ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అమ్మకు నదీహారం

Like-o-Meter
[Total: 3 Average: 5]

ఆవకాయ వ్యాసాలు – అమ్మకు నదీహారం


1.

అమ్మతో మాట్లాడిన తొలి మాటలు మనకు గుర్తుండవు.

కానీ ఆమెతో మాట్లాడిన ఆఖరి మాటల్ని మర్చిపోలేము.

ఈ రెండింటి మధ్యలో అవెన్నో మాటలు. గుర్తుండేవి. మర్చిపోయేవి. మర్చిపోవాలని అనుకునేవి.

మా నాన్నగారి మూడో సాంవత్సరీకం నాడు శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో నేను శ్రాద్ధ కార్యక్రమాన్ని పూర్తిచేసాను. అమ్మ రాక కోసం ఎదురుచూస్తున్నాను. అప్పటికే ఆమెను చూసి సంవత్సరం పైమాటే అయింది.

మెట్లు ఎక్కి వచ్చిన ఆమె నన్ను గాఢంగా కౌగిలించుకొంది. అమెరికా నుండి ఇక్కడకు అంత దూరం ప్రయాణించి వచ్చి, తండ్రి శ్రాద్ధాన్ని శ్రద్ధగా, సంప్రదాయబద్ధంగా చేసానని ఆమె చాలా సంతోషించింది.

నేను ఆమె పరిష్వంగంలోకి ఒదిగిపోతున్నప్పుడు నా నోటిలో నుంచి కొన్ని మాటలు అప్రయత్నంగా వచ్చాయి. నేను ఆ క్షణంలో నా ఆలోచనా భాష అయిన ఇంగ్లీష్‍ను వాడలేదు. అమ్మతో మాట్లాడేందుకు వాడే తెలుగులో పలకలేదు. నా మాటలు సంస్కృత పదాలతో కూడి వచ్చాయి.

అప్పుడు నేను మాట్లాడిన మాటలకు అర్థం లేదు. నాలో సుడులు తిరుగుతున్న భావాలను నాకు తెలిసిన సంస్కృతంలో వ్యక్తపరిచాను, అంతే!

నా సంస్కృతం పండితులు మాట్లాడేంత శుద్ధమైనది కాదు. వ్యాకరణబద్ధమైనది కాదు. కానీ నా లోపలి నుండి అవి హఠాత్తుగా ఉబికి వచ్చాయి.

ఒక పద్ధతి, క్రమం లేకుండానే నేను ఇలా అరిచాను – “దేహమాత! వేద మాత! గోమాత!”

అమ్మ చూపిన వాత్సల్యంతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఉద్వేగం కొంత శాంతపడ్డాక నేను ఆవిడను హాస్యం చేసాను – “గో మాత! గో..గో మాత!” అని అంటూ. ఆమెను “ఆవూ” అని కూడా అన్నాను.

మనం మన తల్లిదండ్రుల నుండి దూరంగా ఉండేటప్పుడు ఇలాంటి కలయికలు చాలా గొప్పగా ఉంటాయి. ఉండవా మరి?

 

******

2.

సాయంత్రం.

అర్థరాత్రి.

మిట్టమధ్యాహ్నం.

తెల్లవారుజామున.

– ఇలా నేను ఏ వేళకు విమానం దిగి ఇంటికి వచ్చినా అమ్మ మేలుకొనివుండేది. నాకు దిష్టి తీయడానికి నీళ్ళు, హారతి పళ్ళెంతో సిద్ధంగా ఉండేది.

1992లో నేను మొదటిసారిగా అమెరికాకు వెళ్ళాను. ఆరోజు నాకు చాలా బాగా గుర్తుంది. అది బేగంపేటలోని పాత ఎయిర్పోర్ట్. అప్పటికే ఎన్నోసార్లు వీడ్కోలు చెప్పిన అమ్మ ఇంకోసారి చెప్పడం కోసం సెక్యురిటీ గేట్లను దాటుకుని నా వైపుకు పరుగెట్టుకొచ్చింది. అక్కడున్న సెక్యురిటీ సిబ్బంది అందరికి అమ్మ పరిచయమే. వాళ్ళందరూ అమ్మ అభిమానులే.

అమ్మకు అభిమాని కాని వారు ఎవరున్నారు?

