ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

తెలంగాణా- తెలుగోడి గుండెల గణగణ

Like-o-Meter
[Total: 0 Average: 0]

తెలంగాణా తెలంగాణా తెలంగాణా !
 
ఈ రోజుల్లో ఎవ్వరిని కదిపినా సరే ఒక్కటే మాట. అదే తెలంగాణా. అయితే ఒక్కొక్కరి నోటి నుండి ఒక్కో భావంతో వస్తుంది. ముందుగా దీని గురించి చెప్పే ముందు రెండు చిన్న కధలు చెబుతాను.
 
మొదటిది మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనకు పెద్దవాళ్ళు కానీయండి లేదా మన పుస్తకాలలో కానీయండి “కలిసి ఉంటే కలదు సుఖం ” అని ఒక కద చెప్పేవారు. ఈ కధలో ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉంటారు. ఎప్పుడూ కూడా ఆ నలుగురు అన్నాతమ్ముళ్లు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. ఈలోగా ఆ తండ్రికి ఆరోగ్యం బాగా లేక మంచాన పడతాడు. ఇక తన చివరి ఘడియలు వచ్చాయి అని తెలుసుకొని నలుగురు కొడుకులని పిలుస్తాడు. వాళ్ళు వచ్చిన తరువాత అందరికి కొన్ని కట్టెపుల్లలు ఇచ్చి వాటిని విరగ్గొట్టమంటాడు. అయితే వాళ్ళు ఎవ్వరు కూడా ఆ కట్టే పుల్లల మోపుని విరగ్గొట్టలేకపోతారు. అప్పుడు అందరిని కూడా ఒక్కో పుల్లని విరగ్గొట్టమంటాడు. దాంతో అందరూ కూడా చాల తేలికగా పుల్లల్ని విరిచేస్తారు. అప్పుడు  ఆ తండ్రి అందరిని దగ్గరకు తీసుకొని ఈవిధంగా అంటాడు.” చూసారా!  పుల్లలు విడివిడిగా ఉంటె మీరు దాన్ని తేలిగ్గా విరిచేశారు. అదే ఆ పుల్లలు అన్ని కలిసి ఉంటే మీలో ఎవరూ కూడా విరగ్గొట్ట లేకపోయారు. అలాగే మీరు కూడా కలిసి ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏమి చెయ్యలేరు” అని. దాంతో ఆ అన్నా తమ్ముళ్ళకి విషయం అర్ధం అయ్యి ఆ తరువాత నుండి అందరూ కలిసి మెలిసి ఉంటారు.  ఇది ఒక కధ.
 
రెండో కధ ఏంటి అంటే ఒక వూళ్ళో ఒకానొక తండ్రికి ముగ్గురు కొడుకులు. అందులో ఇద్దరు అన్నాతమ్ముళ్ళు  ఊరు అంతా మెచ్చుకొనేలా ఎంతో ఆప్యాయంగా ఉంటారు. మూడోవాడు వాళ్ళతో కలవక ఒక్కడే తిరుగుతూ ఉంటాడు. మొదటి ఇద్దరు ఒకరికి దెబ్బ తగిలితే మరి ఒకరు వారికే దెబ్బ తగిలినట్టుగా బాధ పడుతూ ఉంటారు. ఈ ఇద్దరినీ చూసి ఊరు వాళ్ళు అంతా మరో రామ లక్ష్మణులని చూసినట్టుగా భావిస్తూ ఉంటారు. ఇది చూసిన తండ్రి వారిద్దరినీ దగ్గరికి పిలిచి “ఎల్లకాలం మీ ఇద్దరూ ఇలా అన్యోన్యంగా కలిసి మెలిసి ఉండాలని, ఎంత కష్టం వచ్చినా సరే ఒకరినొకరు విడిచి పెట్టకూడదు” అని చెబుతాడు. ఇద్దరు కూడా వారి మనసులో పెట్టుకుంటారు. ఇలా ఉండగా ఒకసారి అన్నాదమ్ముళ్ళు ముగ్గురూ  ఇంట్లో ఉన్నప్పుడు, ఆ ఇంటి వాళ్ళు అందరూ పని మీద పక్క ఊరికి వెళతారు. ఇంతలో వారి ఇంటికి నిప్పు అంటుకుంటుంది. అది చూసిన అన్నాదమ్ముళ్ళు బయటకు వచ్చే సమయంలో అన్న మీద ఒక దూలం పడి కాలు విరుగుతుంది. దాంతో అన్న పైకి  లెగవలేక పోతాడు. అది చూసి తమ్ముడు కూడా అన్నతో ఏడుస్తూ కూర్చుంటాడు. అయితే మూడో వాడు మాత్రం పరిగెత్తి ఇంటి నుండి బయటకు వచ్చేస్తాడు. ఇది చూసి వూరి వాళ్ళు అన్నని వదిలేసి తమ్ముడు ఒక్కడినే బయటకు రమ్మంటారు. అయితే తమ్ముడు వాళ్ళ నాన్న చెప్పిన విషయం గుర్తు ఉంచుకొని తానూ అన్నను విడిచి రాలేను అని చెప్పి అక్కడే ఉంటాడు. ఈలోగా ఇల్లు పూర్తిగా కాలిపోయి ఇంటితో పాటే ఆ ఇద్దరు అన్న తమ్ముళ్ళు చనిపోతారు.మూడో వాడు మాత్రం ప్రాణాలతో బయట పడతాడు. దాంతో ఆ తండ్రి తన మాట వినటం వల్లే కొడుకులు ఇద్దరు కూడా చావులో సైతం విడిపోలేదు అని ఎంతగానో బాధ పడతాడు.
 
