ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అస్తిత్వ వేదన కవులు – 1

Like-o-Meter
[Total: 0 Average: 0]

 

ఆవకాయ.కామ్ లో ప్రచురితమవబోతున్న ఈ వ్యాసమాలకు మూలం శ్రీ ఇక్బాల్ చంద్ గారి “ఆధునిక తెలుగు కవిత్వంలో జీవన వేదన” (Exist Aesthesia in Telugu Modern Poetry) నుండి గ్రహించడం జరిగింది.

శ్రీ ఇక్బాల్ చంద్ గారు “ఆరోవర్ణం”, “బంజారా” సంకలనాల ద్వారా కవిగా తమదైన ముద్రను వేసారు. సాహిత్య వాతావరణం, సాహితీప్రియులైన కుటుంబవర్గంను కలిగిన ఇక్బాల్ చంద్ గారు తమ పి.హెచ్ డి పరిశోధనకు గానూ “మానవ అస్తిత్వ వేదన”ను విషయంగా ఎన్నుకోవడం ఏ మాత్రం కాకతాళీయం కాదు. అటు సూఫీ కవులతోనూ, ఇటు ప్రాచీన భారత తత్త్వశాస్త్రంతోనూ ప్రభావితమైన ఇక్బాల్ చంద్ గారు కవిత్వంలో అస్తిత్వ వేదనను శోధించడం సహజమైనదే.

విషయ పరిచయం:

అస్తిత్వ వేదనను నిర్వచిస్తూ, ఇక్బాల్ గారు…

“కృత్రిమ పరిసరాల్లో ఇమడలేక, మృత్యు కాంక్షతో నిరీక్షణా పూరిత వైయక్తిక అనుభవమే అస్తిత్వ వేదన” అని అన్నారు.

కృతజ్ఞతలు:

తమ సిద్ధాంత గ్రంధంలోని ముఖ్యమైన భాగాలను ప్రచురించడానికి గాను ఆవకాయ.కామ్ కు తమ అనుమతిని ఇచ్చినందులకు శ్రీ ఇక్బాల్ గారికి మేము హృత్పూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాం.



ఆయన కళాశాలల్లో కొంతకాలం పనిచేసాడు. విద్యార్థులకు బోధించాడు. వారివల్ల తాను నేర్చుకొన్నదెంతో ఉండవచ్చు. బొంబాయి నగరానికి వెళ్ళి అక్కడ వ్యాపార సంస్థల్లో ఉద్యోగం చేసారు. మళ్ళా గుంటూరులో “శాంతిని” అనే పత్రికను నడిపాడు. శిష్ట్లా గురించి అబ్బూరి వరదరాజేశ్వర రావు మాటల్లో చెప్పాలంటే “ఉమామహేశ్వరరావు విచిత్రమైన వ్యక్తి. మనిషి శుభ్రత పాటించేవాడు. మాట్లాడినంత సేపూ బాగానే వున్నట్లుండి – హఠాత్తుగా మారిపోయేవాడు. అక్కడే అందరికీ అతనంటే బాధాకరంగా ఉండేది. అంతేకాక వ్యక్తిగత జీవితంలో కొన్ని అవాంఛనీయమైన లక్షణాలు అందరికీ అర్థమయ్యే రకంగా ప్రవర్తించేవాడు.”

ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వం కాలంలో దానికి భిన్నంగా తెలుగు కవిత్వంలో కొత్త ఒరవడిని సృష్టించాడు. శిష్ట్లా తన కవిత్వాన్ని వచన గీతాలు అని పిలువలేదు. తనది “ప్రాహ్లాద కవిత్వ”మని అన్నాడు. “ప్రాహ్లాద కవిత్వం పూర్వ కవిత్వం కాదు. భావ కవిత్వం కాదు. నూతనములో బహు నూతన కవిత్వం” అని చెప్పుకొన్నాడు.

శిష్ట్లా నవ్య కవుల్లో అతి నవ్యకవి. “అతని గొంతుక సొంత గొంతుకే. కాని అది వింత గొంతుక. అతని దారి ముళ్లదారి. నలుగురూ నడవలేని రహదారి. అతని కవిత కూడా చూడచక్కని జాతి గుర్రం. అయినా అది తనకు కూడా లొంగని పెంకి రెక్కల గుర్రం. అతని పేరు శిష్ట్లా ఉమామహేశ్వరరావు. అతనికి మహేశ్వర, వినాయక పండితుడు, ఉమా, విజయమహేశ్వరం మొదలైన కలం పేర్లు అనేకం ఉన్నాయి. ఎప్పుడు ఏ పేరు వాడుకొంటాడో తెలియదు. ఎప్పుడు ఏ తోవన నడుచుకొంటాడో తానే చెప్పడు. అతడు కవి. అతి నవ్యులలో అతి నవ్య కవి.”