తన ఇంటికి వచ్చిన అభిమానులతో జమున

 

నేను ఇన్స్పెక్షన్ తర్వాత హ్యాండ్ లగేజ్ తీసుకుని వెళుతూ సెక్యూరిటీ వాళ్ళు మా గురించి మాట్లాడుకుంటున్నదాన్ని విన్నాను. “తల్లిదండ్రులు తమ పిల్లల్ని అంత దూరం, విదేశాలకు పంపాల్సిన అవసరం ఏమిటి?” అని వాళ్ళలో వాళ్ళే చర్చించుకుంటున్నారు.

నిజమే!

నా భవిష్యత్తును భద్రపరచుకోవడం కోసం నా పెద్దల్ని వదిలేసి వెళ్ళిపోవడం.

బహుశా అలా చేయడం నా విషయంలో తప్పనిసరేమో! లేదూ తప్పించుకునేందుకు వీలు కానిదేమో!

ఏమో! నాకు తెలియడం లేదు!

ఇన్నేళ్ళుగా తన ప్రతి పుట్టినరోజుకు అమ్మ ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉండేది. కానీ ఇది మొదటి సంవత్సరం. ఆమె ఫోన్ కాల్ దూరంలో కాదు అంతకంటే దూరంగా, అందని దూరాలకు వెళ్ళిపోయింది.

కానీ నేటికీ నన్ను కన్నతల్లి – మీ జముననే. మీరు అభిమానించిన జమున. మూర్తీభవించిన సుందర సత్యభామ. మీ అభిమానాన్ని, ఆశీర్వాదాలను నాకు అందించే ఒక మాధ్యమం. మా అమ్మ జమున.

ఈరోజు మన మధ్యన లేకపోయినప్పటికీ మా అమ్మ ఎప్పటికీ మీ జముననే. నేను నోరారా “అమ్మా!” అని పిలిచి, ఆమె పాదాల దగ్గర రవంత ప్రేమను, ప్రీతిని, అభిమానాన్ని అర్పించే అమ్మ.

అమ్మ పాదాలు.

జనవరి నెలలోని ఆ దురదృష్టకరమైన రోజు…చితిపై దుంగలను పేర్చిన తర్వాత అమ్మ పాదాలు మాత్రం బయటకు కనబడ్డాయట.

గోదారి గట్టుంది” అంటూ చిందేసిన పాదం.

శ్రీకృష్ణుని కిరీటాన్ని తన్నిన పాదం.

అమ్మ పాదం.

ఎన్నిసార్లు ఆ పాదాన్ని స్పర్శించి, నమస్కరించానో!

చివరి రోజున మాత్రం, ఆకాశంలో, కొన్ని వేల అడుగుల ఎత్తులో, ఒంటరిగా ప్రయాణిస్తూ, అమ్మనే గుర్తుచేసుకుంటూ నేను కార్చిన కన్నీటి చుక్కల లెక్క నాకు తెలీదు.

అమ్మ పాదస్పర్శనం.

ఎక్కడో సముద్రాల అవతల ఉంటున్న తన కుమారుణ్ణి కవిగా, రచయితగా తీర్చిదిద్దిన పాదాలు. స్ఫూర్తిని, ప్రేరణను అందించిన పాదాలు.

మాతృదేవో భవ

ఆరోజు…నాన్న శ్రాద్ధమప్పుడు అమ్మను నేను ఈరోజు కౌగిలించుకోగలిగితే ఆరోజు పిలిచినట్టుగా పిలిచేవాణ్ణి కాను. ఆమె నాకెప్పుడూ దేహమాతనే, గోమాతనే, వేదమాతనే. నా నరాల్లో ప్రవహిస్తున్న మాతృఋణమనే శక్తి ఎప్పటిలానే మహత్తరమైనది. ఇప్పుడు ఆమె నాతో ఉండివుంటే ఆమెను ఓ నదీమతల్లిగా భావించేవాడిని. నా ప్రాణాన్ని, అస్తిత్వాన్ని నిలిపిన శక్తిగా కొలిచేవాణ్ణి. సమస్త భారతదేశం ఆద్యంతం ప్రవహిస్తున్న అనేక నదుల ప్రతిరూపంగా ఆమెను చూసేవాడిని. సాగరసంగమానికై కదిలే మా అమ్మ ఓ మహా సముద్ర మాత!

