ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నీవు లేవు – నీ కవిత ఉంది

Like-o-Meter
[Total: 6 Average: 5]

 


ఇది దేవరకొండ బాలగంగాధర తిలక్ శత జయంతి వత్సరం. ఈ సందర్భంగా ఆవకాయ.ఇన్ సమర్పిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపరలోని రెండవ వ్యాసం 

మొదటి వ్యాసం: అమృతం చవి చూసిన కవి


 

పరిచయ వాక్యాలు:

‘జయంతి తే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరః

నాస్తి తేషాం యశః కాయే జరా మరణజం భయం’

అన్న యీ శ్లోకం సుప్రసిద్ధమే. 

ఎనిమిదవ శతాబ్దం వాడైన భవభూతి మహకవి విద్వత్పద్ధతి అనే ప్రకరణంలోనిదీ శ్లోకం.

వ్యాస, వాల్మీకాది మహాకవులు యశఃకాయులుగా ఇంకా యీ జగతిలో నడయాడుతుండటం గమనించిన భవభూతి మనసులో యీ ఏ క్షణాన యీ శ్లోకం ఊపిరి పోసుకుందో కానీ తరతరాలుగా ఇటువంటి మహాకవుల జీవితాలు, యీ మాటలను సమాజం తమకూ అపాదించటమే మహాదృష్టంగా జీవితాంతమూ తపిస్తూనే ఉండి ఉంటాయి. ఇప్పటి తరాల , రాబోయే తరాల కలాలు తపిస్తూనే ఉంటాయి కూడా.

వినా వేదం, వినా గీతా, వినా రామాయణీం కథామ్
వినా కవిం కాళిదాసం, భారతం, భారతం న హి

వాల్మీకి, కాళిదాసాదుల నామ స్మరణ లేనిదే భారతీయ సాహిత్యమే లేదంటున్నది పై శ్లోకం.

ఎన్నెన్నో శత జయంతులను దాటి, సహస్ర సంఖ్యను కూడా అధిగమిస్తున్న ఇటువంటి మహానుభావుల, మహాకవుల జీవితాలు మనకు ఆదర్శప్రాయాలు కదా మరి!

శతమానం భవతి శతాయుః

పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతి తిష్ఠతి’

 

ఒక సాధారణ వ్యక్తి జీవితం సుఖ శాంతులతో నూరేళ్ళు వర్ధిల్లాలని ఆశీస్సులందుకోవటం వివిధ సందర్భల్లో మనం చూస్తూనే ఉన్నాము. సాధారణ వ్యక్తుల జీవితాలు, కుటుంబాలకే పరిమితాలు. కానీ, ఋషులైన వారి జీవితాలు, కావ్య సృష్టి చేసిన వారి జీవితాలు అటువంటివి కావు కదా!

యుగాలను అధిగమించి, మనలను ప్రభావితం చేస్తూనే వస్తున్న ఋషితుల్యులైన వారినుండి స్ఫూర్తినందిన కొందరు కవుల జయంతులను, శత జయంతులను ఆయా వర్గాల అభిమానులు నూతనోత్సాహంతో జరుపుకోవటం, నిజంగా అభినందించదగ్గ వేడుక.

సమాజాభ్యుదయానికై, సమాజానందానికై, ఎన్నో అవరోధాలను అధిగమించి, తమ జీవితాలను వెచ్చించిన ధన్యజీవుల శతజయంతులను సమాజమంతా ఆనందోల్లాసాలతో జరుపుకోవటం ఒక పర్వ సందర్భం వంటిది.

తెలుగు సాహిత్యాకాశంలో ‘కవితాసతి నుదుట నిత్య రసగంగాధర తిలకం‘ గా వెలుగొందిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ శతజయంతి వత్సరమిది.

రాశి కాకుండా వాసికి ప్రసిద్ధి చెందిన తిలక్ రచనలను ఆస్వాదించటమంటే, పుచ్చపువ్వు వంటి వెన్నెల్లో విహరించటమే! తిలక్ రచనలు మంచి గంధం వలె నిత్యమూ పరిమళించేవే. మహస్సులవలె హృదయాలను కాంతిమంతం చేసేవే. తాడిత పీడిత జీవితాల పక్షం కూడా వహించిన తిలక్ కవితలు నిస్సందేహంగా, కరుణాసముద్రాలు కూడా!

ఈ విధంగా, సమాజంలోని అన్ని వర్గాల పాఠకులనూ, తన వాసిగల కలంతో ఆకట్టుకుని, చిన్న వయసులోనే అమరలోకాల కేగినా సాహితీలోకంలో అమరుడైన తిలక్ రచనా పటిమను యీ సందర్భంగా గుర్తుచేసుకోవటమే ప్రస్తుత వ్యాసోద్దేశం.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
 

తిలక్ కవిత్వంతో నా తొలి పరిచయం:

…………
కాలం సవాల్ లాంటిది.
సాహసవంతుడందుకుని ముందుకు సాగిపోతాడు..’
………….
‘తెరిచే కిటికీని బట్టి
పరతెంచే పుష్ప పరాగం ఉంటుంది..’
……………………
‘పులి చంపిన లేడి నెత్తురు పులుముకోలేను.
ఖడ్గ మృగోదగ్ర విరావం ఆలపించలేను..’
…………….
‘కరుణ లేని కవి వాక్కు సంకుచితమౌతుంది..’
……..
కవిత్వం ఒక ఆల్కెమీ. దాని రహస్యం కవికే తెలుసు.
………
అప్పట్లో…అంటే, 1970 ప్రాంతాల్లో, అయ్య మాటల్లో పదేపదే దొర్లే కవి పేరు తిలక్. ‘అమృతం కురిసిన రాత్రి’ అయ్య ముఖ్యమైన పుస్తకాల మధ్యే ఉండేదెప్పుడూ.

