ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

తృప్తి

Like-o-Meter
[Total: 0 Average: 0]

పెరేడ్ గ్రౌండ్స్ ముందు ఉన్న ఫ్లైఓవర్ పేలవంగా చూస్తోంది. అటుపక్క ఉన్న చెట్లు వసంత కాలానికి పులకించాయి. చెట్ల కింద ఉన్న ఫుట్ పాత్ పై ఉంది గత రెండేళ్లుగా ఒక కుటుంబం గదలు, విల్లు-బాణాలు, పిల్లనగ్రోవులు, ఇతర ఆట వస్తువులు తయారు చేసి అక్కడకు దగ్గరలో ఉన్న ప్యాట్నీ సెంటర్ లో పారడైస్ సెంటర్లో అమ్మి మళ్ళీ ఆ చెట్ల కిందకు వచ్చి సేదతీరి సంసారం చేస్తు. దగ్గరలోనే శులభ్ సౌకర్యం లో కాలకృత్యాలు, ముందుగా ఉన్న హోటల్ లో టిఫిన్, పారడైస్ బిరియానీ. నగరం మధ్యలో కానీ ఖర్చులేని వసతి!!  వర్షం వస్తే ఫ్లైఓవర్ క్రిందకు చేరిపోయి ఆనందంగా నగర ట్రాఫిక్ ను చూస్తూ కాలం గడిపేస్తారు. 

 
ఉదయం చూస్తె చక్కగా వాళ్ళ పిల్లలు ఫుట్ పాత్ పై ఆడుకొంటూ ఉంటారు. అక్కడే వంట. ఇప్పటి వరకూ ఏ  పోలీసూ వాళ్ళను అక్కడనుంచి వెళ్ళ గోట్టలేదు. తరచూ అనిపిస్తుంది  ధర్మం ఈ కుటుంబం విషయం లో నాలుగు పాదాల మీదా నడుస్తుంది అని! 
 
చాల సార్లు చూసాను, వెన్నెల్లో, వానలో, ఉదయాలూ సాయంత్రాలూ చాల సంతోషం గా కనిపిస్తారు ఈ కుటుంబ సభ్యులు.  రోజూ వీరి విచిత్రమైన ఇంటి మీదుగానే నా ప్రయాణం పనికోసం. సాయంత్రం కూడా అంతే ఆనందం గా కనిపిస్తారు. కుటుంబ పెద్దేమో ఆయన, ఎప్పుడూ కాలుమీద కాలు వేసుకొని వెల్లకిలా పడుకొని నీలాకాశం వైపు చూస్తూ సేద తీరుతూ  ఉంటాడు.   ఎదురుగా పెరేడ్ గ్రౌండ్స్ మీదుగా చాల్లని గాలి, ఫుట్ పాత్ పై ఉన్న వరుస చెట్లు మంచి నీడను చల్లదనాన్ని ఇస్తాయి.   ఎదురుగా విశాల మైన రోడ్లు వీళ్ళని ఇబ్బంది పెట్టవు. ఎవరూ వీళ్ళ ఫుట్ పాత్ ను ఎక్కువగా వాడరు వాడినా పక్కనుంచి ఒరిగి ఒరిగి వెళిపోతారు !! పండుగ రోజుల్లో (నాకు సెలవు లేనప్పుడు) పని మానేసి భలే సరదాగా ఆటలూ కేరింతలూ ఈ కుటుంబం లో ఉంటాయి. పండుగ కళ  అంతా అక్కడే !!
 
రోజూ ఇంటికి వచ్చి చూస్తె, మా ఇంటి దగ్గరలో ఒక కుటుంబం సకల సంపదలూ ఉన్నాయి కాని శాంతి, ఆరోగ్యం లేదు. కడుపు నిండా తినలేరు, కంటి నిండా నిద్ర పట్టదు.  ముఖం లో సంతోషం కానరాదు!! నిజమైన సంపద తృప్తి కదా అని రోజూ అనిపిస్తుంది.   ఆ విచిత్రమైన కుటుంబం చూస్తూ రోజూ వాస్తవాన్ని తాకుతూ వెళ్తున్న భావన ఇది !! ఈ కుటుంబం ఉన్న చోట చెట్లు కదిలితే, గాలి వీస్తూ వీళ్ళ పిల్లల ముంగురులను కదుపుతుంటే ఒక ప్రశాంతత ప్రకృతి చూసి ఆనందించి నంతగా కలుగుతుంది.  ఎండా కాచినా, వాన కురిసినా, చలిగాలి వీచినా  వెన్నెల తడిపినా వీరి దగ్గర మాత్రం ఒక ప్రత్యేకత ఉంది.  నగరం మధ్యలో ఒక చక్కని జీవన యాత్ర చూసిన సంతోషం. నగరానికి ఈ కుటుంబం ఒక కళని  ఆపాదిన్చిందా  అని అది ఒక ఆకాశ హర్మ్యం కూడా చేయలేని పనిలా తోచింది నాకు.