ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

యజ్ఞాలు-ఆధునిక దృష్టి

Like-o-Meter
[Total: 3 Average: 4.7]

(ఈ వ్యాసంలో ప్రచురించిన సమీకరణాలను పొందుపరచింది – దివంగత డా.సీబయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్, యువరాజా కళాశాల, మైసూర్.)

ఆధునికత ప్రారంభం:

తత్వజ్ఞానపు నైజతను తెలియాలీ అంటే మొదలు ఆధునికత ప్రారంభమేలాగు అని తెలుసుకోవాలి. పురాణాలు చెబుతున్నట్టు గౌతమ ఋషి శాపం వల్ల తత్వజ్ఞానం అజ్ఞానంలో మునిగిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. “బుద్ధ సుబోధక దైత్య విమోహక”, “దితిసుత మోహన విమల సుబ్ధన పరగుణ బుద్ధ హే భవమమ శరణమ” అన్నట్టు కలియుగపు నాందిగా బౌద్ధావతారి శ్రీహరి, ద్వంద్వార్థాలు పలికేటివి, పరమాణు-శూన్యవాదాలను ప్రతిపాదించే మతాలను మండన చేసాడు. ఇదే ఆధునికత యొక్క మూలబీజం.

ఒకప్పుడు మన భూగోళపు ఆద్యంతం వైదిక సంస్కృతి వ్యాపించి ఉండేది. కలియుగపు వేళకు ఆ సంస్కృతి భారతదేశానికి, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు సీమితమైంది. ఇతర ప్రాంతాలలో అన్య సంస్కృతులు ప్రాబల్యాన్ని సంపాదించాయి. ప్రాచీన గ్రీకులు క్యాస్పియన్ (కశ్యపీ) సముద్ర తీర వాసులు కావడం చేత ప్రాచీన సంస్కృతియొక్క చిహ్నాలను ఇప్పటికీ అల్పంగానైనా మనం చూడవచ్చు.

బుద్ధివంతుడైన “ప్లేటో” అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉండే సిధ్దాంతాన్ని ప్రవచించాడు. అలాగే “అరిస్టాటిల్” యొక్క విచారధార సాంఖ్యశాస్త్రానికి అనుకరణే ఐవుంది.

రమారమి క్రీ.శ.120 నాటికి చెందిన “టౌలెమి” మన ప్రాచీనులు చెప్పినట్టే భూమి నాణ్యానికి మల్లే లావుగా, చదరంగా ఉందని తెలిపాడు. “గెలెలియో” కూడా ఇదే వాదాన్ని బలపరిచాడు.

రేఖాగణితమే మొదలైన క్రమాలతో మన భూమికి, సూర్యునికి మధ్య దూరం 9 కోట్ల 30 లక్షల మైళ్ళని కనిపెట్టడం జరిగింది. ఇది శ్రీమద్భాగవతంలో చెప్పిన దానికి దగ్గరగా ఉంది. (భాగవతం ప్రకారం సూర్య పథం ఉండే కాలచక్రపు చుట్టుకొలత 9 కోట్ల 51 లక్షల యోజనాలు. 1 యోజనం = 5.05 మైళ్ళు. ఈ కొలతతో చక్రపు త్రిజ్యాన్ని కనిపెడితే, అది మేరుపర్వతం యొక్క కేంద్రానికి, సూర్యునికీ గల దూరం, మన భూమికి సూర్యునికీ ఉన్న దూరం 9 కోట్ల 30 లక్షల మైళ్ళేనని స్థిరపడుతుంది). అందువల్ల ఈ ప్రాచీన గ్రీకుల ఆలోచనా సరళి మన పురాణాల ననుసరించే ఉన్నది చెప్పవచ్చు.

క్రైస్తవ మతం పుట్టి 1000 సంవత్సరాలు గడిచే సరికి వైదిక మతానుసారియైన ఈ ప్రక్రియలను, యూరోపు ప్రజలు తమకు లభించిన కొత్త జాగృతితో తప్పుతప్పుగా వివరించడం ప్రారంభించారు. “టౌలెమి” చెప్పినవాటితో విభేదించారు. కారణం, “సోక్రటీస్” ప్రభావం. ఆతని ప్రభావంతో ప్రజలు అప్పటి క్రైస్తవ మత పెద్దల మాటలని విశ్వసించలేదు. తరువాత 15వ శతాబ్దానికి చెందిన “కోపర్నికస్” భూమి నారింజ పండులా గుండ్రంగా ఉండే గ్రహమని, ఇది సౌరమండలానికి చెందిందని ప్రతిపాదించాడు. భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు భూమి యొక్క సృష్టికి కోట్లాది సంవత్సరాలు పట్టివుంటాయని తీర్మానించారు.

