ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

కాంక్రీట్ – కథ, వ్యథ

Like-o-Meter
[Total: 1 Average: 5]

కాంక్రీట్ కథ – వ్యథ

శబ్దచిత్రాన్ని ధ్వని పాడ్కాస్ట్ లో ఉచితంగా వినండి!

ఉపోద్ఘాతం:

ఈనాడు మానవాళి కాంక్రీట్ తో కట్టిన పట్టణాల్లో నివసిస్తోంది. అత్యధిక సంఖ్యలోని కట్టడాలు కాంక్రీట్ తోనే కట్టబడ్డాయి. ఎత్తైన ఆకాశహర్మ్యాలు మొదలుగొని చిన్న చిన్న ఇళ్ళ వరకూ అన్నీ కాంక్రీట్ నిర్మాణాలే. బయటకు ఇనుము లేదా రాయి లేదా కొయ్యలతో కట్టబడినట్టుగా కనబడే కట్టడాలు కూడా కాంక్రీట్ పునాదులపైనే నిలబడివున్నాయి.

ఈ నవీన ప్రపంచంలో కాంక్రీట్ సర్వంతర్యామి.

ఫ్లోరింగ్స్, సీలింగ్స్, రహదారులు, సొరంగ మార్గాలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ఆనకట్టలు, నీటిగొట్టాలు – ఇలా ఏ కట్టడం తీసుకున్నా అది కాంక్రీట్ వల్ల సాధ్యమయిందే గానీ వేరే వస్తువుల వల్ల కాదు.

కొన్ని కాంక్రీట్ గోడలు చరిత్ర ప్రసిద్ధి చెందాయి. ఉదాహరణకు 1961 నుండి 1989 వరకు తూర్పు, పశ్చిమ జర్మనీలను విడదీసిన బెర్లిన్ వాల్ ఓ కాంక్రీట్ కట్టడమే. అలానే ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశాన్ని పాలస్తీనా నుండి విడదీస్తున్నది కూడా ఒక కాంక్రీట్ గోడే!

ఇలా కాంక్రీట్ సర్వంతర్యామే కాదు సర్వకాలీయమైనది కూడా.

DON’T MISS TO WATCH THIS EXCITING HISTORICAL VIDEO ON ANVESHI CHANNEL

మనకు ఈ కాంక్రీట్ కొత్తదిగా కనబడుతున్నా ఇది ఎంతో పాతది. దీనికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పటికి 2,120 సంవత్సరాల క్రితమే రోమన్లు కాంక్రీట్‍ను వాడిన దాఖలాలు ఉన్నాయి. యూరోపు ఖండంలో అత్యంత ప్రాచీన కట్టడాలైన పాన్థియాన్, కొల్లోజియమ్‍లు కాంక్రీట్ తో నిర్మించబడ్డాయి.

అగ్నిపర్వతాల నుండి బయటకు వచ్చిన బూడిదను సున్నం మరియు నీటితో కలిపి, అలా కలపగా వచ్చిన పదార్థాన్ని వాడి కడితే కట్టడాలు భద్రంగా ఉంటాయని రోమన్లు కనుగొన్నారు. ఇదే ఈనాటి కాంక్రీట్‍కు పూర్వ రూపం.

ఇదేవిధంగా, భారతదేశంలో ’వజ్రలేపం’ అన్న పేరుతో కాంక్రీట్ కంటే గట్టిగా ఉండే పదార్థాన్ని తయారు చేసేవారు. ప్రాచీన ఆలయాల్లోను, ఇతర కట్టడాల్లోనూ ఈ వజ్రలేపాన్ని వాడేవారు. ఇందుకు ఉదాహరణగా కేదారనాథ్ ఆలయాన్ని చెప్పుకోవచ్చు. 2013లో వచ్చిన గంగానది వరదల్లో కాంక్రీట్ తో కట్టిన కొత్త కట్టడాలన్నీ కూలిపోయినా వెయ్యేళ్ళ పాతదైన కేదార్‍నాథ్ ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు. ఇందుకు కారణం ఆ ఆలయ నిర్మాణంలో వాడిన ’వజ్రలేపం’ అనే సంప్రదాయిక కాంక్రీట్.