ఆధునిక వచన కవిత – పూర్వ రంగం:

1930 తర్వాత తెలుగు కవిత్వపు బహిరాకృతిలో వచ్చిన మార్పు “వచన కవిత్వం”. భావ కవులు ఛందో బంధాలను వదులుకోడానికి ప్రయత్నించారు. అయితే “వారు స్వేచ్ఛకై పరితపించారే గాని నియమాలను తెంచివేయలేదు. పద్యానికి ముందు వృత్తాలను సూచించే “ఉ-చ-శా-మ” అని అచ్చు వేయడం మానేసారు. అసలు అచ్చువేసే ఆకృతిని గూడా మార్చారు. నాలుగు పంక్తుల పద్యాన్ని ఒక్కోసారి 6, 8 పంక్తులుగా కూడా అచ్చువేసారు. పద్యం పూర్తికాక పోయినా భావం పూర్తయితే అక్కడితో పద్యాన్ని ఆపివేసారు. ఈ స్వేచ్ఛతో సరిపెట్టుకోక శ్రీ దువ్వూరి రామిరెడ్డి, కవికొండల వెంకటరావు మొదలైనవారు దరిదాపు గద్యకవిత్వమనదగిన రచనలు చేశారు. కొత్తను వెదుక్కుంటూ ఆయన చేసిన ప్రయోగాలే వచన కవిత్వానికి తొలి రూపాలుగా కన్పిస్తున్నాయి. దువ్వూరి వారి ఈ కొత్త రచనలు వచన గేయ రూపం గలిగినవే గాని వచన కవిత్వం కాదు.

వచన కవిత్వానికి ఆద్యుడు – శిష్ట్లా:

“వచన కవితకు ఆద్యుడుగా పేర్కొనదగిన కవి శ్రీ శిష్ట్లా ఉమామహేశ”. వచన కవితకు ఆద్యుడు శిష్ట్లా అనటంతో నేటి విమర్శకులు చాలామంది ఏకీభవిస్తున్నారు.

శిష్ట్లా రచనలు:

1938లో శిష్ట్లా “విష్ణు ధనువు”, “నవమి చిలుక” అను రెండు కవిత్వం సంపుటాలను ప్రకటించాడు. కొంతకాలం మిలటరీలో పనిచేసాడు. ఆ అనుభవంతో “సిపాయి కథలు” రాసాడు. సిపాయిల కథల్లాగే “ఆంగ్లో ఇండియన్ కథలు” అనే పేరుతో ఎన్ని కథలు రాసాడో కాని కొన్ని 1946లో “ఢంకా” అనే మాసపత్రికలో ప్రచురణ పొందాయి. వీటిని ఎవరూ సంకలనం చేయలేదు. గ్రంథరూపంలో రాలేదు.

శిష్ట్లా పై పలువురి అభిప్రాయం:

డా. సి. నారాయణరెడ్డి: “ఛందస్సు విషయములో శిష్ట్లా అద్భుతమైన ప్రయోగాలు చేసాడు. విష్ణుధనువులో ప్రయత్నపూర్వకంగా ఛందస్సును వికృతమొనర్చినాడు. కొన్ని మాత్రాబద్ధ గేయములను, కొన్ని వచనపు తుంటలను ఇష్టము వచ్చినట్లే పేర్చి విశృంఖల మనస్తత్వమును ప్రదర్శించాడు”.

దేశిరాజు కృష్ణశర్మ(ప్రతిభ): “ఉమా విష్ణుధనువులో దేశంలోని సమ్యక్ దృక్పథానికి దూరమై, నిద్రాణమై, నిర్వేద రూపమైన, అశాంతి, అసంతృప్తిని నిశీధ సౌందర్యమూర్తిగా దర్సించాడు.”

నోరి నరసింహశాస్త్రి: “సంపూర్ణమైన నవ్యత్వమున్న కవి ఇతడే. అయితే దేశములో ఇతనికి రాదగిన ప్రసిద్ధి ఇప్పటికీ రాలేదు. అందుకు కారణాలు చాలా ఉన్నాయి. ఇతను పత్రికలలో తన కావ్యాలు ప్రచురించడు. సభలకు రాడు. పదిమందిలోకి రాడు. వచ్చినా ఎక్కువ మాట్లాడడు. తాను వ్రాసినది చదివి వినిపించడు. ప్రచురించిన గ్రంథాలకు ఎక్కువ వ్యాప్తి లేదు. వ్యాప్తి కోసము ఏమాత్రమూ ప్రయత్నించడు.”

