ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

తెలుగు తరగతిలో ఆ రోజు!

Like-o-Meter
[Total: 2 Average: 4.5]

 

నేను తొమ్మిదో క్లాసు చదివుతున్న రోజులు. మా తెలుగు మాష్టారి క్లాసంటే మా అందరికీ చాలా యిష్టం. పద్యమైనా, గద్యమైనా ఎంతో ఆసక్తికరంగా చెప్తూ విద్యార్ధులు తల తిప్పకుండా వినేలా చేయగల నేర్పు వారిలో వుండేది.

క్లాసులో నలభై మంది విద్యార్ధులలో నేనొక్కర్తినే అమ్మాయిని. ఒక బెంచి మీద విడిగా కూర్చునేదాన్ని. ఆ రోజు క్లాసులో పాండవుల అజ్ఞాత వాసం పాఠ్యాంశంగా చెపుతున్నారు. పాఠం చాలా ఆసక్తికరంగా చెప్తున్నారు. 

అనుకోకుండా బెంచి కొసలో ఏదో కదలుతున్నట్ట్లుంటే నా దృష్టి దాని మీద పడింది. కందిరీగ కన్నా చిన్న కీటకం, ఆ కోవకి చెందినదే. కాళ్ళతో చిన్న మట్టి వుండ తెచ్చి అంతకు ముందు నుంచీ కడుతున్న యింటికి చేర్చి కాళ్ళతో తడుతూ గోడలా కడుతోంది. మధ్య మధ్యలో నోటి తడిని కాలితో తీస్తూ, రెండు కాళ్ళని చేతులలా వుపయోగిస్తూ, పల్చటి గోడ కడుతూంటే గమ్మత్తుగా అనిపించి పరిసరాల్ని మరిచి ఆ దృశ్యాన్ని చూస్తున్నాను.

మా మాష్టారు నా పరధ్యానంను గమనించి, చెప్పులు విడిచి అడుగుల చప్పుడు కాకుండా నా వెనుకకి వచ్చి నేను చూస్తున్నదేమిటా అని చూశారుట.(ఈ విషయం తరువాత మిగతా వారి ద్వారా తెలిసింది) ఒకప్రశ్న వేసి “హైమవతీ! నువ్వు చెప్పు”అన్నారు గట్టిగా.

తుళ్ళిపడి లేచి నిలుచున్నాను.

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

“క్లాసులో పరధ్యానంగా వుంటే పరీక్ష రిజల్టు పరాధీనమవుతుంది. ఏమిటంత దీక్షగా చూస్తున్నావు?” గద్దించారు.

కాస్త తడబడ్డాను – “కందిరీగలాంటి కీటకం మట్టితో యిల్లు కట్టుకుంటూ వుంటే విచిత్రంగా అనిపించి చూస్తున్నాను మాష్టారూ.”

“అమ్మా! క్లాసులో పాఠాలు సరిగా వినకుండా ప్రకృతి పర్యావలోకనం చేస్తుంటే పెద్దై మట్టిళ్ళు కట్టుకోవాలి.”

“క్షమించండి మాస్టారూ తప్పైపోయింది,”

“సరే నా ప్రశ్నకి సమాధానమివ్వు”

“అడగండి మాష్టారూ”

“విరటుని కొలువులో సైరంధ్రి ఏ పేరుతో పరిచయమైంది?”

పిల్లలంతా ఘొల్లున నవ్వారు. “సైలెన్స్! ఏమయింది?” అని మాష్టారు గదమాయించారు.

నాకు నవ్వు వచ్చినా ఆపుకుని “మీ ప్రశ్నలోనే సమాధానముంది మాష్టారూ”

“అలాగా ప్రశ్న ఎలా వుండాలి?”

“విరటుని కొలువులో ద్రౌపది ఏ పేరుతో పరిచయమయింది అని వుండాలి.”

“నేనూ అదే అడిగాను గదా?”

“లేదు. మీరు సైరంధ్రి ఏ పేరుతో పరిచయం అయిందని అడిగారు సార్”

“చూశారా పిల్లలూ ! క్లాసులో మీరు పరధ్యానంగా వుంటే మా ధ్యానం కూడా చెదురుతుంది. తెలిసిందా? ఇంకెప్పుడూ క్లాసులో కూర్చుని కాకుల్ని, కందిరీగల్ని గమనించకండి!” అంటూ సున్నితంగా మందలించారు. వారి మందలింపులో కూడా సున్నితమైన హాస్యం తొణికిసలాడేది.

ఎన్ని సంవత్సరాలు గడచినా యీ చిన్ని సంఘటన నా జ్ఞాపకపు పొరల్లో నిక్షిప్తమై వుండిపోయింది.




@@@@@