ఆసిం మునీర్ నుండి శశీ థరూర్ వరకూ వంటి వ్యాసాలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ముందుమాట
ప్రస్తుత పరిస్థితికి ఆసిం మునీర్ పలికిన నాంది.
ఏప్రిల్ తొలి వారంలో ప్రవాసీ పాకిస్తానీయులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అన్నమాటలు. “హిందువులూ ముస్లిములూ కలసి ఉండలేరు. కనుకనే ద్విజాతి సిద్ధాంతం ఆధారంగా పాకిస్తాన్ ఏర్పడింది. కాశ్మీర్ అనేది పాకిస్తాన్ కి జీవనాడి“.
ఆసిం మునీర్ ఉద్దేశ్యం సుస్పష్టం. “నాకు హిందువులంటే ద్వేషం. కాశ్మీర్ పాకిస్తాన్ కి చెందినది.“
సైనికాధికారి ఎవరినైనా ద్వేషిస్తే వారు తన దృష్టిలో చంపదగ్గవారు. సైనికాధికారి ఏదైనా తన భూభాగం అని ప్రకటిస్తే అది ఆక్రమించుకోదగ్గది. కాశ్మీరుని ఆక్రమించుకోవటం పాకిస్తాన్ సైన్యం తరం కాదు కనుక, ఈ ప్రసంగం లో, ఆసిం మునీర్ తన అనుచరులకు “కాశ్మీరులో హిందువులను చంపండి” అని ఆదేశం ఇచ్చినట్టే.
పాక్ ఆర్మీ, పాకిస్తాన్ లో తీవ్రవాద సంస్థలూ (ముఖ్యంగా కాశ్మీర్ లక్ష్యంగా ఉండే తీవ్రవాదులు) అనేక దశాబ్దాలుగా అవిభక్త కవలలుగా ఉన్నారు కనుక, ఆర్మీ చీఫ్ మాటలను అందుకున్న పాక్ ఆర్మీ – తీవ్రవాద సంయుక్త ఆధ్వర్యంలో పెహల్గాం నరమేధం జరిగింది. ఆసిం మునీర్ చెప్పినట్టుగానే హిందూ-ముస్లిం పర్యాటకులను వేరు చేసి మరీ చంపారు.
పుల్వామా దాడి 2019 లో జరిగినా, అది తమ పనే అని అంగీకరించటానికి పాకిస్తాన్ ఆర్మీకి ఆరేళ్ళు పట్టింది. పెహల్గాం దాడిలో తమ హస్తాన్ని ఎప్పుడు ఒప్పుకుంటూందో వేచి చూడాలి.
అసలు ఇంతవరకూ పాకిస్తాన్ లో ఏ రాజకీయ నాయకుడూ చేయనంత మత విద్వేష ప్రసంగం ఆసిం మునీర్ ఎందుకు చేసాడు? పాకిస్తాన్ లో ప్రభుత్వం (ఆర్మీ) ఎప్పుడూ కూడా నోరు మాట్లాడుతూ ఉంటే నొసలు వెక్కిరిస్తూ ఉన్నట్టే ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా మైనారిటిల (హిందువుల) రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పాడు. దాడులు షరా మామూలే. అలాంటిది, ఇప్పుడు నేరుగా ఆసిం మునీర్ నోటితో వెక్కిరించేసాడు. ఎందుకు?
పాకిస్తాన్ సున్నీ-షియా విభేదాలు
ఎందుకంటే ఆసిం మునీర్ ముస్లిముల్లో షియా వర్గానికి చెందినవాడు అని కొందరు నమ్ముతారు. కొందరు మాత్రం ఆయన షియా కాదు, సున్నీ వర్గస్తుడే అని వాదిస్తారు. ఏది ఏమైనా పాకిస్తాన్ దేశం సున్నీ ఆధిపత్య దేశం కనుక అక్కడ తన షియా మూలాలు (లేదా తాను షియా అనే అనుమానాలు) తనకి అడ్డంకి కాకూడదు అంటే “హిందూ” ప్రస్తావన తీసుకురావాలి. అప్పుడు పాకిస్తాన్ సైన్యంలో ఉన్న సున్నీ వర్గాలు ఈ సున్ని-షియా భేదాలు (తాత్కాలికంగా) పక్కన పెట్టి ఆసిం మునీర్ వెనుక ఉంటారు.