ఇప్పుడు ఒక సారి పైన చెప్పిన కధలని నేటి పరిస్థితులకి జత చేసి చూద్దాము.
 
మొదటి కధని విశ్లేషిస్తే, మనకు తెలిసిన నీటి కలిసి ఉంటే కలదు సుఖము. ఇది మనకు అందరికి తెలిసిన విషయమే. అందుకే మన రాష్ట్రంలో ఉన్న తెలంగాణేతర(అంటే కోస్తా, రాయలసీమ) నాయకులంతా కూడా మన రాష్ట్రం విడిపోతే ఢిల్లీ పెద్దల వద్ద మన పలుకుబడి తగ్గిపోతుంది అని గొంతు చించుకుంటున్నారు. కానీ వీరు అంతా ఒక విషయం మర్చిపోతున్నారు. 2004 నుండి వచ్చిన రెండు UPA ప్రభుత్వాలని కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళిన MP లు మాత్రమే నిలబెడుతున్నారు. ఇది ఎవరైనా కాదని చెప్పగలరా?
 
అయితే ఇంత చేసినా మన వాళ్ళు అందరూ ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండి  కేంద్ర ప్రభుత్వానికి 33 పైగా MP లని ఇచ్చినా కూడా మన రాష్ట్రానికి వచ్చినా మంత్రి పదవులు ఎన్ని? పోనీ మంత్రి పదవులు వదిలేసి ఇంత పెద్ద రాష్ట్రంగా ఉండి కూడా మన రాష్ట్రానికి చెందిన ఇంత మంది MP లు కలిసి ఉండి తీసుకు వచ్చిన పధకాలు, నిధులు ఎన్ని?
 
అదే పక్క రాష్ట్రాలను చూడండి! కేవలం వారికి ఉన్న 18 , 14 మంది MP లతో వారికి నచ్చిన మినిస్టర్ పోస్టులు, కావలసిన నిధులు ఎలా తన్నుకు వెళుతున్నారో? అది ఏంటి అని అడిగే దమ్ము ఒక్క MP గారికి కూడా లేదు. ఎందుకు అంటే ఏమన్నా అంటే అమ్మగారు వారి MP పోస్ట్ ని ఊడ పీకి ఇంటికి పంపుతారు. దీన్ని బట్టి తేలింది ఏంటి అంటే మనం అందరము కలిసి ఉన్నంత మాత్రాన ఢిల్లీ పెద్దలు మనకు భయపడి మనం అడిగింది ఇచ్చేయరు. అందుకే అంటారు “వడ్డిచ్చేవాడు మన వాడు అయితే చివరి బంతిలో కూర్చున్న నెయ్యి/లడ్డు వస్తుంది”.
 
సరే ఇంకో ఉదాహరణ తో మనం మొదటి కధ విశ్లేషణ పూర్తి చేద్దాము. ఒక క్లాసు లో 60 మంది స్టూడెంట్స్, ఇంకో క్లాసు లో 40  మంది స్టూడెంట్ ఉన్నారు అనుకోండి. ఎవరైనా మిమ్మల్ని ఈ క్లాసు కంట్రోల్ చెయ్యగలరు అంటే ఏ క్లాసు ని ఎన్నుకుంటారు? ఖచ్చితంగా 40 మంది స్టూడెంట్స్ ఉన్న క్లాసునే కధ. అంతేకానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అందరూ కలిసి మెలిసి ఉంటారు అని 60 మంది ఉన్న క్లాసు ని ఎన్నుకోరు కదా? అందుకే రాష్ట్రం చిన్నదైనంత మాత్రాన మన పెద్దరికం ఏదో ఢిల్లీ పెద్దల దగ్గర తగ్గిపోతుంది అని బాధపడాల్సిన పని లేదు. అసలు మనకు ఢిల్లీ పెద్దల దగ్గర గౌరవం అనేది ఉంటే అది ఎప్పుడూ ఐనా అలాగే ఉంటుంది. రాష్ట్రాన్ని విడకొట్టడం వల్ల నష్టము ఏమి లేదు.
 
