ముఖ్యమంత్రి అవుదామనే దురాశతో ఉప ఎన్నికలకు జగన్ కారణమయ్యాడట! ఈ విమర్శలేవో నల్లారి వారో, నారా వారో చేస్తే సరిపుచ్చుకోవచ్చు. ఆఘమేఘాల మీద సి.ఎం. అయిపోదామని పార్టీ పెట్టి, గిరాకీ లేక ఆ పార్టీనే అమ్ముకొని, రాజ్యసభ సీటు కొనుక్కున్న కొణిదెల వారు ఖళ్ళుఖళ్ళు మంటుంటే, తిరుపతి నియోజకవర్గం హోల్ మొత్తంగా చెవులు చూపిస్తున్నదట పూలేమీ పెట్టుకోలేదని!
* * *
చంటబ్బాయ్ దగ్గులు ఇలా ఉంటే, వీహెచ్ మాత్రం గాండ్రించేస్తున్నాడు. జగన్ లాంటోళ్ళను వదిలేస్తే, ప్రజల ఇళ్ళల్లో చెంబులు, తప్పేళాలు కూడా దోచుకునేస్తారని ప్రజలు జాగ్రత్త పడాలని సలహాలిస్తున్నాడు. దేశంలో కాంగ్రెస్ పడి ఎనిమిదేళ్ళౌతుంటే ఇంకా దోచుకోటానికి ఎవరికి ఏం మిగిలి ఉంటుంది?
* * *
కాంగ్రెస్ అధినేత్రి సోనియా జీ లో ఓ గొప్ప గుణం ఉందట! ఆ పార్టీ నేతలపై ఎటువంటి ఆరోపణలు వచ్చినా ఆయా నేతలని ఆవిడ, ఇతర కాంగ్రెస్ నాయకులు గాలికి వదిలేయరట! ఆరు నూరైనా అండగా నిలబడతారట! పొరుగింటి పుల్లకూర రుచిని నోరు ఊరేలా యెడ్యూరప్ప చప్పరిస్తుంటే, సురేష్ కల్మాడి, అశోక్ చవాన్ లు గుడ్లురిమి చూస్తున్నారట, ఎ.కె.రాజా, కణిమొళి కారాలు మిరియాలు నూరేస్తున్నారట! ఇంతకి యెడ్యూరప్ప దగ్గుతున్నాడో, తుమ్ముతున్నాడో మరేదేమైనా చేస్తున్నాడో అర్ధం కాక, అటు కర్ణాటక కాంగ్రెసీయులు, భా.జ.పా.లు తలలు బాదుకుంటున్నాయని భోగట్టా.
@@@@@