ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అనల్పార్ధ రచనలు

Like-o-Meter
[Total: 1 Average: 4]

 

ఆకారమేలేని అక్షరాల్ని వాడి సృష్టి అనంతత్వాన్ని పరిమితమైన పదాల్లో ఆవిష్కరింపజేయడం ఒక్క కవిత్వంలోనే సాధ్యం. అందువల్లే అనల్పార్ధ రచనలే జేస్తామని సత్కవులు పూనుకొనేవారు.

మనిషి గుండెల్లో గుంభనంగా కాపురముండే అనుభూతుల రహస్యాల్ని ఒక్క కవిత్వమే పరిపూర్ణంగా చిత్రీకరించేది. చిత్రకళలో, శిల్పకళలో, యే వొక్క రంగుగానీ భంగిమగానీ తేడా వొస్తే కళాకారుని గురి నెరవేరదు. సంగీతంలో గమకాలు దెబ్బతింటే రసాభాసమౌతుంది. వీటిల్లో సబ్జెక్టు, ఆబ్జెక్టు వేరువేరుగా వుంటాయి. కవిత్వంలో అల్లా కాదు. ఉన్నవి పిడికెడు అక్షరాలే గానీ అవి చెప్పే భావాలు అనంతమైనవి. సబ్జెక్టూ అవే. ఆబ్జెక్టూ అవే.

అంతరంగంలోనే నివసిస్తూ, అక్కడ పుట్టే అలజళ్ళను గమనిస్తూ, విషయమూ, విషయీ తానే అయ్యే మనిషి మనసుకి మరో నిర్వచనమే కవిత్వం.

కేవలం అక్షరాల్ని మాత్రమే చదివేవాళ్ళకి కవిత్వం అర్థం కాదు. అల్లానే కేవలం అక్షరమాలని బట్టీపట్టి రాసేవాళ్ళకీ కవిత్వ తత్వం సిద్ధించదు. యెపుడైతే అక్షరాల్లో ప్రతిధ్వనించే “ధ్వని”ని పట్టుకోగలుగుతామో అప్పుడే కవిత్వం రాయను సంభంవించేది. అల్లా కవి అక్షరాలకున్న భౌతిక బంధాల్ని తెంచి, అలౌకార్ధాలను సమకూరుస్తాడు. పాఠకులూ అంతే. అప్పటిదాకా వాళ్ళకి తోచనిదేదో దొరికేటట్టు చేసే కవిత్వాన్ని చదవాలి. అల్లా కవి-పాఠకులు ఉన్నప్పుడు ఉన్నదున్నట్టు చెప్పే వార్తల్నో, వ్యాసాల్నో కవిత్వంలా చెలామణి జేయిస్తున్న దండుగ్గణాలన్నీ కలుపుమొక్కల్లా తుడిచిపెట్టుకుపోతాయి.

రోజువారీ జీవితం చాలాసార్లు మనిషికుండాల్సిన లోపలికన్నుని మూసేస్తుంది. దాంతో భ్రమకు, నిజానికీ మధ్య దాగుడుమూతలారంభమౌతాయి.

కవి లోలోపల తెరుచుకొనేవుండే ఆ మూడోకన్ను భ్రమనీ, నిజాన్ని విడదీసి చూస్తుంది. ఆ చూపులోనుంచి పుట్టుకొచ్చేదె కవిత్వం. ఈ దృక్కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేసేప్పుడు కవికి కావల్సింది వాచాలత గాదు. వందపుటల అతి విస్తరణగాదు.

గానీ దురదృష్టవశాత్తు 75% తెలుగు కవులు ఇక్కడే బోల్తా పడ్తారు. కనీసం వందలైన్లుంటేగానీ కవిత్వం గాదని (అ)జ్ఞానపీఠాధిపతులు వేసిన వక్రమార్గాల్లోనే పోతున్నారు. కవిత్వం జేయాల్సింది భాషని శుభ్రపరచడమేనన్న ఇస్మాయిల్ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి.