ఈ సున్నీ-షియా భేదాలు పాకిస్తాన్ లొ ఎంతలా పాతుకుపోయాయి అంటే మొహర్రం కి మనదేశంలో హైదరాబాద్ నగరంలో షియాలు ఊరేగింపు చేసుకున్నంత నిర్భయంగా కరాచీలో షియాలు ఊరేగింపు చేసుకోలేరు. షియాల మొహర్రం ఊరేగింపుపై సున్నీల రాళ్ళదాడి జరగొచ్చు. అందుకని పాకిస్తాన్ లో షియాల ఊరేగింపులకు పోలీసు భద్రత తప్పనిసరి. చరిత్ర లోకి వెళితే, సున్నీ వర్గానికి చెందిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు, గోల్కొండ కుతుబ్ షా వంశస్తులనుండి స్వాధీనం చేసుకుందికి ఉన్న అనేక కారణాల్లో కుతుబ్ షాహీ వంశస్తులు షియా వర్గస్తులు కావటం ఒకటి.
మరి అలాంటి సున్నీ-షియా బేధాలున్న సున్నీ మెజారిటీ దేశంలో, కేవలం 17% శాతం ఉన్న షియా వర్గ వ్యక్తి ఆర్మీ చీఫ్ అయినప్పుడు, ఆర్మీ చీఫ్ పదవికి ప్రధాని కన్నా ఎక్కువ అధికారాలున్నప్పుడు సున్నీ వర్గస్తులు ఆసిం మునీర్ ఆర్మీ చీఫ్‌గా ఉండటాన్ని వ్యతిరేకించకుండా ఉంటారా?
అప్పుడు ఆసిం మునీర్ ముందు ఉన్న ఆయుధమే, భారత్ తో ఘర్షణ. అది కూడా, ఆసిం మునీర్ స్వయంగా భారత్ వ్యతిరేక, హిందూ వ్యతిరేక ప్రసంగం ద్వారా, మొదలయి రెండు వారాల్లోనే కాశ్మీర్ లో ఒక మత ఆధారిత నరమేధం జరిగితే అది పాకిస్తాన్ సైన్యంలో ఆసిం మునీర్ పట్ల అనుకూల వాతావరణం సృష్టిస్తుంది. అందుకే సైనిక దుస్తుల్లో చేసిన ప్రసంగం, ఆ దేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడు చేసేదానికన్న ఎక్కువ మత విద్వేషం పెంచేలా ఉంది.
పాకిస్తాన్ లో ఇంతవరకూ ఒక మోస్తరు స్థాయి అంతర్జాతీయ మీడియా ఫోకస్ ఉన్న ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత విద్వేషపూరిత ప్రసంగం చేయలేదు. హింసని ప్రేరేపించే ప్రతి ప్రసంగమూ “కాశ్మీర్ మానవ హక్కులు” అనే మర్యాదపూర్వక ముసుగు వెనుకనుండే వచ్చేది. ఆ ప్రంగాలు కూడా పాకిస్తాన్ సైనికాధికారులనుండి కాకుండా ఆ దేశ రాజకీయనాయకులనుండే వచ్చేవి. ఆ ప్రసంగాలు సైనికాధికారులు రాసి ఇచ్చి “ఈ ప్రసంగాలను చదివేవరకే నీ పదవి” అని చెబితే అది వేరే విషయం.
పెహల్గాం దాడి తరువాత భారత్ ఖచ్చితంగా ప్రతీకారానికి పూనుకుంటూందని పాకిస్తాన్ లో చిన్నపిల్లాడు కూడా ఊహిస్తాడు. మరి అలాంటప్పుడు మునీర్ తన నాయకత్వాన్ని వ్యతిరేకించేవారికి “ఇది సున్నీ షియా బేధాలకి సమయం కాదు” అని చెప్పటం, ఒప్పించటం తేలిక అవుతుంది.
జరిగింది కూడా అదే.
మునీర్ లాభాలు మునీర్ కు!