కుందుర్తి: కవితా రూపంలో కొత్త కోసం తాపత్రయపడి ఓంప్రథమంగా కొన్ని ప్రయోగాలు చేసి చూపినవాడు శిష్ట్లా…”

శ్రీశ్రీ: “ఒకానొక రాత్రి దీన్ని ఉమ్మయ్యతో గుంటూరు రాత్రి అని గాని, “గుంటూరులో ఉమ్మయ్యరాత్రి” అని గాని, “ఉమ్మయ్యా, నేను, నాటుసారా” అని గాని, “గడ్డివాముకి మంటపెట్టి, ఉమ్మయ్యనన్నందులో” అనిగాని లేదా టూకీగా “హోమో-హోమం” అనిగాని అనవచ్చు. ఏమీ అనకుండానే రాయనూవచ్చు. ఉమ్మయ్య అంటే శిష్ట్లా ఉమామహేశ! అతనే ఉమామహేశ్వర వినాయకం, క్షమా పరాత్పర కృపాకరం, దయా రసార్ణవ దవానలం (ఇందులో మొదటిదే అతను పెట్టుకొన్న పేరు. మిగిలినవన్నీ ఆ బాణీలో నా సొంత కల్పన).

అప్పటికే శివశంకరశాస్త్రి, విశ్వనాథల ఉపోద్ఘాతాలతో అతని “విష్ణుధనువు”, “అచ్చయివచ్చేసింది. “నవమిచిలుక” కూడా వెలువడిందనుకొంటాను. అప్పటికింకా నా “మహా ప్రస్థానం” గీతలు పత్రికల్లోనే నిద్రపోతున్నాయని జ్ఞాపకం. కవుల వలయాల్లో మాత్రం కల్లోలం పుట్టిస్తూనే ఉన్నాయి. అది వేరే కథ.

ఇక “నిషా విషామృత మశూచికం” దగ్గరకి వద్దాం. ఆ రోజుల్లో అతను “కాళంగి” అనే మహాకావ్యం రాస్తున్నానని చెప్పేవాడు. అందులో యుద్ధాలన్నిటినీ ముగించే యుద్దంలాగ కవిత్వన్ని ముగించే కవిత్వం ఉందని మా నమ్మకం. కళ, ఇంగితం కలిపి “కాళింగి” అనే సమాసం చేశాడట. ఇది ఎలా సాధ్యమో నాకు బోధపడలేదు. నీకు బోధపడదులే అన్నాడు. బాధపడ్డాను. జేంస్ జాయిస్ ని ఎందుకు చదివేనా అని! జాయిస్ లో నానా భాషాప్ద సముచ్ఛయాలు కోకొల్లలు. కాని అవి పరిశోధన ద్రావకంలో పరిశీలనకు లొంగుతాయి. “కాళింగి” మీద పరిశోధన అనవసరం! నళిని గెస్టుగా నేను గుంటూరు వెళ్ళాను. అతని దగ్గర స్కాచి విస్కీ ఉంది. అది వదులుకొని నాటు సరుకు ఆహ్వానాన్ని అంగీకరించాను.

నాటు సారా విషయంలో నాకు దేశభక్తి లేదు. మన కల్లు, మన సారా అనే వెధవల్ని తంతాను. కనీసం ఇందులోనైనా నాది అంతర్జాతీయ దృక్పథం. అసలైన తెలుగువాడికి సిసలైన పొరుగింటి పుల్లకూర నచ్చుతుంది. అందుకే నేను రూపాయికి నూరుపైసల తెలుగువాణ్ణి. ఆ రాత్రంతా అయ్యో నేను స్కాచికి దూరం అయిపోయానే అని బాధపడుతూ ఉన్నాను. మళ్ళీ మన “కళాపరాయణ పలాయనం” దగ్గరికి వద్దాం. ఉమ్మయ్య ఆజానుబాహుడు. నన్ను తన ముందు నిలబెట్టి ఒకేఒక ప్రశ్న వేశాడు. ఇవాళ తెలుగుదేశంలో నిన్ను కమ్యూనిస్టు పార్టీవాళ్ళు మహాకవి అంటూ దుమారం రేగిస్తున్నారు. నిజమైన మహాకవిని నేను. ఇది నువ్వు ఒప్పుకుంటావా లేవా? అని నిలదీసి అడిగేడు. నేను ఒప్పుకున్నాననుకో! నీకేం ఒరిగింది! లోకం ఒప్పుకోవద్దా? అన్నాన్నేను. అతనిలో కరుడుగట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకత ఉందు. అదో సుపీరియారిటీ కాంప్లెక్సు. అది వున్నచోట ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు కూడా వుంటుందని మనస్తత్త్వవేత్తలందరూ ఒప్పుకున్నదే. ఉమ్మయ్య నా ముందు ఎంతగా సుపీరియారిటీ (నేనే గొప్పవాణ్ణనే) ఫోజులు కొడుతున్నా అంతరాంతరాల్లో మాత్రం తన దౌర్బల్యానికి తానే క్రుంగిపోతూండడం నేను పసికట్టేను.

