ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అచ్చ తెలుగులో ఆల్కెమిస్ట్ – కొండపొలం

Like-o-Meter
[Total: 8 Average: 4.8]

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారి రచన, తానా వారి 2019 నవలల పోటీలో రెండులక్షల బహుమతి పొందిన “కొండపొలం” చదవగానే నాకు ఆల్కెమిస్ట్ (తెలుగులో పరుసవేది) గుర్తొచ్చింది. కొండపొలం గురించి రాసేముందు ఆల్కెమిస్ట్ పుస్తకం గురించి క్లుప్తంగా.

ఆల్కెమిస్ట్ అనే పుస్తకం (చిన్న నవల) 1988 లో పోర్చుగీసు భాషలో వచ్చి, ఒక్కో భాషలోనికీ అనువదింపబడి, ఇప్పటికి దాదాపు 15 కోట్ల కాపీలు అమ్ముడుపోయిన ప్రపంచ ప్రఖ్యాత పుస్తకం. వ్యక్తిత్వ వికాస నిపుణులు చదవమని సూచించే పుస్తకం. ఐఏఎస్ కి ఎంపికైన వారిలో చాలమంది ఈ పుస్తకాన్ని తమకు స్పూర్తి (మోటివేషన్) ఇచ్చిన పుస్తకం గా చెప్తారు.

ఈ పుస్తకం స్పెయిన్ దేశంలో ఒక గొర్రెలకాపరి కథ. అతడు చదువుకొని కూడా, దేశాటన మీద ఆసక్తికొద్దీ  ఈ వృత్తిలోకి వస్తాడు. ఈజిప్ట్ లో పిరమిడ్ల వద్ద వెతికితే తనకు నిధి దొరకబోతున్నట్టు గా పదే పదే వచ్చిన కల ఆధారంగా, గొర్రెల మంద అమ్ముకొని వేలమైళ్ళు ప్రయాణానికి సిద్దం అవుతాడు. ఈ ప్రయాణంలో తొలిరోజే పరదేశంలో మోసపోయి కట్టుబట్టలతో మిగలటం, ఏడాది పాటు కూలీగా పనిచేసి ఆ డబ్బుతో ఒంటె కొనుక్కొని ఎడారి బిడారులో  ఈజిప్ట్ వైపు వేల మైళ్ళు ప్రయాణించటం, ప్రాణగండాల నుండి తృటిలో బయటపడుతూ, కొన్ని నెలల తర్వాత తీరా అనుకున్న చోటుకి వెళితే నిధి దొరక్కపోగా దోపిడీ దొంగలకు చిక్కి మరోసారి దెబ్బలు తిని రక్తాలు ఓడుతూ చావుకి దగ్గరగా వెళ్ళి బ్రతుకుతాడు. ముగింపు మాత్రం రాయను. పుస్తకం చదివి తెలుసుకుంటేనే బావుంటుంది.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
కొండపొలంలో హీరో రవి, బీటెక్ చదివి, రాత పరీక్షల్లో తగిన ప్రతిభ కనపరచినా, ఇంటర్య్వూల్లో పల్లెటురి నేపద్యం, పేదరికం, ఆంగ్ల ఉచ్చారణ తదితర కారణాలవల్ల వచ్చిన ఆత్మన్యూనత వల్ల ఏళ్ళ తరబడి నిరుద్యోగిగా మిగిలిపోతాడు.

స్వగ్రామం వచ్చినపుడు, అనుకోని పరిస్థితుల్లో తండ్రికి సాయంగా దాదాపు యాబై రోజులు గొర్రెలమందతో పాటు అడవిలో ఉండవలసి వస్తుంది. అడవినుంచి రాగానే తిరిగి హైదరాబాద్ వెళ్ళాకా అతడిలో మార్పు చూసిన స్నేహితులు, మీ ఊళ్ళో ఏదైనా పెర్సనాలిటీ డవలెప్మెంటు కోర్సు గానీ, మోటివేషన్ కోర్సు గానీ చేసావా అని అడుగుతారు. గొర్రెలు కాసాను, అడవిలో తిరిగాను. అదే ఈ మార్పుకి కారణం అని చెబితే స్నేహితులు నమ్మరు. స్నేహితులేం ఖర్మ, అతడు అడవిలో గడిపిన పేజీలు చదవకుండా ఉంటే పాఠకులు కూడా నమ్మరు.