ఇక రెండో కధని కూడా ఒకసారి విశ్లేషిద్దాము. రెండో కధ వల్ల మనకు తెలిసింది ఏంటి అంటే, అవసరాన్ని బట్టి మనము ప్రవర్తించాలి అని. ఎందుకంటే ఆ సమయంలో మాత్రమే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ రోజుల్లో ఖండాల మధ్యే దూరం తగ్గిపోతుంది. అంతెందుకు ఎక్కడో గ్లోబ్ కి అటు పక్కన ఉన్న Newyork  లేదా Australia కే మనం కేవలం ఒక రోజులో వెళ్లి వచ్చేయగలుగుతున్నాము. ఇంకా ఈ సమయంలో మన వాళ్ళు రాష్ట్రాన్ని విడతీయాలి అని మనలో మనం కొట్టుకు చావటంలో అర్ధం లేదు. ఇంతకు ముందే చెప్పుకున్నాము మనమందరం ఇంత మందిమి కలిసి ఉన్నా మనకు న్యాయంగా రావలసిన వాటాలను కూడా వేరే రాష్ట్రాల వాళ్ళు ఎలా దోచుకుపోతున్నారో? అందుకే కనీసం ఇప్పుడు నుండి ఐనా సరే కలిసి మెలిసి నుండైనా వాటా కోసం పోరాడి సాధిద్దాము. ఒక విషయం ఆలోచిస్తే కోస్తా ప్రాంతానికి తీర ప్రాంతం ఉంది, రాయలసీమ ప్రాంతానికి గనులు ఉన్నాయ్, తెలంగాణా ప్రాంతంలో నీళ్ళు, బొగ్గు ఉన్నాయ్. ఈ మూడు కలిస్తే దేశంలో వేరే ఏ రాష్ట్రం కూడా అందుకోనంతగా అభివృద్ధి సాధించవచ్చు. కానీ ఎవ్వరూ దీని గురించి ఆలోచించట్లేదు. రాష్ట్రాన్ని కలిపి ఉంచితే వచ్చే నష్టము ఏమి లేదు.
 
అసలు తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలి అనే వాళ్ళు అందుకు సహేతుకం గా ఒక్క కారణం ఇది అని ఇద్దమితంగా చెప్పలేక పోతున్నారు. ఏమైనా అంటే మాకు పంట భూములు ఉన్నా సరైన నీటి వసతి లేదు అంటారు. కానీ నీటి పారుదల శాఖ వారు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు ఐన అప్పుడు నుండి రాష్ట్రం లో మిగతా ప్రాంతాల కన్నా కూడా తెలంగాణా ప్రాంతం సాగు నీటి ప్రాజెక్టుల వల్ల అధికంగా లబ్ది పొందింది. ఈ సంగతి తెలిసిన వెంటనే వారు చెప్పే తరువాత కారణం తమ ప్రాంతం వెనకబాటు కి గురి అయ్యింది అని. కానీ అందరికి తెలుసు రాయలసీమ ప్రాంతం రాష్ట్రం మొత్తం లోనే ఎంతో వెనకబడి ఉంది, అంతే కాదు శ్రీకాకుళం ఇంకా కొన్ని కోస్తా ప్రాంతాలు కూడా తెలంగాణా లోని కొన్ని జిల్లా కన్నా కూడా వెనకబాటు గురి అయ్యాయి అని. ఎప్పడు అయితే మనం ఈ విషయం చేబుతామో వెంటనే వారు చెప్పేది స్వయం పరిపాలన అని. ఒక తమిళ్ వాడు సింగపూర్ కి ప్రధాని గా చేసాడు అంటే అందరూ కూడా అబ్బ మన భారతీయుడు ఇతర దేశాలలో కూడా ప్రతాపం చూపుతున్నాడని సంతోషిస్తాము. ఒక తెలుగువాడు అమెరికాలో ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా చేస్తున్నాడు అంటే అబ్బో తెలుగువాడు అమెరికాలో కూడా వెలిగి పోతున్నాడు అని ఆనందిస్తారు. పాకిస్తాన్ లో పుట్టిన పెద్దాయన మన దేశ ప్రధానిగా చేస్తున్నా సరే మనకు ఏమి ఇబ్బ౦ది  లేదు, కానీ మన రాష్ట్రంలో ఉన్న వేరే ప్రాంతం వాడు మాత్రం  రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండ కూడదు అంట.  
                                             
