ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వెర్రి భక్తి – వ్యక్తిపూజ

Like-o-Meter
[Total: 0 Average: 0]

మొన్న ఖైరతాబాద్ గణేశ్ ప్రసాదం (4 వేల కిలోల లడ్డూ) మురికి నీరులో కలిసిపోయాకా, నిన్న జగన్ బెయిల్  పై విడుదలై అద్భుత స్వాగతం పొందాకా ఎందుకు మన భారతీయ సంస్కృతీ సాంప్రదాయం గురించి అన్య మతాల వారు అవమానకరంగా మాట్లాడతారు అనే విషయం తేటతెల్లం అయింది . 
 
ఇక్కడ లడ్డూ కి జగన్ కి లింకు ఏమిటని మనసు ఎద్దేవా చేస్తుంది. దానిని అలా వదిలేయండి కొంచం సేపు. 
 
మన సంస్కృతీ సాంప్రదాయాలకు మనమే నిజమైన శత్రవులం. అంటే అంతఃశత్రువులం. 
 
నా పరిమిత బుద్ధికి తోచినంత వరకూ మన వాజ్ఞ్మయాల్లో గణేశ నిమజ్జనమన్నది ఇలా ఎడాపెడా చేయాలని ఎక్కడా లేదు. ధూమ్ ధామ్‍గా, ఇతరులు ఇబ్బంది పడే రీతిలోనే చేయాలని, విగ్రహం కనీసపుటెత్తు రెండు-మూడు అంతస్థులైనా ఉండాలని, ఇన్ని వేల కిలోల లడ్డూనే కావాలని, ఆ పాచిన లడ్డుని వేలం వేయాలని, అది ప్రసాదం అయినా స్వీకరణకు కుదరని రీతిలో  అన్ని రోజులు ఆ పాచి నైవేద్యాన్ని స్వామీ దగ్గర ఉంచి చివరకు మురుగు నీటి పాలు చేయాలని?
 
ఇక జగన్ విషయం. అతను జైలుకి ఎందుకు వెళ్ళాడు ఎందుకు అన్ని రోజులు ఉన్నాడు ఎందుకు బయటకు వచ్చాడు అనే విషయాన్ని పక్కన పెట్టి చూస్తే ఏదో ఒక గొప్ప స్వాతంత్ర్య ఉద్యమ యోధుడు బైటకు వచ్చినట్లు నీరాజనాలు ఇస్తుంటే నాకిలా అనిపించింది – “చేయవలసిన పనిని అధార్మికంగానూ, చేయకూడని పని సక్రమమైనదిగాను చేయడమే ఈ కలియుగధర్మం” అని.
 
ఈ రెండు ఘటనల వల్ల వెర్రితలలు వేసే దేవుడి(!) భక్తీ,  వ్యక్తిపూజ ఒక్కటే అని నిరూపణ అయింది. సనాతన ధర్మ ప్రచారకులు భక్తి పేరుతో జరుగుతున్న విపరీతాల్ని తీవ్రంగా ఖండించాలి. సక్రమమైన భక్తి అంటే ఏమిటో తెలియజేయాలి. ఇప్పుడు టీవీల్లో అనర్గళంగా ప్రవచనాలు చేస్తున్న జ్ఞానులందరూ మొదటగా హైదరాబాదు గణేశ్ సంఘాల వారికి ఉపదేశాలు చెయ్యాల్సిన అవసరం ఎంతైనా వుంది. కొందరు మాత్రమే సక్రమమైన మార్గంలో ఉంటే చాలదు. దాని వల్ల సమాజం బాగుపడదు. అధిక సంఖ్యలో ప్రజలు ధర్మమార్గంలో నడిస్తేనే  సమాజం కూడా మంచి మార్గంలో ఉంటుంది . 
 
సమాజ వికాసానికి విశ్వాసం పునాది. ఆ పునాదిని పునర్నిర్మించాల్సిన అవసరం గతంలో కంటే ఇప్పుడే చాలా అవసరమైంది. ఎందుకంటే పిచ్చి భక్తి, పిచ్చి వ్యక్తిపూజ మొదలైనవి మన ధార్మిక మూలాలను  సైతం పెకలించివేసే స్థాయికి వెళ్ళిపోతున్నాయి. సనాతన ధర్మమంటే మూఢులు, మూర్ఖులు, పిచ్చివాళ్ళు నమ్ముకొన్న అపోహల ప్రోదిలాగా చూపించే స్థాయిలో ఈ వెర్రిమొర్రి ఉత్సవాలు, నాయకుల ఊరేగింపులూ జరుగుతున్నాయి.
 
హంగూ ఆర్భాటాలు భక్తికి నిర్వచనాలు కావు. కాషాయం కట్టిన ప్రతి వ్యక్తీ నిజమైన సన్యాసి కాడు. అలాగే సినిమా పాటల్తో చేసే వినాయక పూజ అసలు పూజే కాదు. జైల్లో ఉండొచ్చిన ప్రతి నాయకుడూ విశిష్ట నాయకుడైపోడు. ఈ తత్వాన్ని ఆ వినాయకుడే బోధించాలి.