వైద్య వసతులు లేని రోజుల్లో అయితే, పుట్టిన పిల్లలందరూ పోతూంటే, విచిత్రమైన పేర్లు పెట్టుకునే వారుట. పెంటమ్మ, పిచ్చయ్య, వగైరా. గ్రామ దేవతల పేర్లు కూడా లేకపోలేదు… పోలేరమ్మలూ, కాటేరమ్మలూ అన్న మాట! ఇక పితామహులూ, మాతామహులూ వంటి వార్ల పేర్లు మామూలే. మా తాత పేరంటే, మా తాత పేరని గొడవలు పడ్డ దంపతులూ, రాజీపడి ఇద్దరి పేర్లూ పెట్టుకునే వారు కూడా లేకపోలేదు. పిల్లలు పుట్టడం కాసింత ఆలస్యం కావడంతో పేరుపేరునా అందరు దేవుళ్ళకూ మొక్కుకుని కొండవీటి చేంతాడంత పేర్లు పెట్టుకున్న వారూ కద్దు!
ఇటీవల కులాల పేర్లు పోయాయి. మతాల పేర్లు కూడా పోయి వసుధైక కుటుంబాలు రావాలంటే ఇంకా కొన్నేళ్ళు (కనీసం శతాబ్దం) పడుతుందేమో. పిల్లల పేర్లు కురచగా, వెరైటీగా పెట్టుకోవడం కూడా ఫ్యాషనై పోయింది. కానీ, అర్థం కానివి కూడా పెట్టుకుంటున్నారు. అడగడానికి మనమెవరం? మా పిల్లలు, మా ఇష్టం అనే తల్లిదండ్రులుంటారు.
కాకపోతే, తెలుగులో Irony/ Paradox అనే పదానికి సరైన అనువాదం లేదేమో. ఎనీవే, చిత్రంగా పేరుకీ, ప్రవృత్తికీ విపరీతమైన తేడా ఉంటుంది. ‘ప్రశాంత్’ అందరిమీదా మండి పడేవాడూ… విఘ్నేశ్వర శాస్త్రి ఫక్తు నాస్తికుడూ… ఇలాగన్న మాట! అందుకే ‘అమర్’, ‘చిరంజీవి’ వంటి పేర్లు చాల తక్కువ.
ఇటీవలే అవినీతి శాఖ అధికారులకు ఓ ఎమ్మార్వో పట్టుబడ్డాడు. 23 ఇళ్ళ స్థలాలూ, ఎకరాల కొద్దీ వ్యవసాయ భూములూ, కమర్షియల్ భూములూ, మొదలైన అక్రమాస్తులూ దాదాపు 10 కోట్ల దాకా బల్ల కింది డబ్బు! చిత్రమేమిటంటే ఆయన పేరు ధర్మారావు!
ఒకసారి ఒక తెలుగువ్యక్తి విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతని పక్క సీటులోని విదేశీయుణ్ణి తనపేరు అడిగాడు.
“My name is Bond…JAMES Bond” అని సమాధానం వచ్చింది.
“By the way, what is your name?” అని ఆయన తిరిగి మన తెలుగు బాబుని అడిగాడు.
“My name is Prasad….KRISHNA Prasad…….RAMA Krishna Prasad…..NARAYANA Rama Krishna Prasad…..SHANKARA Narayana Rama Krishna Prasad…….”
వీరు తమపేరు పూర్తిగా చెప్పకముందే Bond గారు మూర్చపోయారు.
ఇదీ మన వాళ్ళ పేర్ల సంగతి.