ఒక్క విషయం ఆలోచించాలి. భారతదేశం లోని ఏ రాష్ట్రానికైనా ఇతర రాష్ట్రానికి చెందిన వాళ్ళు మాత్రమే గవర్నర్గా పని చెయ్యాలని రూల్  పెట్టుకున్నాము. ఇక్కడ లేని అభ్యంతరం మిగత వాటికి ఎందుకు? తరువాత వాళ్లు చెప్పే మాట ఆంధ్ర ప్రాంతీయులు వారి ప్రాంతానికి వచ్చి వ్యాపారాలు చేస్తూ ఇక్కడ వారి పొట్ట కొట్టారు అంటారు. కానీ ఇదే ప్రాంతంలో మాత్రం వేరే రాష్ట్రాలు లేదా దేశాలకు చెందిన  వారు కూడా  వ్యాపారం చేస్తారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన వారు కూడా ప్రపంచం లోని ఏ ప్రాంతానికైనా వెళ్లి వ్యాపారం చేస్తారు. కానీ మరి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు మాత్రం తెలంగాణాలో వ్యాపారాలు చేస్తే వచ్చే తప్పు ఏంటో చెప్పరు కదా! 
 
సరే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి అనే వాళ్ళు కూడా విడిపోతే వచ్చే నష్టాలు విడ మర్చి చెప్పరు. ఎంత సేపు మన విలువ ఢిల్లీ లో తగ్గిపోతుంది  అని “పాడిందే పాటరా , పాచి పళ్ళ దాసర” అన్నట్లుగా చెపుతారు. కనీసం కలిసి ఉంటే వచ్చే లాబాలు కూడా చెప్పరు. ఎందుకు అంటే వీరు ఎవ్వరూ కూడా అసలు ఆలోచించేది రాష్ట్రం యొక్క లాభనష్టాలు కాదు కేవలం వారి వ్యాపార అవసరాలే. ఇన్ని గొడవలు జరుగుతున్నప్పుడు ఐన సరే వీరిలో ఎవరన్నా రాష్ట్రంలో ఉన్న వేరే ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టిన పాపాన పోయారా? ఎంత సేపు హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే వీరి పెట్టుబడులు తిరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే వీరికి హైదరాబాద్ అనేది ఒక బంగారు బాతు. దీని గుడ్లు మొత్తం వాడి అప్పుడు ఇతర ప్రాంతాల మీద దృష్టి పెడతారు.
 
పోనీ మీడియా వారైనా రాష్ట్ర౦ విడిపోవడం వల్ల వచ్చే లాభనష్టాలను వివరిస్తారు అంటే అది కూడా ఎంత మాత్రం లేదు. ఇక్కడ నా ఉద్దేశం రాష్ట్ర విభజనకు అనుకూలంగానో లేదా వ్యతిరేకం గానో కాదు. ఏ నిర్ణయమైనా చాల త్వరగా తీసుకోవాలి అని. ఎందుకు అంటే ఈ రాజీనామాలు, బందులు వల్ల ఏ రాజకీయ నాయకుడికి కానీ సో కాల్డ్ ఐకాసా నాయకులకు కానీ నష్టం లేదు. నష్ట పోయేవారు ఎవరు అంటే ఖచ్చితంగా విద్యార్దులు, ఇంకా మన బోటి మధ్య తరగతి  జనాబా మాత్రమే. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చిన కాంపిటిటివ్ ఎగ్జామ్స్ లో మన రాష్ట్ర విద్యార్దులు ఎంత గా నష్ట పోయారో చూసాము. ఈ సారి అలా కాకుండా చూడాల్సిన భాద్యత మన అందరి మీద ఎంత ఐన ఉంది. 
 
చివరిగా చెప్పేదేంటంటే మన నాయకులు అందరూ కూర్చొని రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఏ నిర్ణయమైనా సరే త్వరగా తీసుకోవాలి. ఒకవేళ విభజన అనివార్యం అయితే అందువల్ల వచ్చే లాభనష్టాలు, విభజనే లేకపోతే వచ్చే లాభనష్టాలు అందరూ చర్చించి వాటి అన్నింటిని ప్రజల ముందు ఉంచాలి.  తద్వారా ఈ గంధర గోళానికి త్వరగా తెర దించాలి. మన౦ ఇలా గొడవల్లో పడి కొట్టుకుంటుంటే మన పక్క రాష్ట్రాల వాళ్ళు చక్కగా ఈ గొడవల్లో చలి కాచుకుంటూ మనకి రావలసిన రొట్టెలని కూడా తీరిగ్గా ఆరగిస్తున్నారు. కానీ ఇంత చేసి ఇరు ప్రాంతాల వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడేట్టు చేసేది ఎవరు అని అందరూ ఎదురు చూసే ప్రశ్న. ఎందుకు అంటే ” పిల్లి మెడలో ఎవరు గంట కడతారు?” అని ఎవరిని అడిగిన ఎవ్వరూ సమాదానం ఇవ్వలేరు. మరి ఆ గంట కట్టి మన గండం దాటించేవాడు ఎవ్వరో మనం ఎదురు చూస్తో ఉండవలసిందేనా?