ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

తేనెల తేటల మాటలతో

Like-o-Meter
[Total: 0 Average: 0]

“మనసులో మాట” సుజాతగారు వ్రాసిన “మీరైతే ఏం చేస్తారు?” అన్న రచన చదివి ఒక్కసారిగా బాల్యస్మృతుల్లోకి వెళ్ళిపోయాను. అలా ఆలోచిస్తూనే, నా స్నేహితుని బ్లాగు చూస్తుంటే, ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారు పాడుతుంటేను, ఆకాశవాణిలో తరచుగా వింటూ నేర్చుకున్న పాట యుట్యూబ్ లింకుతో కనబడింది.

 

నేను ఏడో తరగతి చదువుతున్న రోజులు. అప్పట్లో మా హిందు హైస్కూలు, గుంటూరు వార్షికోత్సవాలకి ప్రతి తరగతికి తెలుగు, ఇంగ్లీషు, హింది వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించేవారు. అప్పట్లో, నేను, పత్రి వాసుదేవన్ దాదాపుగా అన్ని బహుమతులు గెలుచుకుంటూ ఉండేవాళ్ళం. దాదాపు అన్ని పోటీల్లో బహుమతి గెలుచుకుంటున్నా, పాటల పోటీలో ఏనాడు గెల్చుకోలేదని ఓ అసంతృప్తి మాత్రం ఉండిపోయింది.

 

సరే, ఈసారి పాటల పోటీలో కూడా పాల్గొందామని ఈ పాటే బాగా సాధన చేసి వెళ్ళాను. పల్లవి కూడా కానీకుండా, “ఇక చాల్లే, పా!” అంటూ మాస్టారు కాకాని నరసింహా రావుగారు పంపించేసారు 🙂

 

దేశభక్తి గీతాలు ఎన్ని విన్నా, ఈ పాట మనలో ఊపిరులూదే ఉత్సాహం అనిర్వచనీయం. అందులోను, పిల్లలు పాడుతుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి కూడా. ఎంత అద్భుతమైన సాహిత్యం!మీరు కూడా వినండి.

 

తేనెల తేటల మాటలతో

మన దేశమాతనే కొలిచెదమా

భావం భాగ్యం చూసుకొని

ఇక జీవన యానం చేయుదమా

 

సాగరమేఖల చుట్టుకొని

సురగంగ చీరగా మలచుకొని

గీతాగానం పాడుకొని

మన దేవికి ఇవ్వాలి హారతులు…. (తేనెల…)

 

గాంగ జటాధర భావనతో

హిమశైల శిఖరమే నిలబడగా

గలగల పారే నదులన్నీ

ఒక బృందగానమే చేస్తుంటే… (తేనెల…)

 

ఎందరొ వీరుల త్యాగ ఫలం

మన నేటి స్వేచ్ఛకే మూలబలం

వారందరినీ తలచుకొని

మన మానసవీధిని నిలుపుకొని… (తేనెల…)

 

కర్టెసి : యుట్యూబ్ – పూనూరు కమలాకర్ గారు