మనం చూసింది చూసినట్టుగా చెప్పడం గాదు కవిత్వ లక్ష్యం. చూసేప్పుడు మన మనసు అనుభవించినదాన్ని చెప్పడమే దాని లక్ష్యం. చాలామందికి యీ విషయం అర్ధంగాక తామూ తికమకపడి లోకాన్ని గూడా తికమకపాల్జేస్తారు.

 

కవిత్వమెల్లా పుడుతుంది?

కవిత్వమన్నది కేవలం భౌతికమైంది కాదు. అది భౌతిక వాతావరణంలో మనిషి లోనయ్యే రకరకాల స్పందలు మాట్లాడే భాష. స్పందన యేవిటి అన్న విషయాన్ని మామూలు మనుషుల కోణంలోనే చూద్దాం. యెందుకంటే కవి గూడా వొకానొక రసమయ ఘడియలోనే కవి గనక.

వొకే సంఘటనపై యే యిద్దరి ప్రతిస్పందన వొక్కలా వుండదు. స్పందన వొకటిగానప్పుడు వర్ణన గూడా వొక్కలా వుండదు. వొకరు భావుకత్వంతో దట్టించబడ్డ వర్ణనకి పూనుకోవొచ్చు(యిందులో వుత్ప్రేక్షలకి అవకాశం వుంది). మరొహరు వున్నదున్నట్టుగా వర్ణించవొచ్చు (యిందులో facts and figures తప్ప యింకేమీ వుండకపోవచ్చు. వొహవేళ యేవైనా వుంటే అది వాళ్ళ అభిప్రాయమో, సూచనో ఐవుండొచ్చు. అభిప్రాయం లేక సూచన బౌద్ధికమైనదే గానీ చేతనా సౌకుమార్యానికి సంబంధించింది గాదు). ప్రతి మనిషీ తన పరిధిలో సమాజానికి స్పందిస్తాడు గానీ అవి భిన్నాలుగా వుంటాయి. యీ భిన్నత్వమే కవిత్వాన్ని, వచనాన్ని విడదీస్తోంది. అయితే మన అదృష్టమో, దురదృష్టమో అటు కవిత్వం గాక, ఇటు వచనంగాక రెండు రకాలుగా అనిపించే వాక్యాల్నే రాసి చంకలు గుద్దుకుంటుంటారు.

సరే! మరి కవిత్వమెల్లా పుడుతుందన్న మొదటి ప్రశ్నకే వస్తే….

కవిత్వమనేది వో వ్యక్తి వో విషయంపట్ల కొత్తగా తెల్సుకొన్న దాన్ని, అంతకు పూర్వమే సంపాదించిన జ్ఞానంతో జతజేసి చెప్పబోయే ప్రయత్నంగా అనిపిస్తుంది. కొత్తకి, పాతకి మధ్యన వంతెన నిర్మించబోయేప్పుడు కవిత్వం పుడ్తుంది.

కల్పన, బుద్ధితో గూడి అనుభవాన్ని సంపాదించుకొని, హేతురాహిత్యంతో మార్మికతని పొంది, సామాన్యీకరణ గావడమే కవిత్వం పుట్టుకకి పునాది. కవి జెప్పిన మాటలు వొకానొక ప్రొజెక్టైల్లో వదలబడి, పాఠకుల మనసుని తాకి, పేలి, ఆలోచనా శకలాల్ని విరజిమ్మి వారిలో ప్రతిస్పందనన్ని నింపినప్పుడే కవిత్వం పుట్టేది.

రోజూ వాడే పదాలే తమ లౌకిక వునికి పోగొట్టుకొని కొత్తరూపంలో ఆవిష్కరింపబడిన చోటే కవిత్వం పుట్టేది. ప్రేమ అనే అతీంద్రియ భావనని వెలిబుచ్చడానికి రోజాపువ్వునో, తాజ్ మహల్ బొమ్మనో యిచ్చినట్టు కవి భౌతికమైన భాషనే వాడి అలౌకికమైన భావ పరంపరని పాఠకుల్లో నిలిపినప్పుడే కవిత్వం పుట్టేది.

అవునంటారా?

 

pay per click