ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చిటపటలు-14 “మేధావులు, కొశ్శినీలు”

Like-o-Meter
[Total: 0 Average: 0]

రాష్ట్ర కాంగ్రెస్ లో మేధోమధనం జరగాలని వి.హెచ్. ముఖ్యమంత్రికి, పి.సి.సి. అధ్యక్షుడికి లేఖలు వ్రాసారుట! కాంగ్రెస్ లో మేధావులంటే చేతికి మంత్రదండమైనా ఇస్తారు లేదంటే, కాళ్ళు చేతులు కట్టి కుర్చీలో కూర్చోబెడతారుగానీ వాళ్ళతో మేధోమధనం ఎక్కడైనా చేస్తారా? కాంగ్రెస్ లో, అందునా రాష్ట్ర కాంగ్రెస్ లో మేధావులా అని జనాలు జుట్టు పీక్కొని విస్తుపోయేలోపు హనుమన్న వాళ్ళెవరో చెప్పేస్తే బాగుండు. ఈలోపు కాకులైన లోకుల ఊహాగానాల్లో మాత్రం కాకా, కేకే, శంకర్రావ్, సర్వే లే మేధావులని అమ్మనా-అయ్యనా బూతుల సాక్షిగా ప్రకటించేస్తున్నారు.

బై ద వే, రాష్ట్ర కాంగ్రెస్ మేధావుల లిస్టులో ఒకళ్ళనొకళ్ళు దుమ్మెత్తిపోసుకుంటూ లేటెస్టుగా లగడపాటి, పొన్నం ప్రభాకర్ చేరారని భోగట్టా.

* * *

తెలంగాణా కోసం ఏమైనా చేస్తాం… ప్రాణాలైనా పణంగా పెడతాం… తెలంగాణా వచ్చుడో, కె.సి.ఆర్ చచ్చుడో లాంటి ఎన్నెన్నో బీరాలు గత 6-7 సంవత్సరాలుగా వింటూ వచ్చాం. అడిగినవాడికి, అడగనివాడికి, వినేవాడికి, విననివాడికి చెవులు చిల్లులు పడేట్లు తెలంగాణా వాదం వినిపించే కె.సి.ఆర్. గత రెండేళ్ళల్లో కేవలం 11 కొండు రోజులు మాత్రమే లోక్ సభ సమావేశాలకు హాజరయ్యారుట! ఆ పదకొండు రోజుల్లోనూ కనీసం ఒక్కసారైనా నోరు మెదపలేదట! గంతకు తగ్గ బొంతలా విజయశాంతి కూడా హాజరు విషయంలో ఏమీ తీసిపోలేదని సమాచారం. ఈవిడ కూడా పార్లమెంటులో మూతి బిగించుకునే కూర్చుందట! వీరికి తోడు మరో ఏడు మంది రాష్ట్ర ఎంపీలు ఈ రెండేళ్ళు పార్లమెంటులో ఆవులిస్తూనే గడిపేసారట! కూసే వాడొచ్చి మేసే వాడిని చెడగొట్టాడని, ఆ పార్టీకి ఒకే ఒక్క ఎంపీగా ఉన్నా 512 కొశ్శెనులు వేసాడని అసదుద్దీన్ ఒవైసీ మీద గుంభనంగానే అగ్గి మీద గుగ్గిలాలౌతున్నాయట ఈ తొమ్మిది గ్రహాలు!

 

బ్రేవో అసదుద్దీన్! అడగందే అమ్మైనా పెట్టదు ఈ రోజుల్లో… అడిగినా పెట్టని అమ్మ కొలువైన పార్లమెంటులో, సిగ్గు పడకుండా కొశ్శెనీలు అడుగుతూనే ఉండాలి.