ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొత్త లక్ష్యాలను పెట్టుకుంటారు. కొత్త నిర్ణయాల్ని తీసుకొని అమలు చేయాలనుకొంటారు. కొత్త ఆశయాల్ని ఏర్పరచుకుంటారు. కానీ, గణాంకాల ప్రకారం కేవలం 14 శాతం మాత్రమే వాటిని అమలు చేయడంలో కృతకృత్యులవుతూంటారు. మిగతా 86 శాతం ఎప్పట్లాగే వాయిదా పధ్ధతినే అవలంబిస్తూంటారు. ఈ నిర్ణయాలు ఆరోగ్యానికి, కెరీర్ కి, కుటుంబానికి సంబంధించినవి కానీ లేక మరేదైనా కావచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా బరువు తగ్గడమనేది ఈ కొత్త సంవత్సరపు నిర్ణయాల్లో మొదటిది. తరువాత ఉద్యోగ విషయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలను పాటించడం! ఉద్యోగం తెచ్చుకోవడం ఒక ఎత్తైతే, అది నిలబెట్టుకోవడం మరొకటి. కానీ, ఇప్పటి రకరకాల బూమ్ లతో (Software boom, BPO Boom, Retail boom etc.) ఉద్యోగం తెచ్చుకోవడం కాస్తంత సులభతరమైన విషయం మనందరికీ తెలిసిందే! అలాగే అది వదిలేసుకుని మరొకటి చూసుకోవడం కూడా!
SUBSCRIBE TO ANVESHI CHANNEL – ACCESS FACTUAL HISTORY
కానీ ఉద్యోగానికి సంబంధించినంత వరకూ ఎదుగుదల కోరుకునే వారు మాత్రం తమ ఆఫీసుల్లో పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రవర్తనలో తెచ్చుకోవలసిన మార్పులూ వంటి విషయాల గురించి ఇక్కడ చర్చించుకుందాం. ‘ఓ వ్యక్తి దృక్పథాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దగలిగితే అతని నైపుణ్యాన్ని అభివృధ్ధి చేసినట్టే‘ నంటారు అమెరికన్ మేనేజ్ మెంట్ పితామహుడు పీటర్ డ్రక్కర్.
ఉద్యోగంలో వృధ్ధి చెందాలనుకునే వారూ, మంచి జీతాల్ని కోరుకునే వారూ ఈ క్రింది ఏడు తప్పుల్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తుంచుకోవడం అవసరం అని అనుభవజ్ఞుల ఉవాచ.
మొదటిదీ, ముఖ్యమైనదీ గర్వం. దీనికీ అహంకారానికీ చాలా దగ్గరి సంబంధం ఉంది. చాలా మంది ఏదైనా విజయానికి తాము మాత్రమే కారణమని క్రెడిట్ తీసేసుకుంటారు. అది సాధించడంలో తమకి అందిన సహాయాన్ని, సహోద్యోగుల సహకారాన్ని ‘కన్వీనియంట్’ గా మర్చిపోతారు. ఇది కొలీగ్స్ లో అసంతృప్తిని కలిగించడమే కాకుండా అసలైన విజయాన్ని దూరం చేస్తుంది.
ఇందులోనే ఇంకో కోణం ఉంది. కొందరు పక్కవాడి విజయాల్ని గురించి మాత్రమే ఆలోచిస్తూ అసూయ పడుతూంటారు. అదీ తప్పే. ఇందువల్ల తమ పనుల్ని నిర్లక్ష్యం చేయడం — దాంతో చివాట్లు తినడం జరుగుతూంటుంది. ఇందుకు పరిష్కారంగా సహోద్యోగుల విజయాల్ని ప్రేరణగా తీసుకోవడం ఉత్తమం.