1975–77 లో నేను ప్రైవేట్ గా తెలుగు ఎం.ఏ చేసినప్పుడు, ఆ కవితామృతం నాకు పాఠ్య గ్రంధం. ఇంకేముంది! ఎప్పుడూ, నా మనసు, వెన్నెల్లో గంతులేసే ఆడపిల్లే!(నాలో ఇంకో ఆడపిల్లన్నమాట).

తన మనస్సులోని పాతాళ గంగలను పదాలుగా మార్చి తిలక్ చేసిన ప్రతి ప్రయత్నమూ కవితారాధకుల మనసుల్లో ప్రతిష్టితమైపోతుంది. మనసు లోతుల్లోని అనుభూతులను కవితలుగా అక్షరీకరించాలన్న తిలక్ ప్రధాన లక్ష్యమే ‘అనుభూతి వాదం’గా ప్రసిద్ధి చెందింది.

ఒక నిశార్ధ భాగంలో నక్షత్ర నివహ గగనం,
ఓరగా, భూమ్మీదకు వంగి, ఎదో రహస్యం చెబుతున్న వేళ..’

కవితారచనా పారవశ్య లక్ష్యాన్ని, నక్షత్రాలతో మిలమిలలాడే ఆకాశం భూమ్మీదకు వంగిన వైనం, ఏదో రహస్యం చెప్పాలనే ఆ ప్రయత్నం – ఇవన్నీ, మనమంతా చూస్తున్న దృశ్యాలే ఐనా కవి లేఖినిలోంచీ వచ్చినప్పుడు ఆ దృశ్యాలకో రహస్యాత్మకత ఆపాదింపబడుతుంది. అందునా తిలక్ కవితా పరమైన మనసుకూ, ప్రకృతికీ మధ్య రహస్యాత్మక వారధివలె పనిచేస్తున్నది.

టీ.ఎస్.ఇలియట్ అబ్జెక్టివ్ కోరిలేటివ్ (Objective correlative) సిద్ధాంతానికి ఉదాహరణ పూర్వకంగా కనిపించే యీ కవిత చూడండి.

ఎదురుగా గోడ మీద, బల్లి ఏకాగ్రంగా నాకేసి చూస్తూంది.
కిటికీ అవతల ఫెరన్ మొక్క క్రీగంట కనిపెడుతున్నది.
కీచురాళ్ళ చప్పుడు అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంది..’

ఈ వర్ణనతో మనల్ని కూడ ఆ పరిసరాల్లోకి తీసుకుని వెళ్ళిపొతాడు కవి. ఆ తరువాత, ఇంకా కొన్ని విచిత్ర సంకేత భావాలతో, తన అనుభూతిని వెలువరిస్తాడు. తనలోపల ఎవరో చప్పున అటునించీ ఇటూ, ఇటునుంచీ అటూ వెళ్ళిపోతున్నారంటాడు. వాళ్ళు వెళ్ళిన ఆనవాళ్ళుగా ఇరవై ఏళ్ళనాటి జ్ఞాపకాలను వదిలి వెళ్ళారంటాడు. అంతేనా? ఎవరో నవ్వును నొక్కి పెట్టిన జాడలు, రోదసిలో, చీకటిలో, అంతర్హిత సంగీతం తాలూకు శృతి చుట్టుకుందంటాడు. ఈ కవితా పంక్తులలోని సంకేతాలన్నీ కవి మన:స్థితికి ప్రతిబింబాలే కదా!

అనుభూతి సత్వ స్థితి దర్శనావిష్టుడైన కవిగా తిలక్ మనసు, మంచూ, మసక వెన్నెలా కలిసిన శీతాకాలపు రాత్రి గుండెలమీద మకరికలా పడిన తన నిట్టూర్పును, ఏకాంతం మీద తన తీర్పుగా మనకు పరిచయం చేస్తుంది. అంటే, ఏకాంతానికి వ్యాఖ్య వ్రాయటమైందన్నమాట! తనలో తానే ఏకమైపోయిన అద్వైత స్థితి ఇది!

ఇక ఆ స్థితి తరువాత, ఇక భావన తెరలు జారిపోయి, యీ లోకంలో పడిపోతాడు కవి. ఆ స్థితిని తిలక్, ఎలా వర్ణిస్తాడు? కవిత మొదట్లో, యే వస్తు సామగ్రి, పరవశ స్థితికి ఆలవాలంగా కనపడిందో, అదే వస్తు సామగ్రి ఇప్పుడెలా కనిపిస్తున్నది?