పెహల్గాం నరమేధం, తరువాత జరిగిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ఎన్ని చావుదెబ్బలు తిన్నా, చివరి ఫలితం మాత్రం ఆసిం మునీర్ కి లాభమే జరిగింది. ఆ లాభం ఏ స్థాయిలో ఉంది అంటే, గతంలో రాజకీయ నాయకత్వాన్ని తప్పించి పాకిస్తాన్‌ను నేరుగా పాలించిన సైన్యాధ్యక్షులు ఇద్దరు, జియా-వుల్-హక్, పర్వేజ్ ముషారఫ్ లు చేయని సాహసం – తనకు తాను ఫీల్డ్ మార్షల్ రేంక్ ఇచ్చుకోవటం – ఆసిం మునీర్ చేసాడు. బహుశ ఆసిం మునీర్ కి ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఫీల్డ్ మార్షల్ రేంక్ ఇస్తూ ప్రకటించే సమయానికి (కెమెరాకి కనపడని ఏంగిల్లో) నలుగురు మనుషులు గన్ లు ఎక్కుపెట్టి ఉండొచ్చు కూడా. పొరపాటున కెమెరాలో పడ్డా, ప్రధాని అంగరక్షకులు అని చెప్పొచ్చు కదా.
ఇది పహల్గాం ఉదంతంలో పాకిస్తాన్ సాధించిన ప్రయోజనం. ప్రజలకూ, దేశానికీ ఎంతనష్టం జరిగినా అది లెక్కలోనిది కాదు. ఎందుకంటే, పాకిస్తాన్ లో “దేశమంటె ప్రజలు కాదోయ్, దేశమంటే సైన్యమోయ్.“
ఆపరేషన్ సింధూర్ వివరాలు ఈ వ్యాస పరిధిలో లేవు.
ఇప్పుడు ఇతరుల ప్రయోజనాలు చూద్దాం.
పహల్గాం దాడిలో పాక్ ప్రయోజనాలు
పాకిస్తాన్ ని సమర్ధించే అతి ముఖ్యమైన, బలమైన రెండు దేశాలు – అమెరికా, చైనాలు. ఇవి ఒకదాన్నొకటి ప్రత్యర్ధిగా చూసుకుంటాయి. ఆ రెండూ పెహల్గాం దాడి తరువాత భారత్ చేపట్టబోయే “చర్య” ఊహించలేవా? మరి ఆ చర్యకి పాకిస్తాన్ కూడా ప్రతిచర్యతో స్పందిస్తే ఫలితం కూడా ఊహించే ఉంటాయి. అలాంటప్పుడు ఆ రెండు దేశాలూ కొన్ని రోజులు ఎందుకు ఊరుకున్నట్టు?
ఎందుకంటే ఆ రెండు దేశాలకూ భారత మిలిటరీ సామర్ధ్యం చూడాలని ఉంది. భారత్ ఈ మధ్యన కొన్న రాఫెల్ విమానాలూ, ఎస్-400 గగనతల డిఫెన్సు వ్యవస్థా, భారత్ గొప్పగా చెప్పుకున్న బ్రహ్మోస్ క్షిపణులూ యుద్ధరంగంలో వాడటం చూడాలి అని అనుకున్నట్టు ఉన్నాయి. అందుకే ఆ రెండూ దేశాలూ పాకిస్తాన్ ని భారత్ మీదికి ఉసిగొల్పి భారత్ సామర్ధ్యం అంచనా వేసాయి. దానికి తగ్గ తెలుగు సామెత “చుట్టంతో పాముని కొట్టించే” పద్దతి. ఈ పద్దతివల్ల పాము చుట్టాన్ని కరచినా, చుట్టం చేతిలో పాము చచ్చినా పాముని కొట్టమని చెప్పినవారికి (కర్ర అందించినవారికి కూడా) ఎటువంటి నష్టమూ లేదు. చైనాకి నష్టం తెలియకుండా భారత్ సామర్ధ్యం అంచనా వేసే అవకాశం వచ్చింది. అమెరికాకి కూడా భారత్ “చైనాకి పోటీగా” ఉండాలి కానీ అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేంత ఎదగకూడదు.
