“దండాలు గురూ!”
“వెర్రోహం శిష్యా!”
“చూసారా గురూ?”
“హు..హు..హు….కాల్చేసాము కూడా శిష్యా!”
“వెర్రోహం….”
“అది పెటెంటెడ్ పదమురా అక్కుశిష్యపక్షీ! పరులు పలుకరాదు!”
“క్షమించండి! కర్నాటక అంతర్నాటకానికి అంతరార్థాలు తెలుసుకోలేని నా నిస్సహాయస్థితికి ఆ పదమే దివ్యౌషధం గురూ!”
“వెర్రివాడా కుర్రవాడా!”
“వేడుకొంటున్నాను గురూ! చేతులు జోడించాను గురూ! అనుగ్రహించండి మహాగురు!”
“హు..హు.హూ…కమలం కమిలిందిరా. హస్తము చిక్కుముడిలో చిక్కుకుందిరా! పృష్ట తాడనాత్ దంతభంగః”
“వద్దు గురూ…మీ రహస్య కోడెడ్ సాంకేతిక ఎంబడెడ్ భాషలో చెబితే నాకు హత్యయే శరణ్యం!”
“యూ మీన్ మై హత్య?”
“అనుమానమా గురూ!”
“ఆ….మ్మ్…..మాటతో పోయేదానికి మర్డర్ దాకా ఎందుకు?”
“గురువులు బుద్ధిమంతులు!”
“ఐతే విను శిష్యా! కమలం కమిలిపోవడానికి కారణం భాజపా చివరాఖరి ముఖ్యమంత్రిగా ఓ షట్టరును పెట్టుకోవడం!”
“ఆయన షట్టరు కాదు శెట్టరు గురూజీ!”
“అక్షరంలోని మార్పు ఫలితాల్ని మార్చినదేమిరా?”
“లేదు గురూ!”
“అదేమరి! అసలే మూడు ముక్కల ముఖ్యమంత్రుల్తో వెర్రెక్కివున్న కన్నడిగులకు శెట్టర్ అంటే షట్టర్ అనుకొని భాజపా కొట్టును మూసేసారు.”
“ఓహో అలాగొచ్చారా! అద్భుతంగా ఉంది గురూ. మరి హస్తానికి చిక్కుముళ్ళెందుకు? ఎక్కడ?”
“వెర్రోహం! భాజపా అవినీతిని ఎండగట్టి, ప్రజల మద్దతు కూడగట్టి కదరా కర్నాటక కాంగిరేసు గెల్చింది. అదే చావగొట్టుడు ఆంధ్రాలో జరిగితే సదరు కాంగి రేసు….”
“తుస్సుమంటుందంటున్నారా! అమోఘం….దివ్యోపదేశం, దివ్యోపదేశం.”
“అదేరా వోటుమాయ! వోటరు బాబు ఎప్పుడు, ఎలా తన్నినా…తన్నులు మాత్రం పృష్టభాగానికే తగులురా!”
“దానితో ఎంత పెద్ద పార్టీకైనా మూతిపళ్ళు రాలునుగా!”
“హస్తానికైనా, కమలానికైనా తన్నులు తప్పవురా! వెళ్ళిరారా కుర్రవాడా…వెర్రివాడా”
“ధన్యోస్మి గురూ! ధూమ్ ధామోస్మి గురూ!”
“హు..హు..హు…వెర్రోహం!”