18/12/2017 న గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆఖరి ఫలితాల ప్రకారం బిజెపి 99 స్థానాల్లోను, కాంగ్రెస్+మిత్రపక్షాలు 80 స్థానాల్లోను, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లోనూ నెగ్గడం జరిగింది. ఆవిధంగా, భా.జ.పా. ఐదోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం ఏర్పడింది.
గుజరాత్ రాష్ట్రం ప్రస్తుత ప్రధాని స్వరాష్ట్రం కావడం ఒక విశేషం. అంతే కాదు, అధికార పక్షం అధ్యక్షుడు కూడా అదే రాష్ట్రం నుండి మరొక ముఖ్యాంశం. అలానే, గుజరాత్‍లో పుట్టకపోయినా ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయిన ఊర్జిత్ పటేల్ పూర్వీకుల స్వస్థలం కూడా గుజరాతే! ఇలా మూడు ముఖ్యస్థానాలలో ఉన్నవారికి పుట్టినిల్లైన గుజరాత్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతం కావడం కూడా ఆ రాష్ట్ర ఎన్నికలను జాగ్రత్తగా గమనించవలసిన అవసరాన్ని కల్పిస్తోంది.
ఈనాడు వెలువడిన ఫలితాలను కేవలం రాజకీయ కోణంలోనే కాక జాతీయవాద కోణంలోను, దేశ సాంస్కృతిక పరిరక్షణా కోణంలోనూ చూడాలనే అభిప్రాయమే ఈ రచనకు ప్రాతిపదిక. ఈ కోణాన్ని ఎందుకు ఎంచుకోవలసి వచ్చిందో ఈ క్రింది కారణాల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాను.
- భా.జ.పా తన తొలినాళ్ళనుండీ భారతీయతకు పెద్దపీట వేసే రాజకీయపార్టీగా ముద్రపడినది కావడం.
- అలనాటి అద్వానీ రథయాత్ర, సంఘపరివారంతో చెట్టాపట్టాలు, నాయకుల్లో అనేకులు వివిధ దేవుళ్ళకు, బాబాలకు భక్తులైవుండడం వల్ల ’హిందూత్వ’ పక్షం అని గుర్తింపును పొందడం.
- 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రామమందిరం కడతామని రాసుకోవడం.
- ఎన్నికల ప్రచార సందర్భంలో ముస్లిమ్ టోపీని ధరించడానికి మోడీ నిరాకరించడం.
- ఉమ్మడి పౌర చట్టం (యూనీఫామ్ సివిల్ కోడ్) తెస్తామని చెప్పడం.
- “జస్టిస్ టు ఆల్ – అపీజ్‍మెంట్ టు నన్” (అందరికీ న్యాయం – ఎవ్వరికీ లేదు బుజ్జగింపు) అని ప్రధాని అభ్యర్థి మోడీ అప్పట్లో సగర్వంగా ప్రకటించుకోవడం.
- నెహ్రూ అసంబద్ధ ధోరణితో తెచ్చిన ఆర్టికల్ 370ను తొలగిస్తామని అనడం.
- ఇలాంటివే మరి కొన్ని.
ఈ పైన చెప్పినవి కాక, మోడీ చేసిన మరికొన్ని ఎన్నికల వాగ్దానాలను పరిగణలోకి తీసుకోవాలి. అవేవంటే,
- (మతపరంగా) మైనార్టీలు నడిపే విద్యాసంస్థలను బలోపేతం చేయడం. జాతీయ స్థాయి మదరసా ఆధునీకరణ.
- వక్ఫ్ బోర్డ్ కు మరిన్ని అధికారాలను ఇవ్వడం.
ఇప్పుడు గుజరాత్ ఎన్నికల విశ్లేషణ:
2014 ఎన్నికల నుండి ఇప్పటి దాకా నరేంద్రమోడీ ’హిందూత్వ’ విధానాలను పాటించలేదు. కనీసం అటువంటి మాటైనా మాట్లాడలేదు. ఒకప్పుడు ముస్లిం టోపీని పెట్టుకోవడానికి నిరాకరించినవారు, తరువాత కలకత్తాలో ఓ సభలో ప్రసంగిస్తున్నప్పుడు ఎక్కడో లౌడ్ స్పీకర్ నుండి వినవచ్చిన ’అజాన్’ పిలుపుకు ప్రసంగాన్ని ఆపేసారు.
ప్రతి విదేశీ పర్యటనలోను తాను కలిసిన ఆయా దేశాల నేతలకు ’భగవద్గీత’ను బహుమతిగా ఇచ్చినవారు తనదేశంలో మెజారిటీ ప్రజలు నడిపే విద్యాసంస్థల పాలిటి ఉరితాడైన RTE చట్టాన్ని అమలు చేసారు. కానీ, ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా మదర్సా ఆధునీకరణకు నిధులు కేటాయించారు. అక్కడ చెప్పలేదు కాబట్టి దయనీయ స్థితిలో ఉన్న వేదపాఠశాలలకు ఎటువంటి సహాయాన్నీ ప్రకటించలేదు.
“బేటీ బచావ్ – బేటీ పఢావ్” అన్న నినాదాన్ని “షాదీ షగున్” పథకం ద్వారా కేవలం ముస్లిమ్ బాలికలకే పరిమితం చేసారు. ఇలా ఎన్నో చేసినా, చేస్తున్నా గత నాలుగేండ్లుగా కుహనా సెక్యులరిస్టుల మన్ననను, ముస్లిమ్ వర్గీయుల ఆదరాన్ని పొందలేకపోయారు భా.జ.పా. నేతలు.
ఉత్తరప్రదేశ్ లో జరిగిన ’అఖ్‍లాక్’ హత్యను మీడియావాళ్ళు, సెక్యులర్లు, మేధావులు “మెజారిటీ వర్గపు అసహనం”గా ప్రచారం చేసి, ఆ అసహనానికి కారణం మోడీ హిందూత్వమే అని దూషించారే తప్ప మోడీని ’సెక్యులర్’ అని ఒప్పుకోలేదు. అయినా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భా.జ.పా. నెగ్గింది. అందులోనూ ఓ కాషాయధారి అయిన సన్యాసి నేతృత్వంలో. దీని సంగతి తర్వాత ప్రస్తావిస్తాను.
అటుపై జరిగిన మరొక తంతు – “అవార్డ్ వాపసీ” ప్రహసనం. ఏదో ఫలానొక్క అకాడెమీ ఇచ్చే అవార్డులనే చెక్కముక్కల్ని వెనక్కి ఇచ్చినప్పుడే ఇలాంటి వాళ్ళు ఉన్నారని, అలాంటి చెక్కముక్కల అవార్డులూ ఉన్నాయని నాకు తెలిసివచ్చింది. కొద్దిమంది అర్భక రచయితలు, అనామక కళాకారులు, “వృద్ధనారీ పతివ్రతః” వంటి ముసలి వగ్గుల్ని ముందేసుకుని “అవార్డ్ వాపసీ” డ్రామా జరిగినన్నాళ్ళూ ప్రతి దళిత, మైనార్టీ, మేధావి వర్గ ప్రతినిధి మోడీని హిందూ నియంతగానే అసహ్యించుకున్నారు గానీ ’అజాన్’ వేళకు మౌనం వహించిన మరో ’చాచా నెహ్రూ’గా కీర్తించలేదు. కీర్తించడం కాదు గదా కనీసం గుర్తించలేదు కూడా.
ఇప్పటి గుజరాత్ ఎన్నికల సందర్భంగా గుజరాత్ ఆర్చ్ బిషప్ భా.జ.పా. వంటి జాతీయవాద పార్టీలను క్రిస్టియన్లు ఓడించాలని పిలుపునిచ్చాడు. జాన్ దయాళ్ వంటి వారు ప్రతిరోజూ ఏదోక టివి ఛానల్లో కనబడుతూ భా.జ.పాను, మోడీని ’మైనార్టీ వ్యతిరేకి’ అని దుమ్మెత్తి పోసరే తప్ప అక్కున చేర్చుకోలేదు. ’చర్చ్ పై దాడులు’ అనేది దొంగనాటకని తేలినా ఇంకా ప్రస్తావనకు నోచుకుంటూనే ఉంది. అయినా ఏ క్రిస్టియన్ మతపెద్దా, క్రిస్టియన్ సమాజ నేతా మోడీని గానీ, భా.జ.పా.ను గానీ పొగిడింది లేదు. పొగడ్డం అటుంది కనీసం విమర్శించకుండా ఉండనూ లేదు.
ఇవన్నీ చాలవన్నట్టుగా భా.జ.పా. వాళ్ళు తమ కాళ్ళను తామే నరుకున్న సందర్భాలు కోకొల్లలు. మచ్చుకు కొన్ని…
> మొన్నటిదాకా కేంద్రమంత్రిగా ఉండి ఈమధ్యనే ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు గారు “యోగా ఒక మతానికి చెందినది కాదు” అని ఏకపక్షంగా ప్రకటించి ఇప్పుడు అమెరాకలోను, యూరోపులోను వెర్రితలలు వేస్తున్న ’క్రిస్టియన్ యోగా’కు మరింత ఊతమిచ్చారు.
> భా.జ.పా. జాతీయ కార్యదర్శి అయిన రామ్ మాధవ్ “కేదార్‍నాథ్ ఎంత గొప్పదో తాజ్‍మహల్ కూడా అంతే గొప్పద”ని ప్రకటించేసి దేవాలయానికి, సమాధికి మధ్యగల అంతరాన్ని తుడిచేసి చేతులు దులుపుకున్నారు.
> తల్లి పొలంలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్న చందాన ప్రధాని మోడీగారే మైనార్టీలను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉండడం చూసి మహారాష్ట్రా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసు, అతని భార్య దీపావళి నాడు హిందువులకు ఆ పండుగ ఎంత కాలుష్యం చేస్తుందో హితబోధ చేసారు. అదే చేత్తో ఉత్తి అభూతకల్పన అయిన “క్రిస్టమస్ శాంటా” నిజమైన శాంతి, సంతోషాలను పంచుతాడని ఊదరగొట్టారు.
> ఒకానొక ముంబై బిజేపి ఎమ్మెల్యే ఏకంగా మత మార్పిళ్ళు చేసే క్రిస్టియన్ పాస్టర్ సభలకు అందరూ దయచేసి హాజరు కావాలని ట్విటర్ ద్వారా ఆహ్వానించాడు. బహుశా ఇలా మహారాష్ట్రలో క్రిస్టియన్లను ఉబ్బేస్తే, గుజరాత్ క్రిస్టియన్లు ఓట్లు వేస్తారన్న ఆశ కావొచ్చు
ఇలా హిందూత్వవాదులుగా ముద్రపడిన ఈ పార్టీ 2014 విజయం తరువాత వీలైనంత ఎక్కువగా ’సెక్యులర్’ వేషాన్ని పోషిస్తూనే వస్తోంది. దీనివల్ల ఏమైనా లాభం కలిగిందా? అని ప్రశ్నించుకుంటే ఈనాటి గుజరాత్ ఎన్నికల ఫలితాలు చెప్పిన విషయం వేరుగానే ఉంది.
మతమార్పిళ్ళ నిషేధ చట్టం అమల్లో ఉన్నా మతమార్పుళ్ళు విపరీతంగా జరుగుతున్న గుజరాత్ గిరిజన ప్రాంతాల్లో గల 28 సీట్లలో భా.జ.పా కేవలం 8 సీట్లలో గెలిచింది. గత ఎన్నికల కంటే ఈ ప్రాంతంలో ఈసారే భా.జ.పా. అతి తక్కువ సీట్లను సంపాదించింది. నిజం చెప్పాలంటే గత ఐదు ఎన్నికల కంటే ఈసారి ఎన్నికల్లోనే భా.జ.పా రెండంకెల సీట్లను గెలిచింది.
ఇలా ప్రధాని, అతని ముఖ్యమంత్రులు, వాళ్ళ భార్యలు, ఎమ్మెల్యేలు, ఇతరత్రా నాయకులు ఎన్ని ’సెక్యులర్’ సర్కసుల్ని చేసినా, చేస్తున్నా వాళ్ళ పార్టీకి ఉన్న ’హిందూత్వ’ ముద్ర పోవడం లేదు. ఏ ఘనత వహించిన సెక్యులర్ వాదీ వీళ్ళకు కితాబునివ్వడం లేదు.
మైనార్టీ పెద్దల దృష్టిలో భా.జ.పా. గతి ఇలా ఉండగా, ఆ పార్టీ పట్ల హిందువుల దృక్పథం ఎలావుందో చూద్దాం.
2014లో విజయం సాధించి, ప్రధాని పదవీ స్వీకారం చేసిన వెంటనే వారణాసికి వెళ్ళి గంగా ఆరతికి హాజరైనప్పుడు విభూతి-చందనం పట్టీలతో ఉన్న మోడీ ఫోటో సోషియల్ మీడియాలో మూలమూలనా, ప్రతి ’హిందూత్వవాది’ టైమ్ లైన్‍లోనూ కనబడింది.
2017 నాటికి ’సెక్యులర్’గా మారిన మోడీ కేదార్‍నాథ్ దర్శనానికి వస్తే, అదే ఉత్సాహంతో ప్రతి సాధారణ ’హిందూత్వవాది’ ఆ ఫోటోలను పంచుకోవడం జరిగింది.
RTE చట్టంతో హిందువులు నడిపే పాఠశాలలు మూతబడుతున్నాదసరా నాడు అమెరికాలో ఉన్నా, రష్యాలో ఉన్నా మా ప్రధాని ఉపవాసం ఉంటాడని మురిసిపోయి చెప్పుకున్నారు ’హిందూత్వవాదులు.’
“షాదీ షగున్” స్కీమ్ ఒక్క ముస్లిమ్ అమ్మాయిలకే అని చట్టం చేసినా, మదరాసులో జరిగిన తన సెక్రెటరీ బిడ్డ పెళ్ళికి వచ్చిన మోడీ చెప్పులు లేకుండా వివాహ వేదిక ఎక్కాడని తెగ ముచ్చటపడి ఆ వీడియోను వ్యాట్సాప్ లో పంపిన వాడికే పంపి, పంపి, పంపీ మరి మురిసిపోయారు సాధారణ ’హిందూత్వవాదులు.’
అఖలాక్ ఉదంతంతో దేశమే అతలాకుతలమయేట్టు విపక్షాలు చేసిన సందర్భంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగితే, ఒక్క ముస్లిమ్ అభ్యర్థినీ నిలబెట్టని నికార్సయిన ’హిందూత్వం’ మోడీ దని మురిసిపోయారు సామాన్య ’హిందూత్వవాదులు.’ (నిజానికి ఇది హిందూత్వమేమీ కాదు. భాజపా వేసిన ఫక్తు రాజకీయపు ఎత్తుగడ.)
ఎన్నికల వాగ్దానమైన ఉమ్మడి పౌర చట్టం గురించి నాలుగేళ్ళుగా ఒక్కమాట మాట్లాడని ప్రధానిని ఇంకా అభిమానిస్తున్న సామాన్య ’హిందూత్వవాదులు’ కోట్లలో ఉన్నారు.
హైకోర్టులు, సుప్రీమ్ కోర్టులు, వార్తా మాధ్యమాలు తమ పండుగల పై ఆంక్షలు విధిస్తున్నా, సంప్రదాయలపై వింత వ్యాఖ్యలు చేస్తున్నా, చీరకట్టుపై అసహ్యపు వీడియోలు తీస్తున్నా పల్లెత్తు మాట మాట్లాడని ’సెక్యులర్’ భాజపాని ’హిందూత్వ రక్షక’ పార్టీగా భుజాన మోస్తున్నవారు కోట్లలో ఉన్నారు.
ఆ పార్టీ ముఖ్యమంత్రి భార్య క్రిస్టమస్ సందర్భంగా “Be Santa” ప్రచారంకు ఊతమిస్తే రామనవమి, కృష్ణాష్టమి నాడు “Be Rama”, “Be Krishna” అన్న ప్రచారాలను ఎందుకు చెయ్యలేదని అడగకుండా ఉన్న సామాన్య ’హిందూత్వవాదులు’ కోట్లాదిగా ఉన్నారు.
అయినా సరే, ఇందరి ఆశల్ని వమ్ము చేస్తూ, ఓట్లు వేయడం అటుంచి ఒక మెచ్చుకోలు సైతం ఇవ్వని మైనార్టీ వర్గ నాయకుల దయాదాక్షిణ్యాలపై, కుహనా సెక్యులర్ల కృపా వీక్షణానికై మోడీ నుంచి మొదలుగొని గల్లీ లీడరు వరకూ ’సెక్యులర్’ వేషాలు వేస్తున్నారు. వారు చేస్తున్న ఈ కృత్రిమ నాటకానికి వంతలు పాడే అంధభక్తులు కొందరున్నారు. వీరు ట్విటరులోను, ఫేసుబుక్కులోనూ బ్లూటిక్కులు పెట్టుకుని టెక్కులు పోతుంటారు. ఇలాంటి వారిని వారి భావ దౌర్భాగ్యానికి వదిలేస్తున్నాను.
గత ఐదు ఎన్నికల్లో మూడంకెలు సాధించిన పార్టీ ఆరో ఎన్నికలో రెండంకెలతో సరిపెట్టుకోవలసి వచ్చిన సందర్భంలో, ఎందుకు భాజపా ’హిందూత్వ’ పార్టీగానే ఉండిపోకూడదు అన్న ప్రశ్న తలెత్తింది్ కొందరిలో.
ముఖ్యంగా ఎన్నికల ఫలితాల వెల్లడి మధ్యలో మోడీ చేసిన “జీతా వికాస్, జీతా గుజరాత్” ట్వీట్ నేపధ్యంలో ఈ ప్రశ్నను విశ్లేషించారు కొందరు.
ఈసారి గుజరాత్ ప్రచారంలో కాంగ్రెస్‍ను దుమ్మెత్తిపొయ్యడానికే సమయం వెచ్చించిన ప్రధాని ’వికాస్’ గురించి మాట్లాడిందే తక్కువ. అటువంటిది, ఫలితాలు అనుకూలించగానే ’వికాస’ మంత్రాన్ని పఠించడం కూడా అర్థం కాని కొందరు భాజపాకు బ్రహ్మకపాలంలా అంటుకునివున్న ’హిందూత్వ’ ముద్రపై ఆలోచించారు.
నా మిత్రుడు హరిప్రసాద్ www.medium.comలో వ్రాసిన The Aspirations of the Majority వ్యాసంలో పై ప్రశ్నను చాలా చక్కగా విశ్లేషించారు. ఆ ఆంగ్ల వ్యాసంలోని కొన్ని ముఖ్య భాగాల తెలుగు అనువాదం చదవండి.
“ప్రియమైన నరేంద్ర మోడీజీ, అమిత్ షా జీ.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల విజయానికి గానూ హార్దిక శుభాకాంక్షలు. చాలామంది రాజకీయ పండితులు గుజరాత్ ఎన్నికల్లో భాజపా చూపిన నీరస ప్రదర్శనకు “వికాస్” మంత్రమే కారణమని చెబుతున్నారు. వారిలా తలపండిన వ్యక్తిని కాను గనుక, గుజరాత్ గురించి ఎక్కువగా తెలీదు గనుక దీనిపై నేను వ్యాఖ్యానించదలచుకోలేదు. కానీ ఈసారి జరిగిన గుజరాత్ ఎన్నికల్లో మీరు “వికాస్” గురించి కాక ఇతర అంశాలపైనే ప్రచారాన్ని నడపడాన్ని నేను, నాలాంటి సామాన్యులు గుర్తించాము. కనుక పండితులు వెలిబుచ్చిన అభిప్రాయంలో కొంత నిజం లేకపోలేదని అనుకుంటున్నాను. మీరు చెబుతున్న వికాసం ఎక్కువగా ఆర్థిక విషయాలకు సంబంధించింది. వస్తు ఉత్పత్తికి సంబంధించింది. కానీ మనం మరమనుషులం కాము. అస్తిత్వంలేని జడపదార్థాలం కాము. మనకు ఆర్థిక వికాసంతో బాటు వేరే వికాసం కూడా కావాలి. చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు, విద్య, భాషలు – ఇలా ఎన్నో ముఖ్యమైన రంగాల్లో వికాసం కావాలి. ధర్మబద్ధమైన జీవనం కావాలి. మోక్షమనే నాలుగో పురుషార్థాన్ని నమ్ముకున్న నాలాంటి హిందువులకు ఈ దేశమొక్కటే బ్రతుకునిచ్చే స్థలం. ఇది మా కర్మభూమి. ఇక్కడే మా దేవుళ్ళు అవతరించారు. ఋషులు హితబోధలు చేసారు. ధర్మపరులైన రాజులు పరిపాలన చేసారు. మా పూర్వీకులు అందించిన సంస్కృతి, వారసత్వం, వివిధ భాషలు, ఆధ్యాత్మికత మొదలైనవాటిని మా ముందు తరాలకు అందించాలని మేము కోరుకుంటున్నాం. స్వతంత్ర భారతదేశ నిర్మాతలు ’మైనార్టీ’ల క్షేమమే తమ లక్ష్యమని భావించారు. మెజారిటీలైన హిందువులు మైనార్టీలపై దౌష్ట్యం చెలాయించకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో రాజ్యాంగం ద్వారా చట్టాలను చేసారు. సంస్థలను స్థాపించారు. గత డెబ్భైయేళ్ళుగా ఇది సాగుతూ వచ్చింది. ఘనతకెక్కిన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నాగారు “ఒక పరిణితి చెందిన వ్యవస్థలో మెజారిటీలకు రక్షణ అవసరంలేదు. ఎందుకంటే తమకు నచ్చిన ప్రతినిధుల్ని ఎన్నుకుని, వారి ద్వారా తమకు కావల్సిన దాన్ని సాధించుకోగలిగే అవకాశం మెజార్టీ వర్గానికే ఉంది.” అని అన్నారు. స్వాతంత్య్రం దొరికినప్పటి నుండీ మా విషయంలో పై మాటలు ఇసుమంతైనా ఫలించలేదు. గత డెబ్భై ఏళ్ళలో మేము మా దేవాలయాలను ప్రభుత్వపరం చేసాం. ఇప్పుడు మా పాఠశాలల్ని మూసేసుకుంటున్నాం. మా ఆచారాలను హేళన చేస్తున్నారు. మా పండుగల్ని కించపరిస్తున్నారు. మా ప్రాంతీయ భాషలను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాలు, కోర్టులు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. గతప్రభుత్వాలు ఏవీ జస్టిస్ ఖన్నా మాటల్ని నిజం చేయలేదు. నాలుగేళ్ళ క్రితం మీపైన, మీ పార్టీపైన నమ్మకంతో ఓటేసాం. మీ ఉత్థానాన్ని మా సంస్కృతీ వికాసంగా ఊహించుకున్నాం. మీ వరుస విజయాలను మా వికాసంగా సంతోషించాం. ఇదీ మీ 2014 సార్వత్రిక ఎన్నికల ఘనవిజయం వెనుక ఉన్న అసలు కారణం. ఇప్పటికీ మేము ఆశాభావంతోనే ఉన్నాం. మీ గెలుపును నిజం చేస్తూ వచ్చిన మమ్మల్ని మీరు నిరాశపరచరని భావిస్తున్నాం.”
ఇంతకంటే చక్కగా, సూటిగా, శషభిషలు లేకుండా వ్రాయగలగడం సాధ్యం కాదని నా అభిప్రాయం. కేవలం నాలుగంటే నాలుగే నిముషాలు పట్టే ఈ వ్యాసాన్ని తప్పక చదవండి.
హరిప్రసాద్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ, నేను చెప్పదల్చిన ముగింపు మాటలు ఇవే:
“మాలేగాంవ్ బాంబ్ పేలుళ్ళలో కర్నల్ పురోహిత్ మొదలైనవారిని అక్రమంగా ఇరికించి, ఆ నేరాన్ని మోపింది హిందువుల పైనే.
నిర్భయ మానభంగానికి, పురుషసూక్తానికీ ముడిపెట్టి హేళన కవితలు వ్రాసింది హిందువులపైనే.
అఖలాక్-దభోల్కర్-డా.కల్బుర్గి-గౌరీ లంకేశ్ హత్యలను చేసింది వేరేవారైనా నేరం మోపింది హిందువులపైనే.
త్రికోణ ప్రేమ కారణంగా రాజస్థాన్ లో ఓ ఉన్మాది చేసిన హత్యను హిందూ తీవ్రవాదంగా చిత్రీకరిస్తూ ఆ నేరాన్ని గంపగుత్తగా రుద్దుతున్నది హిందువులపైనే.
ఇంత జరుగుతున్నా నోరు మెదపని హిందూత్వ పార్టీ బిజెపినే.
బ్రహ్మకపాలంలా అంటుకున్న హిందూత్వ ముద్రను వదిలించుకోలేక, మరుజన్మకైనా దక్కని ’సెక్యులర్’ ముద్రకు తాపత్రయపడి ప్రధాని స్వరాష్ట్రంలో, పార్టీ అధ్యక్షుడి స్వస్థలంలో మూడంకెల నుండి రెండంకెలకు చేరుకున్నదీ భాజపానే.
తమపై ఎన్ని బరువుల్ని మోపినా, తమని ఫాసిస్టు మద్దతుదారులుగా అవహేళన చేస్తున్నా, అవమానాలు ఎదురవుతున్నా, భాజపాయే తమ ఆశాకిరణమని ఇంకా నమ్ముతున్న కోట్లాది సామాన్య ’హిందూత్వ’ ఓటర్లు కావాలా? లేక అడుగడుగునా అనుమానిస్తూ, అవకాశం దొరికినపుడల్లా అవమానిస్తూ, విదేశీ శక్తుల అడుగడుగులకు మడుగులొత్తే పిడికెడు ’మైనార్టీ’ నాయకుల కృపాకటాక్షాలు కావాలా? అన్నది తేల్చుకోవల్సింది భాజపాయే!
—–
2014 గడచిపోయియి దూరం వెళ్ళిపోయింది. 2019 ఎంతో దూరం లేదు. కానీ భాజపా మాత్రం కోట్లాది ’హిందూత్వ’ ఓటర్ల నుండి దూరం జరిగి, ఎన్నటికీ దగ్గరవని ’మైనార్టీ’ నేతల అనుగ్రహానికై అర్రులు చాస్తోంది.
కనుక భాజపాకు నేను చెప్పదలచింది ఇంతే – “2014 ఎన్నికలను మా బాధ్యతగా భావించాం. మా పాత్రను పోషించాం. 2019 మీ బాధ్యత. మీ పాత్రను మీరు పోషించండి. లేకుంటే ఉభయభ్రష్టత్వమే తలరాతగా మిగులుతుంది.“
తస్మాత్ జాగృత…జాగృతః
@@@@@@