ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మరో చరిత్రలో మొదటి అడుగు

Like-o-Meter
[Total: 0 Average: 0]

“To destroy is the first step to any creation” – EE Cummings.

ఒక పీడా విరగడయ్యింది! ఒక అవినీతి, అసమర్ధ ప్రభుత్వం ధ్వంసమయ్యింది! దాదాపు పది రాష్ట్రాలలో నామరూపాలు లేకుండా చిత్తుచిత్తయ్యింది! ప్రధానమంత్రి పదవికి పోటీ పడిన పార్టీ ప్రధాన ప్రతిపక్షపు హోదా కూడా దక్కే అవకాశం లేక దిక్కులేనిదయ్యింది! మరో చరిత్రకు ముందుమాటగా మోడీ ప్రభుత్వం ఏర్పాటవ్వబోతున్నది.

 

ఇదొక ప్రజాస్వామిక విప్లవం! దాదాపు నెలరోజులకు పైగా జరిగిన అవినీతి బకాసుర సంహార క్రతువు ఆశించిన రీతిలోనే సరైన ముగింపు పలికింది. పది సంవత్సరాల అసమర్ధుల పాలనకు ప్రజలు ఎట్టకేలకు భరతవాక్యం పలికారు. విభజించి పాలించే దుర్రాజకీయ నాయకుల పీచమణిచే రీతిలో ప్రజలు ప్రతిస్పందించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ప్రజలు పాలుపంచుకున్న ఈ ప్రజాస్వామ్య యజ్ఞం దేశాన్ని మలుపు తిప్పే మరో చరిత్రకు మైలురాయిగా మిగిలిపోతుందనేది వాస్తవం!

 

ఈ ఎన్నికలలో ప్రధాన పాలకపక్షమైన కాంగ్రెస్‌కే కాక, ఇతర ప్రతిపక్షాలకు కూడా ప్రజలు సరైన గుణపాఠం నేర్పారు. 70వ దశకంలో ఇందిరాగాంధీ అరాచకాలకి అడ్డుకట్ట వేసేందుకు ఆరోజుల్లో జయప్రకాష్‌ నారాయణ్ విప్లవశంఖాన్ని పూరించి ప్రధాన పార్టీలన్నిటినీ సమీకరిస్తే, ఈనాడు ఒక్కడే అందరిగా, అందరికీ ఒక్కడిగా ప్రజా చైతన్యానికి కారణభూతుడైనాడు నరేంద్ర మోడీ. సాథారణంగా, పాలకపక్షానికి వ్యతిరేకంగా ఎన్నికలు పోరాడే పార్టీలు, ఈ ఎన్నికలలో మాత్రం పాలకపక్ష వైఫల్యాలను ఏమాత్రమూ  పరామర్శించకుండా, ప్రధాన ప్రతిపక్షమైన భా.జ.పా.కు అడ్డుకట్ట వేయబూనటం విచిత్రం! మోడీకు అమెరికా వీసా ఇవ్వరాదని కాంగ్రెస్‌తో సహా అమెరికాని దేబిరించిన పార్టీలే ఇవి!! గుళ్ళుగోపురాలు తిరిగాడని, మసీదులు, చర్చులు తిరగలేదని, సిక్కుల తలపాగా చుట్టాడని, ముస్లీముల టోపీ పెట్టుకోలేదనీ, కాషాయం కోటు కట్టాడని, క్రైస్తవులకు గౌరవం ఇవ్వలేదనీ,… ఇలా నానారకాల కారణాలు చూపిస్తూ… ఆరు నూరైనా, మోడీ ప్రధాని కాకూడదని, దేశంలో మైనారిటీలకు రక్షణ ఉండదని ప్రజలను భయభ్రాంతులను చేయటానికే కాంగ్రెస్ సహా ప్రతి పార్టీ ప్రయత్నించిందనేది నిజం.

