ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

దాసుగారి కృతులు, చమత్కృతులు

Like-o-Meter
[Total: 1 Average: 5]

ధ్రువ చరిత్రము, అంబరీష చరిత్రము, రుక్మిణీ కళ్యాణము, ప్రహ్లాద చరిత్రము, గజేంద్ర మోక్షణము,గోవర్ధనోద్ధరణము,శ్రీహరికధామృతం,సావిత్రి చరిత్రము, భీష్మ చరిత్రము, యధార్ధ రామాయణము, జానకీ శపధము, హరిశ్చంద్రోపాఖ్యానము, మార్కండేయ చరిత్రము, గౌరమ్మ పెండ్లి, హరికధలు, ఫలశ్రుతి. ఇవన్నీ హరికధలు.

రామచంద్ర శతకం, కాశీ శతకం, సూర్యనారాయణ శతకం, మృత్యుంజయ శివ శతకం, ముకుంద శతకం, సత్యవ్రత శతకం, వేల్పునంద, బాటసారి, ట్రావెలర్, మేలుబంతి, తారకం, దంభపుర ప్రహసనము, సారంగధర, నాయెఱుక, మృత్యుంజయాష్టకము, బాలరామాయణ కీర్తన, వేల్పుమాట,అచ్చతెలుగు పల్కుబడి, నవరస తరంగిణి, రుబాయెతు, నూఱుగంటి, వెన్నుని వేయిపేర్ల వినకరి, మొక్కుబడి, తల్లి వినికి, తర్క సంగ్రహము, వ్యాకరణ సంగ్రహము, చాతుర్వర్గ్య సాధనం, సీమపల్కువహి, జగజ్జ్యోతి, పురుషార్ధసాధనం, దశవిధరాగ నవతి కుసుమ మంజరి – ఇవన్నీ హరికధేతరములు.

కృతులగురించి తరువాత ముచ్చటిస్తాను, ముందు వారి చమత్కృతులను చూద్దాం.

* * * * *

ఒకసారి నాదెండ్ల పురుషోత్తమ శాస్త్రి అను ఆసామి దాసుగారి అవధానమును “చిన్నపనుల గుంపు” అని విమర్శించగా దానికి దాసుగారు కోపముతో ఒక చాటువును చెప్పేరట, ఈ చాటువు విని తిరుపతి వేంకట కవులలోనొకరైన చెళ్ళపిళ్ళవారు ఎంతో ముచ్చటపడి కంఠస్తము చేసుకున్నారట. ఆ పద్యం చూడండి

ఆలి యొరులకాయె అత్త నీ పాలాయె

ముడ్డితుడుపులాయె బుధవిధేయి

నేతి బీరకాయ రీతి నీ పేరాయె

ఉత్తముండ పూరుషోత్తముండ

ఈ పద్యము పురుషోత్తముడైన విష్ణువుకూ, నాదెండ్ల పురుషోత్తమునకూ కూడా అన్వయము.

ఒకసారి దాసుగారు హరికధ చెప్పుచున్నప్పుడు, వారు ప్రదర్శించుచున్న రాగతాళములను సరిగా గుర్తించలేక వాయించుచున్న ఒక వయొలనిస్టు ను సుతిమెత్తగా ఇలా తిట్టేరట.

నిగమ పద గరిమ మాదారి – పాపగాని పని నీ దారి

గాగ నీ పని సరి గాదప్పా- నీదారి నీదారి మాదారి మాదారి

మరి మాపని నీ దరిని దగదప్పా- దారి దప్ప పసగద్దా

పస మాపగా సరిగాదప్పా- పని సప్పగదా పద పద

పై పద్యములోనున్నవన్నీ సరిగమలే!

* * * * *

ఒకసారి రాజమండ్రిలోని దాసుగారి హరికధ విన్నవారు వీరేశలింగము పంతులుగారితో “నిన్న ఈతడు అద్భుతమూ హరికధ చెప్పెను” అనగా పంతులుగారు “ఛీ! యేమి హరికధలు, వెధవ హరికధలు!” అని అనగా, దాసుగారు “అవును, వీరికి సహవాసబలము వల్ల కాబోలు ఎప్పుడూ విధవా నామస్మరణమే!” అని చమత్కరించేరట, వీరేశలింగము గారు విధవా వివాహములు చేయించేవారు కదా!

ఒకసారి విశాఖపట్టణములోని ప్రభల లక్ష్మీనరసింహము పంతులుగారింట దాసుగారు హరికధ చెప్పుచుండగా జయపురాధీశులైన శ్రీ విక్రమదేవ వర్మగారు వచ్చి కూర్చొనకుండ నిల్చునియే వినుచుండిరట. కూర్చోమని అక్కడివారు అనగా “శ్రీ దాసుగారి నిలుచుని కధ చెపుతూ ఉంటే నేను కూర్చుందునా?” అని అన్నారట. దానికి దాసుగారు “అయ్యా! నేను నిలబడి చెప్పటంలేదు ఆడుతూ పాడుతూ చెపుతునాను కనుక మీరు కూర్చోవచ్చును.” అని చమత్కరించేరట.

ఒకసారి సుప్రసిద్ధ నటులైన స్థానం నరసింహారావు గారు దాసుగారి దర్శనానికి వస్తే అతని ఆకారము చూసి “రోషనార వేషం కడతావట నువ్వేరా అబ్బీ, నీ పేరు విన్నానులే, అదేమిట్రా ఇలా ఉన్నావ్, ఆ పేరుకు చిక్కేవా లేక ఆపేరే నీకు చిక్కిందా?” అని చమత్కరించేరట.