ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చిటపటలు-16 “దండోపాఖ్యానం – భోళా శంకరులు”

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఈమధ్య డిగ్గీరాజా వారి “దండోపాఖ్యానం” వినే మహద్భాగ్యం మరోసారి కలిగింది. అయ్యవారి “దండబోధ”లో మన రాజకీయ నాయకులెంత భోళా శంకరులనే విషయం తెలిసి కళ్ళు తెరుచుకున్నాయి. అదేలానో మీరూ తెలుసుకోండి.

* * *

2007 లో ఏదో దద్దమ్మల సామాజిక సేవా సంస్థ శీతలపానీయాల్లో పురుగుల మందులు వాడుతున్నారని ఆ రిపోర్టులు, ఈ రిపోర్టులు ఉటంకించి నానా రభస చేసింది. దేశంలో శీతల పానీయాలని నిషేధించాలని కూడా గొడవ చేసింది.

ఎందరెందరో సినీ తారలు, క్రికెటర్లు శీతలపానీయాలతో ప్రజలని ఉత్తేజితులని చేస్తుంటే, ప్రజలని త్యాగం చేయమనటానికి దద్దమ్మలకు నోరెలా వచ్చిందని అందరూ ఆడిపోసుకున్నారు.

ప్రజల నెత్తిన భారాన్ని పెట్టకుండా, కేంద్ర ప్రభుత్వం మాత్రం త్యాగం చేసే భారాన్ని తన నెత్తిన వేసుకుంది. పార్లమెంటు క్యాంటీన్ నుంచి శీతల పానీయాలని నిషేధించింది. శీతల పానీయాలు వదిలేసి, కేవలం లస్సీలు, జ్యూసులతోనే కాలం గడిపేస్తున్నారట మన ఎంపీలు. చూశారా, ప్రజల కోసం మన ప్రజా ప్రతినిధులు ఎంతెంత త్యాగం చేస్తున్నారో!

* * *

అన్నా హజారే పుణ్యమా అని, ప్రభుత్వం ఎట్టకేలకు పార్లమెంటులో లోక్ పాల్ బిల్లు ప్రవేశ పెడుతున్నది. ప్రధానిని, ఉన్నత న్యాయస్థానాలని, పార్లమెంటులో ఎంపీల వ్యవహారానికి, నిర్వాకాలకి కూడా లోక్ పాల్ పరిధి నుంచి మినహాయింపు ఇచ్చేసారు!

లోక్ పాల్ బిల్లు ప్రేరణతో, రాష్ట్ర స్థాయిల్లో లోకాయుక్త కూడా ఇలాంటి మినహాయింపులే ఇచ్చే దిశగా మరెన్నో రాష్ట్రాలు ఆలోచిస్తున్నట్లు భోగట్టా. ఇకమీదట బయట కాకుండా పార్లమెంటులోనో అసెంబ్లీలో మాత్రమే లంచాలు మేయాల్సి రావటం త్యాగమే కదా!!

దీనివల్ల, అవినీతి అనే జాడ్యం అసెంబ్లీ, పార్లమెంటు వరకే పరిమితమౌతుందిట. సాధారణ జన బాహుళ్యం అవినీతికి దూరంగా హాయిగ బతుకులు వెళ్ళబుచ్చొట!

శీతల పానీయాలు త్యాగం చేసి, అవినీతి అనే గరళాన్ని మింగుతున్న మన ప్రతినిధులు భోళా శంకరులే… కాదనగలమా?

* * *