ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఇండియన్ ఫూల్స్ లీగ్ – ఎవ్రీ థింగ్ ఈజ్ ఫిక్స్‍డ్!

Like-o-Meter
[Total: 0 Average: 0]

 

 

“హల్లో!  నేను రావణ్ భూస్వామి! వెల్కం టు టీవీ నెవర్. “ఏమిటీ కాంట్రవర్సిటీ” వారి గ్యాస్ అవర్ లో ఈరోజు డిస్కషన్‍కు మేం పిలిచిన ప్యానల్ మెంబర్స్ ను ఒక్కసారే చెప్పేస్తే మా వ్యూయర్ షిప్ మునిగిపోయే అవకాశముంది. సో, ఒక్కొక్కరిగా పరిచయం చేస్తాను.

మీ టీవీ స్క్రీన్ ఎడమ పైమూలన తొంగి చూస్తున్న వ్యక్తి ఛీకుమారన్ అశాంత్. స్క్రీన్ పై మధ్య భాగంలో నవ్వుతున్న బొండాం ఫేస్ డోరియా డిషుందార్. పై కుడి మూలలో దిక్కులు వెతుకుతున్న వ్యక్తి పరాజిత్ ఛండాల. స్క్రీన్ మధ్యన ఎడమవైపు ఉన్న క్లీన్ షేవ్ ఫేస్ దిబ్బాస్ కూలీ బాగ్‍ది…మధ్య మిడిల్ స్క్రీన్లో…అఫ్ కోర్స్ మీరెప్పుడూ చూసే రావణ్ భూస్వామీ…నా పక్కన కుడివైపు మెటికలు విరుస్తున్న వ్యక్తి ఇండియా కిమెంట్స్ ఎం.డి మరియు చెన్నై పాపర్ స్లేవ్స్ మాజీ యజమానికి మామగారైన ఛానివాసన్.

ఒకే ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాం….గుండెజబ్బులు, ఆస్తమా, హైపర్ టెన్షన్ వున్నవాళ్ళు లేచి పోవడానికిదే చివరి అవకాశం…అదర్స్ ప్లీజ్ స్టే ట్యూన్డ్!”

“మిస్టర్ ఛీకుమారన్ అశాంత్…నా మొదటి ప్రశ్న నీకే! నువ్వు కర్చీపును బొడ్లో దోపుకొని బౌలింగ్ చేయడానికి ఇరవై లక్షలు తీసుకొన్నావని కుఖ్యాత బుకీ చిందూ కౄరాపింగ్ పోలీసులకి చెప్పేసాడు. నువ్వెందుకలా చేసావ్?” 

(అశాంత్ కళ్ళు నులుముకొని, ఒక్కసారి పైకి చూసి, పిడికిలి బిగిస్తాడు)

’మిస్టర్ అశాంత్! నేను రావణ్ భూస్వామిని….చిందూ కౄరాపింగును కాను. నా ప్రశ్న రెండోసారి…..మూడోసారి….ఏడోసారి….” 

Buy this eBook on Amazon Kindle
(అశాంత్ గట్టిగా ఏడ్వడం మొదలుపెడ్తాడు. మిగతా ప్యానలిస్టులు వెర్రిగాను, తిక్కగాను, ఐస్ క్రీములో ఫిక్సైపోయిన మసాలా వడ తిన్నవారిలా మొహాలు పెడ్తారు)

“వెల్…అశాంత్…వెల్….ఓకే! నీకు ప్రోగ్రాం మధ్యలో మరోసారి ఛాన్సిస్తాను….అరే…ఎవర్రా అది అశాంత్ కి కర్చీపునిస్తున్నది. ఖబర్దార్….గో అవే”

(టీవీ నెవర్ ఉద్యోగి ఉలిక్కిపడి పారిపోతాడు.)

“పరాజిత్ ఛండాలా….పరాజిత్….ఛం….డాలా”

“రావణ్! నువ్వేమీ కోర్టు అమీనావి కావు. ఒక్కసారి పిలువ్. చాలు”

“లుక్…ఛండాలా…వెల్….పాయెంట్ టేకెన్. నువ్వు కర్చీఫుని ఎక్కడ దోపుకోవాలో చెప్పినా కూడా దోపుకోకుండానే నలభై లక్షలు నొక్కేసావని సాంబార్ డ్రమ్మప్పన్ సీబీయైవాళ్ళకు ఉప్పందించాడు. ఎందుకంత అన్‍ప్రొఫెనల్గా బిహేవ్ చేసావ్? అలా చేసినందుకు నీకు సిగ్గేయ్యడం లేదా? ఒప్పేసుకో! భారత ప్రజల్ని సస్పెన్సులో పెట్టి చంపకు!”