మా అమ్మ…మీ జమున.

నా ఈ ఉత్తిమాటలు ఆమెను ఏమని వర్ణిస్తాయి?

మా అమ్మకు అమితమైన ప్రేమను అందించిన నా ప్రియ సోదర, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా! నా ఈ ఉత్తి మాటలు అమ్మ పట్ల మీకున్న అభిమానాన్ని కొలవగలవా? లేదు.

నేను కూడా మీతో నిలబడి మీలానే ఆమెను అభిమానిస్తాను. ప్రేమిస్తాను. ఓ కొడుకుగా అది నా కర్తవ్యం కూడా!

అపర సత్యభామ పట్ల మీ అభిమానానికి ఉన్న మెత్తదనం, వేగం, ఒడుపు, బరువుకు నేను మీకు ఇవ్వగలిగేది ఏముంది? అమ్మకు ఇవ్వగలిగేది ఏముంది?

*****

3.

తల్లిదండ్రులతో రచయిత ప్రొ. వంశీ జూలూరి

అమ్మ కళామతల్లికి అలంకరించిన కంఠహారం మాత్రమే కాదు. అమ్మ తెలుగు జానపద కళాతోరణానికి కట్టిన పూలదండ మాత్రమే కాదు. అమ్మ ఓ నదీహారం.ఆమె అనేక పవిత్ర నదుల సమాహారం.

నేను భగీరథుణ్ణి కాను. ఋషిని కాను. కనీసం కాటన్ దొరనో, ఎం. విశ్వేశ్వరయ్యనో కాను. కానీ నా మాటల్లో, నా ఊహల్లో మా అమ్మను పెంచి, పోషించిన నదీమతల్లుల్ని స్మరించుకుంటాను. ఆ పవిత్ర జలదేవతల కాళ్ళకు నమస్కరిస్తాను. మా అమ్మను ప్రేమించినట్టే ప్రేమిస్తాను. ఆ నదులు మా అమ్మను లాలించినట్టే నేను వాటిని కీర్తిస్తాను.

ఓ మహానదీమతల్లులారా! ఓ కృష్ణ! ఓ గోదావరీ! తుంగభద్రా! యమునా! గంగా! మీలో కలిసిపోయిన మా అమ్మను పొదివిపట్టుకోండి. మీలానే ఆమె కూడా మీతో కలిసి శాశ్వతంగా ప్రవహించేట్టు ఆశీర్వదించండి. మా అమ్మలో నేను మీ అందరినీ చూసేవాడిని. శివుని ఇల్లైన హిమాలయాల నుండి, విష్ణువు విడిది కూటమైన సముద్రాల వరకూ సాగే మీ ప్రయాణంలో మా అమ్మ కూడా ఉండేట్టు అనుగ్రహించండి.

మా మనోభావాలు, మా మాటలు, మా ఆటలు, పాటలు, కళలు, చరిత్ర అనే నదుల్లో తరతరాలకు సరస్వతీ మాత పలుకుల్లా, ఆలోచనల్లా మా అమ్మ జమునమ్మ జ్ఞాపకాలు మధురమైన అమృతాన్ని పంచిపెట్టనీ. అన్నపూర్ణేశ్వరిలా ఆదరించనీ. దుర్గాదేవిగా రక్షించనీ. విశ్వజనీనమైన సనాతనధర్మజ్యోతిలా ప్రకాశించనీ.

 

 

 

*****

4.

తల్లీ తుంగభద్రా!

నీవు పట్టుకున్న పొత్తిళ్ళలో, విజయనగర సామ్రాజ్య ఛాయలో, మా అమ్మ ఈ లోకంలోకి అడుగుపెట్టింది.

అమ్మా కృష్ణమ్మా!

దుగ్గిరాలలో, నీ సన్నిధిలోనే, మా అమ్మ తన పెద్దల నుండి కళారాధనను నేర్చుకుంది.

తల్లీ గోదావరీ!

నీ ప్రవాహంలో అపూర్వమైన గానాన్ని ఆలపించింది మా అమ్మ.

గంగా యమునల్లారా!

మీరు అందించిన బలంతో మా అమ్మ ఢిల్లీ పాలకుల వద్ద దీటైన శక్తిగా నిలిచింది.

అమ్మా, కృష్ణమ్మా!