అక్కడే వుంది కమ్యూనిస్టు వ్యతిరేకతలోని కిటుకంతా! సాటివాణ్ణి నీతో సమానుడుగా అంగీకరించలేవు! ఉమ్మయ్య కవే! నేనూ కవినే! నీ కంటే నేను గొప్పవాణ్ణని నేనెప్పుడూ వూరేగలేదు. తనకంటే నేను తక్కువ కవినని నాచేత ఒప్పించాలనే శిష్ట్లా తాపత్రయం ససేమిరా నేనొప్పుకోనన్నాను.

అప్పుడో ముగ్గురు కుర్రాళ్ళు వచ్చారు. 14-15 ఏళ్ళ వయస్సు వాళ్ళు. ఉమ్మయ్య హోమో అని అప్పటిదాకా నాకు తెలియదు. కాళ్ళు పట్టించుకోవడానికి ఎందుకో పిలిపించాడనుకున్నాను. కాదు ఏకలింగ సంభోగంలోని ఔన్నత్యం గురించి నాకు లెక్చర్ ఇచ్చాడు. శిష్ట్లా, షేక్స్పియర్, మిచితేంజిలో, ఆస్కర్ వైల్డ్ అంటూ ఏకరువు పెట్టడు. వీళ్ళంతా గొప్పవాళ్ళు కావడానికి వీరిలో ఉన్న ఏకలింగ ప్రియత్వమే అని నమ్మించడానికి ప్రయత్నించాడు. వైల్డ్ మాటేమో కాని షేక్స్పియర్ హోమో అని నేను అంగీకరించలేదు. ఇలా వాదోపవాదాలు పెరిగాయి. నన్ను అమాంతంగా ఎత్తుకొని గిర్రున తిప్పడం మొదలు పెట్టాడు. ఆరడుగులు మనిషేమో, నేను ఆకాశంలో రంగులరాట్నం మీద తిరుగుతున్నట్లు అనిపించింది. ఎదురుగుండా ఒక గడ్డివామును భావించుకొని, తన “ఊహల్లోనే” దానికి నిప్పంటించి అందులో నన్ను పడేశాడు. అక్కడే నన్ను వదిలేసి కుర్రాళ్ళను వెంటపెట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోయడు. తాను నా కంటే గొప్ప కవినని నా చేత అనిపించలేక పోయినందుకు నన్ను గాలిలో తిప్పి గడ్డివాములో తగలేశాననుకున్నాడు.”

శివశంకర శాస్త్రి: “ఊరందరిదీ ఒక తోవ, ఉమామహేశ్వరానికి ఒక తోవ. నాకు తెలిసినంతలో అతి నవీన మార్గంలో మొదట నడచినవాడు ఇతనే”

కురుగంటి సీతారామయ్య: “ఈతని జీవితము చిత్రమైనది. ఎక్కడా నిలకడ అంటూ లేకపోవడం – కారణాలుగా యువ కవులలో ఎవరికీ లేనన్ని స్వేచ్ఛా జీవితానుభవా లితనికి లభించాయి.”

శిష్ట్లా కవిత్వం:

శిష్ట్లా తన కవిత్వాన్ని “భావ కవిత్వం” అనిగాని “నవ్య కవిత్వం” అని గాని అనలేదు. శిష్ట్లా తన జీవితంలోనే కాదు కవిత్వంలోనూ స్వేచ్ఛను కోరాడు. “వ్యాకరణంలో వ్యభిచరించటము కూడదు కాని poetryలో కొంత స్వేచ్ఛ అవసరం! న్యాయం” అని ప్రకటించాడు. కావ్య లక్షణాన్ని వివరిస్తూ ఇలా అంటాడు “రమ్యత అనేది రంజింపచేయుట అనేది కావ్యానికి ముఖ్యము. రమ్యత అనగా ఎరుపు, పచ్చన రంగులు గల రామ చిలుక వలె భావమూ, రసమూ సరసగా కనబడుతూ కలిగించుటే!” అంతేకాదు, తన కవిత్వాన్ని “ప్రాహ్లాద కవిత్వము” అని పేరు పెట్టాడు. శిష్ట్లా తన ప్రాహ్లాద కవిత్వము ఎలాంటిదో కూడా చెప్పాడు.

“ప్రాహ్లాద కవిత్వములో ప్రౌఢత్వమున్నది. పామరత్వ మున్నది. దేశికి విదేశికీ నేస్తమున్నది” అని సూచించాడు. తన ప్రాహ్లాద కవిత్వము లక్షణాన్ని చెబుతూ “ప్రాహ్లాద కవిత్వం ఆరిపోయే దీపాన్ని రగుల్పుతుంది! పరుగెత్తే పామరుణ్ణి నిలేస్తుంది! తాను నిలుస్తుంది” అని వివరించాడు.

శిష్ట్లా కవిత్వంలో విశృంఖలత్వం, ఆర్ద్రత, గ్రామీణ వాతావరణం, స్వేచ్ఛ, పురాణాల నేపధ్యం, ప్రేమ, స్త్రీ, అన్వేషణ, మృత్యువు మొదలైనవి కన్పిస్తాయి. “ఉమామహేశ్వరానికి మన నుడికారాలూ, జాతీయాలూ, సంప్రదాయాలూ, చాలా బాగా తెలుసు. విష్ణుధనువులోనూ, నవమి చిలుకలోనూ తెలుగు దేశపు పండుగలు, మదన పంచమి, రథసప్తమి, నాగుల చవితి, దేవీ నవరాత్రులు కనబడుతాయి. అలాగే ఎన్నెమ్మ, కొత్తెమ్మ, పోతరాజు కనబడుతారు. తన ప్రాహ్లాద కవిత్వంలో పామరత్వం కూడా ఉందని చెప్పడానికి దాఖలాగా “బీదమందు” అనే కవితను పామరుల భాషలోనే రాసాడు.

తూర్పు తెల్లారింది, వాన వెలిసింది!
అమ్మ పోయే మందెట్టుకు రాయే!
కాండబ్బైనా లేదు. కాసైనా లేదు!
కాత్తె కూత్తె కైతే డాక్టేరు రాడే!
సందేళ సలిజరం ఊర్కే పోదే!
సందొచ్చిన పిల్లోడు ఉలుకుతుండాడే!
ఏ యాకో తింటుంది గజ్జెట్టిన కుక్క!
నేపాళం మాత్రెయ్యే, లేత్తాడు, పిల్లోడు!
పాతాళం బలి సెక్రవర్తీ! సంకురాతిరి పండక్కు
నేపాళం సెట్టెక్కిరా! జబ్బులన్నీ పోతాయి!

పోయే, రాయే, కాండబ్బైనా లేదు, సలిజరం, సంకురాతిరి, సెట్టిక్కిరా వంటి పామరుల మాటల్ని గమనించవచ్చు.

