ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అనువాదాలలో సాధకబాధకాలు.

Like-o-Meter
[Total: 1 Average: 4]

 

 

వాస్తవ్ గారు అనువాదాలమీద రాసిన ప్రశ్నోత్తరాలు చూసేక, నా అభిప్రాయం కూడా చెప్దాం అనిపించింది. వాస్తవ్ గారి ప్రశ్నలూ, సమాధానాలూ సమంజసమైనవే. అయితే అక్కడ ప్రస్ఫుటం కాని ఒకటి రెండు విషయాలు మరోమారు స్పృశించడానికి ఈ వ్యాసం.

అనువాదకులు అనువాదానికి పూనుకున్నప్పుడు ప్రప్రథంగా రెండు విషయాలు ఆలోచించాలి. మొదటిది ఎందుకు, ఎవరికోసం చేస్తున్నాం అన్నది. రెండోది అనువాదం ఎలా ఉండాలి అన్నది.

ఆకలి, ఆవేశం, ఆశలూ, ఆశయాలూ వంటి ఆధిభౌతికమైన అంశాలు ప్రపంచంలో సహజంగా అందరికీ ఉంటాయి. అవి మానవజాతికి సర్వసాధారణం. కానీ ఒక్కొక్క జాతిని విడివిడిగా పరిశీలించినప్పుడు తెలిసేది ప్రతి జాతికీ వారి సామాజిక, భౌగోళిక పరిస్థితులు ఆధారంగా వారి అనుభవాలూ, అనుభూతులూ ప్రవర్తనలూ వేరుగా ఉంటాయి. వారికథలు చదివినప్పుడు అవి తెలుస్తాయి. మనం అనువాదాలకి ఎన్నుకొనే కథలు అలాటి ప్రత్యేకతలని ఎత్తి చూపేవిగా ఉండాలి.

అంటే మనదేశంలో మన దేశస్థులకోసం చేసే అనువాదాలు వేరు, ఇతరదేశాల్లో ఆ పాఠకులకోసం చేసే అనువాదాలు వేరు. ఉదాహరణకి ఈనాడు ప్రాచుర్యం పొందుతున్న కథలు నూటికి 90 వంతులు స్త్రీలసమస్యలూ, రైతుల కష్టాలు. ఇవి కథలు కావు అనడం లేదు నేను. మన స్త్రీల దుస్థితిగురించి విదేశాల్లో ఇప్పటికే స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని మరింత పటిష్టం చేసే కథలద్వారా మనం వారికి అధికంగా చెప్తున్నది ఏమిటి అన్నది ఆలోచించుకోవాలి అంటున్నాను. మరోలా చెప్పాలంటే, మన మౌలికవిలువలు చిత్రించేవి, తెలుగువాళ్ళకే ప్రత్యేకమైన ఆచారాలూ (ఉదాహరణకి మడి, లెంపలేసుకోడం, అష్టావధానం, చెడుగుడు ఆటలు … ఇలా ఎన్నో ఉన్నాయి) ఆవిష్కరించే కథలు ఇతరదేశాలవాళ్ళకి చెప్పడంవల్ల మనగురించి వారికి మరింత ఎక్కువ అవగాహన ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న అభిప్రాయాలకి కొత్తకోణాలు చేర్చి వారి అవగాహన మరింత సమగ్రం కావడానికి తోడ్పడుతుంది అని నా అభిప్రాయం.

Buy this book on Amazon
రెండోది అనువాదం ఎలా ఉండాలి – ఒక భాషలో వెలిబుచ్చిన భావాలు ఆ భాష చదవలేనివారి సౌకర్యార్థం చేస్తాం. ఇది కేవలం మనదేశానికే పరిమితమైనప్పుడు ఒకరకమైన పరిమితీ, ఇతరదేశాలవారికి చేసినప్పుడు మరొక రకమైన పరిమితులూ ఉంటాయి. ఉదాహరణకి మనదేశంలోనిపాఠకులకోసం అయితే భాషలు వేరైనా సాంస్కృతిక విలువలు సుమారుగా ఒకే విధంగా ఉంటాయి కనక కథ అర్థం అవుతుంది. ఉభయసామాన్యమైన విషయాలు చాలా ఉంటాయి కనకనూ, ఇండియనింగ్లీషు దేశవ్యాప్తమైనది కనకనూ, పాఠకులు మనదేశప్రజలే అనుకున్నప్పుడు ఇండియనింగ్లీషు అంగీకారయోగ్యమే.

