ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఇద్దరు బిడ్డల తెలుగుతల్లి

Like-o-Meter
[Total: 0 Average: 0]

ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు దోశె వేసినంత సులభం కాదు. అన్ని పక్షాలతో చర్చించాలి. ఏకాభిప్రాయం సాధించాలి. ఆ పిమ్మటే, తెలంగాణా గురించి ఆలోచించగలం. 2009 డిసెంబరు ప్రకటన దరిమిలా కాంగ్రెస్ రాష్ట్ర, దేశ రాజకీయ పార్టీలను అనేక విధాలుగా ఇరుకున పెట్టి, వాళ్ళ అభిప్రాయమైతే తీసుకుంది కానీ, తన అభిప్రాయాన్ని ప్రకటించలేదు. దాదాపు 4 సంవత్సరాలు పైగా ఊరించి, రాష్ట్రంలో గందరగోళం సృష్టించి, ప్రజల మధ్య వైషమ్యాలు మరింత పెంచి, ఎట్టకేలకు నిన్న తన అభిప్రాయాన్ని, యు.పి.ఎ. సమన్వయ కమిటీ అభిప్రాయాన్ని వెలువడించింది. పది జిల్లాలతో, పది సంవత్సరాల ఉమ్మడి రాజధానితో కొత్త రాష్ట్రాన్ని ప్రతిపాదించింది.  ప్రత్యేక తెలంగాణాకు మొదటి నుంచి సహానుభూతి వ్యక్తం చేస్తున్న వ్యక్తిగా నాకు చాలా సంతోషం కలిగించే విషయమె. 

కానీ, ఈ నిర్ణయం ఆషామాషీగా తీసుకున్నది కాదని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నా, ఇది ఎన్నికలవేళ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంగానే అందరూ భావిస్తున్నారనేది నిజం. గత నాలుగు సంవత్సరాలుగా, అటు తెలంగాణా ఉద్యమనేతలను, ఇటు సమైక్యాంధ్ర నేతలను కలుసుకోటానికే విముఖత చూపించిన అధినేత్రి గత నెలరోజుల్లోనే హఠాత్తుగా ఇటువంటి కీలక నిర్ణయం తీసుకోవటంలో ఎన్నికల రాజకీయాలు లేవని ఎవరూ చెప్పలేం. వివిధ జాతీయ మీడియాలలో వెలువడుతున్న ఎన్నికల సర్వే ఫలితాలతో ఆంధ్రలో చావుతప్పి కన్నులొట్టబోయే పరిస్థితుల నుంచి తప్పించుకోటానికి ఇప్పుడు తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ వాడుకుంటున్నదనేది సుస్పష్టం.

అకస్మాత్తుగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం, మరోసారి ఆంధ్రప్రదేశ్ ను పెనం మీద నుంచి నిప్పుల కుంపట్లోకి తోయబోతున్నదనేది కూడా సీమాంధ్రలలో రగులుతున్న సమైక్య ఆందోళనలు ఋజువు చేస్తున్నాయి. తెలంగాణా ప్రజల ఉద్యమం తీవ్రంగా ఉన్న రోజుల్లో, ఈ ఉద్యమాన్ని ఎదుర్కోటానికి సీమాంధ్రలలో నామ్ కె వాస్తే రాజకీయ ఉద్యమాలు సీమాంధ్ర నేతలు నిర్వహించారు. అప్పటి సమైక్యాంధ్ర ఉద్యమం రాజకీయుల ఉద్యమమే కానీ, ప్రజల ఉద్యమం కాదని స్పష్టంగానే తెలుస్తూనే ఉండేది. కానీ, నిన్నటి కాంగ్రెస్ తీర్మానం తర్వాత సీమాంధ్రలలో రాజకీయులను మినహాయించి ప్రజా ఉద్యమమే మొదలయ్యే సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. నేటి సీమాంధ్ర నిన్నటి తెలంగాణాలా అగ్నిగుండమయ్యే పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి.

ఏ మాటకు ఆ మాట మాట్లాడుకుంటే, రాష్ట్ర విభజనలో ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా కాంగ్రెస్ పరిస్థితి ఉన్నదనేది నిజమే. కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం వచ్చే పరిస్థితుల్లో ఏం చేయాలనేది ఎవరినైనా ఇరుకున పెడుతుందనేది వాస్తవం. సరిగ్గా, ఇక్కడే రాష్ట్రంలో నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తున్నది. అటు తెలంగాణాలోనైనా, ఇటు సీమాంధ్రలోనైనా ప్రజలకు దిశానిర్దేశం చేయగలిగే నాయకుడే లేడు. ప్రజల గౌరవాభిమానాలు అందుకోగలిగే నాయకుడే లేడు. లేకపోగా, ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే నాయకుల గుంపు మాత్రం మొసలి కన్నీళ్ళు కార్చేస్తున్నాయి.

తెలంగాణాలో అభివృద్ధి ఏ స్థాయిలో ఉన్నదనే గణాంకాలు విప్పి చెప్పేవారే కానీ,  వీళ్ళల్లో ఒక్కరైనా, ఏనాడైనా సీమాంధ్రల్లో పారిశ్రామికీకరణకు ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారా? లేదు. ఇకపైగా, వాళ్ళ వ్యాపార పెట్టుబడులు కూడా హైద్రాబాదుకే పరిమితం చేసారు. ఈరోజు తెలంగాణాలో చెప్పుకోటానికి ఒక హైద్రాబాదైనా ఉంది. మరి సీమాంధ్రలో ఏముంది? అరకొర వసతులతో ఉండే విశాఖపట్నం తప్పించి? తెలంగాణా ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనైనా సీమాంధ్ర అభివృద్ధికి దోహదపడే నిర్ణయాలు అటు ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు, ఇటు రాజకీయ వ్యాపారులు ఎందుకు తీసుకోలేదు. అప్పుడే ఒక ప్రత్యామ్నాయ పరిస్థితుల గురించి ఎందుకు ఆలోచించలేదు.

ఏదేమైనా, తెలంగాణా సీమాంధ్రలు రెండూ రాజకీయ నాయకుల చేతుల్లో వంచితులైన తెలుగుతల్లి ముద్దు బిడ్డలే. ఇప్పటికైనా, ఈ అరాచకీయ అవశేషాల నుండి రెండు ప్రాంతాల ప్రజలు తెప్పరిల్లి ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి సౌధాలు నిర్మించుకుంటే తెలుగుతల్లి సంతోషిస్తుంది.

(వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయితవే. వీటికి ఆవకాయ.కామ్ కు ఎటువంటి సంబంధమూ లేదు)