 

కాంగ్రెస్ విషయానికి వస్తే, ఆ పార్టీకి ఈ దేశమన్నా, దేశ ప్రజలన్నా చాలా చులకన భావం ఉంది. ఆ పార్టీ నాయకులకి ప్రజా సేవ కన్నా అధినేత, అధినేత్రుల కాళ్ళు కడగటమే పరమార్ధమన్న విషయం అందరికీ తెలిసిందే.. ఆ పార్టీ నేతల దృష్టిలో దేశమంటే నెహ్రూ కుటుంబమే కానీ మరెవరూ వారి దృష్టికి ఆనరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అహంకారానికి అడ్డు అదుపు లేకుండా పోయిందనేది వాస్తవం.  పబ్లిక్ పాయిఖానాల నుంచి విమానాశ్రయాల వరకు దేశాన్ని గాంధీ నెహ్రూ మయంగా చేయాలనే వాళ్ళ బానిస మనస్తత్వంతోపాటు, రెండోసారి అధికారం సాధించామన్న అహంకారంతో జనలోక్‌పాల్ బిల్లు కోసం ఉద్యమించిన అన్నాహజారేలాంటి స్వాతంత్రయోధుడిని అవమానించిన తీరులో, పార్లమెంటు తలుపులు మూసి మరీ తెలంగాణా ఏర్పాటు చేయటంలో వారి మనోవైకల్యాలు ప్రజలకు ప్రస్ఫుటంగా కనిపించాయి.

 

 

ప్రతి ఎన్నికల సభలోనూ, మోడీని రాక్షసుడుగా అభివర్ణించింది సోనియా గాంధీ. మత ప్రసక్తి లేకుండా మరే ఇతర కాంగ్రెస్ నాయకుడు ఏనాడూ, ఎక్కడా ఉపన్యసించకుండా ఉండలేదు. తమ పార్టీ సమావేశాలలో టీ అమ్ముకోమని ఈసడించాడు మణిశంకర్అయ్యర్‌లాంటి ప్రబుద్ధుడు. పెళ్ళాన్ని వదిలేసిన మోడీ ప్రజలని ఏలా పాలించగలడని తన చాటుమాటు వ్యవహారం బట్టబయలయ్యేదాకా రాజగురువు దిగ్విజయ సింగ్ ఘోషిస్తూనే వచ్చాడు. గుజరాత్ మోడల్ ఓ బెలూన్ అని, అభివృద్ధంటే జూపిటర్ మీది ఎస్కేప్ వెలాసిటీ అంటూ ప్రజలకు దిశానిర్దేశం చేయబోయాడో పప్పు! అవినీతిని అణచివేయటానికే లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టామని చంకలు గుద్దుకొని మరీ వాడివేడి ప్రసంగాలు చేసిన రాహుల్, ప్రభుత్వంలోని అవినీతి గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు, సరికదా మోడీని మించిన అవినీతిపరుడు లేడని తీర్మానించాడు! అంతే కాక, మోడీ అధికారంలో వస్తే 22 వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారని భవిషత్తు పురాణం ప్రవచించాడు! ఇవేవీ కాదని, అభివృద్ధి ప్రాతిపదికగా వోట్లు అడిగిన మోడీవి నీచరాజకీయాలని ఎద్దేవా చేసింది ప్రియాంకా! అన్నీ తీరిగ్గా విన్నారు ప్రజలు.

 

వందేమాతరమంటూ భారతమాతకి జయజయధ్వానాలు చేసిన నరేంద్రమోడీ ప్రజలలో నివురుగప్పిన జాతీయతా భావాన్ని వెలికితీసి నిలువెత్తుగా నిలబెట్టాడు. అసమానతలకు అసలైన విరుగుడు అభివృద్ధే అన్న మంత్రాన్ని ప్రజలకు అర్ధమయ్యే భాషలో చెప్పగలిగాడు. యు.పి.ఎ. ప్రభుత్వంపై విమర్శలైనా కానీ, ప్రభుత్వం ఎలా ఉండకూడదో అన్న విషయంపైన కాకుండా, ప్రభుత్వం ఎలా ఉండాలో అన్న విషయంపైనే తన ఆలోచనలు పంచుకున్న మోడీ తన రాబోయే ప్రభుత్వం ఎలా ఉండబోతుందో కూడా ప్రజలు ఓ అంచనాకు వచ్చేట్లు చేయగలిగాడు. అందుకే కుల మత ప్రాంతీయ రాజకీయాలకు అతీతంగా ప్రజలు వోట్లు వేసారు, మోడీని గెలిపించారు. ఆ పాఠాన్ని ఇతర పార్టీలు ఇంకా నేర్చిన జాడలైతే ప్రస్తుతానికి కనిపించటంలేదు. కేవలం మతాధారంగా ప్రజలను చీల్చి భా.జ.పా. వోట్లు గెలుచుకుందని చెప్పే ఆస్కారం కూడా లేకుండా, హైందవేతర మతస్థులు ఎక్కువగా ఉన్న గోవా లాంటి చోట్ల కూడా ప్రజలు ఆ పార్టీని ఆదరించారు. ముస్లీములు ఎక్కువగా ఉన్న యు.పి., బీహార్ తదితర రాష్ట్రాలలో వారి వోట్లు పడకుండానే భా.జ.పా. గెలిచిందని చెప్పటం కూడా మూర్ఖత్వమే! అసలు ఈ ఎన్నికలను కుల, మతాల కళ్ళజోడులు పెట్టుకొని విశ్లేషించటం కూడా మూర్ఖత్వమే ఔతుందని నా అభిప్రాయం.

