ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అద్వైతం

Like-o-Meter
[Total: 2 Average: 2]

 

సహజంగా జీవించడానికి,సమాజంతో కలిసి నడవడానికి అడ్డుపడే ఆటంకాలను గుర్తించి, వాటినుండి బయటపడే మార్గాన్నికనుగొనడమే ఈ రచన ఉద్దేశ్యం. ఇందులో ప్రస్తావించిన ఈశ్వరుడు, బ్రహ్మం మతానికి చెందినవారు కారు. మానవత్వానికి చెందినవారు. గణిత సమీకరణం అర్ధం కాకపోయినా సమస్యా, దాని పరష్కారం అర్ధం అవుతాయి.

ఈశ్వరుడు:

చూసేవాడు జీవుడు, ద్రష్ట. జీవుడి చేత చూడబడేది జగత్తు, దృశ్యం. ఈ క్రింది అద్వైత సమీకరణం ప్రకారం జీవుడూ జగత్తు(ద్రష్ట,దృశ్యం) రెండూ ఈశ్వరుడే. రెండూ ఆయనవే. రెండింటి అంతరాత్మ ఈశ్వరుడే. కాబట్టి జీవజగత్తులు రెండూ నిమిత్తమాత్రంగా ఉంటూ అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి నడుచుకోవాల్సి ఉంది. జంతువులు తమకు తెలియకుండానే అంతరాత్మ ప్రభోదాన్ని అనుసరిస్తాయి. అందుకే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు.శివుడాజ్ఞను పాటించడానికే కుట్టిన చీమకు కుట్టిన పాపం అంటదు. జంతువులు నిమిత్తమాత్రంగా జీవిస్తాయి.కానీ అర్జునుడు,నేను నిమిత్తమాత్రుణ్ణని అనుకోలేదు. యుద్ధంలో శత్రువులను చంపుతున్నది ‘నేను’ అనుకుని ఆ కార్యానికి కర్తృత్వం వహించాడు. దాంతో తన వాళ్ళను చంపిన పాపం తనను చుట్టుకుంటుందన్న భయం,బాధ అతణ్ణి యుద్ధానికి విముఖుణ్ణి చేసాయి.అంతరాత్మ ప్రభోధం( శ్రీకృష్ణుడే అంతరాత్మ,అయన ప్రబోధమే (భగవద్గీత) విన్న తరువాత తాను నిమిత్తమాత్రుణ్ణని గుర్తించి, కర్తృత్వాన్ని(అహంకార మమకారాలను) విడిచిపెట్టి యుద్ధం చేస్తాడు.

ఎవరిమాటైనా వినాలంటే వారి మీద విశ్వాసం ఉండాలి. అంతరాత్మ ప్రబోధం వినాలంటే దాని మీద విశ్వాసం ఉండాలి. ఇదే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం లేని జీవుడు అంతరాత్మ గొంతు నొక్కేస్తాడు.ఆత్మవంచనకు పాల్పడతాడు. అంతరాత్మను విడిచిపెట్టి బాహ్యంగా ఉన్న జగత్తును -అర్ధకామాలను,పేరు ప్రఖ్యాతుల్ని ,ఇతరుల సానుభూతిని- ఆశ్రయిస్తాడు. వాటిని అదే పనిగా అన్వేషిస్తూ వాటికోసం హత్యలు చేస్తాడు. లేదా ఆత్మహత్యకు పాల్పడతాడు.

[amazon_link asins=’0982525540,812081312X,812084081X,8185301298′ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’95928243-dcdb-48a7-8d52-93e5f30e8ccf’]

అంతరాత్మను విడిచిపెట్టి బాహ్యజగత్తును ఆశ్రయించిన జీవుడు భంగపడి, జగత్తు కూడా నిమిత్తమాత్రమేనని గుర్తించి, తిరిగి అంతర్ముఖుడై అర్జునుడు కృష్ణుణ్ణి అశ్రయించినట్టు అంతరాత్మనుఆశ్రయిస్తాడు. ఆత్మవిశ్వాసాన్నిపెంచుకుంటాడు
‘కర్త నేను కాదు ఈశ్వరుడు’ అని గుర్తిస్తే అహం పోతుంది. ‘జగత్తు నాది కాదు ఈశ్వరుడిది’ అని గుర్తిస్తే దాని మీద మమకారం,అధికారం ఉండవు.సహజంగా జీవించడం అప్పుడే మొదలవుతుంది. అప్పుడిక ఏ పని చేసినా అంతరాత్మ ప్రబోధం(ఆత్మజ్ఞానం) తో,ఆత్మవిశ్వాసంతో చేస్తాం. అహంకార,మమకారాలతో కాదు ‘నేను నిమిత్తమాత్రుణ్ణి’ అని గుర్తిస్తే బాథ్యతలుంటాయి. బరువులుండవు.’ జగత్తు నిమిత్తమాత్రమే’ అని గుర్తిస్తే దానితో ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. దాని మీద ఆధారపడడం ఉండదు.

