ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

జైల్ సిటీ

Like-o-Meter
[Total: 0 Average: 0]

“నమస్తే గురూ!”

“వ్యాపారాభివృద్ధిరస్తు శిష్యా!”

“ఆహా! ఆశీర్వదిస్తే మీలాంటజ్ఞానులే ఆశీర్వదించాలి?”

“వెర్రోహం! అదేరా శిష్యవాత్సల్యమంటే? ఇంతకూ నీకా ప్రళయంతకమైన వ్యాపారాలోచన ఎలా వచ్చిందో విశదీకరించు!”

“తప్పక గురూ!”

“అస్తు! మొదలెట్టు!!”

“గురూ! ఈనాడు పేపర్లు తిరగేస్తే మనక్కనబడే ప్రముఖ వార్తలే నా ఆలోచనకు తొలి బీజాలు!”

“అంటే శిష్యా! సమన్లు, విచారణలు, జైళ్ళు, అరెస్టులనేవేనా ఆ బీజాలు?”

“ధన్యోహం! చక్కగా గ్రహించారు.”

“హు..హు…హు! మరి నీ వ్యాపార ప్రణాళికలను రెండొందల పదాలకు మించకుండా చెప్పు!”

“చిత్తం గురూ! చూసారు! ఇప్పుడు జైళ్ళు ఎంతమాత్రం ప్రొహిబిటేడ్ ఏరియాలు కావు. అవిప్పుడు సెలిబ్రిటీలు దిగబడే పాపులర్ హావేన్స్ అనగా ప్రముఖుల విహార, విడిది గృహాలు!”

“అస్తు..అస్తు”

“మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వ్యాపారస్తులు, దళారులు, స్వామీజీలు, చివరకు ఆటగాళ్ళు కూడా పోటీలు పడి ట్రిప్పులేసుకొంటున్నవి ఏ స్విట్జర్లాండుకో, సెషెల్సుకో కాదు!”

“అవునవును!”

“అందుకనే నేనో కొత్త వ్యాపారానికి పధకం సిద్ధం చేస్తాను. వినండి గురూ!”

“చెవులు రిక్కించబడేవున్నాయి శిష్యా!”

“ధన్యోస్మి! హైదరబాదు శివార్లలో ఓ మూడొందల ఎకరాల్ని ప్రభుత్వం కేటాయిస్తే, అక్కడ “జైల్ సిటీ” అనే బృహత్తరమైన కారాగృహ నగరాన్ని కట్టాలనివుంది గురూ! ప్రపంచంలో వివిధ జైళ్లలో ఉన్న ప్రముఖులందర్నీ ఈ “జైల్ సిటీ”లో ఉంచాల్సిందిగా ఇంటర్ పోల్, ఎఫ్.బి.ఐ, కెజిబి, సి.బి.ఐ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటా. దాంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ రెండొందల శాతం వృద్ధిరేటుతో అభివృద్ధి చెందిపోతుంది. “

“ఐడియా అద్భుతం. అందులోని వింతలు, విశేషాలేమిటి శిష్యా?”

“అక్కడ ఓ వంద ఎకరాల్లో అండమాన్ జైలు, గ్వాటనామా జైలు, తీహార్ జైలు వంటి ప్రముఖ జైళ్ళ మాదిరి భవనాలు కడతాను గురూ! వాటి పక్కనే మరో వంద ఎకరాల్లో హిట్లరు కాన్సంట్రేషన్ క్యాంపులు, స్టాలిన్ లేబర్ క్యాంపులు వగైరాల టైపులో మోడల్ క్యాంపులు పెడతా. ఓ యాభై ఎకరాల్లో హర్షద్ మెహతా మొదలుగొని ఏ.రాజా వరకూ గల మహామహుల జీవితచరిత్రలు, ఆడియో, వీడియో, ఫోటోల ప్రదర్శన శాలలు పెడతా. ఇంకో యాభై ఎకరాల్లో “ట్రై యువర్ హ్యాండ్” అన్న పేరుతో ఓ థీమ్ పార్క్ లేవదీస్తా.”

“ఈ థీం పార్కేదో ఉబలాటకరంగా ఉంది శిష్యా!”

“అనుకొన్నా గురూ! మీరు దీనికే నోరిప్పుతారని. వివరాలు వినండి. ఈ థీం పార్కులో కొల్లగొట్టే గేమ్సు ఆడిస్తా. ఆ పార్కులో కొన్ని బ్యాంకులు, ఆర్థిక సహాయ సంస్థలుంటాయి. వాటిల్లో నిజంగా డబ్బులుంటాయి. థీంపార్కుకు వచ్చే ప్రజలు వాటిల్లో ఉన్న డబ్బును అడ్డదారిలో దోచుకొనేందుకు పన్నాగాలు పన్నాలి. షార్ట్ టర్మ్ గేములు, లాంట్ టర్మ్ గేములని రెండు రకాలుంటాయి. గేము టర్మును బట్టి దోచాల్సిన డబ్బులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆసక్తిగల ఆటగాళ్ళకు సహాయం చేసేందుకు కొద్దిమంది నిపుణులు అద్దెకు లభించేట్టుగా ఉంచుతా. నిర్ణీత సమయంలో డబ్బులు దోచుకొన్న ప్రజలు థీమ్ పార్కు ఎంట్రీ ఫీజులు, భోజన-వసతి ఖర్చులు, నిపుణుల జీతభత్యాలు ప్లస్ ఓ ఐదుశాతం లాభం వగైరాలన్నింటినీ చెల్లించి, మిగిలిన డబ్బుల్ని తీసుకొనిపోవచ్చు. ఈ ఆటకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్సు, ఇన్ కం ట్యాక్సు మినహాయింపులు లభించేట్టు చేస్తా!”

“అహో శిష్యా! భావి తరాలకు దూరదృష్టి కల నీలాంటి మార్గదర్శి అవసరమెంతైనా ఉంది. విజయోస్తు!”

“ధన్యోస్మి గురూ! మీ ఆశీర్వాద బలం లభించింది. ఇక రంగంలోకి దిగడమే ఆలస్యం”

“వెర్రోహం! గో అహెడ్ మై బోయ్!”