అదే సమయంలో అమెరికా రాజకీయ వ్యవస్థని నడిపించే రిపబ్లికన్-డెమోక్రాట్లు లాబీలు రెండింటిలో ఒకరు భారత అనుకూల, రెండోవారు పాకిస్తాన్ అనుకూల వైఖరి తీసుకుంటూనే, ఆ రెండో దేశానికి తాము వ్యతిరేకం కాదు అని చెప్పుకుంటాయి. డెమోక్రాట్లు అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ కి “తీవ్రవాదంపై పోరు” కోసం అనే సాకుతో ఎఫ్-16 విమానాలు ఇచ్చి, “మీరు వాటిని భారత్ కి వ్యతిరేకంగా వాడినా పర్వాలేదు” అని చెవిలో చెప్తారు. రిపబ్లికన్ లు అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ కి ఆయుధాల అమ్మకం తగ్గుతుంది కానీ డెమోక్రాట్ల హయాంలో జరిగిన “దీర్ఘకాలిక ఆయుధ సరఫరా ఒప్పందాలు” కొనసాగుతాయి. అంటే ఎఫ్-16 విమానాల స్పేర్ పార్టులూ, సర్వీసింగ్ తదితర సేవలు కొనసాగుతాయి.
చైనా కి జరిగిన లాభం ఇంకా ఎక్కువ. భారత సైన్యం సరిహద్దులు దాటకుండా శతృదేశంలో చేయగల విధ్వంసం, చేరగల దూరాలూ విషయంలో చైనా ఒక అంచనాకి వచ్చింది. ఈ అంచనా వల్ల చైనా “భారత్ తో ప్రత్యక్ష యుద్ధం వస్తే అనుసరించవలసిన వ్యూహాలను పదును పెట్టుకోవచ్చు.”
ఐతే, చైనా అంచనాకి అందని విషయాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, పాకిస్తాన్ లో ధ్వంసమైన సైనిక సదుపాయాలు అన్నీ భారత్ సరిహద్దునుండి 500 కిలోమీటర్ల లోపలే ఉన్నాయి. చైనా ఇంకా పెద్దది. భారత్ కి ఆ సామర్ధ్యం లేదు అనుకోనే సాహసం చేయదు. అలాగే, చైనా తన వద్ద ఉన్న ఆయుధాల్లో అతి బలమైనవి తన దగ్గరే ఉంచుకొని, ద్వితీయ లేదా తృతీయ శ్రేణి ఆయుధాలనే పాకిస్తాన్ కి అమ్ముతుంది. భారత్ వాటిని నిలువరించింది. అంతకన్నా గొప్ప ఆయుధాలను నిలువరించగలదా? ఈ ప్రశ్నకి చైనా పూర్తి సమాధానం పొందలేదు.
ఆయుధం బలం దాని పదునులోనే కాదు, అది వాడే చేతుల్లోనూ ఉంటుంది అని అమెరికా, పాకిస్తాన్ లు సరిపెట్టుకొని, “చేతకాని సైనికుల చేతిల్లో మా యుద్ధవిమానాలూ, మా ఆయుధాలూ పసలేనివి గా తేలాయి కానీ….” అని ఆత్మవంచన చేసుకోవచ్చు. కానీ ఈ ఆపరేషన్ సిందూర్ ఫలితాలు అమెరికా, చైనాలకు “లీక్” చేసిన సమాచారం మాత్రం భారత రక్షణ సంస్థలు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ వ్యూహాలు పన్నుకోవాలి.
యుద్ధానంతర దౌత్య పరిణామాలు
ఆపరేషన్ సింధూర్ మొదలు అయిన వారం రోజుల్లో కాల్పుల విరమణ జరిగింది. ఈ విరమణకి అమెరికా చైనా లు మాట సాయం చేసాయి. చైనాకి ఈ విషయం చెప్పటం కన్నా “మౌనం” గా ఉండటమే లాభం. అదే అమెరికా కి “గ్లోబల్ పెద్దన్న” గా పేరు తెచ్చుకోవాలనే దురద వల్ల తాము చేసిన ప్రయత్నాలను కాస్త పెద్దవి చేసి చెప్పుంటారు. అందునా, అక్కడ అధ్యక్ష పదవిలో ఉన్నది, దౌత్య మర్యాదలు పట్టించుకోకుండా నోటి దురద వల్ల తరచుగా భంగపడే ట్రంప్. అందుకే తగు జాగ్రత్తలు తీసుకోకుండా “నా వలనే భారత్ కాల్పుల విరమణ కి ఒప్పుకుంది” అని ప్రకటించాడు.