గోడ మీద బల్లి విసుగ్గా వెళ్ళిపోయింది.
ఫెరన్ మొక్క నిద్రపోయింది..’

ఆకాశం కూడా నక్షత్రాలను జారవిడిచి, అంత ఎత్తుకు ఎగిరిపోయిందంటాడు. చట్టూ ఉన్న తెరలూ జారిపోయాయని చెబుతూ, మన మనసులపై కూడ తెర జారవిడుస్తాడు. పైగా ‘నాకు నిజంగా మెలుకువ వచ్చింది..’ అని కూడ అని, మనల్ని కూడా, ఆ పరవశనిద్ర నుండి మేల్కోమంటాడు. ఎంత గడుగ్గాయి కదా యీ కవి?

చుట్టూ ఉన్న ప్రకృతిలో తన ఆవేశాన్ని ధ్వని రూపంగా వర్ణిస్తూ, సంకేతాల ద్వారా తన పారవశ్యాన్ని నిరూపించిన యీ కవిత తిలక్, కవితా పరమార్థ భావనకు సంపూర్ణోదాహరణ.

తిలక్ లో ప్రకృతి పట్ల ఇంతటి పరవశత ఎలా తిష్ట వేసుకుంది? ఈ పరవశతనే తీవ్రానుభూతి అనవచ్చా? అసలు తిలక్ ని అనుభూతివాద కవిగా పిలవటమేమిటి? అనుభూతి లేనిదే కవిత్వ అస్తిత్వమెక్కడిది? ఇదివరకు కవుల రచనలన్నీ ఎట్టి అనుభూతీ లేకుండ విరచింపబడ్డవనా అర్థం? తిలక్ ధ్యేయమేమిటసలు?తన కవిత్వ సృష్టితో అతనాశించిన ప్రయోజనమేమిటి? తిలక్ లోని విభిన్న కోణాలను పరిశీలించి, అతన్ని యే విభాగానికి చెందిన కవిగా గుర్తించవచ్చు? ఆత్మానందమేనా?

ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానాలు ఎప్పటినుంచో మనకందుబాటులో ఉన్నవే!

ప్రాచీన ఆలంకారికుల కాలం నాటినుంచీ, కావ్య ప్రయోజనం గురించిన చర్చ తరతరాలుగా సాగుతూనే వస్తున్నది. పదకొండవ శతాబ్దానికి చెందిన మమ్మటుడి యీ వ్యాఖ్య అందరికీ ఆమోదయోగ్యంగా అనుసరింపబడుతూనే ఉంది కూడా.

కావ్యం “యశసే అర్థ కృతే వ్యవహర విదే, శివేతరక్షతయే సద్య: పర నివృత్తయే, కాంతాసమ్మితయోపదేశయుజే

కళ ఎందుకు?

ఆత్మానందానికని కొందరంటారు.

కళ కళ కోసమేనంటారు ఇంకొందరు.

యశస్సు కోసమనీ, ధన సంపదన కోసమనీ, శివేతరములైన వాటి నుండీ రక్షించేందుకనీ, భిన్నాభిప్రాయాలున్నాయి.

కళ ఆత్మానందానికోసమని నమ్మటం కన్నా, సమాజం కోసం అనటం ఒక సదుద్దేశం కోసమే కాబట్టి అది సముచితమనిపిస్తుంది.

సాహిత్యం – సమాజ దర్పణమంటారు. సాహిత్యం పైనే కాదు కళలన్నిటిపైన కూడా తత్కాలీన సమాజ ప్రభావం ఉంటుంది. పురాతన కాలంలో కవిత్వమంటే కేవలం ఆకాశా లోక విహరణమాత్రంగా ఉండేది. క్రమంగా, సాహిత్యం దిశ మారింది. సమాజాన్ని ప్రతిఫలింపజేయటమే కాక, జీవన మూల్యాలను కూడా సూచించటం తన బాధ్యతగా తీసుకున్నది – సాహిత్యం.

ఈ క్రమంలో అనేక వాదాలు పుట్టుకొచ్చాయి. వేటికవే తమకంటూ కొన్ని నియమాలను రూపొందించుకున్నాయి. మార్పును నిరంతరం ఆహ్వానించే మనిషి కూడా, వాటికి తగ్గట్టే, తన అభిరుచులను కూడా మార్చుకుంటూ వెళ్ళాడు. కానీ, ఒక స్థితిలో, అవీ రుచించటం మానేశాయి. ఇప్పుడు సృజనాత్మకతలో కొత్త కోణం పొడచూపటం మొదలైంది. యశోకాంక్ష, ధనాకాంక్ష , కళ ప్రయోజనాలైపోయాయి. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్న ధ్యేయం కాస్తా ‘మమేవ జనాస్సుఖినోభవంతు’ అనో ‘అహమేవ సుఖినోభవంతు’ అనో భావించడం మొదలైంది.

ఇవన్నీ అటుంచి, కవిత అన్నది ఎలా ఉండాలి? అన్న ప్రశ్న వేసుకుంటే, ఏదేని కవితను చదివిన వెంటనే దాని భావం మనసులో ప్రతిధ్వనించినప్పుడే అది కవితౌతుంది. కవితను చదవగానే ఒక అనుభూతి మనసును తడమాలి. అదీ కవితంటే.