ఆల్కెమిస్టులో హీరో, గొర్రెలతో గడిపిన రోజులను పెద్దగా వర్ణించరు. కానీ గొర్రెలు అమ్మేసాకా ఎడారి దాటేటప్పుడు ఎడారి స్వభావాన్ని హీరో పరిశీలిస్తాడు. ఆల్కెమిస్ట్ లో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన సందేశం ఇవ్వటానికి రచయిత శకునాలనూ, అధ్భుతాలనూ మానవాతీత శక్తులనూ ఉపయోగించుకున్నాడు. ఫక్తు నాస్తికులు ఆమోదించలేని సన్నివేశాలు ఉన్నాయి,

కానీ కొండపొలం నవలలో మానవాతీత శక్తులూ లేవు. అసహజం అనదగ్గ వర్ణనలు అసలే లేవు. నూటికి నూరుశాతం సహజ వాతావరణమే. హీరో తండ్రి గురప్ప గొర్రెలను సంరక్షించుకొనే విధానం, గొర్రె ప్రాణాలకి ముప్పు ఏర్పడినప్పుడు పడే తపన, తీరా గొర్రె చనిపోతే అంతే వేగంగా ఆ బాధనుంచి బయటపడటం, క్షణాల్లోనే తక్షణ కర్తవ్యం గుర్తుచేసుకొని రోజువారీ పనుల్లో  పడటం, దానికి దారి తీసిన పరిస్థితులు, ఇవన్నీ ఆకళింపు చేసుకుంటూ, అందుకు తగినట్టు తనను తాను మలచుకోవటంలో తనకు తెలియకుండానే పరిణితి చెందుతాడు.

అడవికి వచ్చిన ఇరవైమంది బృందంలో కురువృద్ధుడు పుల్లయ్యతాత ఆ బృందానికి మార్గదర్శి. అడవికీ, గొర్రెలకీ, వన్యమృగాల ప్రవర్తనకీ సంబంధించిన విషయాల్లో  నడచే విజ్ఞాన సర్వస్వం పుల్లయ్య తాత. అతడి మాటల్లో అడవి విలువ, అతికొద్దిరోజులు ఉండి వెళ్ళే తమకు అడవిలో ఉండే హక్కులు, లేని హక్కులు, చేయకూడని పనులు ఇవన్నీ తెలుసుకుంటాడు.

యుద్ధంలో సైనికుడికి తన కళ్ళముందే చనిపోయిన సహచరుడి గురించి కన్నీటీ చుక్కలు రాల్చటం కన్నా, ఆ శవం దుస్తుల్లోఉన్న తూటాలు తీసుకోవటం ముఖ్యం.  పులులు తిరిగే దట్టమైన అడవిలో సంచరించే గొర్రెల కాపర్లూ ఇదే దృక్పథంతో ఉండాలి.

ఇవన్నీ రవి స్వానుభవంతో తెలుసుకోవటంలో వ్యక్తిత్వ వికాసం తనకు తెలియకుండానే జరిగిపోయింది. దీనితో పాటు అడవిమీద అభిమానం, దానిని స్వార్దం కోసం నాశనం చేసే ఎర్రచందన స్మగ్లర్లపై వచ్చిన కోపం, ఏదైనా చెయ్యాలన్న తపన పెరిగాయి. ఫలితం, అంతవరకూ తాను కలలు కనే సాఫ్టువేరు ఉద్యోగం అవలీలగా సంపాదించే అవకాశం వదులుకొని ఇండియన్ ఫారెస్ట్ సర్వీసుని లక్ష్యంగా ఎంచుకోవటం, అందులో విజయం సాధించి, పదేళ్ళ సర్వీసులో విధి నిర్వహణలో అంకితభావానికి తోడు గొర్రెలకాపు సమయంలో తాను పుల్లయ్యతాత నుండి తెలుసుకున్న, స్వయంగా పరిశిలించిన విషయాలు అతడీని సమర్ధుడైన అటవీ అధికారి రవీంద్రయాదవ్ గా రాష్ట్ర వ్యాప్తంగా మంచిపేరు తెచ్చి పెట్టాయి. రవీంద్రయాదవ్ మాత్రం తన పల్లెటురి మట్టిలోనే కాళ్ళు దిగేసుకొని ప్రతీ సంక్రాంతీ, ఉగాదులు ఊరిలోనే జరుపుకోవటం సహజ పరిణామాలు.

