ప్రపంచంలోని ముఖ్యమైనవన్నీ మూర్తివంతమైనవి. ఉదాహరణలకు ఆకాశం. సముద్రం, కొండలు, నదులు ఇల్లా. ఇవెంత మూర్తివంతమైనవంటే ఆ పదం వినగానే మనసులో వొక రూపం తడుతుంది. దానికెల్లాంటి వివరణలూ అవసరం లేదు.
అల్లానే కవిత్వం కూడ మూర్తిమంతమైందే. ఇందులోని పదాలు, భావాలు నేరుగా చదువర్ల మనస్సులకు తట్టాలి. గానీ ఇది అంత సులభమైంది కాదు. మనిషి స్థాయీభావాలు అమూర్తాలైనవి. కోపం, బాధ, ప్రేమ, తపన వగైరాలు. ఇవి అర్ధమైనట్టే వుంటాయ్ గానీ మనిషి నుంచి మనిషి అర్ధాలు మారిపోతాయి. వొకరి కోపం మరొకరికి అసమంజసంగా తోచొచ్చు. కవిత్వం ఇల్లాంటి అమూర్తభావాల చుట్టూనె తిరుగుతూంటుంది కాన కవిత్వంలో మూర్తిమంతంగా చెప్పడమన్నది అంత సులభం గాదు.
అక్షరాలు అమూర్తాలు. అ అంటే మనకు యేవీ స్ఫురించదు. అంచాత అక్షరాల్ని కూర్చేగానే దానికో రూపాన్నిచ్చినట్టుగాదు. కవి జేయాల్సిన ముఖ్యమైన పని, అక్షరాలకున్న సామాన్యార్ధాల్ని తీసిపారేసి కొత్త అర్ధాల్ని ఇవ్వడం. దానిగుండా కొత్త ఊహల్ని, కొత్త లోకాల్ని పరిచయం చేయగల్గడం. ఇంత కష్టపడినా కవి తన ప్రాధమిక కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహించాడనే చెప్పాలని అక్కిరాజు ఉమాకాంతం చెప్తారు.
మరి యెల్లా కవిత్వానికి రూపాన్నివ్వాలి?
కవిత్వానికి రూపాన్నిచ్చేవే పదచిత్రాలు (imageries). పేరుకు తగ్గట్టుగానే ఇవి మూర్తమైనవి (concrete). వీటిల్ని చదవాగానే మనస్సుకొక రూపం తట్టుతుంది. వీటికి వ్యతిరేకమైనవన్నీ అమూర్తాలు (abstract).అమూర్తాలు కవిత్వానికి రూపాన్నివ్వకపోవడమే గాక కవిత్వాన్ని ఆచ్ఛాదిస్తాయి. దాంతో కవిత్వం కాస్త ఈజిప్టు మమ్మీలా తయారౌతుంది.
ఒక ఉదాహరణ:
“ప్రేమ తీయనైనది”
“ప్రేమొక స్వీట్ బాక్స్”
మనిషి జీవితంలో రెండు ముఖ్యమైనవి గమనించాలి. వొకటి భావాలు(ఉద్వేగాలు) రెండు శారీరిక స్పందనలు. మొదటిది మనో సంబంధమైంది. ఇది అమూర్తం. రెండోది ప్రత్యక్షానుభవానికి చిక్కేది. ఇది మూర్తం. కవి యెక్కువగా మనో సంబంధమైనవాటిల్నే కవిత్వానికి వస్తువులుగా వాడ్డం జరుగుతుంది. చదువరికి అది మనో సంబంధమైందే గాక శారీరిక ప్రతిస్పందనక్కూడ అది కారణమౌతుంది. “ఈ కవిత చదవగానే వొళ్ళు జలదరించింది, పులకరించింది”ల్లాంటివి ఉదాహరణలు. కవి అమూర్తాలైన విషయాల్ని ఉట్టంకిస్తున్నా వాడిన పదచిత్రాలు చదువరిలో మానసిక, శారీరిక స్పందనలకి కారణాలౌతాయి. దాంతో చదువరికి, కవికి మధ్య
వంతెన యేర్పడి వొకరికొకరు అర్ధమౌతారు.
ఇప్పుడు ఆవకాయ సెలయేరులోని కొన్ని కవిత్వాల్ని తీసుకొని చూద్దాం.
ప్రొడిగల్ సన్స్ – బొల్లోజు బాబా
“మెలుకువ నిద్రపొడవునా వ్యాపిస్తూంటుంది”
“గాలి తన బరువుని చెట్లపై ఈడ్చుకుంటూ సాగుతూంటుంది”
ఇవే పదచిత్రాలు. మెలకువ, నిద్ర రెండూ వొకదానికొకటి విరుద్ధమైనవి. గానీ “పొడవునా వ్యాపిస్తుంది” అనడంతో ముసలివ్యక్తి నిద్రలేమితనాన్ని మనమూ అనుభవిస్తాము. ఈ నిద్రలేమితనం యేదో రోగం వల్లగాదు, తనవాళ్ళన్నవాళ్ళు లేని వొంటరితనంవల్ల. ఈ భావాన్ని “అనుభవాల చుట్టూ చేతులు వేసి”, “జ్ఞాపకాల్ని వింటూ కొవ్వొత్తి రాత్రిలోకి వొలికిపోతుంది” వంటి పదచిత్రాల ద్వారా కవి చదువరిలోకి వొంటరితనాన్ని ప్రవేశపెడున్నాడు. దీన్ని అనుభవిస్తూ అర్ధం చేసుకొన్న చదువరికి నిద్రపట్టనప్పుడో, కొవ్వొత్తిని చూచినప్పుడో ఈ కవిత గుర్తుకువస్తుంది. ఇక్కడే కవి ధన్యుడయ్యేది.
మ్యానిఫెస్టో – సగటు తెలుగు జీవి
ఇందులో కవి పదచిత్రాల్తోనే కవితని మొదలెట్టినా మధ్యలో కుక్కపిల్లని కత్తితో పొడవడం, పంజరంలోని చిలకని రాకెట్టు గుద్దుకోడంల్లాంటి అమూర్త భావాల్ని చెప్పడం ద్వారా చదువరికి దూరమౌతాడు. గానీ పంజరం అంటే దేహమని, చిలకంటే జీవి లేక ప్రాణమని రాకెట్టంటే యముడని ఆయన వివరణివ్వొచ్చు. గానీ ఇవి బుద్ధి బులపాటాలు. యేదో గొప్పగా చెప్పాలన్న తాపత్రయమేగానీ మనసులోకి ఇంకేవి గావు ఇవి.
కవిత్వానికి ప్రాణమైన క్లుప్తతని, పదచిత్రంను, దృశ్యమాన ప్రపంచంలోని గుట్టుని సున్నితంగా, సులభంగా ఆవిష్కరించడంలో పరిపూర్ణతని
సాధించిందీ కవిత.
ఒకే మబ్బులో పుట్టి
ఒకే మట్టిలో కలిసిపోయే చినుకులు
మధ్యలో కోటానుకోట్ల అస్తిత్వాలుగా
విడిపోవడమెందుకో!
ఇందులో అర్ధంగానిదీ, కష్టపడి అర్ధం జేసుకోవాల్సింది యేవీ లేదు. గానీ యెందుకు? అన్న ప్రశ్న ద్వారా చదువర్లని నిరంతరాన్వేషణకి వదిలేస్తుంది యీ కవిత. పడ్డ ప్రతి చినుకునూ పరామర్శిస్తూ సాగిపోతారు పాఠకులు. నిజవే కదూ!
ఇప్పటికింతే.