అలాగని వాస్తవికతకు దూరంగా, ఏవో లోకాల్లో విహరించటం కాదు. సమాజంలోని వాస్తవికతను యధాతథంగా చూపించే సంగతి తో పాటూ దానికి భావుకతను జోడించటం – కవి పని. వాస్తవికతను కవితాత్మక స్పర్శతో హృదయాకర్షకంగా మలచటం – కవి చేయవలసిన పని. అది కవి ఏ మేరకు చేశాడో, దాని సాఫల్యత కూడా అదే స్థాయిలో ఉంటుందనే విషయం చెప్పనవసరం లేదింక. శతాబ్దాలనుంచీ లేఖన ప్రక్రియకు ఇదే ఉద్దేశ్యమే ఉత్కృష్టంగాపరిగణింపబడుతున్నది.

అనుభూతివాద కవిత్వం – రూపురేఖలు:

అనుభూతి అన్న పదానికి అర్థం ఏమిటి?

అనుభూతి అంటే సాక్షాత్ ప్రత్యక్ష జ్ఞానము” అని అర్థం. అనుభూతి అనేది సహజాతమని విమర్శకులంటారు. ఇది సుఖాత్మకమైనా కావచ్చు, దుఃఖాత్మకమైనా కావచ్చు. ఈ అనుభూతికి యేదైనా ప్రత్యయ (విశ్వాసము లేదా హేతువు) సంయోగం జరిగినప్పుడు ఒక జటిల మానసికత ఏర్పడుతుంది.దాన్నే భావమంటారని సుప్రసిద్ధ జాతీయ విమర్శకులు రామచంద్ర శుక్ల్ గారంటారు. ఇది తర్కం కంటే భిన్నమైనదనీ, కావ్య విషయంలో ఇది కావ్యానుభూతి, సౌందర్యానుభూతి వంటి వివిధ రూపాల్లో ఉంటుందని వారి వాదన.

ఆంగ్ల సాహిత్యంలో అనుభూతిని Experience లేదా Feeling అన్న అర్థంలో విశ్లేషిస్తారు. Description of the subject matter of Psychology అని కూడా దీన్ని అంటారు.

ఈ అనుభూతులు రెండు రకాలు.

  1. సాంసారికానుభవాలు (Extraverted)
  2. ఆత్మానుభూతులు (Introverted)

ఒక వ్యక్తి సామాజికానుభూతులను సంపూర్ణంగా దర్శించి, తన చేతనత్వాన్ని దానిలో ప్రతిపాదించినప్పుడు, అతని భావాలు సామాజికమైపోతాయి. మనిషి, తన అంతస్సీమలలోనే పరవశించిపోతే, అవి స్వాప్నికానుభూతులు.

ఈ తరహా అనుభూతులకు కావ్య రూపం తప్పక దొరుకుతుంది. కానీ, ఒక్క మాట – అనుభూతి చేతనత్వాన్ని అనుసరించి కవిత్వ విభజన కూడ ఉంటుంది. అదెలా?

  1. Simple Feelings – రుచి వంటివి
  2. Organic Feelings – ఆకలి, దప్పిక వంటివి
  3. Activity Feelings – లైంగికానుభూతులు, ఉత్సాహము, ఈర్ష్య వంటివి.
  4. Sentimental Feelings – నైతిక, ధార్మికానుభూతులు.

అనుభూతుల్లోని వ్యక్తీకరణను బట్టి, భిన్న తత్వాలు కనిపిస్తాయి. ఒకే వస్తువు, కవి యొక్క మానసిక శక్తి, గ్రహణ శక్తిని బట్టి, అనుభూతుల కేంద్రమౌతుంది. వర్డ్స్ వర్త్ మాటల్లో చెప్పాలంటే, శక్తిమంతమైన అనుభూతుల స్యందమే (ఊట) కవిత్వము.

Poetry is the overflow of powerful feelings.

తెలుగు అనుభూతి కవుల ప్రకారం, కవి మనసులోని భావం పఠితలోనూ జాగృతమై, అదే భావాన్ని పలికించాలి. అదే భావం, అనుభూతి కవితకు ప్రాణం. కవి భావం ఎంత సూక్ష్మమో, ఎంత స్వచ్ఛమో అంతటి సూక్ష్మతా, స్వచ్ఛతలు పఠితకూ అనుభూతమవ్వాలి. అదే పరమలక్ష్యం.

కవి భావన విశ్వవ్యాప్తమైనది. ప్రకృతితో కవి మనసు తాదాత్మ్యత చెందితే, అతని మనస్సు ఒక శీతలస్పర్శకు లోనై, కలం పట్టమని ప్రేరేపిస్తుంది. ఒక జటిల మానసికత ఏర్పడుతుంది. స్వాతి చినుకుకోసం ముత్యపుచిప్ప నిరీక్షించే విధంగా, కవి మనస్సు కూడా ఇటువంటి గాఢానుభూతి కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుందంటారు మరో అనుభూతి కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ.

