ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

గుణనిధి వృత్తాంతం – సామాజిక అంశాలు

Like-o-Meter
[Total: 5 Average: 3.8]

 

గుణనిధి వృత్తాంతం శ్రీనాధుడు రాసిన కాశీఖండం అనే గ్రంధంలో శివరాత్రి మహత్మ్యం అధ్యాయం లోనిది.

దీనికి మూలకథ సంస్కృతంలో ఉన్నా, నిడివిపరంగా అది శ్రీనాధుడు రాసిన దాని కన్నా చాలా చిన్నది. సంస్కృత మూలానికీ, శ్రీనాధుడి కాలానికీ పదిహేను శతాబ్దాల అంతరం ఉంది. అంటే, శ్రీనాధుడు సంస్కృత మూలాన్ని మించి సమాజానికి ఇంకేదో చెప్పాలనుకుని దీని నిడివి పెంచి ఉండాలి.

క్లుప్తంగా కథ:

రాజాస్థానంలోనూ, పురజనుల్లోనూ అపార గౌరవ మర్యాదలు, సౌకర్యాలకు కొరతలేని ఆదాయం పొందే ఒక మహాపండితుడైన సోమయాజి సంతానం ఈ గుణనిధి.

ఒక్కగానొక్క కొడుకు, డబ్బుకు కొరత లేదు. తండ్రికి కొడుకు చదువు పట్టించుకొనే తీరిక లేదు. తల్లికి గారాబం. ఈ వాతావరణం వల్ల గుణనిధి చదువుకీ, క్రమశిక్షణకీ దూరంగానూ, చెడుసావాసాలకూ, వయసుతో పెరిగే వ్యసనాలకూ దగ్గరగానూ చేసింది.

తల్లికి కొడుకు ప్రవర్తన తెలిసినా గారాబం వల్ల ఎప్పటికప్పుడు కొడుకుకి డబ్బు ఇచ్చేది. అదే సమయంలో కొడుకు చెడుప్రవర్తనని తండ్రికి తెలియకుండా నెట్టుకొచ్చేది.

గుణనిధి యవ్వన వయస్కుడయ్యాడు. వయసుకి తగ్గ అలవాట్లూ అబ్బేసాయి.

ఒకరోజు సోమయాజి ఇంటికి వస్తూ, ఒకడి చేతి వేలికి వజ్రపుటుంగరం ఉండటం చూస్తాడు. కనురెప్పవెయ్యకుండా కొంచెంసేపు చూసి, అది తనకు రాజుగారు ఇచ్చిన కానుకగా పోల్చుకొని, ఆవ్యక్తిని పిలిచి “ఇది నీకు ఎలా వచ్చిందో చెప్పకపోతే రాజుగారి వద్దకు తీసుకెళతాను” అని బెదిరిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, తాను గుణనిధి నుండి జూదంలో పందెంగా ఈ ఉంగరం గెలుచుకున్నని చెప్పటమే కాక, గుణనిధికి ఉన్న ఇతర వ్యసనాలు కూడా తెలియజేస్తాడు.

చివరగా ఆ వ్యక్తి సోమయాజితో “యజ్ఞం చేయించుటలో మీరెంత నిపుణులో జూదంలో మీ అబ్బాయి అంతే నిపుణుడు!” అని కూడ చెప్తాడు.

ఇంటికి వచ్చిన సోమయాజి కొడుకు ఆ ఉంగరాన్ని ఇంట్లోంచి దొంగిలించాడు అని తెలుసుకొని అటువంటి కొడుకు తనకు అవసరం లేదు అనుకొని కొడుకుని ఇంట్లోంచి వెళ్ళగొట్టి, పిండప్రదానం కూడా చేసేస్తాడు.

ఇంటినుంచి వెళ్ళగొట్టబడిన గుణనిధి ఆకలితో రోజంతా గడపటమూ, చివరకు ఆకలికి తట్టుకోలేక గుళ్ళో ప్రసాదం దొంగిలించటం కోసం రాత్రంతా మెలకువగా ఉండటమూ, తెల్లవారుఝామున ప్రసాదం దొంగిలించే ప్రయత్నంలో కాపలాదారులకు పట్టుబడి, వారు కొట్టిన దెబ్బలతో చనిపోవటం జరుగుతుంది. ఇది కథలో సింహభాగం.

ఇందులో చిట్టచివర ఉన్న భక్తి అంశం ఏమిటంటే, గుడిలో రాత్రంతా ఆకలితో, మెలకువగా ఉండటం యాదృచ్ఛికంగా ఆరోజు శివరాత్రి పర్వదినం కావడం. తనకు తెలియకుండానే శివరాత్రి ఉపవాసం, జాగరణ పూర్తిచేయటం, దైవసన్నిధిలో గడపటం జరిగిపోయాయి.

