ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అన్నమయ్య పాట – మాట

Like-o-Meter
[Total: 0 Average: 0]

2013-17 సంవత్సరాల మధ్య నేను ఓ భక్తి ఛానల్‍కు కార్యక్రమాల రూపకల్పనతో బాటు వాటికి రచనల్ని కూడా చేసాను. 2015 లో ” అన్నమయ్య పాట – మాట ” అన్న పేరుతో ఓ పాటల కార్యక్రమాన్ని చేయాలని ఛానెల్ యాజమాన్యం భావించింది.

దీని ద్వారా యువతరానికి అన్నమయ్య సాహిత్యంను చేరవేయాలని వారి ఉద్దేశ్యం. 2015 మే నెలలో చిత్రీకరణ జరిగి, డిసెంబర్ నెలలో ప్రసారం మొదలుపెట్టారు. ఓ నాలుగు భాగాలు వచ్చాక అర్థాంతరంగా నిలిపివేసారు. కారణాలు నాకు తెలుపలేదు.

తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో మొదటి సీజన్ తాలూకు చిత్రీకరణ సుమారు 5 రోజుల పాటు సాగింది. కార్యక్రమ నిరూపణకై ఓ ప్రముఖ సినీ నేపధ్య గాయనిని ఎన్నుకున్నారు.

ఆమె చెప్పాల్సిన ’యాంకర్ బైట్స్’ నా చేత వ్రాయించుకున్నాడు ఆ కార్యక్రమ నిర్మాత, దర్శకుడు అయిన హరిబాబు.

అవే ఇవి:

*****

అన్నమయ్య పాట – మాట 

  1. తాళ్ళపాకవారి సాహిత్యం అసాధారణమైనదని రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు చెప్పారు. అంతేకాదు, తాళ్ళపాకవారి కొన్ని రచనలే దొరికాయి, మరిన్ని దొరకాలని ప్రజలు ఆశపడాల్సిన రచనలు ఇంకా ఉన్నాయని కూడా అన్నారు. అటువంటి రచనలను ఈనాడు “అన్నమయ్య పాట – మాట” కార్యక్రమంలో మనం వింటున్నాం.
  2. అన్నమయ్య సాహిత్యంలోని అందచందాలు, రసధార, భావవైవిధ్యాలు పాఠకులను రంజింప చేస్తాయని, ఆ సాహిత్యాన్ని చదవాలని, వినాలని తాపత్రయపడేలా చేస్తాయని రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు వర్ణించారు. వర్ణరంజితమైన అన్నమయ్య సాహిత్యాన్ని “అన్నమయ్య పాట – మాట” ద్వారా మీకు అందిస్తోంది టిటిడి.
  3. అన్నమయ్య ఉపయోగించిన సామెతలు, జాతీయాలు, పలుకుబళ్ళు తెలుగు సాహిత్యానికి కట్టిన గుడులై గత ఐదు శతాబ్దాలుగా తల ఎత్తుకుని నిలబడివున్నాయి. అచ్చ తెనుగు భాష లయను, హొయలును “అన్నమయ్య పాట – మాట” ద్వారా శ్రోతలకు అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.
  4. అన్నమాచార్యుల సాహిత్యం పై విస్తృతంగా పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తవ్వే కొద్దీ మంచినీరు ఊరే ఊటలా అన్నమయ్య సాహిత్యం సాహితీ పిపాసుల దాహాన్ని తీరుస్తూనేవుంది. “అన్నమయ్య పాట – మాట” కూడా ఒక నీటి ఊటై ఈనాడు శ్రోతల సాహితీ తృష్ణను తీరుస్తోందని విశ్వసిస్తున్నాం.
  5. సాహిత్య విభాగంలోని శబ్దశాస్త్రం, అలంకారాలు, వ్యాకరణం, పదరచనా పరిణామం, తత్త్వశాస్త్రం మొదలైన అన్ని అంశాలను కలిగిన ఏకైక సాహిత్యంగా అన్నమయ్య కృతులు ప్రశంసల్ని అందుకొంది. ఇటువంటి సమగ్ర సాహిత్యం వల్ల తెలుగు భాష సౌందర్యం మరింత ఇనుమడించింది. “అన్నమయ్య పాట – మాట” కార్యక్రమం ద్వారా సాహిత్య సౌందర్యాన్ని మీ ముందుకు తెస్తోంది టిటిడి. తనివిదీరా ఆశ్వాదించండి.
  6. తెలుగు సరస్వతీ మంగళాశీస్సుల్ని సంపూర్ణంగా సాధించిన విశిష్ట సాహిత్యం అన్నమయ్య సాహిత్యమని ప్రముఖ పరిశోధకులు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు పేర్కొన్నారు.
  7. తాళ్ళపాక వారిది సుప్రసిద్ధ సాహిత్య కుటుంబమని, ఈ కుటుంబంలో పదిమంది సాహిత్యకారులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసారని ప్రముఖ రచయిత్ర శ్రీమతి రామలక్ష్మీ ఆరుద్ర గారు పేర్కొన్నారు. తాళ్ళపాక వారి సాహితీ వ్యవసాయానికి తొలిబీజం వేసిన అన్నమయ్య మాటను, పాటను మీ ముందుకు తీసుకువస్తున్నందుకు మాకు అత్యంత ఆనందకరమైన విషయం.
  8. అన్నమయ్య కుమారుడైన తాళ్ళపాక పెదతిరుమలాచార్యుల అధ్యక్షతన సంకీర్తనలను రాగిరేకులపై చెక్కించారట. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో దాచివుంచిన ఈ రేకులను శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రిగారు కనుగొని వెలుగులోకి తీసుకువచ్చారు. శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశాస్త్రిగారు, శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు విస్తృతమైన పరిశోధనలు, పరిష్కారాలు చేసారు. అన్నమయ్య సాహిత్యాన్ని ప్రపంచానికి అందించిన “ఎందరో మహానుభావులు అందరికీ వందనా”లను “అన్నమయ్య పాట – మాట” ద్వారా అర్పిస్తున్నాం.