నిజమే!

నిరీక్షణ ఎంత తత్పరతతో నిండి ఉంటుందో, ఫలితం కూడా అంతే ఉత్కృష్టంగా ఉండి తీరుతుంది మరి. అంతరాంతర జ్యోతిస్సీమలను బయటకు తేవటం వలెనే! అదే తిలక్ కవిత్వ లక్ష్యం.

పై చెప్పిన మార్గాన్ని ‘అనుభూతివాదం ‘ అనటం అక్షరాలా సముచితం.

తిలక్ తాననుకున్న ప్రతి భావాన్నీ యెక్కడా అస్పష్ట గగనంలో కరిగిపోనివ్వడనీ, హృదయ దిశాగ్రాలలో, సన్నగా వ్రేలాడుతున్న అనుభూతులను కూడా అతి విశాల పరిధిలోకి తీసుకుని వచ్చి ఘనీభవింపజేయాలనే సఫల ప్రయత్నం చేస్తాడనీ విమర్శకులంటారు.

కవిత్వంలో obscurity (నిగూఢత ) కొంతవరకూ ఉండవచ్చు. కానీ పాఠకుడికి నీ అనుభూతి ఆకారం అందాలి. అది Transparent (పారదర్శక) చీకటై ఉండాలి. నిన్ను పలుకరించాలి. కవిత కొత్త అనుభవాల కాంతి పేటికను తెరవాలి, కదిలించాలి.

ఇందులో transparent చీకటి అన్నదే పై పంక్తులలోని ప్రధానమైన లంకె. గాఢమైన అనుభూతులను చీకటిగా తప్ప వెలుతురుగా చిత్రీకరించటం అసంభవం. కానీ అదెలా ఉండాలి? పారదర్శకంగా ఉండాలంటారు తిలక్. కనీ కనిపించని అస్పష్టత. నిజమే కదా!

కవి భావాలు, పాఠకుణ్ణి చేరకపోతే, అవెంత గొప్ప భావాలైనా ఏమిటి లాభం? పారదర్శక అంధకారమౌతేనే పాఠకుడికి కవితలోని మర్మమూ, అందులోని సొబగూ, కవి ఎటు చేయి పట్టి తీసుకువెళ్తే అటు నమ్మకంగా అతనితో ప్రయాణించి, (ఆమె కూడా కావొచ్చు) అక్కడికాంతి పేటికలను తనకు తానుగా తెరచి, సంభ్రమం చెందితేనే కదా ఆ కవితకు సార్థకత.

ప్రణయమన్నది పరువంలో దాదాపు ప్రతి ఎదలోనూ సందడించే ఒక మెత్తటి కుదుపు. దాని రుచి తెలియకపొతే జీవితం వ్యర్థం అనిన కవులూ ఉన్నారు. సామాన్యుల హృదయాలు ప్రణయానికి స్పందించే తీరుకూ, తిలక్ వంటి కవి స్పందించే తీరుకూ తేడా ఏమిటి?

‘నీవు లేని యీ పాట ఉంది.
ఇంటిముందు జూకామల్లెతీగల్లో అల్లుకుని,
లాంతరు సన్నని వెలుగులో, క్రమ్ముకుని, నా గుండెల్లో చుట్టుకుని,
గాలిలో, ఆకాశంలో, నక్షత్రం చివరి మెరుపులో దాక్కుని, నీరవంగా, నిజంగా ఉంది.
జాలిగా, హాయిగా, వినబడుతూ ఉంది.
శిశిర వసంతాల మధ్య వచ్చే మార్పుని గుర్తుకు తెస్తూ ఉంది.’

చిన్ననాడు, తన కౌగిలిలో ప్రేయసి పాడిన పాటింకా అతని గుండెలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ సమయం, ఆ జూకామల్లె తీగ, లాంతరు సన్నని వెలుగు..అన్నీ గుర్తున్నై! అప్పటి మాధురీమంతమైన ఆ పాట నేడు నీరవంగా, నిజంగా ఉందని చెబుతూ చేజారిన ఆ ప్రణయం స్మృతులను అక్షరీకరించాడు కవి.

నేడా పాట నక్షత్రం చివరి మలుపులో దాక్కుని వుంది – విషాదపు జీరకు సంకేతంగా! పైగా శిశిర వసంతాల మధ్యమార్పువలె కూడా ఉన్నదట!

శిశిరం విషాదం. వసంతం ఆనందం. ఈ రెండింటిమధ్య మార్పు – విషాదానందాల మధ్య మార్పు. అంటే వేదనను పిలిచే ఆనందం వలె ఆ పాట. ఆనందానికి చేతులు చాచే వేదన – రెండూ కలిసిన రేఖ!

శాకుంతలంలో ఏనాడో కాళిదాసు దుష్యంతునితో అనిపించిన మాటలు –

రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్
పర్యుత్సుకీ భవతి, యత్ సుఖితోషి జంతుః
తత్ చేతసా స్మరతి నూనమబోధపూర్వం,
భావ స్థిరాణి, జననాంతర సౌహృదాని..’