(పరాజిత్ ఛండాల్ ఒక్క సెకండు గాల్లోకి చూసి) “రావణ్…..బొడ్లో దోపుకొన్నందుకు అశాంత్ ను ద్రోహి అన్నావు. దోపుకోని నన్ను కూడా ద్రోహిలా చూస్తున్నావు!”

“నో…నో…పాయెంటు అది కాదు ఛండాల్….ఛండాల్! అసలు పాయంటేంటంటే! చూడు ఛండాల్! ఇక్కడ దోపుకున్నదాని కన్నా దోచుకొన్నదానికే ఇంపార్టేన్స్. నలభై లక్షలు తీసుకొని కూడా దోపుకోకపోవడం ఇమ్మోరల్ యాక్ట్ కాదా ఛండాల్?”

(పరాజిత్ ఛండాల్ జుట్టులోకి చేతులు పోనిచ్చి దిక్కులు చూస్తాడు).

“హ్మ్…హ్మ్…వ్యూయర్స్! వెల్! లేటజ్ ఆస్క్ డోరియా డిషుందార్. డోరియా! నీకేమనిపిస్తోంది? ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే! ప్లీజ్ డోరియా….ఫర్ గాడ్స్ సేక్”

“రావణ్! ఇది నేరం, ఇది ఘోరం, కలికాలం, దొంగా దొంగా దొరికాడు దొంగల బండి ఎక్కాడు!”

“డోరియా…డోరియా….సారీ టు ఇంటరప్ట్…నీ షాయిరీ మస్తుగా ఉంది. కానీ ఇది ముషాయిరా కాదు…టీవీ నెవర్లో ఏమిటీ కాంట్రవర్సిటీ వారి గ్యాస్ అవర్. ప్లీజ్ రిమెంబర్ దట్ అండ్ కామెంట్. ప్లీజ్ డోరియా!”

Buy this eBook on Amazon Kindle
“ఓకే రావణ్! ఈ కాష్టానికి నిప్పు పెట్టిన వ్యక్తి సాంబార్ డ్రమ్మప్పన్. అతనికి పిల్లతో బాటూ ఫిక్సింగ్ అగ్గిపుల్లనందించిన వాడు ఛానివాసన్. హీ మస్ట్ రివీల్. శివకాశిలోని ఏ ఫైర్ వర్క్స్ కంపెనీలో ఆ అగ్గిపెట్టని కొన్నాడో చెప్పి తీరాలి. ఒకప్పుడు బైజూబావరుద్దీన్ అనే కేప్టన్ ఇలానే గీసి…ఐమీన్…ఫిక్సింగ్ చేసి అడుగంటుకొని పోయాడు. ప్లీజ్ మైండిట్!”

“వెల్ సెడ్ డోరియా..వెల్ సెడ్! నౌ లెట్ మీ ఫింగర్ మిస్టర్ ఛానివాసన్…ఐ మీన్….లెట్ మీ పుట్ క్వశ్చన్ టు ఛాని. మిస్టర్ ఛానీ! ఎస్ మిస్టర్ ఛానీ సర్! అసలు మీరు అన్ని అగ్గిపెట్టల్ని ఎందుకు కొన్నారు? ఎందుకు డ్రమ్మప్పన్ కు ఇచ్చారు? డ్రమ్మప్పన్ చిందూ కౄరాపింగుతో కలిసి మొత్తం ఇండియన్ ఫూల్స్ లీగుకే మంట పెట్టాడెందుకు? మంట లేచాక కూడా ఫైర్ ఫైటింగ్ చేయకుండా మీరు కుర్చీలో కూర్చొని సిమెంటు రంగు రసగుల్లా తినడమెందుకు? మొన్న డోరియా డిషుందార్ అడిగితే డ్రమ్మప్పన్ కు చెన్నై పాపర్ స్లేవ్స్ కు సంబంధాలు లేవని, కనీసం అక్రమ సంబంధమైనా లేదని చెప్పారెందుకు? ఇది ద్రోహం కాదా? ఇది నూటాఇరవైకోట్ల పప్పుముద్దల్ని పేడ ముద్దలుగా చేసి ఫూల్స్ లీగ్ గోడపై కొట్టడం కాదా? చెప్పండి ఛీనీ….కమాన్!”