మరోమారు, నీ ఒడిలో, ఓ చిన్న పడవలో తేలుతూ, మా అమ్మను నీకు అప్పగించే ముందు ఆమె ఆఖరి భౌతిక స్మృతిచిహ్నమైన అస్తికల్ని నేను పట్టుకున్నాను. అది నువ్వు చూసావు కదూ!

*****

5.

ఈ ప్రపంచంలోని అన్ని నదులు.

ఈ విశాల విశ్వంలోని అన్ని నదులు.

కాంతి నదులు. శక్తి నదులు. విద్యుదయస్కాంత తరంగాలు.

చెవికి వినిపించని సూక్ష్మశబ్దాలను రవాణించే సెల్యులార్ ప్రవాహాలు.

సంబంధాల నదులు. అనుబంధాల నదులు. జన్మజన్మాంతరాలలో మనసు వేసే రకరకాల పాత్రల వంటి నదులు.

మూర్తీభవత్ నదుల వంటి అమ్మలు పొదివిపట్టుకున్న జీవితాలతో బ్రతికే మనం.

ఓ మహానది పేరున్న అమ్మ నా జీవితాన్ని ఎత్తి పట్టుకు పెంచింది. అది నా అదృష్టం.

ఉన్నత శిఖరాల నుండి నాట్యం చేస్తూ జాల్వారే ఉత్తుంగ నదీమతల్లి పేరును తన పేరుగా కలిగిన అమ్మ చేతుల్లో నేను పెరిగాను. అదే నా భాగ్యం.

మా అమ్మ జమునమ్మ పేరు ఓ పవిత్ర నదీ నామం. ఆ నదిలానే ఆమె చేసిన దీవెనలు పవిత్రమైనవి. ఆమె అందించిన అనురాగం సుపవిత్రమైనది. ఆమె అందించిన ఆశీర్వాదం కేవలం నాకు మాత్రమే పరిమితం కాదు. రాబోయే తరాల వారికి కూడా చెందుతాయి.

దేదీప్యమానమైన అఖండ భారతీయ సంస్కృతీ మహాప్రవాహంలో మా అమ్మ ఓ నది. నేను పిల్ల కాల్వను. ఇది చాలు నాకు.

దేహమాత
వేదమాత
గోమాత
కళామాత
మహానదీమాత

సమస్త ప్రజానీకం నిన్ను గుర్తుంచుకోనీ గాక!
సమస్త జీవులు సుఖంగా జీవించు గాక!
నా అన్ని జన్మల్లోనూ నీవే నా అమ్మవౌ గాక!

అమ్మా!

*****

అమ్మ మధుర స్మృతులు – Smt. Jamuna Photo Gallery

“జమునా కల్యాణం” – భర్త డా. రమణారావు జూలూరితో శ్రీమతి జమున

 

భర్త డా. రమణారావు జూలూరి, కుమారు వంశీ తో శ్రీమతి జమున

రచయిత ప్రొ. వంశీ జూలూరి జన్మించిన సందర్భంగా తండ్రి డా. రమణారావు జూలూరి గారిని అభినందిస్తున్న నందమూరి తారక రామారావు, నటీమణులు సావిత్రి, అంజలీదేవి మొదలైన వారు
కుమారుడు వంశీ అన్నప్రాశన చేస్తున్న శ్రీమతి జమునా రమణారావు దంపతులు

 

శ్రీరాఘవేంద్రస్వామి మఠం, మంత్రాలయం పూర్వపీఠాధిపతి శ్రీ సుజయీంద్రతీర్ఠులతో శ్రీమతి జమునా రమణారావు దంపతులు

 

ఉడుపి శ్రీపెజావర మఠం పూర్వపీఠాధిపతులు శ్రీ విశ్వేశ తీర్థులతో

 

 

సత్యసాయిబాబాతో శ్రీమతి జమునా రమణారావు గార్లు

 

MP id card of Smt. Jamuna Ramana Rao

శ్రీమతి జమున గారికి తెలుగు సినీ ప్రముఖుల నివాళి

 

నందమూరి బాలకృష్ణ నివాళి

 

 

Tribute by AVM Productions

 

Director K. Raghavendra Rao pays tribute to Smt. Jamuna

 

Kona Venkat tribute to Smt. Jamuna

Allu Arjun pays tribute to Smt. Jamuna