ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చిటపటలు-19 “చంటబ్బాయిలు – చంద్రబాబు”

Like-o-Meter
[Total: 0 Average: 0]

పాపం చంటబ్బాయ్. తెలుగు సినిమాలలో ఎన్నెన్నో “పాత్రలు” అవలీలగా పోషించేసాడు. రాష్ట్ర రాజకీయాల్లో కూడా తనో “పాత్ర” ధరిద్దామనుకుంటే, ప్రజలు వేరే “పాత్ర” ఇచ్చేసారు. ప్రజలిచ్చిన “పాత్ర” ఈ జగదేకవీరుడికి నచ్చలేదు. ఈ “పాత్ర” మారాలంటే మరో అయిదేళ్ళు పట్టేస్తుంది. త్రినేత్రుడి మూడో నేత్రం జ్ఞాన బోధ చేసే సరికి బంపర్ ఆఫర్ కోసం కాంగ్రెస్ అంట కాగాలనే నిర్ణయించాడు. తన పార్టీలోనైతే ఒక్కటే “పాత్ర”. అదే వందేళ్ళ పైబడ్డ కాంగ్రెసైతే, కావల్సినన్ని “పాత్రలు”, కాకపోతే “చెంచాలు, గరిటెలు” ఉండనే ఉన్నాయి.

ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో కాంగ్రెస్ ముందు నీ “పాత్ర” ఇచ్చేయమంది, ఇచ్చేసాడు. నా “పాత్ర” ఏదని అడిగితే, కాంగ్రెస్ లో “పాత్ర” అంటే చాలా వ్యవహారాలున్నాయి, ముందు తీర్ధం పోస్తాం, శఠగోపం పెడతాం, ఆ తర్వాత ప్రసాదం ఇవ్వబడుతుందని సర్ది చెప్పారు. ఇవ్వబోయేది కేంద్రంలో “పెద్ద పాత్ర” అని కొన్నాళ్ళు ఊరించారు. కాదు కాదంటూ రాష్ట్రంలోనే “చాలా పెద్ద పాత్ర” అని ఊహించుకున్నాడు. చిన్న పాత్రలైనా, చితక పాత్రలైనా ఏదో ఒక “పాత్ర” పడేస్తారనే నమ్మకంతో ఇంట్లో “పాత పాత్రలు” అన్నీ ముందేసుకొని మీనమేషాలు లెక్కిస్తున్నాడట “కొదమసింహం”

* * *

సింహమంటే గుర్తొచ్చింది. “కరువుప్రాంత రైతులకు సహాయం అందించకపోతే, ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతా” నంటూ చంద్రబాబుగారు గర్జించారని వార్తలు. మొన్నగాక అటుమొన్న, ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని భరోసా ఇచ్చిన పెద్దమనిషి ఇలా గర్జించటం ఏంటో! తమ గుండెలు వదిలేసి ఆయన ఎక్కడ బబ్బున్నా బాధలేదని రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారట! తెలుగు తమ్ముళ్ళు మాత్రం బస్టాండుల్లో బఠానీలు తింటూ… ఈయనెప్పుడు నిద్రలేస్తారా అని నిట్టూర్పులు విడుస్తున్నారని భోగట్టా!

* * *

బస్టాండులో బఠానీలంటే గుర్తొచ్చింది. ఈ మధ్య దేశంలోని ఏ ఊరికెళ్ళినా అక్కడ రైల్వే స్టేషన్ల దగ్గర అడుక్కునే వాళ్ళ మీద గుగ్గిలమౌతున్నాడట యువరాజు. సంగతేమిటా అని ఆరా తీస్తే, అలా అడుక్కునేవాళ్ళలో చాలామంది మాది ఉత్తర ప్రదేశ్ అని గర్వంగా చెప్పుకుంటున్నారట! అలా అడుక్కోటానికి సిగ్గుగా లేదా, కనీసం ఇప్పుడైనా హస్తానికి ఓటేయండి యు.పి.లోనే అడుక్కునే అవకాశం ఇస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాడట.

యు.పి.లో అడుక్కునే ట్రైనింగు కూడా ఆల్రెడీ మొదలేసాడని ప్రతిపక్షాలు ఆడిపోసుకుంటున్నాయి. పూటకో గుడిసెలో దూరి “చాయ్ పానీ మై యెహీ పీవుంగా, రోటీ భీ యెహీ ఖావూంగా” అని గుడిసెల్లో రొట్టెలన్నీ లాగించిగాని బయటకు రావటంలేదుట! ఓట్ల కోసం ఇన్నేసి డ్రామాలా అని యు.పి. పార్టీలు ముక్కున వేలేసుకుంటుంటే, నేను మీలా స్టూడియోల్లో కన్నీళ్ళు కార్చే డ్రామాలాడను. భారతదేశం స్టూడియోల్లో లేదు, గుడిసెల్లోనే ఉందని ప్రూవ్ చేయటానికే అడుక్కొచ్చిన రొట్టెలు లాక్కొని మరీ తింటాను అని వీరంగాలు కూడా వేస్తున్నాడట!

@@@@@

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>