ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నవపాషాణం మరియు నామక్కల్ క్షేత్రాలు

నవపాషాణం (Navapashanam)

Like-o-Meter
[Total: 0 Average: 0]

అక్టోబర్, 2010 లో నేను శ్రీరంగం, కుంభకోణం, రామేశ్వరం మొదలైన పుణ్యక్షేత్రాలను చూసివచ్చాను. ఆ యాత్రలో భాగంగా మరో రెండు క్షేత్రాలను కూడా చూసాను. అవి

     1) నవపాషాణం

     2) నామక్కల్

నాకు తెలిసి, శ్రీరంగంలాంటి వాటిల్తో పోల్చినపుడు ఈ క్షేత్రాల గురించి ఎక్కువగా ఉదహరించినట్టు కానరాలేదు.

ఆ క్షేత్రాలను చూడ్డానికెళ్ళినప్పుడు చేతిలో ఉన్న మొబైల్ తో కొన్ని ఫోటోలు తీసాను. (నామక్కల్ నరసింహస్వామి, ఆంజనేయస్వామి ఫోటోలను నెట్ నుండి తీసుకున్నాను).

ఫోటోలతో బాటు నేను తెలుసుకున్న క్షేత్ర వివరాలను సంక్షిప్తంగా వ్రాస్తున్నాను. ఎవరికైనా ఎక్కువ వివరాలు తెలిస్తే పంచుకోగలరు.

1) నవపాషాణం:

రామసేతువును కట్టేందుకు మునుపు శ్రీరాముడు నవగ్రహాల్ని ప్రతిష్టించి, పూజించిన స్థలమే నవపాషాణం. రామనాథపురానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో, దేవీపట్టణానికి వెళ్ళే మార్గంలో వస్తుందీ నవపాషాణం.

సర్వ జగన్నియాముడైనా కూడా, లోకశిక్షణార్థం, నవగ్రహ పూజను చేసాడు రాముడు.

ఈ నవగ్రహాలు స్థంభ రూపంలో, సముద్రపు నీళ్ళల్లో ప్రతిష్టిమై ఉన్నాయి. ప్రస్తుతం ఐదు పాషాణాలు మాత్రమే కనబడుతున్నాయి. మిగిలిన నాలుగు నీటిలో మునిగిపోయాయి. సేతువు కట్టడం ఈ నవగ్రహ ప్రతిష్టతో మొదలవడం వల్ల ఈ క్షేత్రానికి “సేతుమూల” అని కూడా పేరుంది.

 

2) నామక్కల్: 

బెంగళూరుకు దాదాపు 250 కి.మి. దూరంలో బెంగళూరు-మధురై జాతీయ రహదారిలో ఉంది నామక్కల్ క్షేత్రం. ఇక్కడ రెండు ఆలయాల్ని చూసాను. ఒకటి లక్ష్మీ నరసింహస్వామిది, మరొకటి ఆంజనేయస్వామిది.

లక్ష్మీ నరసింహస్వామి ఆలయం:

నామక్కల్ పట్టణంలోని ప్రధాన కూడలికి దగ్గరలోనే ఉందీ ఆలయం. అక్కడకి వెళ్లగానే గోపురం లేని ప్రధాన ద్వారం ఇట్టే ఆకర్షిస్తుంది.

ఒక కొండ క్రింద, లోయలాంటి ప్రాంతంలో వెలసిందే లక్ష్మీ నరసింహాలయం.

తమిళనాడులోని ఆలయాల్లో ఎక్కువ భాగం పల్లవులు, చోళులు, పాండ్యులు కట్టించినవే. కానీ ఈ అలయాన్ని కట్టించింది ఆదియవనయ రాజ వంశస్థులు.

స్థల పురాణం:

ప్రహ్లాదుడుని రక్షించే నిమిత్తం అత్యవసరంగా, నరసింహావతారంలో  విచ్చేస్తాడు మహావిష్ణువు. ఆయన అవతార సమయానికి అక్కడ లేకపోవడంతో బాధపడ్తున్న లక్ష్మి, తన కోసం మరోసారి నరసింహావతార ఉద్భవ సమయాన్ని చూపించమంటుంది. అందుకు విష్ణువు సమాధాన పరుస్తూ “నామక్కల్ ప్రాంతంలో ఉన్న “కమలాలయ”మనే పుష్కరణి వద్ద నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉండు, సమయానుకూలంగా దర్శనమిస్తా”నంటాడు. లక్ష్మీదేవి అలానే చేస్తూంటుంది. ఈలోపు కృతయుగం గడిచి త్రేతాయుగం వస్తుంది. రామ-రావణ యుద్ధ సందర్భంలో సంజీవని పర్వతాన్ని తెచ్చి, మళ్లీ దాని స్వస్థానంలో ఉంచుతున్న హనుమంతునికి ఓ దివ్యమైన సాలగ్రామం కనబడుతుంది. తను పూజించాలన్న సంకల్పంతో దాన్ని