ఒక రమ్యమైన దృశ్యాన్ని చూసినప్పుడో లేదా మధుర శబ్దాలను విన్నప్పుడో, మనిషి ఆనందంతో పాటూ ఏదో తెలియని తీయని వేదనకు గురౌతుంటాడు. దీనికి కారణం, గత జన్మ బంధాలేవో, భావాలేవో అతని గుండె తలుపు తట్టటమేనంటాడు కాళిదాసు.

ఈ మాటలు ఇప్పటికీ తిలక్ వంటి కవుల హృదయసీమల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయనటానికి యీ కవిత సాక్ష్యం. అలనాటి ప్రేయసి పాట నేటి కవి వసించే వాతావరణాన్నంతటినీ కమ్మేసి, అతని లేఖినిని రసప్లావితం చేయటం యీ కవితా రహస్యం.

తిలక్ తన గేయాల్లో నింపిన అనుభూతుల్లో ఒక గొప్పదనముందని విశ్లేషకులంటారు. అదేమిటి?

ఏ అనుభూతినైనా సాధ్యమైనంత అంటే దిగంతాలకన్నా దూరంగా లాగే ప్రయత్నం చేస్తాడట ఆయన. ’కఠినోపనిషత్’ అనే గేయాన్ని చూద్దాం.

‘కలాన్ని సాగదీసి, సాగరాన్ని మథించి, ఖగోళాలవరకూ విస్తరించి,
అధునాతన భావుకులు స్వప్న భృక్కులు,
వర్తమాన శిరస్సును వధించబోయే సమయాన…’

ఇలా తిలక్ యే భావాన్ని చెప్పినా ఆకాశాలు, సముద్రాల పర్యంతం లాగాలనీ, మనలను కూడా లాక్కుని పోవాలని ప్రయత్నిస్తాడట!

‘నేను కాని నేను ‘ లో నక్షత్ర నివహ గగనం ఓరగా భూమ్మీదకు వాలిందంటూ కవితాత్మకంగా చూపుతాడు. గదికీ, మదికీ కూడ గవాక్షాలుంటాయి. అంతరిక్షంలోని జీవ రహస్యంలోకి సృష్టి సమక్షం లోకి!

‘నీ ఒడిలో తల పెట్టుకుని
అభ్యంగనా విష్కృత త్వదీయ వినీల శిరోజ
తమస్సముద్రాలు పొంగి,
నీ భుజాలు దాటి, నా ముఖాన్ని కప్పి,
ఒక్కటే ఒక్క స్వప్నాన్ని కంటున్న వేళ..’

ఇదీ తిలక్ నైపుణ్యం.

తిలక్ కవితల్లో మరో ముఖ్యమైన కోణం, సనాతనత్వాన్ని స్మరిస్తూనే, సృష్ట్యాదినీ సమాలింగనం చేసుకుంటాడు. కాల తీరంలో తాను నడుస్తూ, మనల్ని నడిపిస్తూ, ఒడ్డున అనుభూతి ఇసుక పాతరలు తవ్వుతూ, పూర్వపూర్వాలకు నడుస్తాడిలా…

‘అప్పుడు, ఈజిప్టు పిరమిడ్ల మధ్యన
బాబిలోనియా స్థూపాల మధ్య
మొహంజోదరో శిధిలాల మధ్య,
నిలిచి కలలు కంటున్న వేళ,
అలా అలా, అనాది అనాది అంధకార భయాటవుల మధ్య
సృష్టి సింహం చేసిన ప్రథమ గర్జన మధ్య..’

ఎక్కడో కాల తీరంలో కవి నడవటం వరకూ బాగానే ఉంది. హఠాత్తుగా, ఈజిప్టు పిరమిడుల మధ్యకి, బాబిలోనియా స్థూపాల మధ్యకీ వెళ్ళిపోవటమంటే తన మనస్సులో ఒక నిగూఢ రహస్యాన్ని సంకేతించటం – తిలక్ మార్కు.

ఆధునిక కవితలో ఆహ్వానించవలసినది అనుభూతివాదాన్నేనని తిలక్ చాలా గట్టిగా విశ్వసిస్తాడు. అందుకే ఒక సందర్భంలో “ఛందస్సూ, కవి సమయాలూ, మొదలైన సంకెళ్ళ నుండి తప్పుకుని కవిత అచ్చమైన రూపమెలా దాల్చిందో, అలాగే కథా సంవిధానం అనే అనవసరపు తొడుగును విప్పుకుని, ప్రధాన అనుభూతుల ఆకృతిలో దర్శనమిస్తున్నది – కవిత” అన్నాడు తిలక్.

అంతే కాదు. లాంతరు పట్టుకుని నలుమూలలకూ వెళ్ళీ పరిశీలించటం కాదు నేటి కవి దృష్టి. వస్తు స్వరూపాలకూ, సంఘర్షణలకూ, శక్తులకూ మూలమైన కీలక స్థానాల మీద శక్తివంతమైన వెలుగును ఫోకస్ చేయటం లాంటిదని, తన కవితోద్దేశాన్ని కూడా విస్పష్టంగా చెబుతాడు. ఔను. తిలక్ కవితలు మహాశక్తివంతమైన బాటరీ దీపాలే!