పదేళ్ళ తరువాత సంక్రాంతికి ఊరు వచ్చినపుడు తన తండ్రిలో అదే అంకితభావంతో కూడిన గొర్రెలకాపరిని చూస్తాడు. నిజానికి గురప్పకి ఇంటిపట్టూన కూర్చోగలిగే వనరులు పుష్కలంగా ఉన్నాయి. వయసు కూడా మీద పడుతోంది.  తన తండ్రి వృత్తిని అన్న శంకర్, చెల్లి ప్రవీణ కూడా చిన్నతనం అని భావించినా, రవీంద్రయాదవ్ మాత్రం చొరవగా గొర్రెల పాక వద్ద తండ్రితో సమానంగా కూర్చోవటం, గొర్రెల పెంపకం ఆపమని రవి చెప్తే మానేస్తానని తండ్రి అన్నా, మౌనంగా ఉండిపోవటం ఇలాంటివన్నీ సహజత్వం నింపుకున్న సన్నివేశాలే.

వాస్తవ వాతావరణం లో వ్యక్తిత్వ వికాసాన్ని అలవోకగా ఇమడ్చటం కలం మీద సామే, అంటే కత్తిమీద సాము కన్నా కష్టం. కాకపోతే రచయితకి ముప్పై య్యేళ్ళ కలంసాముతో కండలు తిరిగిన వ్యక్తి. రచయిత పాత కథలూ/నవలలకీ ఈ నవలకీ తేడా ఒక్క గొర్రెలు మాత్రమే. రాయలసీమ మాండలికం, ఆధునిక అభివృద్ధి మూలంగా తరాల మధ్య అంతరాలు, కరువు, అడవీ ఇవన్నీ రచయితకి కొట్టినపిండి.

అడవి వర్ణనలకు సంబంధించి నాకైతే కేశవరెడ్డి నవల అతడు అడవిని జయించాడు, జిం కార్బెట్ రాసిన అనుభవాల సంకలనం మేన్ ఈటర్స్ ఆఫ్ కుమావోన్ రీజియన్ లాంటి పుస్తకాలను గుర్తు వచ్చాయి.

అడవినీ, గొర్రెలనీ, హీరోనీ కాసేపు పక్కన పెడితే ఈ నవలలో ప్రస్తావించిన సామాజిక అంశాలు చాలా లోతైనవి.

ఉద్యోగాల్లోనో, వ్యాపారాల్లోనో స్థిరబడిన  తొలితరం వారు, తమ తల్లిదండ్రులు కులవృత్తిలో కొనసాగటాన్ని చిన్నతనంగా భావిస్తారు. ఈ నవలలో హీరో తన తండ్రి చేత గొర్రెల మేపు మానిపించలేదు. అంటే దానికి కారణం అతడు “హీరో” కావటమే. అదే కుటుంబంలో బెంగుళూరులో మెస్ నడుపుకొనే హీరో అన్న, అత్తవారింటికి వెళ్ళిన హీరో చెల్లి కూడా తండ్రి గొర్రెలు కాయటాన్ని చిన్నతనంగా భావించి వ్యతిరేకిస్తారు.

