ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

త్వం హి దుర్గా

Like-o-Meter
[Total: 0 Average: 0]

త్వం హి దుర్గా దశప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయిని, నమామి త్వాం
నమామి కమలాం అమలాం అతులాం….వందేమాతరం

పై వాక్యాలవల్ల “వందేమాతరం” భారత జాతీయగీతం కాలేకపోయిందీ అంటే హిందువులకు నమ్మడం కష్టమౌతుందా? నరనరాన, కణకణానా సెక్యులరిజం పారి, ప్రవహించేవాళ్ళ సంగతేమో కానీ నాకు మాత్రం జీర్ణం కాని విషయం.

స్వాతంత్ర్యానికి పూర్వమే 1937లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో “వందేమాతరం” పై ఒక నిర్ణయం తీసుకున్నారట. “త్వం హి దుర్గా….” వంటి మతసంబధమైన చరణాలను విడిచి, దేశాన్ని మాత్రమే వర్ణించే చరణాలను (అంటే శుభ్రజ్యోత్స్న పులకిత యామినీ మొ.) పాడాలని ఆ నిర్ణయం యొక్క సారాంశం. ఇలా ఎందుకు చెయ్యాల్సి వచ్చింది ? ముస్లింలు అల్లాకు తప్ప మరే దేవుడికీ, దేవతకూ నమస్కరించనందు వల్ల.

స్వాతంత్ర్య పోరాటాలు ఊపందుకొంటున్న సమయంలో ప్రతి భారతీయుని గొంతులో నినదించిన పదం “వందేమాతరం”. బ్రిటీషు ప్రభుత్వ నిషేధానికి లోనైన పదం ఇది. స్వతంత్ర్య భారత జాతీయ పతాకాల నమూనాలను రూపొందిస్తున్నప్పుడు, మేడమ్ కామా (భికాజీ రుస్తుం కామా) తన నమూనాలో సంస్కృతాక్షరాలలోని “వందే మాతరం” ను చేర్చింది.

లాలా లజ్పత్ రాయ్ “వందేమాతరం” పత్రికను నడిపారు. 1896లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జాతీయగీత కర్త రబీంద్రనాథ్ టాగోర్ ఈ పాటను పాడారు. “వందేమాతరం అన్న మహిమాన్వితమైన పదం, తనను ఉచ్ఛరించని వ్యక్త ఇనుప బొక్కసాలను, బలమైన గోడలను పగులగొట్టి అతని గుండెను చీల్చుతుంది” అని టాగోర్ ప్రకటించారు.

ఇంతటి ప్రభావశీలమైన గీతం రాజకీయంగా సరైన గౌరవానికి నోచుకోకపోయినా ఆ గీతానికి గల మంత్రతుల్యమైన శక్తి మాసిపోదు.

హిందూదేశంలో హిందూ దేవతలను పొగిడితే ఏదో నేరంగా భావించేవాళ్ళు పక్క దేశాలకు వెళ్ళి “గాడ్ సేవ్ ద క్వీన్” పాటను గుండెపై చేయి వేసుకొని పాడుతారు(!). అదీ మన సమ్ గతి!

[amazon_link asins=’B07F42WYGM,9351365476,9352661567,9388304004′ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’b0df8d25-0eb9-11e9-aa2e-ab5a4770b059′]

రాజకీయాల మాటను విడిచిపెట్టి సాహిత్య దృష్టి నుంచి చూస్తే “వందేమాతరం” హత్యకు గురైన గీతమని అనిపిస్తుంది.

ఒక రచయిత/కవి సృష్టించిన కావ్యం/కవితను మన ఇష్టాయిష్టాల మేరకో, పరుల ప్రీతి కోసమో కత్తర వేసే హక్కు మనకు ఉందా? ప్రభుత్వానికి ఉందా? అలాంటి కత్తెర ప్రయోగం ఆయా కవుల గొంతు నొక్కే ప్రయత్నం కాదా?