ఇలా యూరోపు ప్రజలకు మతగ్రంథాలలోనూ, అతీంద్రియ పదార్థాల ప్రక్రియల్లోనూ నమ్మకమన్నది క్రమేణ క్షీణించింది. దైవీ ప్రపంచపు అన్ని విచారాలను విడిచేసి, కనిపించని పదార్థాల ప్రభావాన్ని తోసిపుచ్చి, వీటికీ ప్రకృతిలోని క్రియలకూ ఎలాంటి సంబంధం లేదని ప్రకటించుకుని, కేవల భౌతిక (జడతత్వపు)వాదాన్నే అవలంబించసాగారు. దీన్నే మన ప్రాచీనులు గౌతమ ముని శాపఫలమని చెప్పారు.

బ్రిటీషుల పాలన కారణంగా ఈరకపు జడతత్వ దృష్టి మన దేశానికి కూడా పాకింది. ఇప్పటికీ చెక్కుచెదక నిలిచింది. ఈ భౌతిక వాదపు సత్యాసత్యాలను తెలుసుకునే ప్రయత్నమే ఈ వ్యాసం.

ఆధునికత ప్రాభవం:

“శృతిర్వావానిత్యం”

“భూతం భవ్యం భవిష్యం చ సర్వం వేదాత్ప్రసిద్ధతి”

“వేద ఏవద్విజాతీనాం ని:శ్రేయసకర: పర:”

“వేదాద్ధర్మోహి నిర్భభౌ:”

“ధర్మ: జిజ్ఞాసమానానాం ప్రమాణం పరమ శృతి:”

ఈ ప్రమాణాలను విమర్శనాత్మక దృష్టితో అవలోకించినపుడు, అపౌరుషేయము, అనాదియూ, స్వత:ప్రమాణమూ, నిత్యము, నిర్దుష్టమూ ఐన వేదాల ఆవశ్యకత అర్థమౌతుంది. ధర్మం వేదం నుండే ఆవిర్భవించింది.

“ధర్మోహి జగత ప్రతిష్టా” – ధర్మమంటే ప్రపంచంలోని మంచి వ్యవస్థ యొక్క క్రమమే. అదే జగత్తు యొక్క ప్రతిష్టకు కారణం.

“సర్వం ధర్మే ప్రతిష్టతి” – సర్వమూ ధర్మంలో ఇమిడివుంది. ఈ ధర్మమే సకలానికీ ఆధారం. ఈ కారణమ్ వల్లనే “ధర్మో రక్షతి రక్షిత:” అన్న ప్రమాణం ఏర్పడింది. ఐతే కలియుగంలో వేదోపనిషత్తులను బోధించే వారే ఎక్కువై, ఆచరించేవాళ్ళు తక్కువైనారు.

“స్వే స్వే కర్మణ్యేభిరత: సంసిద్ధిం లభతే నర:” అన్న శ్రీకృష్ణుని ఉక్తి మేరకు ప్రతి వర్ణంవారూ సహ వారి వారి విహిత కర్మల్లో నిరతులవడం ఉచితం. “విహితత్వాచ్చాశ్రయ కర్మాపి” అనే బ్రహ్మసూత్రం దీన్నే చెబుతోంది. ఈ వేదోక్త కర్మాచరణలు “శృతి స్మృతి: హరేరాజ్ఞాఅని జగత్సృష్టి కర్తయైన భగవంతుని ఆజ్ఞారూపమని భావించేవారే ఆస్తికులు.

ఈ కర్మాచరణ వల్ల ఇహ పర సౌఖ్యాలను పొందడమన్నది సూర్యుని వెలుగంత స్పష్టం. “యజ్ఞో దానంతపశ్చైవ పావనాని మనీషిణాం” అన్న గీతోక్తి మేరకు యజ్ఞ, దాన, తపస్సు, దైవపూజ మొదలైన సత్కార్యాలు అతి ముఖ్యమైనవి. ఈ విద్యుక్త ధర్మంలో ఆసక్తి ఉన్నవారినే బ్రాహ్మణునిగా భగవంతుడు భావిస్తాడు. ఇందుకు ప్రమాణం

“దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మనాధీనాం బ్రాహ్మణో మమ దేవతా”