రైతు కూడా తన కూతురిని రైతుకి ఇచ్చి పెళ్ళి చేయటానికి బదులు మరింత కట్నం ఇచ్చి ఉద్యోగస్తుడికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకోవటానికి రైతు బాధ్యతకన్నా సమాజానికీ ప్రభుత్వాలకీ ఉన్న బాధ్యత ఎంతో ఎక్కువ.

వ్యవసాయదారులకీ, గొర్రెల కాపర్లకీ మధ్య ఉన్న సంబంధాలలో క్లిష్టత, ఒకరిమీద ఒకరు ఆధారపడటంతో పాటు, కరువుకాలంలో వనరుల కొరత ఏర్పడినప్పుడు ఇద్దరికీ రాగల స్పర్ధలు, ఒకరి నిస్సహాయ స్థితిని ఇంకొకరు ఎంతో కొంత సొమ్ముచేసుకోవటం అత్యంత సహజంగా వర్ణించారు.

ఈ నవలలో రచయితకి ఎవరినీ, ఏవృత్తివారినీ, ఏ కులస్తులనీ చెడ్డవాళ్ళగానో, మంచివాళ్ళగానో, చిత్రించాలన్న ఉద్దేశ్యం ఏకోశానా కనపడదు. కేవలం వారి రోజువారీ వ్యవహారాల్లో జరిగే సంఘటన్లు, అప్పుడు వారు తీసుకొనే వైఖరి, సంభాషణలు మాత్రమే రాసి వదిలెయ్యటం చాలా బావుంది.

ఈ పుస్తకంలో తెలుగువాళ్ళకి చాలా తెలుసుకోవలసిన అవసరం ఉన్న విషయాలున్నాయి.

రాయలసీమ పల్లెల్లో రెడ్డి కులస్తులందరినీ “రెడ్డి” అని పిలవరు. ఊళ్ళో పెత్తందారీతనం, పలుకుబడీ ఉన్న ఒకరిద్దరిని రెడ్డి అనీ, మిగతా కాయకష్టం చేసుకొనే రెడ్లను “కాపులు” గా వ్యవహరించటం జరుగుతుంది. దీనిని గురప్ప మాటల్లో చెప్పిన తీరు బావుంది. తన ఇద్దరు కొడుకులతో “కాపులు అందరూ రెడ్లు ఐన తీరుగానే, మీరు యాదవ్ లు అయ్యారేమో గానీ, నేనింకా గొల్లోణ్ణే,” అంటాడు గురప్ప. అలాగే ఒక రెడ్డీ కులస్తుడు గొర్రెలమందతో పాటూ అడవికి వచ్చి తనను తాను రెడ్డి గా కంటే గొల్లలలో ఒకరిగా భావించుకుంటాడు. మళ్ళీ ఊళ్ళో ఎలెక్షనులప్పుడు  రెడ్డి కులస్తులకే మద్దతు ప్రకటించి అవసరమైతే గొల్ల వారికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఇందులో ఎక్కడా ఎక్కడా నాటకీయత లేదు. కేవలం సహజ పరిస్థితులు, అంతే.

రచయిత సామాజిక చేదు వాస్తవాలకి ఎంతో సంఘర్షణకి లోనైతే కానీ ఇలాంటి విలువైన రచనలు రావు. కాకపోతే, బంగారు పళ్ళేనికైనా గోడ చేర్పు కావాలి. అలాంటి గోడ, తానా వారి నవలల పోటీ. రచయితలు ఆర్ధికంగా చేతులు కాల్చుకోనక్కర్లేకుండా, విలువైన రచనకి బహుమతి ఇచ్చి, ముద్రించి అధిక సంఖ్యలో పాఠకులకు చేరవేసినందుకు తానా వారికి అభినందనలు.

P.S: ఇదే పోటీకి నేను రాసిన నవల పంపాను. కాకిపిల్ల కాకికి ముద్దు. కానీ, ఈ నవల చదివేకా తానా వారి న్యాయనిర్ణేతల బృందం (జ్యూరీ) మీద గౌరవం పెరిగింది.