Namakkal Lakshmi Narasimha Swamy
తీసుకువస్తూ, సాయం సంధ్య వేళకు “కమలాలయ పుష్కరిణి”కి చేరుతాడు హనుమ. సరైన పీఠం లేకుండా సాలగ్రామాన్ని ఉంచకూడదన్న నియమం ఉండడంతో, సరైన స్థానం కోసం వెదుకుతున్న హనుమకు తపస్సు చేసుకుంటున్న లక్ష్మీదేవి కనబడుతుంది. సంతొషంతో ఆవిడ చేతికి ఇచ్చి సంధ్యావందనానికి వెళతాడు.

తిరిగి వచ్చాక లక్ష్మీదేవి వట్టి చేతుల్ని చూసి, సాలగ్రామ మెక్కడని అడుగుతాడు. విపరీతమైన బరువు ఉండడం వల్ల మోయలేక నేలమీద పెట్టేసానంటుంది లక్ష్మి.  ఆ సాలగ్రామం పెరిగి పర్వతమైపోతుంది. సంజీవన గిరిధారివి కదా ఈ కొండనూ ఎత్తి చూడమంటుంది లక్ష్మి. హనుమంతుడు ఎత్తబోయే సరికి ఆ కొండ మధ్యభాగం నుండి విద్యుల్లతా ప్రభలు విరజిమ్ముతుండగా ప్రత్యక్షమౌతాడు నరసింహుడు. కృతయుగంలో తను చూడలేకపోయిన నరసింహ ఆవిర్భావ ఘట్టాన్ని చూసి తరిస్తుంది లక్ష్మి. లక్ష్మీదేవి నారాయణ నామ జపం చేసినదానికి గుర్తుగా “నామగిరి” అన్న పేరుతో సాలిగ్రామ పర్వతాన్ని, “నామగిరియమ్మ” (నామగిరి తాయార్) అన్న పేరుతో లక్ష్మీదేవి ప్రసిద్ధులౌతారని ఆశీర్వదిస్తాడు నరసింహుడు. నామగిరి సాలగ్రామ పర్వత ఉద్భవానికి కారకుడై, తన సహజసిద్ధ బలాన్ని సూచిస్తూ నిలువెత్తు రూపంలో సాలగ్రామ పర్వతానికి అభిముఖంగా, చేతులు జోడించి, దాసభావాన్ని చూపుతూ నిలబడమని హనుమంతుడిని ఆదేశిస్తాడు నరసింహుడు.

గర్భగుడిలో బ్రహ్మ, రుద్ర, సూర్య, చంద్రాది దేవతలు కుడి, ఎడమల కొలుస్తుంటె, మధ్యలో ఉన్నతమైన నరసింహ రూపం దర్శనమిస్తుంది. ఆ విరాడ్రూపాన్ని చూస్తున్నంత సేపూ “భయం, భక్తి” రెండూ కలిగాయి నాకు. “భయం తత్వ విమర్శనాత్” అని ఎందుకన్నారో అనుభవపూర్వకంగా అర్థమైంది. నరసింహస్వామి దేహమంతా నలుపు రంగులో ఉంటుంది ఒక్క కుడి అరచేయి తప్ప. ఆ భాగం మాత్రం రక్త వర్ణంలో ఉంటుంది. హిరణ్య కశిపుని రక్తమదని చెప్పారు అర్చకులు. హారతి వెలుగులో చూస్తే ఒక్కసారిగా ఒళ్ళు ఝల్లుమంది.

 

 ఈ గుడిలో ఉన్న శిల్పకళ మనసుల్ని రంజింపజేస్తుంది.

నామక్కల్ ఆలయ శిల్పకళ

 

నామక్కల్ ఆలయ కళ

 

 

 

 

 

 

 

 

ఇక్కడ నన్ను అమితంగా ఆకట్టున్నది – ఆలయ ద్వారం పైగల దారుశిల్పాలు (చెక్క విగ్రహాలు). చెక్క తలుపుల పై రామాయణ ఘట్టాల్ని చిన్ని చిన్ని బొమ్మలుగా చెక్కారు.