ఇలా ప్రపంచంలో అనేక చోట్ల ఈనాటి కాంక్రీట్‍కు సమానమైన లేదా అంతకంటే పటిష్టమైన పదార్థాలను ప్రాచీనులు కనుగొన్నారు. అయితే, ఈ పాత కాంక్రీట్ వల్ల ప్రపంచానికి పెద్ద నష్టమేమీ కలగలేదు. దీనికి వ్యతిరేకంగా ఆధునిక సమాజాన్ని నిర్మించిన కొత్త కాంక్రీట్ తన సృష్టినే ధ్వంసం చేయబోతోంది.

ఎలా? ఎందుకు?

*****

కాంక్రీట్ – వివరాలు:

 

ఈనాడు భూమిపైన నీరు తర్వాత అతి ఎక్కువగా వాడుతున్నది కాంక్రీట్ నే.

ప్రపంచవ్యాప్తంగా, ప్రతి సంవత్సరం సుమారు 40,000 కోట్ల కిలోలీటర్ల నీటిని వాడుతారు. అలాగే, ప్రతి సంవత్సరం ప్రపంచంలో సుమారు 3,300 కోట్ల కిలోగ్రాముల కాంక్రీట్‍ను వాడుతున్నారు.

నీరు ప్రకృతి యొక్క సృష్టి.

కాంక్రీట్ మానవుడి మేధస్సు చేసిన సృష్టి.

నీరు ఒక కానుక. అనాది కాలం నుండి నీటి వల్ల మానవజాతి బ్రతికి బట్టకడుతోంది.

మానవసృష్టి అయిన కాంక్రీట్ కూడా ఒక కానుకే అనుకున్నారు. అయితే అది శాపంగా మారుతోందని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు.

కాంక్రీట్ తయారీలో ప్రధాన వనరు సిమెంట్. ఒక్క 2021 లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 4,400 టన్నుల సిమెంట్‍ను ఉత్పత్తి చేయడం మరియు ఉపయోగించడం జరిగింది. ఇందులో చైనా దేశం మొదటిస్థానంలో ఉంటే, భారతదేశం రెండవ స్థానంలో ఉంది.

ఇంతటి విశృంఖలమైన, విచ్చలవిడిగా సాగుతున్న కాంక్రీట్ ఉపయోగం వల్ల ఎన్నో ప్రమాదాలు పొంచివున్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. విపరీతమైన ఉత్పత్తి, వినియోగాల వల్ల కాంక్రీట్ కనబడని ఆటంబాంబ్‍గా మారుతోందన్నది విశ్లేషకుల అభిప్రాయం.

విచ్చలవిడిగా వాడుతున్న కాంక్రీట్ కోసం కొండల్ని పిండి చేసేస్తున్నాం. నదుల్ని పీల్చేస్తున్నాం. ఇసుకను మాయం చేస్తున్నాం. మొత్తానికి భూమి నివసించడానికి వీల్లేని కాంక్రీట్ గుట్టగా మార్చేస్తున్నాం.

ఇవి చాలదన్నట్టు సిమెంట్, కాంక్రీట్ ఉత్పత్తుల్లో విడుదలయ్యే కార్బన్ డైయాక్సైడ్ యొక్క ప్రభావం మరింత ఘోరంగా ఉండబోతోంది. ఒక్క కిలో సిమెంట్ నుండి అర కిలో కార్బన్ డైయాక్సైడ్ విడుదలవుతోంది. ఇప్పటివరకూ అత్యంత కాలుష్యమయమైన పరిశ్రమ అనుకున్న విమాన పరిశ్రమ కూడా సిమెంట్ పరిశ్రమ ముందు దిగదుడేపేనని లెక్కలు చెబుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా విమాన పరశ్రమ 2-3% వరకు కార్బన్ డైయాక్సైడ్‍ను విడుదల చేస్తోంది. దీనితో పోలిస్తే సిమెంట్ రంగం సుమారు 8% కార్బన్ డైయాక్సైడ్‍ను పర్యావరణంలోకి విడుదల చేస్తోంది.

కాంక్రీట్ లేనిదే ప్రగతి లేదు. కానీ కాంక్రీట్ ఉంటే ప్రకృతి ఉండబోదు.

మరిప్పుడు మనకు కాంక్రీట్ కావాలా? వద్దా?

****

కాంక్రీట్ – పర్యావరణ సవాళ్ళు

ఒకవైపు పర్యావరణ సమస్య పెరుగుతోంది. మరోవైపు కాంక్రీట్ వాడకం మరింత పెరుగుతోంది. ఈ రెండింటికి మధ్యన పొంతన కుదరడం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇందుకు కారణం కాంక్రీట్లో ఉండే కొన్ని గొప్పగుణాలే!

