ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చీపురుతోడ చిమ్మి….

Like-o-Meter
[Total: 0 Average: 0]

“నమస్కారాలు గురూ!”

“ఆ పుష్పహారమేమిటి శిష్యా?”

“ఢిల్లి నుండి దిగుమతి చేసుకొన్న కమలాలు గురూ! మీకు సమర్పిద్దామని తీసుకొచ్చా!”

“నచ్చినావురా…మెచ్చినానురా..కానీ కమలాలు వాడిపోయినవెందుకురా?”

“దిగుమతిలోని లోపమేమో గురూ! ఆ…అన్నట్టు…ఈ దేహంలో ఒక సందేహం రగులుతూ మీ సందేశం కోసం తహతహలాడుతోంది గురూ! అడగమంటారా?”

“హు..హు..హు..అడుసు కడుక్కోడానికి అనుమానం తీర్చుకోడానికే పుట్టాయిరా అర్భకా! అడుక్కో, కడుక్కో!”

“ధన్యోస్మి గురూ! ఈ వాడిన ఢిల్లీ కమలాలని చూస్తుంటే కూతవేటు దూరంలో ఉన్న ఢిల్లీ సింహాసనాన్ని అందుకోలేక చతికిలబడ్డ పార్టీ ఒకటి గుర్తొస్తున్నది గురూ! ఢిల్లీవాసుల బుర్ర ఊసులు మీబోటి విణ్ణామ్మన్యులకు గాని మాబోటి కాఫీ, ఉప్మామ్మన్యులకు తెలిసేనా? వివరించి, ఉద్ధరించండి గురూ!”

“వెర్రోహం! ఈ పుణ్యభూమిలో నీవు తప్పబుట్టావురా శుంఠాగ్రేసరా! బుడుతాగ్రణీ!”

“అయ్యో! అదేమిటి గురూ! అంతలా అనేసారు!”

“హర్టయ్యావా శిష్యా?”

“నిర్భయ చట్టంలాగా దుర్భాషా నియంత్రణ చట్టం తీసుకొనిరావాలని ఇప్పుడే కంకణం కట్టుకొంటున్నాను గురూ!”

“వద్దు శిష్యా! వద్దు! అంతటి పనికి దిగొద్దు. నీకు కావలసిన విషయమూ, రావలసిన సమాధానమూ కళ్ళెదుటే ఉన్నా కనిపెట్టలేని నీ కబోదితనాన్ని అలా గుర్తుచేసాను. అంతే!”

“అయ్యో! అవునా గురూ! కళ్ళున్నా కబోదినైపోయానా? ఎలా? హౌ?”

“ఈ పార్టీల గుర్తులను ఒక్కసారి పరీక్షగా చూడు శిష్యా!”

“చూసాను. చూస్తున్నాను కూడా. కానీ…..”

“పోనీ…ఇలా ప్రయత్నించు. ఇదేమిటి?”

“హస్తం”

“ఇదేమిటి?”

“చీపురు”

“మరి ఇదో!”

“కమలం”

“కరుణశ్రీవోహం….కరుణశ్రీవోహం. ఏమైనా వెలిగిందా శిష్యా?”

“కరెంటు కోతలతో సతమతమౌతున్న రాష్ట్రవాసిని. ఇలా దెప్పడం న్యాయమా గురూ?”

“హు..హు..హు..ఈరోజు నువ్వెందుకో మరీ పద్మశ్రీ బిరుదు రాలిపోయినవాడిలా అత్తిరిబిత్తిరైపోతున్నావ్. క్షమిస్తున్నాను ఫో!”

“పోతాను గురూ! నా బల్బును దయతో వెలిగించండి. వెంటనే వెళ్ళిపోతాను.”

“ఆపై చీపురుతోడ చిమ్మి మమ్మావలకు పారవోతురు గదా!”

“అహో…అహో…అహో…వెలిగింది గురూ వెలిగింది! వాడిన పూలను ఊడ్చాలంటే చీపురు కావాలి. చీపురు చేత ఊడ్పించాలంటే చెయ్యి కావాలి. చెయ్యి-చీపురు కలిస్తే పూలేమిటి ఖర్మ నీతులు, నియమాలు, నిష్టలు, నిబంధనలూ – ఇలా సమస్తమూ కొట్టుకుపోవల్సిందే! ఆహా…నా జన్మ ధన్యమైంది. ఆహా..ఆహా!”

“హు..హు..హు..వెళ్ళిరా శిష్యా! మా నిత్యానంద సేవకు వేళమాయెను!”

“ధన్యోస్మి గురూ! “ఆప్” చీపురుతోడ చెయ్యి మమ్మావలకు పారవోసెను గదా ఢిల్లి ప్రజలకు దిల్లువున్నదా అన్న కమలాల ఘోష…అహా…చాలా కర్ణభేద్యంగా ఉందు గురూ. కాస్త పత్తిని అనుగ్రహించండి.”

“వెర్రోహం….వెర్రోహం…నీ బొంద…ఇంద!”