(ఛీనీ ఒకసారి కళ్ళద్దాలు తీసి, పెట్టుకుని, తీసి, పెట్టుకుని, తీసి, పెట్టుకుని, పెట్టుకుని తీసి, తీసేసి పెట్టుకునేసి….)

“మిస్టర్ ఛీనీ! నేను రావణ్ భూస్వామీ హియర్….కెన్ యూ హియర్ మీ?”

(ఛీనీ చివరిసారిగా కళ్ళద్దాలను తీసి పెట్టుకుని)

“రావణ్, కూల్ డౌన్! ఇండియన్ ఫూల్స్ లీగ్ ను ఫూల్‍ప్రూఫ్ గా నడపగలమా లేదా అన్నది చెక్ చేయడానికి నేను, సాంబార్ డ్రమ్మప్పన్ మరియు ఫూల్స్ లీగ్ కంట్రోల్ కమిటీలోని కొద్దిమంది కలిసి ఈ ఫిక్సింగ్ డ్రామా ఆడాం. “

(రావణ్ భూస్వామి పొలమార్చుకొని) “వ్వాట్….ఆర్ యూ జోకింగ్?”

“నో….ఐ యామ్ నాట్ జస్ట్ జో కింగ్ బట్ కింగ్ ఆఫ్ పాపర్ స్లేవ్స్. నెవర్ ద లెస్, ఐ యామ్ సీరియస్. ఇదంతా మేమాడిన నాటకం. ఈ ఫిక్సింగ్ ఎపిసోడంతా ఫిక్స్డ్ బై అజ్! ఇదిగో కావాలంటే ఈ సీక్రెట్ వీడియోలు చూడు!”

(ఛీనీ లాప్ టాప్ స్క్రీను పై కొన్ని మసక మసక బొమ్మలు కదుల్తుంటాయి. గుసగుసలు వినబడుతుంటాయి)

“నో….మేం నమ్మం. మీరే లీగ్ నడపడమేంటి? మీరే ఫిక్స్ చేయడమేంటి? అంటే అశాంతు, చండాలా….వీళ్లెవ్వరూ నిజ్జంగా ఫిక్సింగ్ చేసి డబ్బులు తీసుకోలేదా? ఐనా వీళ్ళనే ఎందుకు ఎన్నుకొన్నట్టు? పచన్ పండాల్కర్నో, క్రిస్ గోళీనో ఎందుకు టార్గెట్ చెయ్యలేదు. కమాన్…ఆన్సర్!” అని ఆవేశపడిపోయాడు అప్పటిదాకా మౌనంగా ఉన్న దిబ్బాస్ కూలీ బాగ్.

(ఛీనీ మరోమారు కళ్ళద్దాలు తీయబోయి, విసుగొచ్చి, ప్యాంటు వెనక జేబులోకి చెయ్యెట్టి తెల్లటి కర్చీఫ్ తీసి చేతిలో పట్టుకొని)

“మిస్టర్ దిబ్బాస్! నువ్వన్న వాళ్లందరికీ ఘనమైన గతమే కాక ఇంకా గొప్ప భవిష్యత్తుంది. అందుకనే మేము కొద్దిమంది ఘరానా డింగరోళ్ళని ఎన్నుకొన్నాం. మొత్తం ఫూల్స్ లీగ్ ఆటగాళ్ళల్లో అశాంత్, ఛండాలా కంటే గొప్ప డింగరోళ్ళు కనబడలేదు. వాళ్ళకి ఘనమైన గతమూ లేదు, అద్భుతమైన ఫ్యూచరూ లేదు. అదీ సంగతి. సో…ఇది మీ అందరి కోసం…మైండిట్!” అంటూ తెల్ల కర్చీఫుని కెమెరాకు కప్పేసి చక్కా పోయాడు ఛీనీ.

॓॓॓॓॓॓॓॓॓

ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన అశాంతుని, ఛండాలాను ఇంకా విడుదల చెయ్యాల్సివుంది. ఎందుకు రిలీజ్ చెయ్యలేదని అడిగితే పోలీసోళ్ళు గోళ్ళు కొరుక్కుంటున్నారు. అసలు విషయం తెలిసినవాళ్ళేమో కొన్ని రహస్యాల్తో చెవులు కొరుక్కొంటున్నారు.

ఏమిటా రహస్యాలన్న మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు త్వరలోనే వస్తాం…అప్పటి దాకా చూస్తూ ఉండండి టీవీ నెవర్!

*****

Buy this eBook on Amazon Kindle