దేవతల స్థానమానాలను నిరూపించే వేదాలలో

“అగ్నిర్వై సర్వే దేవా:”,

“అపోర్వై సర్వే దేవా:”,

“బ్రాహ్మణోవై సర్వే దేవా:”,

“అగ్నిశ్యుచివు తతమశ్యుచిర్వప్రశుచి: కవి:”

అని వర్ణించారు. ఈ విధిమైన బ్రాహ్మణ్యాన్నే పూర్వీకులు గౌరవించారు. అంతేకానీ పుట్టు బ్రాహ్మణ్యాన్ని కాదు. ఐతే రానురాను పుట్టు బ్రాహ్మణ్యమే ప్రధానమైపోవడంతో దాని పట్ల విముఖత పెరిగిపోయింది. ఇది శోచనీయం.

వైదిక ధర్మాచరణాలలో బహుముఖ్యమైన యాగ-యజ్ఞాదులలో సంభవించే రసాయనిక క్రియాల స్వరూపాన్ని ఇప్పుడు విమర్శించుకుందాం. పూర్వం అగ్నిహోత్రం, హోమం, హవనం, సవనం, యజ్ఞం యొక్క నిర్వహణ దినసరి కార్యక్రమమంగా ఉండేది. శాస్త్రాల ఆధారాల మేరకు జ్ఞాన, భక్తి, దేవుని ప్రసాదపు స్వీకరణ, తద్వారా మోక్షమని మెట్టు మెట్టుగా ఫలాలను ఒప్పి, వాటి ప్రాప్తి కోసం ఈ కార్యక్రమాలను ఆచరించేవారు. ఈ యజ్ఞయాగాదులలో భస్మమయ్యే సేంద్రియ వస్తువుల ద్వారా ఉత్పత్తి అయ్యే క్రిమినాశక పదార్థాలు, రోగకారకమైన అణువుల్ని నాశనం చేసి వాతవరణాన్ని కలుషితం కాకుండా చూసేవి.

ఈ నిర్మల వాతావరణంలో ప్రజలు ఆరోగ్యవంతులై మరియు ధృడకాయులై ఉండేందుకు ఎంతో అవకాశముండేది. కేవల ధార్మికాచరణంగా పిలువబడే ఈ యజ్ఞ నిర్వహణ ప్రతినిత్యం నడిచేది. ఈ యజ్ఞయాగాదులలో కేవలం సేంద్రియ పదార్థాల వాడకమే ఉండేది. ఐతే ఆనాడు ఈ కార్యక్రమాలలో మిళితమైన వైజ్ఞానిక (సైంటిఫిక్) కారణాలను ప్రజలు ఎక్కువగా పట్టించుకోలేదు. అందువల్ల వీటిని సైంటిఫిక్ ఈవెంట్స్ గా వాళ్ళు ప్రచారం చేయలేదు. రాను రానూ ఆధ్యాత్మికత తగ్గి వైజ్ఞానికత పెరగడంతో కొత్త కొత్త రసాయనాలను కనిపెట్టడం జరిగింది. ఈ రసాయనాల మిశ్రణ వల్ల క్రిమిసంహారక మందులను తయారుచేయడం కూడా జరిగింది. ఈ మందులను ఇళ్ళల్లోనూ, చుట్టూ ఉండే ప్రదేశాల్లోనూ విరివిగా వాడడం జరిగింది. ఒకవైపు యజ్ఞయాగాలను మూఢనమ్మకాలుగా పరిగణించి, వాటి నిర్వహణను మానివేయడం జరిగింది. కృత్రిమ క్రిమినాశకాల వల్ల వాతావరణ కాలుష్యం హెచ్చింది. స్వచ్ఛమైన వాతావరణం నశించసాగింది.

యజ్ఞయాగాదులలో నెయ్యి, పాలు, పిండి, అన్నం, చక్కెర, పళ్ళు, టెంకాయ, కొబ్బరి మొదలైన వాటిని విరివిగా వాడేవారు. ఆధునికత పెరిగిన తరువాత ఈ పదార్థాల వాడకాన్ని వ్యర్థ కార్యంగా భావించడం మొదలైంది. ప్రజలకు ఉపయోగపడే ఈ పదార్థాలను కాల్చి బూడిద చేసే ప్రక్రియగా యాగాలను నిరసించడం జరిగింది. ఐతే ఈ భావనలు సరికావని ఇటీవలి ప్రయోగాలు నిరూపిస్తున్నాయి. కృత్రిమ రసాయన పదార్థాల వల్ల జరిగే కాలుష్యపు నివారణకు సేంద్రియ పదార్థాలను భస్మం చేసే యాగాలే విరుగుడని తేలింది.