అదే ఇతరదేశాల, ఇతర జాతుల పాఠకులకోసం అయితే, అనువాదంలో ఇంగ్లీషు తదనుగుణంగా అంటే అంతర్జాతీయపాఠకులకి అర్థమయేలా ఉండాలి కదా. లేకపోతే ఆ అనువాదం అర్థం కాక, వ్యర్థమయిపోతుంది. నిజానికి తెలుగు సాహిత్యానికి అంతర్జాతీయస్థాయిలో చెప్పుకోదగ్గ ఆదరణ రాకపోవడానికి చాలావరకూ మన అనువాదాలే. అరవై ఏళ్ళక్రితం పాలగుమ్మి పద్మరాజుగారికథకి అంతర్జాతీయ బహుమతి వచ్చిందని ఈనాడు గొప్పగా చెప్పుకునేది మన వ్యాసాల్లోనూ ఉపన్యాసాల్లోనూ తప్పిస్తే, వేరే ఎవరికీ గుర్తు లేదంటే కారణం మంచి అనువాదాలు లేకపోవడమే.

ఈ విషయాలు మరింత విపులంగా నేను నాబ్లాగులోనూ, సైటులోనూ చర్చించేను. కావలసినవారు తెలుగుతూలిక బ్లాగులో, ఇంగ్లీషు సైటు thulika.net లో చూడవచ్చు.

నా సైటు ధ్యేయం మన తెలుగుసంస్కృతీ సాంప్రదాయాలు తెలుగుకథల అనువాదాలద్వారా విదేశీపాఠకులకి తెలియజేయడం. పైన వివరించి విషయాలు ప్రత్యేకించి ఎత్తి చూపడానికి కారణం నాకు వస్తున్న అనువాదాలు. కథలఎంపికలో గానీ, వాక్యనిర్మాణం, అనువాదానికి వాడుతున్న భాషలో గానీ అనువాదకులు పై విషయం గమనించడం లేదు. అసంపూర్తి వాక్యాలూ, వ్యాకరణదోషాలూ ఘోరంగా ఉంటున్నాయి నాకు వచ్చే అనువాదాల్లో. అవి నేను ఎత్తి చూపిస్తే, “మీరే సరి దిద్దుకోండి, నేనేం అనుకోను,” అని జవాబిస్తున్నారు! వారిపేరుమీద ప్రచురించే అనువాదానికి వారే బాధ్యులు కనక అనువాదకులే శ్రద్ధ వహించి మంచి అనువాదం అందించడం న్యాయం.

కొన్ని తెలుగు,భారతీయభాషల్లో పదాలు – కర్మ, యోగ, దాల్ వంటివి – ఇంగ్లీషులో సర్వసాధారణం అయేయి. కానీ పాలేరు, చారు, పిన్ని లాటివి ఇంకా కాలేదు. ముఖ్యంగా పిన్ని, బాబాయి. బావ వంటి పదాలు బంధుత్వాలనే కాక సంస్కృతిపరంగా కొంత ప్రత్యేకతని సంతరించుకున్నాయి. ఇలాటి విషయాలు అనువాదం చేస్తున్నప్పుడు గమనించాలి.

*****

ఈ సందర్భంలోనే మరొకసారి మనవి చేస్తున్నాను. తూలిక.నెట్ లో ప్రచురణకి అనువాదాలకోసం నేను చూస్తున్నాను. దయచేసి పైన వివరించిన అంశాలు కథలఎంపికలో, భాషలో  దృష్టిలో పెట్టుకుని మీ అనువాదాలు పంపండి.

ధన్యవాదాలు.

Buy this book on Amazon