“వందేమాతరం” వ్రాసినప్పుడు బంకించంద్రుడు ఇది జాతీయగీతం పోటీలో నిలుస్తుందని అనుకొని ఉండడు. బ్రిటీష్ రాజ్యంలో ఉద్యోగిగా “గాడ్ సేవ్ ద కింగ్” పాటను తప్పనిసరిగా పాడాల్సివచ్చినప్పుడు అతనిలోని కవి ఆలపించిన అంతర్వాణి అది. ఈ గీతాన్ని వ్రాసిన 6-7 ఏళ్ళ తర్వాత తన “ఆనంద మఠ్’ నవలలో వాడుకొన్నాడు అంతే.

నిజానికి ఈ గీతం స్వాతంత్ర్యాభిలాషులై, పొట్ట కూటి కోసం బ్రిటీషు కొలువు చేస్తున్న అప్పటి భారతీయులందరి మనోభావమే ఐవుండాలి. లేకపోతే తూర్పులో పుట్టి, ఉత్తర-పశ్చిమాల మీదుగా మన దక్షిణ భారతంలోకి ప్రాకి ఉండేది కాదు. పుట్టిన 135 సంవత్సరాల తరువాత కూడా తన ఉనికిని, శక్తిని నిలుపుకుని ఉండగలిగేది కాదు.

అలాంటి అత్యున్నత సాహిత్యానికి అంటకత్తెరలు వేసి “ఇది సెక్యులర్ చరణం, ఇది మతమౌఢ్య చరణం” అని విడగొట్టడం సమంజసమా?

“ఎప్పటికెయ్యది ప్రస్తుతమో” అన్న చందంగా 1947కు పూర్వం అన్ని మతాల వారినీ కలుపుకుని వెళ్ళి స్వాతంత్ర్యం సంపాదించాల్సిన అవసరం ఉండింది కాబట్టి కొన్ని చరణాలు పాడి, కొన్ని చరణాలు వీడి ఉండవచ్చు. కానీ పాకిస్తాన్ రూపంలో మతప్రాతిపదికంతో ఒక కొత్త దేశం ఏర్పాటైన తర్వాత కూడా భారత ప్రభుత్వం “లౌకికం” పేరుతో బంకించంద్రుడి గొంతు నొక్కుతూనే వస్తోంది.

కవి స్వేచ్ఛ, స్వజనుల భావ స్వేచ్ఛను హత్య చేయడం మనకే చెల్లు అని “వందేమాతరం” నిరూపిస్తోంది. నిష్కల్మషమైన దేశభక్తిని “మతమౌఢ్యం”గా తేల్చి చెప్పే చరిత్రకారులు మన భావ దారిద్ర్యాన్ని మరిత సుసంపన్నం చేసారు. ఆర్.సి. మజుందార్ అనే గొప్ప చరిత్రకారుడి మాటల్లో చెప్పాలంటే “Bankimchandra converted patriotism into religion and religion into patriotism.”

ఈ క్షుద్ర రాజకీయాలను కాసేపు వదిలి, “వందేమాతరం” మూలపాఠాన్ని మననం చేసుకొందాం…

వందేమాతరం
సుజలాం, సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం…వందేమాతరం

శుభ్రజ్యోత్స్న పులకిత యామినీం
ఫుల్ల కుసుమిత దృమదళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం, వరదాం మాతరం
వందేమాతరం

సప్తకోటి కంఠ కలకలనినాదా కరాళే
ద్విసప్తకోటి భుజౌధృత ఖరకరవాలే
అబలా కేనో మా ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం..వందేమాతరం

తుమి విద్యా, తుమి ధర్మా
తుమి హృది, తుమి మర్మా
త్వం హి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తోమారౌ ప్రతిమా గడి మందిరే మందిరే

త్వం హి దుర్గా దశప్రహరణధారిణీ
కమలా కమలదల విహారిణీ
వాణి, విద్యాదాయిని, నమామి త్వాం
నమామి కమలాం, అమలాం, అతులాం
సుజలాం, సుఫలాం, మాతరం…వందేమాతరం

శ్యామలాం, సరళాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం…వందేమాతరం