యజ్ఞాలలో ఉత్పత్తి అయ్యే వస్తువుల వివరాలు:

హోమ-యజ్ఞాలలో భస్మమయ్యే పదార్థాలు, క్రమంగా, కట్టెలు (అశ్వత్థ, వేప, మత్తి, శ్రీగంధం, దేవదారు, మామిడి, పనస, చింత, అర్జున, శమీ, బదరి, అర్క మరియు అనేక మూలికలు, వేర్లు), ఆవు పేడ, నెయ్యి, వెన్న, పాలు, అనేక ధాన్యాలు, కొబ్బరి, పిండి, అన్నం (చరు), బెల్లం, చెరకు, సుగంధద్రవ్యాలు, అపురూపమైన మూలికలు. సరిగ్గ గమనిస్తే ఇవన్నీ సేంద్రియ పదార్థాలే. వీటన్నింటినీ చేర్చి దహన క్రియను నడపడం వల్ల రసాయనిక చర్యలు జరిగి అనేకమైన క్రిమినాశక వస్తువులు, వాయువులు, ఆవిరి ఉత్పత్తి అవుతాయి. ఈ క్రియల్లో “ఫార్మాల్డిహైడ్” (HCHO), “ఎనిటాల్డిహైడ్” (CH3CHO), “అసిటిక్ ఆసిడ్” (CH3COOH), “ఆలాల్డిహైడ్” (CH3OH), “అసిటోన్” (CH3COCH3), “ఫీనోల్” (C6H5OH) అనేక ఇతర హైడ్రోకార్బనులు విడుదలవుతాయి. ఇవన్నీ ఏదో ఒక క్రిమినాశక తత్వాన్నికలిగినవే.

“ఎనిటాల్డిహైడ్”, “ఫార్మాల్డిహైడ్” మొదలైనవి తీవ్రంగా ఆవిరయ్యే ద్రవపదార్థాలు. వీటి బాష్పీభవన స్థాయి 20o మరియు 40o సెంటీగ్రేడ్. వీటికి ఊపిరిని ఆపివేసేంత వాసన ఉండడంతో క్రిమి కీటకాలు వీటి ఆవిరిలో బ్రతకలేవు. ఐతే ఈ అవిరుల సాంద్రత తక్కువున్నప్పుడు వీటికి సువాసన ఉంటుంది. ఇది మనిషి దేహానికి ఉపయోగకరమైంది.

“ఆల్కహాల్” (CH3OH), “బెంజీన్” (C6H6), “ఈథర్” [(CH3CH2)2O] మొదలైనవి ద్రవాల్లో కరిగేవి. అందువల్ల వీటితో తయారైన ద్రావణాలను క్రిమినాశకాలుగా ఇప్పటికీ వాడుతున్నారు. “ఫార్మిక్ ఆసిడ్” రంగులేని ద్రవ పదార్థం. ఇది ఘాటు వాసనతో కూడినది. “అసిటిక్ ఆసిడ్” చర్మాన్ని కాల్చివేసే సామర్థ్యం కలిగినది. దీనికి కూడా విశేషమైన వాసన ఉంది. ఇది నీటి ఆవిరితో కలిసినపుడు “కార్బోలిక్ ఆసిడ్”గా మారుతుంది. ఇది మనిషి చర్మంలోని క్రిములను, చెమట వాసనను నాశనం చేస్తుంది.దీనిని సబ్బుల తయారీలో వాడుతారు.

