చట్రం  లో పెట్టి నరికేసాడు అంతే.  వీళ్ళను నరకంలో చూడలేదే అని వాపోయాను. 
 
నేను చనిపోలేదని వెంటనే తెలిసింది. మళ్ళీ నా తలపుల్లోకి వెళ్లాను 
 
నా పాల తో వ్యాపారం 
నాశరీరం తొ వ్యాపారం 
నా బిడ్డ తో వ్యాపారం 
నా జీవితం తో  వ్యాపారం 
నా మల మూత్రాలతో వ్యాపారం 
నాకు పూజ, నమస్కారం 
మమ్మల్నే వేదోక్తం గా దానం ఇవ్వడం 
వింతగా తోచింది ఈ మనుషుల నైజమ్. 
 
నేను విన్నాను నా దగ్గరకొచ్చి రోజూ విష్ణు సహస్రం చదివే ఆయన తన భార్యతో చెబుతుంటే. ద్వాపర యుగంలో బృందావనం లో కృష్ణుడు చేసిన లీలలు అన్నీ మా ఉద్ధరణ కోసం చేసినవే అని. అందుకే నందవ్రజం లో పాలు పెరుగు నెయ్యి సంవృద్దిగా దొరికేవని. లేగదూడలు కడుపు నిండా పాలు తాగేవని. పాలు అమ్మడం యాదవులు ఎరుగరని 
 
మొన్న ఒకాయన వచ్చి వాపోయాడు:
 
నీటి కొరత, ఆహార కొరత, ఎండ వేడిమి పెరగడం, అవినీతి పెరిగిపోవడం, భద్రత లేకపోవడం, చెత్త చెదారం, మురికి కూపంగా మైదానాలు మారడం, అడవులు తరిగిపోవడం అన్నీ నన్ను హింసించడం వల్లే జరిగాయని. 
 
నేను అంత శక్తి ఉన్న దాననా అని నేను వాపోయాను !!