ట్రంప్ అబద్దం చెప్పాడని నేరుగా ప్రకటించటం దౌత్య మర్యాద కాదు కనుక పూర్తి దౌత్య పరిణితి ఉన్న భారత విదేశాంగ శాఖ అధికారులు “కాల్పుల విరమణ పాకిస్తాన్ కోరికపై పూర్తి ద్వైపాక్షిక అంశం గా జరిగింది” అని ప్రకటించారు. భారత దౌత్య అధికారుల ప్రకటన సారాంశం “ట్రంప్ చెప్పుకుంటన్నది అబద్దం” అనే.
సాయుధ యుద్ధం ముగిసాక భారత్ దౌత్య యుద్ధం మొదలుపెట్టింది. దీని ప్రధాన లక్ష్యం విదేశీ వ్యవహారాలే ఐనా, కొన్ని స్వదేశీ వ్యవహారాలు కూడా జరుగుతున్నాయి.
శశి థరూర్, ఒవైసీ దౌత్యయుద్ధం
ఈ దౌత్య యుద్ధానికి భారత ప్రభుత్వం పంపిన “యుద్ధ వీరుల్లో” శశి థరూర్, ఒవైసీలు ప్రధాన ఆకర్షణ. ఎందుకంటే ఇద్దరూ విదేశీ గడ్డమీద వారి శక్తికి మించి (వారిపట్ల భారత ప్రజలకున్న అంచనాలకు మించి) భారత్ తరపున పాకిస్తాన్ ని చీల్చి చెండాడారు. ఈ ఇద్దరూ ప్రతిపక్షులుగా బీజేపీ ప్రభుత్వం మీద ఎంత బలంగా పోరాడేరో, విదేశాల్లో అంతకు రెట్టింపు బలంతో భారత ప్రభుత్వం తరపున పోరాడారు. పాకిస్తాన్ ను ఏకి పడేసారు. ఓవైసీ ఐతే పాకిస్తానీయులకు అర్ధమయ్యే ఉర్దూలో, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ను “కాపీ చేయటం కూడా చేతకాని తెలివితక్కువ దద్దమ్మ” అని నేరుగా తిట్టాడు. శశి థరూర్ ఐతే “పెహల్గాం కూడా 9/11 లాంటిదే” అని మొదలెట్టి అమెరికన్ పాత్రికేయుల ముందరికాళ్ళకి బంధం వేస్తున్నాడు.
ఇందులో ఒవైసీ రాజకీయంగా సర్వ స్వతంత్రుడు, తన పార్టీకి తానే అధ్యక్షుడు. కనుక తాను విదేశీ గడ్డపై చెప్పే ప్రతిమాటా తనకు రాజకీయంగా లాభించేదే. ఒవైసీ ప్రస్తుతం విదేశాల్లో పోషించే పాత్ర వల్ల ప్రభుత్వానికి లాభం ఏమిటంటే, “మాది ఏకపక్ష ప్రభుత్వం కాదు. మా ప్రభుత్వం హిందూత్వం కన్నా జాతీయవాదాన్ని ఎక్కువ నమ్మే ప్రభుత్వం. ప్రతిపక్షాలకు కూడా దేశ రక్షణలో భాగస్వామ్యం కల్పించే ప్రభుత్వం” అని చెప్పుకోగలగటం. ఒవైసీకి లాభం ఏమిటంటే, అంతర్జాతీయ వేదికలు ఎక్కిన గౌరవం అందుకోవటం. ఇంతవరకూ ఎన్నికలప్పుడు బీజేపీ దిగువ స్థాయి నాయకులు ఒవైసీ పై చేసే విమర్శ – దేశ వ్యతిరేకి, పాకిస్తాన్ అనుకూలుడు. ఇకపై అలాంటి విమర్సలు ఎవరూ చేయలేరు. ఇప్పుడు ఒవైసీ కూడా “దేశభక్తి, జాతీయభావాలు ఉన్న నేత” గా గుర్తింపు పొందాడు. అది ఆయన ప్రయోజనం.
శశి థరూర్ పరిస్థితి మాత్రం రాజకీయ జూదం. భవిష్యత్ ప్రయోజనాలు తెలియకుండా స్వంత పార్టీని నొప్పించాడు. అసలు ఈ బృందంలో థరూర్ వెళ్ళటమే కాంగ్రెస్ అభీష్టానికి వ్యతిరేకంగా వెళ్ళాడు. విదేశీగడ్డపై శశిథరూర్ మాటలు విన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ఆయనని “బీజేపీ అధికార ప్రతినిధి” అని వ్యంగ్యంగా వర్ణిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను వచ్చే ఎన్నికల (2029) లోపు సాగనంపవచ్చు. లేదా ఈలోపలే కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో శశిథరూర్ ని బీజేపీ వాడుకోవచ్చు. లేదా శశి థరూరే బీజేపీని వాడుకోవచ్చు. గతంలో గులాం నబీ ఆజాద్ కూడా కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టే వైఖరి తీసుకొని, ఆ తరువాత పార్టి వదిలినా పెద్ద విజయవంతం కాలేదు.
ఒవైసీ, థరూర్ లు విదేశాల్లో స్టార్ వక్తలు కావటం, స్వదేశంలో వారి అభిమానులు పెరగటం చూసిన సల్మాన్ ఖుర్షీద్ కూడా “ఆర్టికల్ 370 రద్దు వల్ల జమ్మూ కాశ్మీర్ కి మేలు జరిగింది” అని ప్రకటించి కాంగ్రెస్ నెత్తిమీద మరో పిడుగు పడేసాడు. పాపం కాంగ్రెస్ నాయకులు కూడా శశి థరూర్ ని నిందించినంత త్వరగా సల్మాన్ ఖుర్షీద్ ని నిందించలేరు. ఖుర్షీద్ మూడోతరం కాంగ్రెస్ నాయకుడు. ఆయన తాత జాకీర్ హుస్సేన్ మాజీ రాష్ట్రపతి, ఆయన తండ్రి ఖుర్షీద్ ఆలం ఖాన్ కూడా కాంగ్రెస్ నేత, కర్నాటక మాజీ గవర్నర్ కూడా. అలాంటి నేత సల్మాన్ ఖుర్షీద్ ని నిందిస్తే కాంగ్రెస్ కి నష్టమే ఎక్కువ. ఖుర్షీద్ ఇక్కడితో ఆగుతాడా లేదా శశి థరూర్ లాగా దూకుడు పెంచుతాడా అన్న ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి.
వీరితో పాటు కనిమోళి, సుప్రియా సూలే తదితర ప్రతిపక్ష నేతలు కూడా విదేశాల్లో “జాతీయవాదం” పక్షాన గట్టిగా నిలబడుతున్నారు.
ముగింపు
నిజానికి దౌత్య బృందాల్లో ప్రతిపక్ష నాయకులను పంపటం ఇందిరా గాంధీ కాలం నుండీ ఉంది. కానీ ఇప్పటి లెక్కలు వేరు.
1993-94 లో జెనీవాలో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వాజపేయీ పోషించిన పాత్ర, అటూ ప్రభుత్వానికీ ఇటు వాజపేయికీ కూడా లాభించింది. అప్పటివరకూ, అంటే 1991 ఎన్నికల్లో కూడా అద్వానీయే (అప్రకటిత) బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్ధి. కానీ 1996 నాటికి వాజపేయీ గ్రాఫ్ పెరగటానికి కారణం ఒకరకంగా జెనీవా లో వాజపేయీకి ఇచ్చిన పాత్రే. ఒకవేళ ముందు ముందు బీజేపీ అధికారంలోకి వస్తే అద్వానీ కన్నా వాజపేయికి ఎక్కువ క్రేజ్ ఉండేలా పీవీ తీసుకున్న చర్య ఈ జెనీవా కి పంపటం అని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. అద్వానీ కూడా తన మనసులో బాధ బయటపెట్టకుండా “వాజపేయికి జూనియర్” పాత్రలో ఒదిగిపోవటం ఆ తరువాతి చరిత్ర. కానీ ప్రస్తుతం శశీథరూర్ గ్రాఫ్ పెరగటం కాంగ్రెస్ అధిస్టానానికి అంగీకారం కాదు.
పెహల్గాం – ఆపరేషన్ సింధూర్ ముగిసాకా జరుగుతున్న దౌత్య బృందాల పర్యటనలు, ముందు ముందు ఏ మార్పులకు నాంది కాబోతున్నాయో కాలమే చెప్పాలి.
*****