జీవాణువుల్ని నాశనం చేసే “నాఫ్తలిన్” (C10H8) ఘాటు వాసన కలిగి వేడి చేసిన మరుక్షణమే ఆవిరిగా మారి వాతావరణంలోని రోగకారక అణువుల్ని నాశనం చేస్తుంది. దీనికి “నాఫ్తలిన్ బోల్జ్” అని ఇంకొక పేరు ఉంది. ఈ పదార్థాన్ని క్రిములనుండి దుస్తుల్ని కాపాడడానికి వాడతారు. హోమ – యజ్ఞాలలో అగ్ని ఎక్కువ కాలం మండడానికి కొన్నిరసభరితమైన కట్టెలను వాడడం వల్ల జిగురు పదార్థంతో కూడిన “టర్పంటైన్” ఉత్పత్తి అవుతుంది. ఇది కూడా క్రిమి సంహారిణే. హోమంలో వాడే నెయ్యి, పాలు, జిడ్డుతో కూడిన ఇతర పదార్థాలను భస్మం చేయడంవల్ల కట్టెలలోని “సెల్యులోస్” (C6H10O5) మరియు “ఆగ్నోసెల్యులోస్”[(C6H10O5)x]లను సంపూర్ణంగా దహించేందుకు వీలౌతుంది. నెయ్యి లాంటి జిడ్డు పదార్థాలలో “అసిటిక్ ఆసిడ్” మరియు “గ్లిసరాల్” (CH2OHCHOHCH2OH) ఉంటాయి. ఇవి కట్టెలను దహించే క్రియలో కొన్ని రకాల ఆమలాలను విడుదల చేస్తాయి. “గ్లిసరాల్” దహనంతో “ఎక్రోలిన్” (ఆల్డిహైడ్) పుడుతుంది. అలాగే అనేకరకాల “ఎస్టర్లు” కూడా వాతావరణాన్ని చేరుతాయి. వీటన్నిటినీ వేసి హోమం చేసిన చాలా సమయం వరకు కూడ సువాసనను వెదజల్లుతూనే ఉంటాయి.

ఐతే ఈ “ఎస్టర్లు” స్త్రీల గర్భకోశానికి హాని కలిగిస్తాయి. ఈ విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు కనుక, పూర్వీకుల యజ్ఞాల పూర్ణాహుతి సమయంలో గర్భిణీ స్త్రీల ప్రవేశాన్ని నిషేధించారు. ఇలా యజ్ఞాల నుండి ఉత్పన్నమైన రసాయన పదార్థాలు కేవలం క్రిమి, కీటకాలను మాత్రమే నాశనం చేస్తాయని అనుకోరాదు. ఇవి దీర్ఘకాలిక రోగాలను కూడా నయం చేయగలవు. ఇది ఏ మాత్రం హస్యాస్పదమైన విషయం కాదు. యజ్ఞకుండం నుండి వెలువడే ఆవిరులు, పొగల ద్వారా సూక్షమైన రసాయన పదార్థపు అణువులు, భస్మం మనిషి దేహాన్ని చేరి దీర్ఘకాలంగా బాధిస్తున్న కంటి వ్యాదుల్ని, తలనొప్పుల్ని, పార్శవపు నొప్పుల్ని, అనేక చర్మ రోగాల్ని, మూర్చ రోగాలను, ఉదర సంబంధ రోగాలను నయం చేస్తాయి.

ఇప్పటికీ ఆయుర్వేద వైద్య పద్ధతిలో భస్మాలను వాడే పద్ధతి ఉంది. ఈ భస్మాలనుహోమ, యజ్ఞాదుల నుండే గ్రహించడం జరుగుతుంది. అస్తిగత రోగమైన ట్యూబర్ క్యులోసిస్ మరియు నేత్ర రోగాలకు “అమృతవేరు”ను దహించి చేసిన హోమపు భస్మం చాలా మంచిది. నాగకేసరి, లవంగ, యాలకులు, మిరియాలు, అశ్వగంధ, దేవదారు, వేప మొదలైనవాటిని మంత్రపూరితంగా హోమంలో వేసి, ఆ భస్మాన్ని రోజూ సేవిస్తే దీర్ఘకాల జ్వరం, పాండురోగం, అజీర్ణం, కామెర్లు, కుష్టు, శ్వాసకోశ వ్యాధులు, ఉదరవ్యాధులు, వాత సంబంధి రోగాలు పూర్తిగా నయమౌతాయి.

ఇవే కాకుండా అనేక వాతావరణ పరిరక్షకాలైన రసాయనాల విడుదలకు కూడా ఈ యజ్ఞాలు దోహద పడతాయి. పూర్వకాలంలో యజ్ఞాలు రోజుల తరబడి సాగేవి. యజ్ఞం జరిగినన్ని నాళ్ళూ యాజ్ఞీకులు కేవలం పాలు మాత్రమే తీసుకుని, ఉచ్ఛకంఠంతో రోజంతా మంత్ర పఠనం చేసి, వేసిన ఆసనం నుండి బహుకాలం కదలకుండా కూర్చునేవారు. ఈ దేహ ధారుఢ్యానికి యజ్ఞాలనుండి విడుదలయ్యే పదార్థాలే కారణం. అందువల్ల పదార్థాలను వ్యర్థంగా కాల్చే ప్రక్రియగా యజ్ఞాలను పరిగణించడం తప్పు.