కాంక్రీట్ వాటర్ ప్రూఫ్, ఫైర్‍ప్రూఫ్ మాత్రమే కాదు చాల పటిష్టమయింది కూడా. ఒక ఉదాహరణను ఇవ్వాలంటే – సముద్రతీరాల్లో ఉండే నగరాలు, పట్టణాలు, పల్లెలు మొదలైనవి సముద్రపు అలల్లో మునిగిపోకుండా ఉండాలంటే ఒక్క కాంక్రీట్ గోడ వల్ల మాత్రమే సాధ్యం. అమెరికాలో 14% తీరప్రాంతం, చైనాలో 60% తీరప్రాంతం కాంక్రీట్ గోడలతో నిండివున్నాయి. చివరకు పేదదేశమైన నైజీరియాలో కూడా ఆ దేశంలోని అతిపెద్ద పట్టణమైన లాగోస్‍ను కాపాడుకోవడానికి ఐదు మైళ్ళ పొడవైన కాంక్రీట్ గోడను సముద్రతీరంలో కడుతున్నారు.

మరి ఇంతటి ఉపయోగం ఉన్న వస్తువును ఎవరు వదులుకోగలరు?

ఇదే విషయంగా ప్రపంచంలోని ఆర్కిటెక్ట్లు వర్గాలుగా విడిపోయారు. కొందరు కాంక్రీటును వాడల్సిందే అని అంటున్నారు. కొందరు వద్దంటున్నారు. మరికొందరు ఇంకేవైనా వేరే వస్తువుల్ని కనిపెట్టాలని అంటున్నారు. ఏదిఏమైనా కాంక్రీట్ యొక్క వినాశక శక్తి పెద్ద దుమారాన్నే లేపుతోంది.

ఇంతకూ కాంక్రీట్ వల్ల కలుగుతున్న లేదా కలగబోయే ప్రమాదాలేవి?

అమెరికాకు చెందిన మార్షల్ దీవిలో “The Tomb” అని పిలిచే పెద్ద కాంక్రీట్ కట్టడం ఉంది. ఈ కట్టడం లోపల ఉండేది అణుబాంబు పరీక్షవల్ల కాలుష్యమైన మట్టి. రెండో ప్రపంచయుద్ధం నుండి ఇప్పటి వరకూ అమెరికా సుమారు 67 అణుపరీక్షల్ని నిర్వహించింది. ఈ పరీక్షల వల్ల కలుషితమైన నేల చుట్టూ కట్టబడినదే ద టోంబ్ అనే అతి పెద్ద కాంక్రీట్ సమాధి.

The Tomb in Marshall Islands, USA

సైన్స్ లెక్కల ప్రకారం ఆధునిక కాంక్రీట్ యొక్క వయసు – 100 సంవత్సరాలు. ఆ తర్వాత కాంక్రీట్ కూడా, అన్ని పదార్థాల్లానే, నశించడం మొదలుపెడుతుంది. అలా చూస్తే ద టోంబ్ లో అమెరికా నింపివున్న అణు కాలుష్యం పూర్తిగా కరిగిపోవడానికి 24,000 సంవత్సరాలు పడుతుంది. మరి వందేళ్ళ ఆయుష్షువున్న కాంక్రీట్ కట్టడం కూలిపోతే అమెరికా గతి ఏమి? ప్రపంచం పరిస్థితి ఏమి?

****

కాంక్రీట్ వ్యథ:

కాంక్రీట్ అతి ఎక్కువ కాలం నిలిచే గట్టి పదార్థం అన్నది కేవలం కల్పన మాత్రమే అని కొత్త పరిశోధనలు తేలుస్తున్నాయి.

సైన్స్ ప్రకారం కాంక్రీట్ అనేది ఘనీభవించిన ద్రవం మాత్రమే. అదొక లిక్విడ్ రాక్. ప్రకృతిసహజమైన రాయి తయారవడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. కానీ కాంక్రీట్ కొన్ని గంటల్లోనే తయారవుతుంది. కాంక్రీట్ కూడా రాయిలానే శాశ్వతంగా ఉండిపోతుందని మొదట్లో భావించారు. కానీ అది తప్పని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

ఇప్పుడు ప్రపంచమంతా కాంక్రీట్ కల్చర్ వ్యాపించిపోయింది. భూమిపైని ప్రతి అంగుళం కాంక్రీట్‍తో కప్పబడిపోతోంది.