మాయ ఋషి రూపంలోని రావణుకి భిక్షవేస్తున్న సీత


సీతాపహరణం

 

మాయాలేడిని వేటాడుతున్న రాముడు

నామక్కల్ ఆంజనేయస్వామి:

ఇక్కడి నిలువెత్తు ఆంజనేయుడు (దాదాపు 20 అడుగులు) చాలా ప్రసిద్ధి చెందాడు. కానీ ఈ అంజనేయుడు, ఎదురుగా ఉన్న లక్ష్మీనరసింహ స్వామికి చేతులు జోడిస్తూ దాస్యభావాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ ఆంజనేయస్వామి గర్భగుడికి పై కప్పు లేదు. దీనికి రెండు కారణాలు చెప్పారు అక్కడి

అర్చకులు.


క్రితంలో పై కప్పు వేయాలని ప్రయత్నాలు జరిగాయని కానీ వేసిన కప్పు వేసినట్టూగానే కూలిపోయాయని చెప్పారు అర్చకులు. 

మానవ జన్మ రహస్యాల్ని చక్కగా తెలుసుకున్న మన పూర్వీకులు దుర్ల్భమైన ఈ జన్మ వ్యర్థం చెయ్యకూడదన్న సదుద్దేశ్యంతో అనేక విధి, విధానాలను ఏర్పరిచారు. అంతేకాదు, తాము ఆచరించి చూపారు. వారు ఏర్పరచిన అనేక విధుల్లో తీర్థయాత్ర ఒక ప్రధానమైన విధి.

ప్రాచీనులు తీర్థ శబ్దాన్ని వివరిస్తూ “తీర్థ శబ్దో ముఖ్యతహ్ పావనేషు వర్తతే” – “తీర్థ శబ్దానికి ముఖ్యమైన అర్థం పవిత్రర” అని చెప్పారు. భగవంతుడిని, ఆయన మహిమల్నూ అన్వేషిస్తూ సాగడమే “తీర్థాటన” అని చెప్పారు (తద్గవేషణాయ అటనమేవ తీర్థాటనం).

సప్రామాణికాలు, సమకాలీనాలైన తత్వ విషయాల్ని చింతన చేస్తూ, ఆయా ప్రాంతాల్లోని భగవద్రూపాల్ని ధ్యానిస్తూ, అక్కడక్కడే ఉన్న నదులు, తటాకాల్లో పుణ్యస్నానాలను చేస్తూ పోవాలి. అలా కాక కేవలం మనోరంజనం కోసం పిక్నిక్ లా వెళ్ళకూడదని చెప్పారు. అలా వెళ్ళేవారు మూఢులని చెప్పారు. (తదేవ కర్తవ్యం కుశలేన, న తు మూఢాభిమత తీర్థాటనమితి).

పరదైవమైన విష్ణువు కూడా రామ, కౄష్ణాది రూపాల్లో వచ్చినప్పుడు అనేక తీర్థయాత్రల్ని చేసాడు. తీర్థయాత్రల్ని ఎలా చెయ్యాలన్నదాన్ని మనలాంటి మందమానవులకు తెలియజెప్పేనిమిత్తమే భగవంతుడు తీర్థయాత్రల్ని చేసాడు. “పానేన్యప్యవగాహనేనన మనసా ధ్యానేన గానేనవా” అని చెప్పినట్లు ప్రతి తీర్థపర్యటనలోను ఆ క్షేత్రంలోని పుణ్య జల పానం, ఆ స్థలపురణాన్ని అవగాహనం చేసుకుని, అక్కడి భగన్మూర్తి లీలని మనసా ధ్యానిస్తూ, గానం చెయ్యడమే తీర్థయాత్రలోని ముఖ్యాంశాలు.

పాండవులే మొదలైన భాగవతోతములు కూడా అనేకమార్లు తీర్థపర్యటనలు ఈ రీతిలో చేసారు. “యద్యదాచరతి శ్రేష్ఠః స్తత్తదేవేతరో జనః” అని గీతలో కృష్ణుడు చెప్పినట్టు

మనమూ ఆ మహామహుల్ని యథామతి, యథాయోగ్యంగా అనుకరించాలి.