  9. ఇదం బ్రాహ్మ్యం – ఇదం క్షాత్రం” అన్నట్టుగా తెలుగు భాషను తాళ్ళపాక వారు లొంగదీసుకున్నారని రాళ్ళపల్లి వారు భావించారంటే అన్నమయ్య భాషాశక్తి ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు. శబ్దాలంకారలను, అర్థాలంకారాలను సమపాళ్ళలో వాడి పాఠకులను అలరించే తాళ్ళపాకవారి సాహిత్యాన్ని “అన్నమయ్య పాట – మాట”లో మీకు అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
  10. తాళ్ళపాక వారి సాహిత్యంలోని సామెతలు, జాతీయాలు, పలుకుబళ్ళు, పదప్రయోగాలను శ్రీమతి రామలక్ష్మి ఆరుద్ర గారు “తాళ్ళపాకవారి పలుకుబళ్ళు” అన్న పేరుతో 1971 లో ప్రచురించారు. ఇటువంటి పరిశోధనలు, ప్రచురణల వల్ల తెలుగు భాషను తాళ్ళపాక వారి సాహిత్యం ఎంత పరిపుష్టం చేసిందో మనం తెలుసుకోవచ్చు.
  11. పదహైదు, పదహారవ శతాబ్దాల నాటి సంఘ చరిత్రను అర్థం చేసుకోవడానికి అన్నమయ్య సాహిత్యం చాలా సహాయం చేస్తుంది. ఆనాటి తెలుగువారి జీవితం ఎలా ఉండేదో, వారి అలవాట్లు, నమ్మకాల గురించి కూడా అన్నమయ్య సాహిత్యం విలువైన సమాచారాన్ని అందిస్తుంది.
  12. భక్తి తత్వాన్ని సులభశైలిలో, జాణ తెలుగులో అందించే అన్నమయ్య సాహిత్యం ’సంకీర్తన’ పద్ధతిలో రచింపబడింది. ఈ సాహిత్యాన్ని పాడగలిగే వారు రాగయుక్తంగా పాడుకోవచ్చు. పాడలేనివారు సైతం లయబద్ధమైన వచనంగా చదువుకొని ఆనందించవచ్చు.
  13. అన్నమయ్యకు ఈ జగమంతా లక్ష్మీనారాయణుల లీలావిలాస వేదిక మాత్రమే. రసభరితమైన సాంసారిక సరసాలను, విరసాలను, విరహాలను ఈ అనాది దంపతులకు ఆపాదిస్తూ వచ్చిందే అన్నమయ్య సాహిత్యం.  పేరుకు శృంగార కీర్తనలైనా వాటిలోని అమలిన భావ సౌందర్యం పాఠకుల్ని, శ్రోతల్ని ముగ్ధుల్ని చేస్తుంది.
  14. మధుర కవితానికి పెట్టింది పేరు అన్నమయ్య సాహిత్యం. లోక వ్యవహారాలలో చేదు అనుభవాలు ఎదురైనప్పుడు అన్నమయ్య రచనలే మనకు పరమౌషధాలు….తియ్యటి చక్కెర గుళికలు.
  15. తెలుగు భాషను సజీవ భాషగా మలచడంలో తాళ్ళపాక వంశీయుల పాత్ర అమోఘమైనది. తాళ్ళపాక వారికి ఆ పాత్రతను అందించిన తొలి రచయిత అన్నమాచార్యుల వారు.
  16. ఆ కాలం నాటి అనేకమంది సాహిత్యకారులు వాడడానికి ఇష్టపడని పదాలనెన్నింటినో వాడి వాటికి సుస్థిర స్థానాన్ని సంపాందించి పెట్టిన ఖ్యాతి అన్నమాచార్యులకే దక్కుతుంది. ఈ సజీవ సాహిత్యాన్ని “అన్నమయ్య పాట – మాట” కార్యక్రమం ద్వారా స్మరించుకోవడం మన అదృష్టం.
  17. “పొంక మెరిగిన పలుకు”లను సంకీర్తనలుగా మలచిన భాషా శిల్పి తాళ్ళపాక అన్నమయ్య. తెలుగు భాషా నిలయంలో సజీవ శిల్పాలై ఈనాటికీ భాసిస్తున్న ఆ సంకీర్తనలను “అన్నమయ్య పాట – మాట” రూపంలో మీ ముందుకు తెస్తున్నాం.
  18. ఉచిత భాష పదముల జెల్లు” అని ప్రకటించిన సాహితీ ధీరోదాత్తుడు అన్నమయ్య. అది శృంగార కీర్తన ఐనా, వైరాగ్య సంకీర్తనమైనా, భక్తి తత్త్వబోధకమైన కృతి ఐనా – ఏది ఏమైనా అన్నమయ్య ఎంచుకున్న భాష అతి రమ్యం, కడు రసమయం.
  19. తెలుగు భాషలో ద్విపద సాహిత్యానికి పాల్కురికి సోమనాథుడు ఆద్యుడైతే, పద సాహిత్యానికి అన్నమయ్య వారు ప్రథమాచార్యులని శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు అభిప్రాయ పడ్డారు.
  20. ముప్ఫైరెండువేల కీర్తనల రాశిని ప్రోది చేసిన అన్నమయ్య, ప్రతి రచనను వాసి తగ్గని వర్ణచిత్రంగా మలచడం తెలుగు సాహిత్యంలో సంభవించిన ఒక అపురూప ఘట్టం. ఆ రసరమ్య ఘట్టాన్ని మరోమారు ఆవిష్కరించడానికి ఏర్పరిచిన వేదికే ఈ “అన్నమయ్య పాట – మాట.”

*****

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు