ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

రవణగారు-నేను

Like-o-Meter
[Total: 1 Average: 5]

సాధారణంగా “ఎలిజీ” రాయడానికి కొంత నేర్పు కావాలి. చనిపోయినవారి జీవిత విశేషాలు చెబుతూ, వారు సాధించిన ఘనత, వారికొచ్చిన రివార్డులు, ఖచ్చితంగా రావలసిన అవార్డులూ, వారి ప్రతిభని పూర్తిగా గుర్తించని ఈ దిక్కుమాలిన సమాజం మీద కాసిన్ని నిష్ఠూరాలు, వారు అవసాన దశలో పడ్డ కష్టాలు చూస్తూ ఊరుకున్న కళాభిమానులందరికీ తిలాపాపాన్ని తలా పిడికెడూ పంచేస్తూ పెట్టే శాపనార్థాలూ, వాళ్ళు స్వర్గంలో దేవుడిని తమ కళతో ఎలా ఆనందపెడుతున్నారో చెప్పే ఉత్ప్రేక్షలూ ఇలా సాగిపోతాయి చాలా ఎలిజీలు. ఇహ మిగిలిన గడుసు ఎలిజీల రచయితలు  వీటన్నిటినీ టచ్ చేస్తూనే, పోయిన కళాకారుడితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, వారి ముందు తాము సూర్యుడి ముందు దివిటీలమనీ, ఆటలో అరటిపళ్ళమనీ చెప్పుకుంటూ, అయినప్పటికీ వారు తమని కూడా ఒక కళాకారుడిగా ఎలా గుర్తించారో, తమని ఎలా పొగిడారో, ఏసందర్భంలో తమని “ఫలానా” వాళ్ళకన్నా గొప్పగా రాస్తావనో, పాడతావనో, నటిస్తావనో అన్నారో చాపకింద నీరులా మనవిచేసుకుంటారు. వ్యాసం పూర్తయే సరికి, వాళ్ళు చనిపోయినందుకు బాధగానూ, రాసిన వాడు ఇంకా బతికున్నందుకు ఆనందంగానూ పాఠకులకి అనిపించేట్లుగా ఉంటాయి. వీళ్ళని ముట్టుకుంటే ఆయన్ని చూసినట్టే అనే నిర్ధారణ కొచ్చేస్తారు కొంతమంది ఎమోషనల్ పాఠకులు. కంచిలో బల్లి గుర్తొస్తుంది నాకు. నేనూ అలాంటి బల్లుల్లో ఒహణ్ణని ఈ వ్యాసం చదివాకా మీకనిపిస్తే నా పూచీకత్తేమీ లేదు. 

అంచేతనే మా ముళ్ళపూడి వెంకట్రవణగారు పోయి వారమైనా, అక్షరమ్ముక్కైనా రాయలేకపోయాను. రాయడానికి మనకేం తెలుసును గనక, అనే బెరుకు ఒహటి. తెలిసిందే రాయచ్చుకదా అని అంతరాత్మ తెగ పోరెట్టేసింది. ఆయన రచనలు ఎందుకు మంచివో, అల్లాంటి రచయిత మళ్ళీ మన భూమ్మీద ఎందుకు పుట్టడో ఇల్లాంటి విశేషాలు చెప్పి పాఠకులని ఊదరగొట్టడం భావ్యం కాదనిపించింది. తాపేస్రం కాజా గురించి లక్ష సార్లు చెప్పేబదులు, ఓ ముక్క విరిచి నోట్లో పెడితే అదే తెలుస్తుంది. అల్లాగే రవణ గారి గొప్పతనం తెలియాలంటే ఆయన రాసిన ఏ రచన ఐనా నాలుగు ముక్కలు చదివితే చాలు. ఏ డైలాగైనా విన్నా చాలు. అందుకని మాట్టాడకూరుకున్నాను ఇన్నాళ్ళూను. అయితే, ఇంక నావల్ల కాలేదు.  మనకి తెలిసింది నలుగురితోనూ పంచుకోవడం, మన అనుభవాలకి అక్షర రూపం కల్పించడం ముఖ్యవనిపించి ఇలా మొదలెట్టాను. దీనిలో స్వోత్కర్షల్ని మినహాయించేసి, మిగితా ముచ్చట్లు చదువుకుంటే, నాకూ తుత్తి,  మీకూ తుత్తి.

అందరిలాగే నేనూ బాపు రవణల స్కూల్లో ఆడుకుంటూ పెరిగాను. నేనే బుడుగుననుకున్నాను. పంతొమ్మిదొందల తొంభయ్యారులో మా అట్లాంటాలో జరిగిన సాహితీ సదస్సులో బాపు గారిని చూసాను. సభ మొదలయ్యేదాకా తెలియలేదు ఆయన ఎక్కడ కూర్చున్నారో. చేతిలో ఓ చిన్న సంచీ, సఫారీలూ జిరాఫీలూ లాంటివి కాకుండా, మామూలు దుస్తుల్లో, సభలో ఓ మూల కూర్చున్నారు. ఆయనని వేదిక మీదకి పిలిస్తే రానన్నారు. బతిమిలాడి కూర్చోపెట్టాము. ఆయన్ని రెండు మాటలు మాట్లాడమంటే పక్కనున్న రావు గారిని చూపించి “ఈయన బాగా మాట్లాడతారు” అని చెప్పేసి కూర్చున్నారు. ఆరోజు ఆయన చిన్న చిన్న మాటలతో, ఏక వాక్య సమాధానాలతో  ఇచ్చిన ఇంటర్వ్యూ వింటే అర్థమయింది ఆయన గొప్పతనం. నిండుకుండ నిజంగానే తొణకదు. సరే, ఆరోజు ఆయన ముందు నేనో కథ చదివాను. వినంగానే లేచి కృష్ణదేవరాయలు లెవెల్లో ఆలింగనం చేసుకుని, మరి సినిమా ఎప్పుడు మొదలు పెడదాం అంటారేమో అనుకున్నాను. అలాంటిదేమీ జరగలేదు. సభ పూర్తవంగానే ఆయన పెద్దవాళ్ళతో కలిసి వెళిపోయారు. అప్పటికి మేమింకా అట్లాంటాలో సత్తరకాయల కిందే లెఖ్ఖ కాబట్టి, మమ్మల్నెవరూ ఆయనతో డిన్నరుకి పిలవలేదు, ఆయన ఎక్కడుంటారో కూడా చెప్పలేదు. ఆయనతో మాట్లాడి మా రవణగారి గురించి కనుక్కోవాలని మనసు లాగింది. కానీ కుదర్లేదు. అలా మొదలైంది వాళ్ళతో తొలి పరిచయం. తరవాత కొన్నాళ్ళు పోయాకా ఓ రాత్రి వేళ బాపు, రమణలకి ఓ పేద్ద ఉత్తరం రాసేసాను. నేను ఫలానా డొక్కావాళ్ళబ్బాయిని, సినిమాలంటే ఇంట్రెష్టు, తియ్యాలనుంది ఎప్పటికైనా అని. పోస్టు కూడా చేసేసాను మర్నాడు. ఓ నెల పోయాకా బాపు గారి చేతి రాతతో ఉత్తరవొచ్చింది. అన్నిటి కన్నా ముందుగా వారిద్దరూ అడిగిన ప్రశ్న “మీకు నిరతాన్నదాత్రి డొక్కా సీతమ్మ గారు ఏమవుతారు?”  అని. తరువాత మిగిలిన విషయాలు రాసి, ఇప్పుడొస్తున్న వీడియో కెమేరాలతో చిన్న చిన్న లఘు చిత్రాలు తీయమని, అనుభవం వచ్చాకా పెద్ద సినిమా తీయచ్చునని ఆశీర్వదించారు. 

సరే, నాన్నగారిని కనుకున్ని మళ్ళీ ఉత్తరం రాసేసాను. డొక్కా సీతమ్మగారు మా తాతగారికి నాయనమ్మ అవుతారు, ఇదిగో మా వంశ వృక్షం అంటూ. ఆ తరువాత కొన్నేళ్ళయ్యాకా బాపు, రమణలకి అమెరికాలో సన్మానం జరిగింది. నేను వెళ్ళ లేకపోయాను, టిక్కెట్టు చాలా ఖరీదుగా ఉంది అప్పుడు. వాళ్ళని మా వూరు రప్పించి ఒక సాహితీ సభ చేద్దామనుకున్నాను. “విత్తులు లేకుండా వీరభద్రుడి సంబరం” జరగదు కదా. అలాగ ఆ ప్రయత్నమూ నీరుకారిపోయింది. ఎవరో చెప్పారు “రవణ గారు పాపం నడవలేక పోతున్నారు” అని. బాధేసింది. సరే రెండువేల ఎనిమిది లో నా మొదటి పుస్తకం “పల్లకీ” అచ్చువేద్దామని ప్రయత్నించినప్పుడు, అందరికన్నా ముందుగా ముందుమాట రవణ గారిచేత రాయించుకోవాలని ఒట్టెట్టేసుకున్నాను. ఆయనకి ఒక రోజు ఫోను చేసాను. చచ్చేంత భయం వేసింది. బుద్ధుందా లేదా అంటారేమోనని ఓ పక్కనించి టెన్షను గా ఉన్నా, గతంలో రాసిన ఉత్తరం గురించి చెప్పి, వాణ్ణి నేనేనండి అన్నాను మెల్లిగా. ఆయన గుర్తుపట్టి, డొక్కా సీతమ్మగారిని ఇంకోమారు గుర్తు చేసుకుని, ఏవిటి ఫోను చేసారు అన్నారు. నాకు తెలుగు సాహిత్యంతో పరిచయం కలిగించింది మీరు, ఆసక్తి పెంచింది మీరు, నేను ఇవాళన్న రోజు రెండు ముక్కలు రాస్తున్నానంటే దానికి కారణం అందరికన్నా ముందు మీరు, కాబట్టి నా పుస్తకానికి ముందుమాట రాసిపెట్టండి అని అడిగాను. అయ్యో దానిదేవుంది, ప్రూఫు పంపించండి, రాస్తాను అన్నారు. ఇంక నా ఆనందానికి పట్టపగ్గాల్లేవు. వెంఠనే నా పుస్తకాన్ని అతి చక్కని ఖరీదైన పేపరు మీద ప్రింటు చేసేసి, పేద్ద బైండు చేయించేసి, అక్షరాలా నూటపదహారు డాలర్లు పోస్టలు వాడికిచ్చి, పోస్టు చేసేసాను. ఓ నెల పోయాకా రవణ గారికి ఫోను చేస్తే తెలిసింది నేను రాసిన ఎడ్రసు తప్పని. “అది పాత ఎడ్రసు, మావీధి చివరన ఉంటారు వాళ్ళు. ఇదివరకు మన ఉత్తరాలు వస్తే  పట్టుకొచ్చి మనకిచేవారు, ఈ మధ్యన ఇవ్వటం లేదు” అని. మళ్ళీ ఎవరో ఇండియా వెళుతుంటే వాళ్ళచేత పంపించాను, ఈ సారి మరో నెల పోయాకా అందింది.

ఓ రోజు రాత్రి అట్లాంటా టైము పదిన్నర. నేను అయిదు నిముషాలయ్యుంటుంది పడుక్కుని. ఫోను మోగింది. అవతల గొంతు నేను గుర్తు పట్టలేదు. “ఫణి గారేనా?” “అవునండీ, మీరు ఎవరు?” అన్నాను నిద్దర్లోనే. “నేను ముళ్ళపూడి వెంకట్రవణని..” . అంతే ఒఖ్ఖసారి నిద్ర ఎగిరిపోయింది. “పుస్తకం ఇప్పుడే చదువుతున్నాను. వినాయక చవితి గురించీ, దీపావళి గురించీ చాలా బాగా రాసావు, నా చిన్నతనం గుర్తొచ్చింది. నిజంగా ఒక స్క్రీన్ ప్లే లాగ రాసి, ఫ్రేముల్లో పెట్టేసినట్టుంది. మీకు లేటయ్యుంటుంది. అయినా మళ్ళీ రేపు ఫోను చేస్తే ఈ మాట చెప్పగలనో లేనో అని ఇప్పుడే చేసాను” అన్నారు. నాకు కళ్ళమ్మట నీళ్ళు. ఏమీ మాట రాలేదు. “మీరు వెలిగించిన దీపాన్నే కదా” అని అన్నట్టు గుర్తు. ఆయన “కథలన్నీ బావున్నాయి, బాల్యం గురించిన సంగతులు ఇంకా బావున్నాయి. ఇవాళే ముందుమాట రాసి, హైదరాబాదు పంపిస్తాను” అనేసి ఫోను పెట్టేసారు. అన్నట్టుగానే పంపించారు. నేను ఓ నెలరోజులు నేలమీద నడవ లేదు. ఇంతలో ఇంకో ఆలోచన వచ్చింది. బాపుగారి చేత బొమ్మలు వేయించుకోవాలని. ఆయనకి ఫోను చేసాను. హైదరాబాదులో ఉన్నారని నెంబరిచ్చారు. ఆ నెంబరుకి చేసాను. ఆయన ఏ మూడ్ లో ఉన్నారో బొమ్మలు వెయ్యనని చెప్పారు. “ప్రస్తుతం హైదరాబాదు లో ఉన్నాను. మద్రాసులో ఉంటేనేగానీ బొమ్మలు వెయ్యను. అయినా ఓ ఆర్నెల్లు నేను బిజీ” అన్నారు. నేను ఆర్నెల్లు ఆగుతానన్నాను. “చూద్దాంలెండి, అప్పటికి బతికుంటే చూద్దాం” అన్నారు కాస్త చిరాగ్గా. నాకు బాధేసింది. అనవసరంగా మాట పడ్డానే అని ఒక్కమాటు మనసు చివుక్కుమంది. అయినా సరే, వాళ్ళిదర్నీ పెదనాన్నలుగా భావిస్తాను నేను, కాబట్టి ఆయన ఓ మాట అన్నా కొంపలేం మునిగిపోలేదులే అని ఆర్నెల్లూ వెయిట్ చేసాను. ఈ లోపు రెండు మూడు సార్లు రవణ గారికి ఫోను చేసి “మీరు ఓ మాటు చెప్పచ్చుకదా..నా తరఫున” అన్నాను. “మొన్నోమాటు చెప్పాను. కానీ, బాపు గారు ఈ మధ్యన చాలా ట్రావెలింగ్ చేస్తున్నారు. నిజంగానే ఆయనకి తీరిక లేదు” అని చెప్పారు రవణ గారు. సరే నా అదృష్టం ఇంతే అని సరిపెట్టేసుకున్నాను. పుస్తకం అచ్చయ్యాకా ఆయనకీ, బాపుగారికీ కాపీలు పంపాను. నవోదయ వాళ్ళ  ప్రొడక్షను క్వాలిటీ బావుందని మెచ్చుకున్నారు. 

రెండువేల తొమ్మిది డిసెంబరులో ఇండియా వెళ్ళాము. అప్పుడు ఎలాగైనా మద్రాసు వెళ్ళి గొల్లపూడి మారుతీ రావుగారినీ, బాపు, రమణలనీ కలవాలని ప్రయత్నం చేసాను. హైదరాబాదులో అల్లర్లు, బందుల వల్ల అది సాధ్యపడలేదు. తిరిగి వచ్చేసాము. అయితే రెండువేల పది డిసెంబరులో మళ్ళీ ప్రయాణం పెట్టుకున్నాము. ఈ సారి ఆరు నూరైనా బాపు రమణలని కలవాల్సిందే నని ఒట్టేసుకు మరీ వెళ్ళాను. మారుతీ రావు గారు విశాఖ పట్నం లో ఉన్నారు. నాకేమో చెన్నైలో ఓ అంటే న తెలియదు. ఎల్లాగరా భగవంతుడా అనుకున్నాను. దేవుడిలా మారుతీ రావు గారి అబ్బాయి రామకృష్ణగారు అన్ని ఎరేంజిమెట్లూ చేసారు. నా రెండో పుస్తకం టేకిటీజీ కి కూడా రవణ గారు ముందుమాట రాసారు. ఆయనని మద్రాసు వచ్చి కలుస్తానని చెప్పాను. ” ఎందుకు, డబ్బులు పాడిచెయ్యొద్దు, నేను పోస్టులో పంపిస్తాను” అన్నారు రవణ గారు. “లేదు, మిమ్మల్ని, ఊళ్ళో ఉంటే బాపు గారినీ ఓ మాటు కలవాలని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. కాదనకండి” అన్నాను. ఇబ్బందిగానే ఒప్పుకున్నారు.  

డిశెంబరు పదకొండు రెండువేల ఫది, మా పిల్ల పుట్టినరోజు. ఆ రోజు ఉదయాన్ని తొమ్మిదింటికి మద్రాసులోదిగాను. ఎరేంజిమెంట్లన్నీ పూర్తయేసరికి పదకొండున్నర. రవణ గారికి ఫోను చేసాను “ఎప్పుడు రమ్మంటారు” అని. భోజనానికి పిలుస్తారేమో అని అనుకున్నాను. మనది కోతి బుద్ధి కదా. ఆయన అన్నారు “ఇప్పుడు మధ్యానం అయిపోతోంది కదా, నేను భోజనం చేసి కాసేపు పడుకుంటాను మామూలుగా. మీకు ఇబ్బంది లేకపోతే సాయంత్రం నాలుగు తరవాత రాగలరా ” అని. సరే అని, ముందు శంకర నేత్రాలయకి వెళ్ళి పల్లకీ పుస్తకం అమ్మగా వచ్చిన కొద్దిపాటి డబ్బులు వారికి ఇచ్చి, అక్కడినించి మా స్నేహితుల ఇంట్లో భోజనం చేసి, సుమారు ఐదుగంటలకి బాపు రమణ ల ఇల్లు చేరుకున్నాను. వెళ్ళేముందు ఓ మాటు ఫోను చేసాను. ” హైదరాబాదులో షూటింగు కేన్సిలు అయింది, బాపు గారు కూడా ఇక్కడే ఉన్నారు” అని చెప్పారు. నా సంతోషానికి అవధుల్లేవు. 

కారు వారింటిముందు ఆగింది. నేను తెలుపు కొట్టాను. ఒక బాపు బొమ్మలాంటి ఆవిడ తలుపు తీసారు. అప్రయత్నంగానే నమస్కారం పెట్టేసాను. రవణ గారి గురించి అడిగాను. రెండో ఫ్లోరులో ఉంటారని చెప్పారు. ఆయాస పడుతూ రెండు ఫ్లోర్లు ఎక్కాను. చెప్పులిప్పేసి, లోపలకి చూసాను “రవణ గారూ” అంటూ. ఆయనమెల్లిగా లేచి, ఎంతో కష్టం మీద నడుస్తూ తలుపు దగ్గరకొచ్చి నన్ను లోపలకి తీసుకెళ్ళారు. ఆయనని చూస్తే అచ్చం మా పెదనాన్నగారిని చూసినట్టే అనిపించింది. కాళ్ళకి దణ్ణం పెట్టాను. నిండుగా ఆశీర్వదించారు, చాలా ఇబ్బంది పడిపోయారు కూడా. కాసేపు మా కుటుంబం గురించి అడిగారు. వాళ్ళ కుటుంబం గురించి చెప్పారు. వాళ్ళ అమ్మాయి కేలిఫోర్నియాలో ఉంటారుట. అబ్బాయి వర, హైదరాబాదు లో ఉంటాడని చెప్పారు. “ఇక్కడ మేమిద్దరమే, ఆవిడ ఇప్పుడే వస్తారు, బైటికెళ్ళారు” అని చెప్పారు.  “ఎప్పుడైనా, ఎక్కడైనా ఇంతే, పిల్లలకి వాళ్ళ బాధ్యతలుంటాయి, వృత్తి ధర్మాలుంటాయి, ఇక్కడ మేమిద్దరం, ఏ తల్లిదండ్రులైనా ఇలాగే, ఈ కాలంలో..” అన్నారు నవ్వుతూ. అప్పుడు అనిపించింది, నన్ను భోజనానికి పిలవాలన్న కోతి ఆలోచన ఎంత పొరపాటో.  

Bapu, Ramana & Phani Dokka

కాసేపు డొక్కా సీతమ్మ గారి గురించి మాట్లాడి, “ఉండండి బాపుగారిని కూడా పిలుస్తాను” అంటూ పిలిచారు. బాపు గారు వచ్చారు. ఆయనకీ పాద నమస్కారం చేసాను. నా అదృష్టం ఏమని చెప్పను. తరువాత సుమారు రెండు గంటలు బాపు, రమణ గార్లు ఎంతో హాయిగా నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడారు. బాపు గారు ఎన్నో జోకులు వేస్తూ, హాయిగా కబుర్లు చెబుతూంటే, ఒక్క సారి టైము ఇలా ఆగిపోతే బావుణ్ణనిపించింది. ఇంతలో రవణ గారు నా పుస్తకం రివ్యూ ఇచ్చారు. దస్తూరీ ముత్యాలకోవలా ఉంది. ఆమాటే అన్నాను. ఆయన నవ్వేసి ” అది మా శ్రీదేవిది, నా రైటింగు మీకు అర్థం కాదని ఆవిడచేత కాపీ చేయించాను” అన్నారు. తరువాత టీ తాగి, రెండు ఫొటోలు తీసుకుని, వాళ్ళ ఆటోగ్రాఫులు తీసుకుని వదల లేక వదల లేక  బయలుదేరాను. మరో మారు ఇద్దరికీ కాళ్ళకి దణ్ణం పెట్టుకున్నాను. రవణగారికిద్దామని పదివేలు జేబులో పెట్టుకుని వెళ్ళాను. కానీ ధైర్యం చాలలేదు. బాపుగారు అక్షింతలేస్తారేమోనని భయం వేసి, ఊరుకుండిపోయాను. వెనక్కి వచ్చేస్తున్నప్పుడు చూపులతోనే ఆ వీధంతా కొలిచాను. కాసేపటికి కారు ఎయిర్ పోర్టుకొచ్చేసింది. కానీ నామనసు మాత్రం బాపు రమణల ఇంట్లోనే ఉండిపోయింది. “మీదగ్గర డొక్కా సీతమ్మగారి గురించి ఉన్న విషయాలన్నీ పంపండి. నేను ఒక ఆర్టికల్ రాస్తాను. మన బలరాం గారికి పంపిస్తే స్వాతిలో వేసుకుంటారు ” అన్నారు వచ్చేసే ముందు రవణ గారు. నేనింకా పంపనేలేదు. ఆయన చూసి చూసి, ఇంక స్వయంగా కనుక్కుందామని సీతమ్మగారి దగ్గరికే వెళిపోయారు.

ఆ నిర్మలత్వం, ఆ నిరాడంబరత, ఆ స్నేహం, ఆ ఆప్యాయత తలుచుకుంటే ఇప్పటికీ మనసు పొంగిపోతుంది. మనుషుల్లో దేవుడితనం ఉంటుందనడానికి వాళ్ళిద్దరే నిదర్శనం.  

వారిద్దరినీ జంటగా వాళ్ళింట్లో కలిసిన చివరి ఎన్నారైని నేనేనేమో, కాబట్టి ఆ కంచి బల్లిని నేనే కావచ్చు, నిజంగానే నన్ను ముట్టుకుంటే పుణ్యం రానూ వచ్చు, ఏమో…గుర్రం ఎగరావచ్చు.