 

ఈరోజుకు కూడా యు.పి.ఎ. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి, వారి వైఫల్యాలకు తాము బలి అయ్యామని ఎస్పీ, బీఎస్పీ పార్టీల ప్రబుద్ధులు భావిస్తున్నారు కానీ, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించలేకపోతున్నారు, ఆ తీర్పుకు కారణాలు వెతకలేకపోతున్నారు! తమను తాము సెక్యులర్ నేతలుగా పరిగణించుకునే ఎస్పీ, ఆర్జేడీ, జె.డి.(యు)లకే కాకుండా సున్నాలతో ఎన్నికలు చుట్టేసిన బీఎస్పీ, నేషనల్ కాన్‌ఫరెన్సు, రాష్ట్రీయ లోక్‌దళ్‌లకు ప్రజలు ఇచ్చిన తీర్పు పెద్ద చెంప పెట్టు. ఈ పార్టీల అస్తిత్వానికి పెద్ద ముప్పుగా పరిణమించిన ఈ ఎన్నికల నుంచి వారు నిజమైన పాఠాలు నేర్వనంతవరకూ బహుశా ప్రజలు అలా మాడు పగలగొడుతూనే ఉంటారు. ఎందుకంటే, అదిగో బూచి, ఇదిగో బూచి అని ప్రజలను భయపెట్టిన పాతరోజులు పోయాయి. సోషల్ మీడియా పుణ్యమా అని, ప్రజలకు పాత చరిత్రలే కొత్తగా తెలిసివస్తున్నాయి.

 

ఈ ఎన్నికలలో తమ వోట్ల ద్వారా, యు.పి., బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్, జమ్ము కాశ్మీర్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్,  ఇలా దాదాపు ఉత్తారాదిన ప్రతి రాష్ట్రంలోనూ ఆయా ప్రాంతీయ పార్టీలనే కాకుండా జాతీయ పార్టీగా కాంగ్రెస్ మనుగడను ప్రశ్నార్ధకం చేసారు ప్రజలు. అందలమెక్కించిన ప్రభుత్వాలు ఆశించిన రీతిలో పనిచేయకపోగా, కుల మత వైషమ్యాలతో తమ మధ్య చిచ్చు పెడుతున్న విషయాన్ని పసిగట్టిన ప్రజలు కుక్కకాటుకు చెప్పుదెబ్బలా, తమ వోట్లతో బదులిచ్చారు.

 

ప్రభుత్వంలో అవినీతిపైనా మౌనం! పరిశ్రమలు మూసుకుపోతున్నా మౌనం! ధరలు ఆకాశాన్ని అంటుతున్నా మౌనం! రైతులు ఆత్మహత్యలకు తెగబడుతున్నా మౌనం! అరుణాచల్‌లో చైనా చొచ్చుకు వచ్చినా మౌనం! పాకిస్తాన్ మన సైనికుల తలలు తెగేసి వెళుతున్నా మౌనమే! పది సంవత్సరాల అసమర్ధుల పాలనలో దేశం పట్టాలు తప్పింది. అరవై నెలలో దేశాన్ని గాడిన పెట్టబోవటం ఓ సాహసమే. తానే కాకుండా తన మంత్రివర్గ సహచరులు కూడా నిజాయితీతో కృషి చేస్తే కష్టసాధ్యమే కానీ, అసాధ్యం కాదు. కనీసం ఆ కోణంలో ప్రభుత్వం పని చేస్తున్నదన్న స్పృహ ప్రజలకు కలగాలి. కనీస ఫలితాలతో ప్రజలకు వారి భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించగలగాలి. ఏదేమైనా, మిన్నంటుతున్న ప్రజల అంచనాలను, తాను ప్రధానిగా ఎన్నికైన నేపథ్యాన్ని నరేంద్ర మోడీ విస్మరించడనే భావిస్తాను. అవినీతిరహిత ఆదర్శ రాజ్యాన్ని, అభివృద్ధిని ఆయన సాధించగలడనే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడనే ఆశిస్తాను.

Pics Courtesy : Google

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>