తిలక్ కవితకు ఉన్న రెండు కళ్ళు : అనుభూతి – అభ్యుదయం

తిలక్ వాడిన బాటరీలైట్ కేవలం ప్రకృతి వైపే కాదు. సమాజం వైపూ కూడ తీక్షణంగా ఫోకస్ చేయబడింది. కాబట్టే ఆధునికుల్లో, ఫ్రీవర్స్ కవుల్లో అగ్రస్థానం వారిని వరించిందంటారు వరవరరావు గారు. అదెలా?

కవిత్వంలో అస్పష్టత ఉండాలి, కానీ, అర్థంలేని ఇమేజరీలతో కలగాపులగపు వర్ణనలతో చేతకాని అనుకరణలతో ఉండకూడదన్నది తిలక్ అనుసరించిన మార్గం.

కవిత అన్ని ఇజాలకూ అతీతంగా, అంతరాంతర జ్యోతిస్సీమలను బహిర్గతం చేసి, చైతన్య పరిధిని విస్తరించాలని వారి నమ్మకం. తన కవితోద్దేశాన్ని ఇలా విస్పష్టంగా చెబుతూనే ధ్వని వైపూ, మానవతావాదం వైపూ కూడా దృష్టిని సారించాడు తిలక్. ‘నీడలు ‘ అనే కవితలో ఇది ఎంతో సూటిగా చెప్పబడింది.

‘చిన్నమ్మా..వీళ్ళమీద కోపం తెచ్చుకోకు.. ‘ అంటూ చాలా మామూలు కవిత వలె ప్రారంభించినా అడుగడుగునా ఎంత గొప్ప సూచనలుంటాయో!

ఇటువంటి ధ్వనితోనే నిండి ఉన్న కవిత ఇది.

‘వీళ్ళందరూ భయపడిపోయిన మనుషులు, రేపటిని గురించిన భయం..’

ఈ భయం రకరకాలు. సంఘ భయం, అజ్ఞాతంగా తమలో దాగిన తమను చూసి భయం. ‘గత కాలపు నీడలమ్మా వీళ్ళు’ అని జాలి పడతాడు తిలక్. అసలా ‘నీడలు ‘ అన్న శీర్షికే అద్భుతమంటారు వరవర రావు.

రావుగారు తిలక్ లో వేదనను కూడా గమనించానంటారు. అది ఆత్మాశ్రయం కాదట, ప్రపంచానికి సంబంధించినదట. ఆ బాధను చెప్పటానికి తిలక్ సూటిమార్గాన్నే ఎన్నుకున్నాడంటారు వారు.

వరవర రావు దృష్టిలో తిలక్ శైలి భావ కవిత్వ శైలే ఐనా దృక్పథం అభ్యుదయ కవితా దృక్పథం.

‘నా దేశాన్ని గురించి నేను పాడలేను.
నీ ఆదేశాన్ని మన్నించలేను.
ఈ రోజు నాకొక విషాద స్మృతి.
నా ఎడద మ్రోడైన దుస్థితి.
నేడు నేను కన్నీరుగా కరిగిన గీతికను
మంటల్లో అంతరాంతర దగ్ధమైన బూడిదను..’

తిలక్ తాను చూసిన మూర్తీభవత్ ధైర్యం గురించి, హైన్యాన్ని గురించీ, క్షుభితార్తు కల్లోల నీరధులను గురించి చెబుతూ, ‘ఇది యే నాగరికతకు ఫల శృతి? ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి?’ అని ప్రశ్నిస్తాడు.

‘ఒక్క నిరుపేద ఉన్నంతవరకూ, ఒక్క మలినాశ్రు బిందువు ఒలికినంతవరకు.. ఒక్క క్షతదుఃఖిత హృదయము ఊరడిల్లునంతవరకూ నాకు శాంతి కలుగదు. (అంతా అశాంతే)

ఇదీ ఆ వేదనకు కారణం.

‘మంచి గంధంలా పరిమళించు మానవత ..మాకున్న ఒకే ఒక్క అలంకారం..’ అని గర్వంగా చెప్పుకున్న తిలక్ సంప్రదాయ భీరువులను కూడా దుయ్యబట్టాడు – ప్రార్థన అనే కవితలో.

ఒక అడుగు ముందుకు వేసి ‘శిఖరారోహణం’ అన్న కవిత లో ‘మురికి కాల్వ మీద, మృషా జగతి మీద మహోదయం వికసించదు..వసంతం హసించదు – సంప్రదాయ భీరువుకీ, అస్వతంత్ర వితంతువుకూ, వసంతం లేదు..’ అని కుండ బద్దలు కొట్టిమరీ చెబుతారు తిలక్.

ఐతే ఒకటి గమనించాలి. తిలక్ యీసడించింది సంప్రదాయ భీరువునే కానీ సంప్రదాయాన్ని కాదు’ అని గుర్తించాలంటారు వరవర రావు.

కథకుడిగా, నాటకకర్తగా తిలక్:

తిలక్ కవితలే కాదు, కొన్ని చిన్న కథలూ వ్రాశాడు.

