ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అనువాద వివాదాలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

తెలుగు సాహిత్యం అనువాదంతోనే మొదలైందని యిప్పటికే సవాలక్షమంది సవాలక్షసార్లు చెప్పేవున్నారు. అనువాదంతోబాటు సొంత కవిత్వం గూడా అందులో వుంది కాబట్టే నిలవగలిగాయి. యిక్కడ నాకో సందేహం వొచ్చింది గానీ సమాధానమింకా దొరకలేదు.

అనువాదానికి(translation), రూపాంతరానికి(adaptation) గల తేడా యేవిటీ అన్నదే ఆ సందేహం. తెలుగు భారత, భాగవతాలు అనువాదాలా లేక రూపాంతరాలా? పండితులు తేల్చగలరేమో!

దీన్నలా వొదిలి నా బుర్రకు కొంచెం పనిగల్పించుకొంటే తోచినవి యివీ…

ప్రశ్న: అనువాదం మూలాని విధేయంగా వుండాలా లేక అనుసృజన పేరుతో సొంత భావాల్ని గూడా చేర్చవచ్చా?

వెదుక్కొన్న సమాధానం: టార్గెట్ రీడర్స్ కోసం రాస్తున్నానన్న ప్రజ్ఞ అనువాదకుడిలో మేల్కొనివుంటే అనుసృజనకు దిగవొచ్చు. అల్లాగాక పరాయి భాషలోని రచనని తన భాషవారికి చేర్చడమే వుద్దేశమైతే మూలానికి విధేయంగానే అనువాదం సాగవచ్చు.

ప్రశ్న: అనువాదంలో యేది ప్రధానం? దగ్గరిదనంతో కూడిన భాషతో చేయడమా? లేక ముక్కస్య ముక్క అన్నట్టు పరాయి భాషా పదాలకు సమానార్ధలైన స్వభాషా పదాలతో చేయడమా? Should it be a resemblance or equivalent?

వెదుక్కొన్న సమాధానం: సమానార్ధ అనువాదమన్నది దాదాపు అసంభవం. అనువదించుతున్నభాషలోని పరిమితులు, వాడుక రీతులు, సంప్రదాయాలు మొదలైనవి దీనికి కారణాలు. అంచాత దగ్గరిదనంతో కూడిన అనువాదమే సాధ్యమయ్యేది.

వో ప్రముఖ కవి అన్నట్టు యాభై శాతం దగ్గరిదనంతో కూడిన అనువాదం మూలరచనలోని సారాంశాన్ని పాఠకులకి చేరవేస్తుంది. మూల భాషలోని మార్మికతని అంతే ప్రతిభావంతంగా వేరే భాషలో చెయ్యలేకపోవచ్చు. అట్లాంటి సమయంలో మార్మికతకు బదులుగా కొంచెం వివరణకు పోయినా సారాంశాన్ని చేరవేయగలిగితే చాలు.

ప్రశ్న: అనువాద నియమాలేవైనా వుంటే అవి పాటించాల్సిందేనా?

వెదుక్కొన్న సమాధానం: అనువాద నియమాలేవో నేను పూర్తిగా తెల్సుకోవాలి గనక ఈ ప్రశ్నకి సమాధానం అసంపూర్ణమే. వున్నంతలో జూస్తే అనువాదంలోని ప్రాధమిక లక్ష్యం – పరాయిభాషలో వున్న భావాన్ని మాతృభాష దెలిసిన పాఠకులకి సరఫరా జేయడం. దానికోసం చాంతాడన్ని నియమాల్ని పాటించాల్సి వొస్తే అసలు పనే ఆగిపోవచ్చు. అంచాత “దగ్గరిదనం” అన్న వొక్క నియమాన్ని పాటిస్తూ మూలంలో లేని విషయాల్ని వీలైనంత చేర్చకండా, అనువదిస్తే చాలు.

యేది యేవైనా…Either move or be moved అని ఎజ్రా పౌండు అన్నట్టు కదిలించే కవితే గొప్పదైనట్టు కదిలించగలిగితే అనువాదం కూడా గొప్పదే!

pay per click