సుమతీ శతకకారుడు అన్నట్టూ ‘తన కోపమె తన శత్రువు‘. ఆఫీసులో కోపం వల్ల అనవసర వివాదాలూ, ఒత్తిడీ తప్ప ప్రయోజనం ఉండదు. కోపంలో వివేకం నశిస్తుంది. దాంతో ఎంతో కాలంగా కష్టపడి సంపాదించిన పేరు క్షణంలో తుడిచిపెట్టుకు పోతుంది. పని పట్ల అంకిత భావంతో ఉండే వారు సైతం కొన్ని సందర్భాల్లో కోపాన్ని జయించలేక పోతూ ఉంటారు. ఈ బలహీనత కారణంగా తోటి ఉద్యోగుల్లో అప్రతిష్ట పాలవడం జరుగుతుంది. కోపాన్ని నిగ్రహించుకోవడం , చెప్పదల్చుకున్న విషయాన్ని సున్నితంగా చెప్పగలగడం ఎంతో అవసరం.
ఉన్నత ఆశయాలు కలిగి ఉండటం మంచిదే అయినా ‘అతి సర్వత్ర వర్జయేత్‘ అన్నట్టూ వ్యక్తులు కేవలం తమ పనిని ‘చూపించుకోవడం’ లో బిజీగా ఉండి, చేయడంలో వెనుకబడతారు. ఇదీ మంచి లక్షణం కాదు. విజయానికి దగ్గరి దార్లు లేవన్న విషయం గుర్తిస్తే మంచిది.
మరో ముఖ్య లక్షణం సోమరితనం. ఇది నిర్లక్ష్యం వల్ల మొదలవుతుంది. అభివృధ్ధిని కోరుకునే వారు నిశ్చయంగా వదులుకోవలసిన గుణమిది. గతంలో తాము సాధించిన పనులూ, విజయాలూ ఎప్పటికీ యాజమాన్యానికి గుర్తుంటాయనుకోవడం అవివేకం. ఇప్పటి పోటీ ప్రపంచంలో ప్రతి రోజూ విలువైనదే. తమకి అప్పగించబడిన ప్రతి పనినీ తమ భవిష్యత్తు కేవలం ఆ పనిపైనే ఆధారపడ్డట్టూ చేయడం మంచిది. అది నిజం కావచ్చు కూడా!
చాలా మంది కార్పొరేట్ రంగంలో ఎంత త్వరగా ముందుకు దూసుకుపోతే, అంత ఘోరంగా చివర్లో అపజయం పాలవుతుంటారు. దీనికి కారణం కొత్త బాధ్యతల్ని తాము సవ్యంగా నిర్వర్తించగలమో లేదో బేరీజు వేసుకోకపోవడం. ఉద్యోగ నిర్వహణ, కుటుంబ బాధ్యతలూ మొదలైనవన్నీ పట్టించుకోలేక అనారోగ్యం పాలయ్యే వారెందరో! కాబట్టి బాధ్యతలు స్వీకరించే మునుపు తాము అందుకు సిధ్ధంగా ఉన్నారో లేరో తెలుసుకోవడం ముఖ్యం.
ఇతరుల విజయానికీ క్రెడిట్ కొట్టేయాలనుకోవడం , ఆఫీసులో తమ స్థానం పట్ల అసంతృప్తి మొదలైనవి ఒక వ్యక్తిలోని దృక్పథాన్ని పాడు చేస్తాయి. దాంతో అపకీర్తితో పాటు కెరీర్ తిరోగమనం మొదలవుతుంది.
ముఖ్యంగా కావలసింది ఉద్యోగం పట్ల కమిట్ మెంట్ , బాధ్యత. ఇవి కావలసిన పాళ్ళలో ఉండే వ్యక్తి అభివౄధ్ధిని ఎవరూ నిరోధించలేరు. పక్కవాడి విజయాన్ని గుర్తించి అభినందించగలగడంతో పాటు తమ విజయాలకై ఏకాగ్రతతో కృషి చేయడం లక్ష్య సాధనకు ఏకైక మార్గం.