గీతాకారుడంటాడు:

“శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్”

స్వధర్మం అంటే అంతరాత్మ ప్రభోదించే ధర్మం. పరధర్మం అంటే లౌకిక ధర్మం.రెండిట్లో స్వధర్మమే శ్రేయస్కరం అంటాడు.వెల్లువలో పూచికపుల్ల కూ ,ప్రవాహంలో చేపకు తేడా ఉంది. పూచికపుల్ల చేపగా మారడమే స్వధర్మాన్ని గుర్తెరగడం.’To follow one’s impulse is slavery,but to obey self prescribed law is liberty’ అంటాడు రూసో. ఆ ‘self prescribed law’ యే అంతరాత్మ ప్రబోధించే ధర్మం, స్వధర్మం. జీవుడితో పాటూ జగత్తు కూడా అంతరాత్మదే కాబట్టి, అంతరాత్మ ప్రబోధించే ధర్మంలో వ్యక్తి శ్రేయస్సు తోపాటు,లోక శ్రేయస్సూ ఉంటుంది. జీవుడికీ,జగత్తుకీ రెండింటికీ ఆత్మతో (ఈశ్వరుడితో)ఉన్నసంబంధం కారణంగా, రెండింటి మధ్య ఉన్న సంబంధం అత్మీయమైనది.

“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన”

జీవజగత్తులు నిమిత్తమాత్రములు.కర్మమీద తప్ప ఫలితం మీద వాటికి అధికారం లేదు. “ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి” ఈశ్వరుడు సర్వభూతముల హృదయమందుండి వాటిని నడిపించుచున్నాడు.

బ్రహ్మం:

క్రింది సమీకరణం అంతటా ఉన్నది ఒకే ఒకటి (1). అది బ్రహ్మం.బ్రహ్మమే,తాడు పాముగా కనిపించినట్టు, జీవుడిగా, జగత్తుగా, ఈశ్వరుడిగా కనపడుతోంది. అందుకే బ్రహ్మ సత్యం, జగత్తు మిధ్య అన్నారు. ఉపనిషత్తులు కూడా జీవుణ్ణి ‘అయమాత్మా బ్రహ్మ’ అని జగత్తుని ‘సర్వం ఖిల్విదం బ్రహ్మ’ అని ఈశ్వరుణ్ణి ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అని మూడింటినీ బ్రహ్మం గానే పేర్కొన్నాయి.

నేనే జీవుణ్ణి, నా శరీరమే జగత్తు, నా అంతరాత్మే ఈశ్వరుడు. కాబట్టి నేను గుర్తించినా గుర్తించకపోయినా (జంతువులు గుర్తించవు) నేను కూడా బ్రహ్మమే(అహం బ్రహ్మాస్మి). నేను, నా శరీరం, నా అంతరాత్మ -ఇలా మూడింటినీ, మూడుగా వేరు వేరుగా చూస్తే, మూడింటిదీ తలోదారీ అవుతుంది. వాటి మధ్య ఘర్షణ వస్తుంది. మనిషొక చోట ఉంటే మనసొక చోట ఉంటుంది. మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతుంది. మూడింటికీ ఉన్న సంబంధాన్ని, బ్రహ్మాన్ని గుర్తిస్తే, వాటి మధ్య ఐక్యమత్యం వస్తుంది. మనోవాక్కాయకర్మల్లో ఏకత్వం వస్తుంది. ఐకమత్యమే బలం.

శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారి ‘జగమంత కుటుంబం’ పాటలో ” జగమంతకుటుంబం నాది,ఏకాకి జీవితం నాది” అని పాడుకుంటున్నది బ్రహ్మమే.బ్రహ్మమే జగమంతకుటుంబంలో రెండుగా (జీవుడు x జగత్తు),అంటే(భార్య x భర్త),(కవి xకవిత)- ఇలా ఒకరికొకరు వరసైన జంటలుగా మారి తనతో తనే రమిస్తున్నది.ఏకాకిజీవితంలో ఈశ్వరుడై ఏకాంతంగా,జీవజగత్తులకు అంతరాత్మగా,సాక్షిగా ఉంటున్నది.జీవజగదీశ్వరులుగా జన్మించి,జీవించి,మరణిస్తున్నది బ్రహ్మమే.

నేనెవరు? జీవుణ్ణా? బ్రహ్మానా?

రాజ్యం కంటే,యుద్ధం కంటే ఈ ప్రశ్నే ముఖ్యమై అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు.శ్రీకృష్ణుడు బ్రహ్మమై గీతను బోధించాడు.నేనెవరు? ఈ ప్రశ్నతో నిద్ర పట్టని శ్రీరాముడు అర్ధరాత్రి లేచి వెళ్ళి వసిష్టుడి తలుపు తట్టాడు.లోపల్నుంచి “ఎవరు నువ్వు?” అని వసిష్టుడు ప్రశ్నించగానే,అది తెలియకే వచ్చానన్నాడు రాముడు.

ఇల్లు అలుకుతూ పేరు మర్చిపోయిన ఈగ కథ అందరికీ తెలుసు.పేరు మర్చిపోవడంతో మొదలైన కథ ఒక అన్వేషణగా సాగి, తిరిగి పేరు గుర్తు చేసుకోవడంతో ముగుస్తుంది.నేనెవరు?అన్న ప్రశ్నతో మొదలయ్యే జీవుడి అన్వేషణ కూడా ‘అహం బ్రహ్మస్మి’ అని గుర్తుకు తెచ్చుకోవడంతో ముగుస్తుంది.