ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చిటపటలు-21 “చెవిలో పూలు”

Like-o-Meter
[Total: 0 Average: 0]

రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మన గవర్నర్ గారు లాంఛనంగా తన ప్రసంగంతో ప్రారంభించేసారట. ఆయన ప్రసంగంపై రాజకీయ పక్షాలు మండిపడ్డాయి.

కమ్యూనిస్టులు : ప్రజలపై పన్నులు మోపి ఆదాయం పెరిగిందని చెప్పుకోవటం, అవినీతిలో మునిగిన ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేయటం, ఓవరాల్ ఇటువంటివేమీ పట్టించుకోకుండా గవర్నర్ ప్రసంగం మసి పూసి మారేడుకాయను చేసిందని కమ్యూనిస్టులందరు తమ నిరసనను చెవులో పూలు పెట్టుకోవటంద్వారా ప్రదర్శించారట!

అది చూసి గవర్నర్ ఏదో బాధపడిపోతారని, పడకపోతే ఈసారి చెవిలో పూలు కాకుండా గుండు చేయించుకొని నిరసన చేద్దామనుకునే ఆలోచన చేస్తున్నారేమో మన కమ్యూనిస్టులు. వాళ్ళు ఓ విషయం మర్చిపోయినట్లున్నారు. చెవిలో పూలు పెట్టుకోటానికే మన గవర్నరు గారు వారానికోసారి తిరుపతి వెళ్తుంటారు కదా. కమ్యూనిస్టుల చెవిలో పూలు చూసి ఈయన బాగా ఆనందపడే ఉంటారు.

తె.రా.స. : గవర్నర్ ప్రసంగంలో తెలంగాణా అంశం లేకపోతే నిరసన ప్రదర్శిస్తామని తెరాస ముందుగానే హెచ్చరించింది. ఊహించినట్లుగానే గవర్నర్ తెలంగాణా అంశం ప్రస్తావించలేదు. మరి తెరాస నేతలు కమ్యూనిస్టుల ప్రేరణతో ఎక్కడ ఏం పెట్టుకుంటారోనని ప్రజలు హడలిపోతున్నారట! ఐ మీన్ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారోనని నాలుగు కోట్ల ఆకాంక్షలు కంగారు పడుతున్నాయని భోగట్టా!

 

* * *

 

అయినా చెవిలో పూలు పెట్టటంలో సెకండ్ టు నన్ దిగ్విజయ్ సింగైతే, ఇప్పుడిప్పుడే డిగ్గిరాజాకు దడ పుట్టిస్తున్నాడట సల్మాన్ ఖుర్షీద్. ఓ.బి.సి. రిజర్వేషన్లలో ముస్లీములకు 9 శాతం ఉపకోటా కల్పిస్తామని దురద పుట్టినప్పుడల్లా ఈయన పూలు పెట్టేస్తుంటే, యు.పి. ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించకూడదని ఎన్నికల కమిటీ లాలించి, మందలించి, కాళ్లావేళ్ళా పడి బ్రతిమాలి, ఊరుకుంది.

ఆయనకా దురద తీరలేదు, పూలు పెట్టటమూ మానలేదు, ఎన్నికల కమిటీ పరువూ నిలవలేదు. ఇకపైగా, నా ముక్కు, నా దురద నా ఇష్టం. నా పార్టీ మానిఫెస్టో పెద్దగా చదివితే మీకేంటి ప్రాబ్లం అని కాలీ ఫ్లవర్లు కాబేజీల కోసం ఎదురుచూస్తున్నాడట! చివరాఖరికి ఎన్నికల కమిషన్ ఆ పూలు ఓ ఫిర్యాదు పత్రంతోపాటుగా రాష్ట్రపతికి పంపితే, ఆమె అవే పూలు అవే ఫిర్యాదు పత్రం ప్రధానికి పంపిందట! జనాలందరికీ ఆల్రెడీ అన్నేసి పూలు పెట్టేసాక ప్రధాని ఆ పూలు పత్రం మడిచెక్కడ పడేస్తారో చాలా ఆసక్తిగా ఉందా లేదా?

@@@@@

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>