దరిద్రమంటే గుర్తొచ్చింది… మన ప్రణాళికా సంఘం లెక్కల ప్రకారం, ప్రస్తుతం రోజుకు ఇరవై రూపాయలు (నెలకు 600, సంవత్సరానికి 7200 రూపాయలు) సంపాదించేవాడు దరిద్రుడు కాదు. కాకపోతే, రోజుకు ఇరవై రూపాయలు కూడా ఆదాయం లేని దరిద్రులు; సురేష్ టెండూల్కర్ కమిటీ లెక్కల ప్రకారం 37 % ఉంటే, అర్జున్ సేన్ గుప్తా అనే పెద్దమనిషి (National Commission for Enterprises in the Unorganised Sector) లెక్కల ప్రకారం 77% మంది. తక్కువ శాతం ఉంది కాబట్టి, సురేష్ టెండూల్కర్ కమిటీ రిపోర్టు మన ప్రణాళికా సంఘం స్వీకరించిందట.
ఒక్క 2జి స్కాములోనే, లక్షా ఎనభై వేల కోట్ల అవినీతి జరిగిన తర్వాత ఈ దేశం దరిద్రుల దేశం ఎలా అవుతుందని పాలక ప్రతిపక్ష ప్రతినిధులు తర్కించుకుంటు సిగపట్లకు కూడా దిగుతున్నారట! అయినా, ఆఫ్రికా దేశాలకు ఆయన ప్రకటించిన ఋణం 22,500 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారనే ఆశ్చర్య దేనికి? మనిషికి 1500 రూపాయల చొప్పున 120 కోట్ల మంది ప్రజలు అడుక్కునే రాజాకు 180000 కోట్ల ముష్టి వేయగలిగినప్పుడు ఇదో లెక్కా?
అన్నట్లు ఇందులో మరో ముష్టి కోణం. అడుక్కునేవాడికి అరవై కూరలు. మన దేశంలో అడుక్కునేవాడి ఆదాయం కూడా రోజుకు కనీసం అరవై పైమాటగానే ఉంటుందని ఓ అంచనా. వాడి ఆదాయం రోజుకు ఇరవై కన్నా మూడింతలు ఎక్కువే కాబట్టి, వాడు దరిద్రుడు కాదు. ఇకనేం, అడుక్కునేవాళ్ళ దగ్గర గీక్కోటానికి ఆదాయ పన్ను చట్టం కూడా ప్రభుత్వం సవరించేస్తుందేమో, ఎవరికి ఎరుక? అలా గీక్కునే డబ్బుతో ఆర్కిటికాలోనో, అంటార్కిటాలోనో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయొచ్చు.