‘అద్దంలో జిన్నా ‘ లో భారతదేశ విభజన కథాంశం. జిన్నా హృదయంపై అంటుకున్న రక్తపు మరకలో విభజన నాటి విధ్వంసాన్ని, ఆర్ద్రంగా చెప్పాడు తిలక్.

రైలు బండిలో, భిన్న భిన్న కవులందరూ ఎక్కి వెళ్ళిపోయారు కానీ, కవిత (ఒక స్త్రీ మూర్తి) కే చోటు దొరకలేదంటారు మరో చిన్న కథలో వ్యంగ్యంగా!

ఇంకా ‘సుందరి – సుబ్బారావు’, ‘నల్ల జెర్ల రోడ్డు’ వంటి కథల్లో, ‘సుప్తశిల’ వంటి నాటకాల్లోనూ చేయితిరిగిన కథకుడిగా, నాటకకర్తగా కూడా పరిచయమౌతాడు.

‘గోరువంకలు ‘ పేరుతో తిలక్ పద్య కవితా సంకలనంలో అత్యంత సుందర భావాభివ్యక్తి ఉన్న పద్యాలున్నాయి. ముఖ్యంగా సీత ఆయన ఆదర్శ విషాద కావ్య నాయిక.

‘పాండవ పత్ని జీవితపు బాట యగమ్యము, నిత్య యాతనా
చండిమమున్, తదన్య గుణ శాలినులున్నను, తల్లి నీవు మా
గుండెల రక్త నాళముల కోసిన జాలివి, నిర్మలత్వమే
నిండుగ వెల్గు నీ కనుల, నిల్చును జాతికి వెల్గు మిన్నులై’

ద్రౌపది కన్నా సీత పాత్రే తిలక్ కు ఎక్కువ ప్రీతిపాత్రమట!

తిలక్ పై కవులు, విమర్శకుల స్పందనలు:

‘వెన్నెల్లో ఆడపిల్లలు నా అక్షరాలు ‘ అనే సౌందర్య దృష్టీ, ‘కవిత్వం ఒక ఆల్కెమీ ‘ అని రస సిద్ధాంతాన్ని కాచి వడబోసే ధైర్యం, సీతను ‘మా గుండెల రక్త నాళముల కోసిన జాలి’ని వ్యక్తీకరించిన సంప్రదాయ వాదం, ఎప్పుడూ ఆనందింపజేసే చంద్రుడూ, వెన్నెలా – కొన్ని సందర్భాల్లో చాలా భయపెడతాయి కూడా సుమా! అని హెచ్చరించే నిశిత దృష్టీ, యే ఇజానికీ లొంగని నిర్భీకత, జాతీయ, అంతర్జాతీయ సమాజాలను ప్రతిబింబింపజేసే ప్రాపంచిక పరిజ్ఞానం, “మేం మనుష్యులం, మేం మహస్సులం” అంటూ తన యోగ్యతేమిటో జగత్తుకు వివరించి చెప్పగల సత్తా, ఆత్మానందాన్నీ, సమాజ శ్రేయస్సునూ కూడా ఒడిసి పట్టుకున్న నేర్పూ, – ఇన్ని గుణాలూ కలగలిసిన తిలక్ ను, ‘యువ కవిలోక ప్రతినిధి – నవ భావామృత రసధుని – రసగంగాధర తిలకం – సమకాలిక సమస్యలకు స్వచ్ఛస్ఫటికా ఫలకం” అని శ్రీశ్రీ పొగడ్తలతో ముంచెత్తారు.

‘మానసికంగా మెత్తవాడు, స్నేహశీలి, కవి, రసజ్ఞుడు..’ అని కుందుర్తి హత్తుకున్నారు.

భావుకత, చిన్న ప్రేరణకు చలించిపోగల సుకుమార హృదయ స్పందన, వీటికి తోడు అనుభూతిని వ్యక్తం చేయగల శబ్ద శక్తి, అలంకార పుష్టీ కలిసివచ్చిన కవి ‘ అని ప్రముఖ విమర్శకుడు రా.రా. సమీక్షించారు.

భావుకత, చిన్న ప్రేరణకు చలించి పోగల సుకుమార హృదయ స్పందన, వీటికి తోడు అనుభూతిని వ్యక్తం చేయగల శబ్ద శక్తి, అలంకార పుష్టీ కలిసివచ్చిన కవి ‘ అని ప్రముఖ విమర్శకుడు రా.రా. సమీక్షించారు.

వ్యావహారిక భాష, రసదృష్టి, వాస్తవిక దృష్టి, అనితరసాధ్యమైన శైలీ – కలగలిసిన మనోజ్ఞ కవిగా డా. గిరిజా మనోహర్ బాబు అభివర్ణించారు.

నివాళి:

ఇంతటి విశిష్ట వ్యక్తిత్వంతో తెలుగు కవితా సామ్రాజ్యంలో తనదైన సుస్థిర సింహాసనాన్ని అధిరోహించిన దేవరకొండ బాలగంగాధర తిలక్ చిన్న వయసులోనే తొందరపడి దివికేగినా, తెలుగు సాహిత్యాకాశంలో దివ్యకాంతులీనే ఉజ్వల తారగా నిత్య స్మరణీయుడే.

@@@@@