ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చిటపటలు – 23 “పార్లమెంటు పండగ”

Like-o-Meter
[Total: 0 Average: 0]

అరవై ఏళ్ళ పండగ బ్రహ్మాండమైన తంతుగా ముగించేసారు పార్లమెంటులో మన ప్రజాప్రతినిధులు. పాత నేతల ఆదర్శాలపై ప్రసంగాలు దంచేసారు. మిగిలిన ఇద్దరు ముగ్గురు పాత తరం పార్లమెంటేరియన్లని సత్కరించేసారు. పార్లమెంటు ప్రతిష్టను పూవుల్లో పెట్టి మరి చూసుకుంటామని సురేష్ కల్మాడి, లాలు యాదవ్, కణిమొళి సాక్షిగా హామీలు గుప్పించేసారు. పార్లమెంటు ప్రతిష్టపై పిడకలు విసురుతున్న అన్నాను, పౌరసమాజాన్ని ఆక్షేపించేసారు. ఆ ఆవేశమంతా గోళీసోడాలా వెంటనే తుస్సుమంది.

ఇరవై నాలుగ్గంటలు గడవక ముండే అధికార ప్రతిపక్షాలు ఒకరి మీద మరొకరు దుమ్మెత్తిపోసేసుకున్నారు! మొత్తానికి కాకుల సాక్షిగా కలకాలం పరిఢవిల్లుతుంది మన ఘనప్రజాస్వామ్యం అని జనాలకి ఓ భరోసానిచ్చింది ఈ అరవై ఏళ్ళ పండగ.

బై ద వే, క్రిమినల్సు, అవినీతిపరులు కూడా ఈ నెలలో పండగ పండగ చేసుకుంటున్నారు. నాలుగైదు రోజుల క్రితం మాఫియా లీడర్ అబూ సలేం పైన అభియోగింపబడ్డ మోకా ను రద్దు చేసేసారట! నిన్ననే 2జి స్పెక్ట్రం కేసులో బెయిల్ పొంది ఎ.రాజా బయటకు వచ్చేసాడు. ఈ కేసుకు సంబంధించి తీహారు జైల్లో ప్రస్తుతానికైతే ఎవ్వరూ మిగల్లేదు. ఇవిలా ఉంటే, పార్లమెంటులో మన ప్రజా ప్రతినిధులు మాత్రం ఐ.పి.ఎల్. లో మ్యాచ్ ఫిక్సింగుల గురించి, యు.ఎస్.ఎ.లో కాళి మాత పేరు మీద అమ్ముతున్న బీయరు గురించి తీరిగ్గా తన్నుకు చస్తున్నారు!