ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చిటపటలు-11 “సాం బేర్ బేరియన్స్”

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఆస్తికుడైనా, నాస్తికుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడని కరుణానిధి నిరూపించాడు. మునుపు “రామసేతు” వివాదం చెలరేగినప్పుడు “రాముడు ఎవరు? ఆయనేమన్నా ఇంజనీరా? అసలు రాముడనే వ్యక్తి ఉన్నాడనటానికి ఆధారాలు ఉన్నాయా”? అని ప్రశ్నించిన కరుణానిధి ఇప్పుడు మాత్రం “రాముడంతటివాడికే పదవీ వియోగం తప్పలేదు, ఇక నేనెంత” అని నిట్టూరుస్తున్నాడట.

జనాల మధ్య జోకర్లు ఉండటం సహజమే. కానీ, కళా రాజకీయ రంగాల్లో ఉన్నది మాత్రం జోకర్లే అని కూడా పెదవి విరిచాట్ట! ఎన్నేళ్ళ తర్వాత అద్దంలో తన మొహం చూసుకున్నాడో ఈ కళాకారుడు ఉరఫ్ రాజకీయ నాయకుడు అని అన్నాడిఎంకె వాళ్ళు గుసగుసలాడుతున్నారట!

* * *

తమిళనాడులో ఈయన ఇలా బేర్ బేర్ మని ఏడుస్తుంటే, ఢిల్లీ తిహార్ జైల్లో మాత్రం ఖైదీలంతా కరుణానిధి పేరుతో పండగపండగ చేసుకుంటున్నారట. పంజాబీ తిండి తింటూ నోళ్ళు చవి చచ్చిపోతున్న సమయంలో ఆపద్బాంధవుడులా స్పెక్ట్రం రాజా జైల్లోకొచ్చాడు. ఈయన పుణ్యమా అని, ఇతర నేరస్థులు, అధికారులు కూడా రోజుకో వెరైటీతో ఇడ్లీ, సాంబార్, దోశ, కొబ్బరి చట్నీ, ఊతప్పాలు లాగిస్తూ లొట్టలేస్తున్నారట. ఇక కనిమొళి వచ్చిందే తడవుగా వంటవాళ్ళకి దక్షిణాది వంటలు కూడా నేర్పేసారట. వీళ్ళిద్దరినీ జైల్లోనే కాకుల్లా కలకాలం జీవించమని తీహార్ ఖైదీలే కాదు, అధికారులు కూడా ఆశీర్వదిస్తున్నారుట!