ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అడ్డరోడ్డు కబుర్లు – అన్నా హజారే

Like-o-Meter
[Total: 0 Average: 0]

“చట్టాలు చేసే విశేషాధికారాలున్న పార్లమెంటునే అన్నా హజారే ప్రశ్నిస్తున్నారు?” – ప్రధాని మన్ మోహన్ సింగ్. 

ప్రశ్నిస్తున్నాడనే అన్నాను అరెస్టు చేసారే. మరి, పార్లమెంటు మీద తుపాకీ గుళ్ళ వర్షం కురిపించిన అఫ్జల్ గురు సంగతేంటి సార్?

“చట్టాలు రూపొందించే పార్లమెంటు వ్యవహారాల్లో ఎవరో నలుగురు జోక్యం చేసుకొని బ్లాక్ మెయిలింగ్ చేయటం సరికాదు” – ప్రణబ్ ముఖర్జీ

 

ఆ ఎవరో నలుగురికి లోక్ పాల్ బిల్లు ముసాయిదా కమిటీలో చోటిచ్చినప్పుడు ఈ ఇంగితం ఏమయ్యింది సార్?

 

“తన పుట్టిన రోజుకు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ట్రస్టు నుంచి ఖర్చుపెట్టిన అన్నా హజారే నిజాయితీపరుడా”? – దిగ్విజయ్ సింగ్

 

తన క్లారిఫికేషన్ అన్నా ఆల్రెడీ ఇచ్చేసారు. మరి, ఎవడబ్బ సొమ్మని రోడ్లు మొదలుకొని మరుగుదొడ్ల వరకు, స్టేడియాలు మొదలుకొని ఎయిర్ పోర్టుల వరకు గాంధీల పేర్లు తగిలిస్తున్నారు సార్? అమ్మగారు పుట్టిన రోజుకి, అయ్యవారు చచ్చిన రోజుకి నానా రకాల పధకాలు తయారు చేసి ప్రజల నెత్తిన రుద్దుతున్నప్పుడు అవి ఎవడి డబ్బులని అడగలేదేంటి సార్?

 

అన్నాను ఉద్దేశించి “నువ్వు కింద నుండి మీద దాకా అవినీతిలో మునిగున్నావు” – మనీష్ తివారి

 

అవును సార్, అన్నా అవినీతి అనే మురికిని తుడుస్తున్నాడు కాబట్టి ఆయనా మురికివాడిలా కనిపిస్తున్నాడేమో మీకు. బై ద వే, బోఫోర్సు లో రాజీవ్ గాంధి, నోయిడా భూమి కబ్జాకు సంబంధించి సోనియా గాంధి, కామన్ వెల్త్ గేముల్లో సురేష్ కల్మాడి, ఆదర్శ్ కుంభకోణంలో విలాస్ రావు, అశోక్ చవానులు కాళ్ళ వరకే అవినీతిలో మునిగారా, మోకాళ్ళ వరకే మునిగారా!

 

“మాట మన్నన తీరు తెన్ను లేనే లేదు. అన్నా వాడే భాష ఎంత అసహ్యకరంగా ఉంది!” – కపిల్ సిబల్

 

అవును సార్. ఆర్మీలో ఏదో చిన్న ఉద్యోగం చేసాడాయన. పెళ్ళైనా చేసుకోలేదు మర్యాదాలు, మన్ననలు తెల్సుకోటానికి. పైగా, మురికివాడల్లో, పంటపొలాల్లో తిరుగుతాడు అందుకే భాష అలా ఉందేమో. అయినా, ఆయన ప్రధానిని ఏమన్నాడు…. “ప్రధాని కపిల్ సిబల్ లా మాట్లాడుతున్నాడు” అనేగా. దానికే అంత ఫీలైతే ఎలా. ఆయన మిమ్మల్ని తిట్టాడనుకున్నారా!

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>