గుణనిధి ప్రాణం పోగానే, జన్మంతా చేసిన పాపాలు లెక్కించిన యమధర్మరాజు అతణ్ణి నరకానికి తీసుకురావటానికి యమభటులను పంపితే, శివరాత్రి ఉపవాస, జాగరణ పుణ్యం వల్ల శివభటులు వచ్చి యమభటులను అడ్డగించి అతణ్ణి కైలాసానికి తీసుకెళ్ళటంతో కథ ముగుస్తుంది.

డబ్బూ, పలుకుబడి పుష్కలంగా ఉండీ, కొడుకు కోసం సమయం ఇవ్వల్లేని తండ్రి.

అతి గారాబం చేస్తూ కొడుకు అవలక్షణాలను భర్త దగ్గరా దాచే తల్లి, అతిప్రేమ, మితిమీరిన నమ్మకంతో, నాకొడుకు బంగారం అంటూ తనను తాను ఆత్మవంచన చేసుకుంటూ, కొడుకు జీవితాన్ని చేజేతులారా నాశనం చేసిన తల్లి.

ఫలితంగా యవ్వన తొలిదశవరకూ విశృంఖల జీవితం గడిపి, ఇంటినుండి వెళ్ళగొట్టబడి తిండికి కూడా దొంగతనం చేయవలసిన దుర్భర స్థితిలో అర్దాంతరంగా జీవితం ముగిసిన కొడుకు.

పదిహేనో శతాబ్దంలో ఇంతకు మించిన సామాజిక కథ ఏముంటుంది?

కథలో ఖచ్చితంగా పేర్కోనప్పటికీ గుణనిధి చనిపోయేనాటికి వయసు ఇరవై లోపే. గుణనిధి కథలో చివరి అంకం (మోక్షం)ను తీసేస్తే, దొంగతనం వరకూ పరిగణిస్తే, నాస్తికకోణంలో చూసినా ఎటువంటి అభ్యంతరాలు ఉండక్కర్లేని ఫక్తు సామాజిక కథ.

శ్రీనాధుడు ఈ కథలో సమాజానికి ఏమి చెప్పాలనుకున్నాడు?

ఒకవేళ శివరాత్రిరోజు ఉపవాస జాగరణల గొప్పతనమే చెప్పాలనుకుంటే, ఇదే నిడివిలో పదిమంది పాపాత్ముల కథలను చెప్పేసి, అందరికీ శివరాత్రి మహత్మ్యంతో మాఫీ చేసేసి మోక్షం ప్రసాదించగలడు. ధూర్జటి కవి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వరుడి మహత్మ్యంలా పూర్తిగా భక్తిరస ప్రధానంగా మలచేవాడు.

ఇక్కడ మనం శ్రీనాధుడికీ ఇతర కవులికీ ఉన్న సామాజిక నేపధ్యంలోని తేడా పరిశీలించాలి.

మన కవుల్లో చాలామంది పూర్తిస్థాయి కవులు. అంటే రచన తప్ప ఇతర బాధ్యతలు లేనివారు. శ్రీనాధుడు మాత్రం రాజాస్థానంలో విద్యాధికారి. ఇప్పటి ప్రభుత్వ వ్యవస్థలో విద్యాశాఖామంత్రి లేక కార్యదర్శి ఉన్నట్లుగా ఆ ఇద్దరి అధికారాలూ, బాధ్యతలూ కూడా శ్రీనాధుడివే.

ఈ హోదాలో అనేక గురుకులాలు చూసి ఉంటాడు. అందులో చదువు అబ్బని రాజోద్యోగుల పిల్లలూ, పండితుల పిల్లలూ, వ్యసనాల బారిన పడిన ప్రముఖుల పిల్లలూ ఉండివుంటారు. తమ పిల్లలు అటువంటివారని తెలియని తండ్రులనూ చూసివుంటాడు. తండ్రులకు అలా తెలియకపోవటంలో తల్లులపాత్ర, ఇలాంటీ అన్ని వివరాలూ గురువుల స్వానుభవాలుగా స్వయంగా విని ఉంటాడు. మిగతా కవులతో పోలిస్తే వీటిని దగ్గరగా చూసే అవకాశం ఉన్న పదవిలో ఉండటం వల్ల కలిగింది.

ఇంకో ప్రశ్న వస్తుంది. పలనాటి వీరచరిత్ర కూడా శ్రీనాధుడే రాసాడు. అది “పాడౌను దేశంబు పగ మించితేనూ…” అంటూ సరళంగా సూటిగా సాగుతుంది. గుణనిధి వృత్తాంతాన్ని అలా సూటిగా స్పష్టంగా చెప్పకుండా శివరాత్రి మహత్యానికి ఎందుకు కట్టేసినట్టు?

