This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author. |
చంచల్ గూడా సెంట్రల్ జైలు.
పొద్దున్నే, పరగడుపున నిలబడిన గాలి జనార్దన రెడ్డి, రెండు చేతుల్నీ పైకెత్తి, ఆపైన గొంతెత్తి…
మొదటి పాటః
“నీ వొళ్ళు బంగారం గానూ…డిచికావ్
నా వొళ్ళు ఇనుపరజను గానూ…డిచికావ్
జోరు మీద గనులన్నీ తోడిపెట్టానూ..ఊఊ
నలభై కోట్ల కిరీటాన్ని చేసిపెట్టానూ నూ నూ…కేవ్..వ్..వ్”
పక్కనేవున్న పూట రౌడీ ఒకడు “అన్నా! బగమంతుణ్ణి ఏడుకొంటన్నావా? ఈ పాట మరీ సీపుగా ఉన్నట్టుంది. కొంసెం క్లాసికల్ సాంగేసుకోన్నా!” అన్నాడు.
అదీ నిజమేననిపించింది గాలికి. గొంతు సవరించుకొని…
రెండో పాటః
ఘనాగని దోచరా! కరుణాకర తమ్ముడా!
అది రైటో లేక చీటో, అది రైటో లేక చీటో
అది నల్లనల్లనల్ల వ్యాపారమో!
టింగురంగ! టింగురంగ! ఘనాగని దోచరా!
ప్రాభాత చోరుల స్వాహావేళ
నీ పద సన్నిధి నిలబడి
వోయెస్సు తమ్ముడా అనబడి
సకల లైసెన్సుల డోనారు తోడుగా
సకల లైసెన్సుల డోనారు తోడుగా
తోడితీ! తస్కరించితీ!
టింగురంగ, టింగురంగా!
గిరులు, తరులు, మైదానాలు,
చదునుగ దున్నేసి తవ్వరా
మినరలు కంప్లీటు దొబ్బరా ఆ ఆ ఆ
నిఖిల జగతి ఉమ్మేసి తిట్టినా
నిఖిల జగతి ఉమ్మేసి తిట్టినా
తుడుచుకో, నవ్వుకో
టింగురంగ, టింగురంగా!”
పూట రౌడీః “అన్నా! ఎంత సక్కని పాటన్న! పీబీ సీనివాసు నీయంత సక్కంగా పాడలేదన్నా!”
గాలిః “హుహుహు! ఈ పాట పాడినాది పీబీ కాదప్పా! ఎస్పీ బాలసుబ్రమన్యమప్పా! ఇంకో పాట పాడమంటావా?”
పూట రౌడీః “కూడెట్టేందుకు సానా టైమున్నాదన్నా. పాడు”
గాలి గొంతు ఇంకోసారి సవరించుకొనిః
“అమ్మహో సుష్మ ఒహో
బంగారు తల్లి ఓహో
బీజెపీనుద్ధరించే ఢిల్లి మా శక్తి ఓహో”
పూటరౌడీ పూనకంతో ఊగుతూ “వద్దన్నా! ఈ పాటొద్దు!” అన్నాడు. వాడి పూనకం చూసి జడుసుకొన్న గాలి టక్కున ఆపేసాడు. పూనకం కొంచెం దిగిన తర్వాత, పూటరౌడీ “అన్నా! అంకాలమ్మ పాటొద్దు. ఎంకన్న పాటేసుకో!” అన్నాడు.
గాలి ఈసారి గొంతు సవరించుకోకుండానే ఎత్తుకొన్నాడు…
“నీ కొప్పుకు చేయిస్తి బంగారు కిరీటాము ఎంకటేశా
ఆ కిరీటమునకూ బట్టే నలభై ఐదు కోట్లు ఎంకటేశా
కిరీటమూ నువ్వెత్తుకొని, పంగనామము నాకెట్టినావా ఎంకటేశా”
పూటరౌడీ చెవులు మూసుకొని “అబ్బా! అబ్బా” అనసాగాడు.
కళ్ళు మూసుకొని చిందులేస్తున్న గాలి, పూట రౌడీ దబ్బున ఉలిక్కిపడ్డారు.
ఎదురుగా మూడునామాల, ఏడుకొండలవాడు……
కాదుగానీ, జైలరు గారొచ్చి ఓ రెండు మూడైదారు లాఠీపూజ చేసిన తర్వాత గాలి, పూటరౌడీలు పూజ మాని కూడు తినడానికి బొచ్చెలెత్తుకొన్నారు.