శిష్ట్లా కవిత్వంలో ముఖ్యమైన అంశం స్త్రీ జీవిత చిత్రణ. ఆడవాళ్ళు, చిన్నమ్మాయి, ఊట్ల వెర్రెమ్మ, పుట్టింట పిల్ల, జ్ఞాపకాలు, చిన్నతనం వంటి కవితల్లో ఈ అంశం కనిపిస్తుంది. “స్త్రీ జీవిత చిత్రణలో ఉమామహేశ్వరం వాస్తవానికి ఎంత చేరువగా వెళ్లగలడో అంతకన్నా ఎక్కువగా వెళ్ళాడు. ఊట్ల వెర్రమ్మ, పుట్తింటిపిల్ల, ఆడవాళ్ళు, జ్ఞాపకాలు అనే ఖండికలు చెప్పుకోదగ్గవి. ఎన్ని నోములు నోచినా చివరకి ఉట్టెక్కి ఉరిపోసుకొనేవాళ్ళు, ఆశలు అడుగంటినవాళ్ళు వీటిలో ఉన్నారు. పుట్టింటి మొదలు పోయేవరకూ అందరూ ఉండి ఏకాకి అయిన యువతి జాలి కథ “జ్ఞాపకాలు” అనే ఖండిక దానికి ఉదాహరణ. శిష్ట్లా స్త్రీ పాత్రలు ఎక్కువగా మృత్యువులో సంబంధించినవే. చిన్నమ్మాయి, “దాక్కున్నది చిన్ని చిన్నమ్మాయి ఓ రాత్రి దాక్కున్నది రాత్రిలో కలిసింది”. జ్ఞాపకాలు కవితలోని “లీల” కూడా ఊరి గోల పడలేక పొరుగూరు వచ్చింది. నమ్మినవాడే మోసం చేసాడు. ఏకాకి అయింది. అందరినీ తలుచుకొంది. వెళ్తున్న దారి వెంట అమ్మలక్కలు ముళ్ళ చూపుల్తో బాధపెడ్తున్నారు. చివరికి విసిగి “ఏకాకినై నేను నడిజాము వరకు మేలుకొని మృత్యువును బ్రతిమాలుకొన్నాను” అని అంటుంది.

పుట్టింటిపిల్ల: పుట్టింటి పిల్ల కవిత ఒక కథనాత్మక రూపం. ఈ కవితలో శిష్ట్లా పుట్టింట ఉన్న పిల్ల జీవితంలోని మూడు కోణాల్ని చిత్రించాడు.

మాటుగలదే మాట, పట్టుగలదే పలుకు, మాట పట్టింపుంది పుట్టింటపిల్ల!
ఆటుగలదే ఆటు, పోటు గలదే పాట! ఆట పాటలు గలది అదేం ఎరగని పిల్ల!
పెద్దదైన పిల్ల, పుట్టింటకై పోయి మాట పట్టింపుతో మళీ రాలేదు
సమత్తాడిన పిల్ల పుట్టింటోనే ఉంది, తెల్లవారు తరుణము తలపు లేవేవో!
నోములైన పిల్ల పిట్టింటోనే ఉంది, పొద్దుపోయే తరణము మససేమి పడునో!
పండుగరోజున పిల్ల పుట్టింటోనే ఉంది, వెన్నెలొచ్చే వేళ ఊహలు ఏ రకమో!
పదునెనిమిది ఏండ్ల పిల్ల పుట్టింటనే ఉంది, చీకటి తరుణమున చూపులు
ఏవైపో!
మెట్టిన ఇల్లు వదిలి పుట్టింటనే ఉంది. నిద్రపోయే సమయమున కలలేమి
కనునో!
అక్కడ్నే ఉందక్కడ! పుట్టింటక్కడ్నే ఉంది! తాళ్ళేమీ
లేకనే ఉట్టికెక్కింది పిల్ల ఉరిపోసుకుందోయి!

పుట్టింట పిల్ల మాట పట్టింపుగలది. పుట్టింట్లోనే ఉంది. చీకటి పడేవేళకు ఆ అమ్మాయి చూపులు ఎటు వెతుకుతుంటాయో. నిద్రపోతున్నప్పుడు ఏ ఏ కలలు కంటుందో. ఆమెకు తెల్లవారుజామున ఎటువంటి తలపులొస్తాయో కాని చివరికి ఉరిపోసుకుంది.

“శిష్ట్లా ఉమామహేశ్వరరావుని వినూత్న మార్గదర్శిగా ప్రచారం చేసేందుకు శివశంకర శాస్త్రి ప్రభృతులు చాలా దోహదం చేయడం జరిగింది. విశ్వనాథ సత్యనారాయణ గారి చేత కూడా యోగ్యతా పత్రం ఇప్పించే ప్రయత్నమూ జరిగింది. వారి ఆశయాల కనుగుణంగా ఉమామహేశ్వరరావు కవిత్వంలో పురోగమించలేకపోయాడు. దానికి తోడు అనతి కాలంలోనే కవిత్వానికి స్వస్తి పలికాడు.”

ఉపయుక్త గ్రంథాలు:

ఆరుద్ర – సమగ్రాంధ సాహిత్యం
ఏటుకూరి ప్రసాద్ (సంపా): శిష్ట్లా ఉమామహేశ్వరరావు కవిత్వం సమాలోచనం
Ibid – నవమి చిలుక మున్నుడి
డా. నారాయణ రెడ్డి: ఆధునికాంధ్ర కవిత్వము-సంప్రదాయములు-ప్రయోగములు