ఆలోచిస్తే తట్టేదేమిటంటే – పలనాటి చరిత్ర రాసేనాటికి శ్రీనాధుడి వ్యక్తిగత జీవితంలో వైభవాలు తగ్గాయి. సామాన్య జనాలను బాగా దగ్గరగా చూసే దశ. అందుకే అక్షరజ్ఞానం లేనివారికి కూడా అర్దమయ్యే గేయంలా రాసాడు. కానీ శివరాత్రి మహత్యం రాసేసరికి రాజప్రముఖులతోనూ కవిపండితులతోనూ గౌరవాలందుకొనే ఉచ్ఛదశలో ఉన్నాడు. అందుకే అందులో చందోబద్ధత.

మరి భక్తి రసాన్ని ప్రధాన దినుసులా చేసి సామాజిక విషయం చెప్పటం ఎందుకు?

ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా దైవభక్తిదే ఆధిపత్యం. నాస్తికత్వం, హేతువాదం ఆచరించిన కుటుంబాల్లోకి కూడా మూడోతరం నాటికి దేవుడు ప్రవేశించేస్తాడు. అందువల్ల పదహారణాల సామాజిక కథను కూడా పదిహేను అణాలకి కుదించి, పదహారో అణా భాగం దైవభక్తితో పైన పూత పూసేస్తే అది పదహారణాల భక్తి కథలా భావింపబడి, జనసామాన్యానికి నోళ్ళలో నానుతుంది.

అందులో కీర్తించిన దేముడికి భక్తులున్నన్నాళ్ళు ఆ కథకి శాశ్వతత్వం కలుగుతుంది. పూజాగదుల్లో తాళపత్ర గ్రంధాల్లో రక్షించబడ్డా, తరువాతి తరాల్లో అర్ధం చేసుకున్నవారికి అర్ధం చేసుకున్నంతగా మిగిలిపోతుంది.

పురాణ కాలక్షేపాల్లో సామాన్యులకు ఈ కథ చెప్పే పండితులు తమకు అర్ధమైన మేర సామాజిక సందేశాన్ని అందిస్తూనే ఉంటారు.

నేటి సమాజంలో గుణనిధులూ, తల్లిదండ్రులు

నేటి సమాజంలో అనేక మంది గుణనిధులూ, వారి తల్లితండ్రులూ కనపడతారు. కథలో కొంచెం తేడాతో అలాంటి సినిమానే “దృశ్యం.”

ఇందులో గారాబం చేసే తల్లే డబ్బూ అధికారం ఉండి కొడుకు కోసం సమయం కేటాయించలేని పోలీసు అధికారిణి. కొడుకు అవలక్షణాలు బయటపడ్డ తరువాత కూడా కొడుకు కోసం తాపత్రయ పడింది. కొడుకు వల్ల కష్టపడిన బాధితులను మరింత బాధించింది.

ఈరోజు డబ్బూ పలుకుబడి ఉన్న అనేక మంది తల్లిదండ్రులు, తమ పిల్లలు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ఇతరుల మరణాలకు కారణమైనా, మద్యం మైకంలో, అధికార మదంతో ఎవరిని బాధించినా పట్టించుకోకుండా ఉండటమే కాక, ఒకవేళ ఆ తప్పుల మూలంగా తమ పిల్లలు దోషులుగా నిలబడితే, తల్లిదండ్రులు స్వయంగా పోలీసు స్టేషన్లలో పంచాయితీలూ, నిందితులతో బలవంతపు రాజీలూ చేస్తూ, తమ పిల్లలకు ‘ఇలాంటివి ఎన్నిచేసినా నీవెనుక మేమున్నాం‘ అనే భరోసా ఇవ్వటం మనం అనేక వార్తల్లో చూస్తున్నాం.

పోనీ సమాజం ఏమైనా పరిణితితో ఆలోచిస్తోందా అంటే, ఇదే నిర్లక్ష్యంలో, కోటిరూపాయల కార్లోనో, ఇరవైలక్షల రూపాయల బైకు మీదనో అర్ధాంతరంగా జీవితాలు చాలించే ముద్దుబిడ్డల పట్ల చూపించే జాలిలో వందోవంతైనా అది ఆపెద్దల స్వయంకృతం. ఆ పిల్లలు బ్రతికి ఉంటే వారి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అమాయకులు చనిపోయేవారేమో అని నిర్మొహమాటంగా అనలేని వాతావరణం ఈనాటి సమాజంలో ఉంది.

కొడుకు అవలక్షణాలు తెలుసుకోకపోవటంలో సోమయాజిది తప్పు. అలా భర్తని అజ్ఞానంలో ఉంచటంలో సోమయాజి భార్యది తప్పు. ఇద్దరూ దానికి తగ్గ మూల్యం చెల్లించారు. కానీ, సోమయాజికి వాస్తవం తెలియగానే కొడుకుని త్యజించటం ద్వారా కనీసం ఆ విషయంలో నైతికంగా పరిణితి చూపించిన పాత్ర. ఈ లక్షణం వల్ల సోమయాజి వ్యక్తిత్వం ఈనాటి వీఐపీ తల్లిదండ్రుల కన్నా వందల రెట్లు ఉన్నతమైనది చెప్పవచ్చు.

*****