***

కాంక్రీట్ కల్చర్:

కాంక్రీట్ కల్చర్ ఇలా పాకిపోవడానికి కారణం అమెరికా దేశమని 1913లోనే డయానా మార్టినేజ్ అనే రచయిత్రి చెప్పింది.

అమెరికా సినిమాలు, టివీ షోలు, పత్రికలు మొదలైనవి కాంక్రీట్‍ను ఒక మహిమాన్విత పదార్థంగా వర్ణించిన విధానాన్ని డయానా మార్టినేజ్ తను వ్రాసిన “కాంక్రీట్ కొలోనియలిజమ్” అన్న పుస్తకంలో వివరించింది.

మరి మహిమాన్వితమైనదిగా అనుకున్న కాంక్రీట్ ఎందుకు ప్రమాదకరంగా మారుతోంది?

****

కాంక్రీట్ – బలం, బలహీనత:

కాంక్రీట్‍కున్న బలం కాంక్రీట్‍ది మాత్రమే కాదు. కాంక్రీట్‍తో బాటు వాడే ఇనుము కడ్డీలది. ఇనుప కడ్డీలతో కలిపి వాడే కాంక్రీట్‍ను రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటారు. ఇలా తయారు చేసిన reinforced concrete చాలా పటిష్టంగా ఉంటుంది. కానీ కాంక్రీట్ యొక్క టెన్సైల్ స్ట్రెంగ్త్ చాలా తక్కువ. అంటే అది త్వరగా పగిలిపోతుంది. అందుకనే ఇనుప కడ్డీలను వాడేది.

అయితే ఇనుముకు కూడా ఒక బలహీనత ఉంది. అదే తుప్పుపట్టడం. Carbonation క్రియవల్ల ఇనుము తుప్పు పడుతుంది. ఎలాగైతే చెదలు కొట్టిన చెక్క తొందరగా నశిస్తుందో అదేవిధంగా తుప్పు పట్టిన ఇనుము త్వరగా వంగిపోయి, విరిగిపోతుంది.

ఇలా కాంక్రీట్‍లోని బలహీనత, ఇనుములోని బలహీనత – ఈ రెండూ చేరి reinforced concrete తో కట్టిన కట్టడాలను ప్రమాదకరమైనవిగా చేస్తున్నాయి. కాంక్రీట్‍తో కట్టిన భవనాల్లోను, ఇళ్ళలోను కనిపించే పగుళ్ళు కాంక్రీట్-ఇనుము యొక్క బలహీనతలకు ఆనవాళ్ళని పరిశోధకులు చెబుతున్నారు.

ఇలా ఎన్ని బలహీనతలున్నా, ఎంత పర్యావరణాన్ని పాడుచేస్తున్నా కాంక్రీట్‍ను కాదని బ్రతకలేమని మానవ సమాజం భావిస్తోంది.

ఒకప్పుడు మట్టి, రాయి, చెక్క వంటి ప్రకృతిసహజమైన పదార్థాలతో తయారైన ఇళ్ళను కట్టుకున్న మానవులు ఇప్పుడు కాంక్రీట్ అనే కృత్రిమరాయికి బానిసలైపోయారు. సహజసిద్ధమైన పదార్థాలతో ఇళ్ళు కట్టే నైపుణ్యం ఇప్పుడు దాదాపు మాయమైపోయింది. అటువంటి నిపుణులు అక్కడక్కడా ఉన్నా వారిని తీసుకువచ్చి పనిచేయించడం కష్టమైపోతోంది.

పర్యావరణ ప్రేమికులు ఎవరైనా పరసరస్నేహి ఇంటిని కట్టాలని భావించినా ఖర్చుకు జడిసి పారిపోతున్నారు. అదే కాంక్రీట్‍తో అయితే తక్కువ ఖర్చులో, తక్కువ కూలీలతో, త్వరగా ఇంటిని కట్టేసుకోవచ్చు.

ఈవిధంగా కాంక్రీట్ అనే పదార్థం కళాత్మక విలువల్ని పణంగా పెట్టి, పెట్టుబడిదారి విధానానికి పునాది అయింది.

ఏది ఏమైనా, ఎలావున్నా, ఎప్పటికైనా సరే మానవులు ప్రకృతి ముందు తలవంచాల్సిందే! ఆ ఎప్పుడు అన్నది ఇప్పుడే మనకు తెలియదు!

*****